డాక్టర్జీ 135వ జయంతి

‘నాయాన్త్యకాలే శిశిరోష్ణ వర్షా:/ కాలేన సర్వం లభతే మనుష్య: కాలం రాకుండా శీతాకాలం గానీ, వేసవి కాలం గానీ, వర్షాకాలం గానీ రాదు. కాలం చేతనే మానవులు అన్నింటిని పొందుతున్నారు. అన్ని విషయాలలోను కాలం మనకు పంచాంగం వలననే తెలుస్తుంది. ఆహా, పంచాంగం ఎంత గొప్పది! పంచాంగం తెలుసుకోవడం అంటే కాలాన్ని తెలుసు కోవడమే. కాలం చేతనే రాత్రులు, పగళ్లు ఏర్పడుతున్నాయి. అమావాస్య, పౌర్ణమి మొదలైనవి కాలంతోనే ఏర్పడుతున్నాయి. చెట్లకు పూలు, పండ్లు కాలం వల్లనే పుష్పించి ఫలిస్తున్నాయి (జాగృతి/ మార్చి 30, 1998). ఇదంతా ప్రకృతికీ, మనిషికీ ఉన్న బంధాన్ని తెలియచెప్పే కాలం. ఈ కాలంతోపాటు, సామాజిక, సాంస్కృతిక వాతావరణంలో వచ్చిన మార్పులూ ఉన్నాయి. చరిత్రనూ, చరిత్ర ప్రస్థానాన్నీ ములుపు తిప్పినవి అవే. వాటి చోదకశక్తీ కాలమే. ఈ కాలం గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ కాలం తాత్త్వికతని అద్భుతంగా గుర్తించిన సమకాలీనుల గురించి కూడా తెలుసుకోవాలి. ఒక గొప్ప పరిణామమే ఏ యుగానికైనా శ్రీకారం చుడుతుంది. అలాంటి మహానుభావులలో ఒకరు డాక్టర్‌ కేశవరావ్‌ బలీరామ్‌ హెడ్గెవార్‌ (డాక్టర్‌జీ). ఆయన స్థాపించిన సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఫ్‌ు. 20వ శతాబ్దంలో ఆరంభమై నూరేళ్ల పండుగ వైపు అడుగులు వేస్తున్న సంస్థ. అలాంటి సంస్థను స్థాపించిన వ్యక్తి జన్మదినం ఉగాది కావడమూ విశేషమే. డాక్టర్‌జీ జీవితం, సందేశం ఆధునిక చరిత్రలోనే అద్భుతం, నిరుపమానం. వాటిని సమకాలీనులతో పాటు, సమీపగతంలోని వారు తమ వ్యాసాలలో వర్ణించారు. వాటికి దాదాపు ప్రతి ఉగాది జాగృతి వేదికయింది. అంతటి వ్యక్తి సమున్నత జీవిత చిత్రాన్ని చిత్రించే పనిని తన 75 సంవత్సరాల కాలంలో జాగృతి శక్తిమేరకు నిర్వహిం చింది. అందుకే ఈ ఉగాది ప్రత్యేక సంచికలో జాగృతి వెలువరించిన కొన్ని ఉగాది సంచికల గురించి పరిచయం చేసుకుందాం.


‘స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత మొదటి ఉగాది సర్వధారిదే’ అంటూ సాగిన సంపాదకీయం (జాగృతి/మార్చి 30,1949, ఇది విరోధినామ సంవత్సరంలో రాశారు) ప్రభుత్వం కొత్తదైనా సర్వేజనా: సుఖినోభవంతు అన్నట్లు శాంతి సౌఖ్యాలు పొందవచ్చని ప్రజలు భావించారు అని వ్యాఖ్యానించింది. కానీ కశ్మీర్‌, సెక్యులరిజం వంటి సమస్యలు దేశాన్ని శాంతంగా ఉండనివ్వడం లేదంటూ ఈ సంపాదకీయం వాస్తవికంగానే ఆరోపించింది. ‘శతాబ్దాలుగా భారతావని మీద ఆవరించిన చిమ్మచీకటి తొలగి, కొత్త సూర్యోదయాన్ని దర్శిం చడం ఎప్పుడు సాధ్యపడుతుందని డాక్టర్‌జీ వేసుకున్న ప్రశ్నకు సమాధానమే `సంఘటిత హిందూ సమాజం. హిందువుల ఐక్యతే ఈ దేశానికి నవోదయం’ అని జాగృతి (మార్చి 20, 2023) వ్యాఖ్యానించింది.

స్వరాజ్యం వచ్చిన నాటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ తపన జాతీయత ఆధారంగా ఈ దేశంలో జీవనం సాగాలి. అందుకు అనుగుణమైన ప్రభుత్వం రావాలనే. ఆర్‌ఎస్‌ఎస్‌ తపనే జాగృతి తపన కూడా. అందుకే ఆ రెండు సంపాదకీయాలు ఒకే విధంగా వ్యాఖ్యానించాయి. ఉగాది అంటే తెలుగువారికీ, భారతావని ఇతర ప్రాంతాలలోని చాలామందికి కూడా కొత్త సంవత్సర ఆరంభ దినం. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉగాది అంటే సాంస్కృతిక ప్రాధాన్యంతో పాటు, జాతీయతకు సంబంధించిన సందర్భం కూడా. ఆ రోజు సంఘ వ్యవస్థాపకులు పూజ్య డాక్టర్‌ కేశవరావ్‌ బలీరామ్‌ హెడ్గెవార్‌ జయంతి. అందుకే జాగృతి ఉగాది సంచికలు డాక్టర్‌జీ జీవనయాత్రను దర్శింపచేయడమే ప్రధాన ధ్యేయంగా రూపొందాయి. అంటే అదంతా భారత స్వాతంత్య్ర సమరానికి ఉన్న నేపథ్యమే. పరిపూర్ణ జాతీయ దృక్పథం నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ నెమ్మదిగా వెనక్కి తగ్గుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టేదే. ముస్లింలను బుజ్జగించే విద్యను నేర్చుకుంటూ, అధికారంలో ఉన్న క్రైస్తవ బ్రిటిష్‌ రాజ్యాన్ని మంచి చేసుకునే పనిలో దేశీయతను కాంగ్రెస్‌ క్రమంగా విస్మరిస్తున్న కాలాన్ని పట్టి చూపేదే కూడా.

డాక్టర్‌జీ, సంఘ ఆవిర్భావ కాలం, అడుగులు వేస్తున్న తీరులను అక్షరబద్ధం చేయడానికే ఉగాది సంచికలు పరిమితం కాలేదు. సంస్కృతి, సాహిత్యం, ఖగోళంతో మనిషికి ఉన్న బంధం, రాజకీయ సామాజిక పరిస్థితులను ప్రత్యేక శ్రద్ధతో జాగృతి నివేదించింది. 1949 నుంచి 2023 మధ్య వెలువడిన ఉగాది సంచికలలో కొన్నింటి గురించి:

మార్చి 30, 1949: సంపాదకీయం ‘విరోధి’. ఆ సంవత్సరం ప్రపంచంలో సంభవించిన పరిణామాలు పరిచయం చేశారు. అమెరికా, చైనా, ఇండోనేషియా, రష్యా, డచ్‌, దక్షిణాఫ్రికాలో భారతీయుల పరిస్థితి వంటి అంశాలను చిన్న సంపాదకీయంలో పరిచయం చేశారు. ఈ తప్పటడుగులే కమ్యూనిజం వ్యాప్తికి దోహద పడుతున్నాయని ఆరోపించింది ఈ సంపాదకీయం.

ఈ సంచికకు బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, శతావధాని ‘సంవత్సరాది’ వ్యాసం అందించారు. ‘ఇతర పండుగ దినాలలో బొత్తిగా కనపడని నింబ కుసుమ భక్షణం (వేపపువ్వును పరగడుపున తినడం) ఈ పండుగలో కొత్తది ఉంది.’ అన్నారు తిరుపతి వేంకటకవులలో ఒకరు చెళ్లపిళ్ల. ఉగాది ప్రసాదం, పంచాంగంలోని ప్రత్యేకతలను వివరిస్తూ, సంవత్సరాది, ఉగాది పదాల వ్యుత్పత్తుల గురించి ఆ మహా పండితుడు అత్యంత సులభమైన భాషలో అందించారు. ఈ సంచికలోనే ‘శ్రద్ధాంజలి’ పేరుతో డాక్టర్‌జీకి ఇచ్చిన అక్షర నివాళి నిజంగా స్మరణీయమైనది. ‘నేను హిందువునని చెప్పుకో లజ్జిస్తూన్న యుగంలో ‘హిందువు’ అని పిలవబడడం గర్వించదగిన విషయమని భావిస్తూ, ప్రాంతీయ భాషాదివైమనస్యాలకు అతీతులై సంఘనోద్యమాన్ని నిర్మించి ఒక దృఢశక్తిని సాధించి ‘పొల్లు మాటలు జాతిని ఉద్ధరించలేవు’ అని చాటారు’ అని రాసింది సంపాదకమండలి. శంకర భగవత్పాదులు, విద్యారణ్య, వివేకానంద వంటి మహా పురుషుల మాదిరిగానే చరిత్రలో పరిగణించ వలసిన మహనీయులు డాక్టర్‌జీ. ఇలాంటి అంచనాతో ‘శిథిలమై పోతూన్న రాష్ట్రానికి సంఘటనా మంత్రద్రష్ట డాక్టర్‌జీ’ పేరుతో ఇదే సంచికలో వ్యాసం ప్రచురించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన ‘స్వరాజ్యము` భారతీయ సంస్కృతి’ వ్యాసం కూడా ప్రచురించారు. విక్రమశకం (శ్రీపూర్ణ), నేటి మన ఆర్థిక దుస్థితి `తరుణోపాయం’ (జేసీ కుమారప్ప) ఇతర వ్యాసాలు ఉన్నాయి.

 పేష్వా దర్బారు నేపథ్యంతో ‘త్యాగం’ (రత్నం) కథ, ‘ఆంధ్ర కర్ణాటక సారస్వతములు’ (ఆచార్య పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి) వ్యాసం ఇందులో ఉన్నాయి.

 ‘పావిత్య్రాన్ని, సత్యశాంతి మోక్షాలను, సర్వకాలాత్మక ‘జాగృతి’ని, మానవ పురోభివృద్ధిని, ఉత్తమ రసానందాన్ని ఆదర్శంగా పెట్టుకోని కళ కళ కాదు. అది రాక్షసము, పైశాచికము అయి మానవ జాతి నాశనానికి ముఖ్యకారణమవుతుంది’ అంటూ మొదలయ్యే అడవి బాపిరాజు వ్యాసం (కళ- ఆదర్శము) కూడా ఈ సంచికలో ఉంది. ఈ వ్యాసం లోనే దామెర్ల రామారావు ప్రస్తావన కనిపిస్తుంది. కళకు జరుగుతున్న అవమానాన్ని బాపిరాజు విఫులీకరించారు అంటూ సంపాదకులు ఒక వ్యాఖ్య కూడా రాశారు.

‘మంచిచెడ్డలు’ శీర్షికతో ఈ సంచికలో వెలువ రించిన వ్యాసం విశిష్టమైనది. ఆ మంచిచెడ్డలు జన బాహుళ్యానికి వర్తిస్తాయి. ప్రతి రాజకీయ పక్షం ‘ప్రజానీకం’ అనే పదాన్ని ఉపయోగించుకుని ప్రచారం చేస్తుంటుంది. రచయిత పెమ్మరాజు గోపాలకృష్ణమూర్తి అన్నారు. కానీ జనాభిప్రాయం ఒక్కొక్క పర్యాయం ఆవేశం ఆధారంగా ఉంటుంద న్నది ఆయన అభిప్రాయం. ‘ఒకప్పుడు ఈ ప్రజానీకం వాస్తవానికి విరుద్ధంగా కూడా ఊహిస్తుంది. సావర్కార్‌కు గాంధీ హత్య కేసులో సంబంధ ముందన్నారు ప్రజలు. లేదన్నారు న్యాయమూర్తులు’ అని ఈ వ్యాసంలో పేర్కొనడం` ఆలస్యమైనా చారిత్రక సత్యాలు వెలుగులోకి రావడం తథ్యమని చెప్పడం కోసమే అనిపిస్తుంది.

‘బంగరు లేడి’ (విశ్వనాథ, శ్రీమద్రామాయణ కల్పవృక్షం నుంచి), ‘నిశాచరత్వం నడుపుతూ/ పిశాచ జీవితం గడుపుతూ/ నశించకుండా బ్రతకడం నాకు మాత్రం చాతగాదు/ అణగిన నిరుపేదవాడు/ ఆకాశం దాకా పెరిగి / లోకాలను మింగేసే/ ఆ కాలం వస్తున్నది. దూరం దూరం…’ అంటూ ముగిసే రాయ్‌ హీరాలాల్‌ మోర్యా కవితకు మైత్రేయ తెలుగు అనువాదం ఇందులో ఉన్నాయి. కరుణశ్రీ రాసిన చక్కని సీసం ఇందులో ఉంది. ‘తెలుగు వెలుగులు’ శీర్షికతో రసవత్తరంగా సాగింది, ‘నాగార్జునాద్రి నున్నని పాలరాలపై / శ్రీలు చిందించె మా శిల్పబాల/ విద్యానగర మంజలోద్యాన వీథుల/నవ్యతల్‌ నెరపె మా కావ్య కన్య/ త్యాగరాయల ప్రేమరాగ డోలికలలో/ కమ్మగా నూగే మా గానలక్ష్మి/ ఏకశిలాపురీ ప్రాకార శిఖరాల/ విహరించె మా వీర విజయరాజ్ఞి …

దిక్కుదిక్కుల కీర్తి చంద్రికలు నింప/ వెలుగు వెలార్చుకొనియె మా తెలుగుతల్లి/ నా పురా వైభవా నంద నందనమున/ నవ్వుకొన్నవి నవ వసంతు ములెన్నొ’. ఒక గొప్ప సందర్భం కోసం వెలువరించే ప్రత్యేక సంచిక ఎలా ఉండాలో ఈ సంచిక తెలియచేస్తుందంటే అతిశయోక్తి కాదు. చెళ్లపిళ్ల, విశ్వనాథ, అడవి బాపిరాజు, ఉన్నవ లక్ష్మీనారాయణ, కరుణశ్రీ వంటి మహామహుల రచనలతో తీర్చిదిద్దిన సంచిక ఇది. అలాగే డాక్టర్‌జీ వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేయడానికి విశేషమైన ప్రయత్నం జరిగింది.

వికృతి నామ సంవత్సరంలో (మార్చి 19, 1950) వెలువడిన ఉగాది ప్రత్యేక సంచిక తొలినాటి సంఘ పెద్దలను పరిచయం చేస్తూ వ్యాసం అందించారు. ‘రాష్ట్రీయ స్వయంసేవక సంఫ్‌ు రథ చోదకులు: హిందూ సంఘటనోద్యమ సూత్రధారులు’ శీర్షికతో వెలువడిన ఈ వ్యాస రచయిత కృష్ణారావ్‌ మొహరీల్‌. ఈ వ్యాసకర్త ఫోటో కూడా ఇచ్చి డాక్టర్‌జీ ప్రియతమ అనుచరుడు అని రాశారు. ఈ వ్యాసంలో గురూజీ, బాబాసాహెబ్‌ ఆప్టే, దాదారావ్‌ పరమార్ధ్‌, అప్పాజీ జోషీ, ఏక్‌నాథ్‌ రానడే, బాలాసాహెబ్‌ దేవరస్‌, గజాననరావు జోషీ, బాపూరావ్‌ మోఘే (ఆంధ్రప్రాంత ప్రచారక్‌), భావూరావ్‌ దేవరస్‌, బాబారావ్‌ భిడే, వసంతరావ్‌ ఓక్‌, భగవాన్‌దాస్‌, భయ్యాజీ దానీ, యాదవరావ్‌ జోషీ, రాజాభావూ పాతూర్‌కర్‌, లేఖరాజశర్మ, రాజాభావూ డేగ్వేకర్‌ పరిచయాలు ఉన్నాయి. వీరందరి ఫోటోలను ఇందులో దర్శించుకోవచ్చు కూడా. ఆదర్శశిఖరం పేరున డాక్టర్‌జీకి పద్యరూపంలో కిరణ్‌ నివాళి ఘటించారు. విప్లవమూర్తి పేరుతో 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ వీరుడు మంగళ్‌పాండే గురించి వ్యాసం (కిరణ్‌) రాశారు. ఏప్రిల్‌ 4,1954 ఉగాది సంచికలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి. ‘ఉగాది: నవయుగాది’ శీర్షికతో దివాకర్ల వేంకటావధాని రాసిన వ్యాసం ప్రచురించారు. చాలా చక్కని కవిత్వానికి చోటు ఇచ్చారు. ‘స్వాగతము (బులుసు వేంకటేశ్వరులు), ‘భరతమాతా (శ్రీనివాస కాస్యప), ఉగాది సుమబాల (జూలూరి హనుమంతరావు), మధుగీతి (కవిరత్న), మాతృగీతి (కవికొండల వేంకట రావు), బంగారపు కత (కనకదండి గోపాలకృష్ణశాస్త్రి), ఏటేటా (వెంబు) ఉగాదిని స్వాగతించిన కవిత్వహారమే. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి రాసిన ఏది ఉత్తమ సాహిత్యం? మరొక చక్కని అంశం. తాళంచెవులు (కథ, శండిల), కలుపుమొక్క (కథ, కర్రా చంద్రశేఖరశాస్త్రి) వంటివి ఉన్నాయి. అయితే ‘ఉగాది ప్రతిజ్ఞ’ పేరుతో ప్రచురించిన అంశం ప్రత్యేకమైనది. బ్రిటిష్‌ వాళ్లు నిష్క్రమించినా దేశంలో కొన్ని విదేశీ స్థావరాలు అప్పటికి ఉన్నాయి. గోవా, యానాం, పుదుచ్చేరి అలాంటివే. ‘విదేశీ స్థావరాలు వెంటనే భారత్‌లో విలీనం కావాలి/ అఖండ భారత్‌ అమర్‌ రహే’ పేరుతో ఉగాది సందర్భంగా ప్రతిజ్ఞ చేయవలసిందని జాగృతి పాఠకులను కోరింది. ఈ సంచిక ముఖపత్రంగా డాక్టర్‌జీ చిత్రం వేశారు. మార్చి 25, 1955 నాటి ఉగాది సంచిక కూడా డాక్టర్‌జీ ముఖచిత్రంతోనే వెలువరించారు. డాక్టర్‌జీకి నివాళిగా ఏకనాథ్‌జీ రానడే రాసిన ‘ప్రప్రథమ స్వయంసేవకుడు’ వ్యాసం చదవడం గొప్ప అనుభవం. ఆయన అనుయాయులను తయారు చేయాలని అనుకోలేదని అంటారు వ్యాసకర్త. సంస్థను స్థిరమైన సిద్ధాంత పంథాలో నడిపించాలనే ఆయన యోచించారు. అందుకే సంఘ మార్గదర్శిగా కాషాయ ధ్వజాన్ని ఏర్పాటు చేసి తాను కూడా ఒక కార్యకర్తగానే డాక్టర్‌జీ భావించుకున్నారు. ఉగాది గేయాలు శీర్షిక కింద రెండు రచనలకు చోటు కల్పించారు. ఏప్రిల్‌ 1,1957, మార్చి 28,1960 ఉగాది సంచికలలో ఇచ్చిన వ్యాసాలు కూడా డాక్టర్‌జీ జీవితం గురించి మంచి అవగాహన కల్పిస్తాయి. ఏప్రిల్‌ 5,1962 నాటి ‘పూజ్య హెడ్గెవార్‌ స్మారక సంచిక’ చరిత్రాత్మక మైనది. ‘యుగపురుషుడు’ పేరుతో ఈ సంచికలో ప్రత్యేక అనుబంధం అందించారు. డాక్టర్‌జీ జీవితంలోని అనేక కోణాలను ఇది స్పృశించింది. గురూజీ (‘కర్మయోగి’, ‘జ్వలంత జీవనశక్తి’), డీటీ సబ్నిస్‌ (‘ధన్యజీవనము’), యాదవరావ్‌ జోషీ (‘ఉద్యమ నిర్మాణశక్తి’, ‘దూరదర్శిత’), ఏక్‌నాథ్‌ రానడే (‘సంఘ దివ్య గురుత్వాకర్షణ ద్వారా సాత్విక మహాశక్తి నిర్మాణం’), భయ్యాజీ దానే (‘సంఘ స్థాపనకు పూర్వరంగం’), పీకే ఆత్రే (‘స్వరాజ్యోద్యమం `సంఘటన’), బాలశాస్త్రి హరదాస్‌ (‘విప్లవో ద్యమంలో’), దీనదయాళ్‌ ఉపాధ్యాయ (‘ఒక్క అడుగు దూరాన మాత్రమే కనిపించే అందరాని వ్యక్తిత్వం’), నారాయణరావ్‌ తిర్టే (‘కేశవ మాధవుల దివ్య సమాగమం’), భాపూరావ్‌ అభ్యంకర్‌ (‘దైవీ రాష్ట్రవాద ద్రష్ట’) ఇంకా డాక్టర్‌జీ అంతిమ సందేశం, కొన్ని లేఖలు కూడా ఈ అనుబంధంలో ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్ర సమరంలో పాల్గొనలేదంటూ వచ్చే కువిమర్శలకు ఈ విభాగంలోని రచనలు చక్కని సమాధానం ఇస్తాయి. సంఘ నిర్మాణం, సంఘ స్థాపన, ఆశయం, భారత స్వాతంత్య్రోద్యమంలో స్వ అనే అంశం లుప్తమైపోయిన తీరు, దానికి విరుగుడు ఆలోచించిన డాక్టర్‌జీ వంటి అంశాలన్నీ ఇందులో చదువుతాం.

మార్చి 29, 1965లో వెలువరించిన ఉగాది సంచికలో డాక్టర్‌జీ సందేశామృతాన్ని పరిచయం చేస్తూ గురూజీ రాసిన రెండు వ్యాసాలు ఉన్నాయి (‘పరమపూజనీయ డాక్టర్‌ హెడ్గేవార్‌: జీవిత సందేశం, యుగావసరం’). ‘హిందువుల కాలజ్ఞానం: ఈ సృష్టి ఎప్పుడు జరిగింది?’ (కోట నిత్యానందశాస్త్రి) వ్యాసం ఇందులో ప్రత్యేక అధ్యయనాంశమే. ‘ప్రపంచ పంచాంగములన్నిటిలో అత్యంత శాస్త్రీయం హిందూ పంచాంగం’ (అస్ట్రలాజికల్‌ మ్యాగజైన్‌ నుంచి సేకరించినది) వ్యాసం ప్రచురించారు. వ్యాసకర్త ఎస్‌ఎమ్‌ అహమ్మద్‌ హాష్మీ. సౌరమానం చంద్రమానం అంటే ఏమిటి?, అధికమాసం ఎందుకు ఎప్పుడు వస్తుంది? నెలల పేర్లు ఎలా వచ్చాయి?, తిథులను లెక్కకట్టడం, యోగము కరణము అంటే ఏమిటి వంటి అంశాలతో ఈ వ్యాసం ఉంది. ‘వివిధ ప్రాంతీయ ప్రభుత్వాలు సమగ్ర దేశీయ దృష్టితో వ్యవహరించాలి’ అన్న శీర్షిక కింద (తొలి పేజీ) ఆర్‌ఎస్‌ఎస్‌ తీర్మానాలను ప్రచురించారు. యథా ప్రకారం డాక్టర్‌జీ జీవిత సందేశాలను కూడా ప్రచురించారు. ‘డాక్టర్‌జీ జీవితపు స్మృతులు కొన్ని: లోక సంగ్రహానికీ, సంఘటనా దక్షతకూ ప్రతిబింబం డాక్టర్‌ హెడ్గేవార్‌’ వ్యాసంలో యాదవరావ్‌ జోషీ ప్రభృతుల అనుభవాలను ఉటంకించారు.

మార్చి 25, 1968 ఉగాది సంచిక కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది. అంతకు ముందే జరిగిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ హత్యోదంతం వివరాలు ఇందులో పొందుపరిచారు. ఉపాధ్యాయ గురించి అటల్‌ బిహారీ వాజపేయి, రజ్జూ భయ్యాల నివాళులను ప్రచురించారు. అయినా డాక్టర్‌జీ జీవిత విశేషాలకు యథాప్రకారం ప్రాధాన్యం ఇచ్చారు. ‘విప్లవయోధులుగా డాక్టర్‌జీ’ (వినాయకుడు), ‘డాక్టర్‌జీ ఒక మహా సాగరము’ (గురూజీ) వ్యాసాలలో అది కనిపిస్తుంది. ‘సాయన శాలివాహన శకం’ (లంక వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి), భారతీయ విజ్ఞానవేత్త సిద్ధ నాగార్జునాచార్యులు (వల్లూరి సుబ్బారావు) వ్యాసాల సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఏప్రిల్‌ 4,1978 జాగృతిని ఉగాది ప్రత్యేక సంచికగా వెలువ రించారు. ‘డాక్టర్‌జీ అసమాన వ్యక్తిత్వం’ (దోనేపూడి వెంకయ్య), ‘సాహిత్యంలో సంవత్సరాది సౌందర్యాలు’ (సుచంద్ర) వ్యాసాలు ఉన్నాయి. ఇందులో ‘ఈ ఉగాదికి కొత్త శపథం చేయవలెరా/ పొయెనా స్వాతంత్య్ర సంపద ముందెన్నడు రాదురా’ అన్న దాశరథి కృష్ణమాచార్య కవిత్వ పంక్తులు జాతిపైన ఉన్న పెద్ద బాధ్యతను గుర్తు చేసేవే. అలాగే, ‘తిండి గింజలు లేవు పాప, పిండివంటలెక్కడివి తల్లి’ అంటూ కొందరి జీవితాలలోని వాస్తవ పరిస్థితిని చిత్రించిన కవితా పంక్తులను కూడా వ్యాసకర్త అందించడం ఆహ్వానించదగినదే. ఒకే జీవన విధానంలోని అందరు సమానంగా సంతోషించి నప్పుడు కదా పండుగ పరమార్ధం నెరవేరేది.

ఏప్రిల్‌ 3,1989 నాటి జాగృతిని శుక్ల ఉగాది ప్రత్యేక సంచికగా వెలువరించారు. అది డాక్టర్‌జీ శతజయంతి ప్రత్యేకం కూడా. చక్కని ముఖచిత్రం. ‘సంఘ దర్శనమ్‌’ పేరుతో భండారు సదాశివరావు ఈ సంచికకు ఆలోచనామృతం వంటి వ్యాసం అందించారు. 1990లో ‘ప్రమోదూత ఉగాది ప్రత్యేక సంచిక’ వెలువడిరది. అందమైన ముఖచిత్రం. ‘హిందూరాష్ట్రం సనాతన సత్యం’ పేరుతో రామ్‌ మాధవ్‌ రాసిన వ్యాసం ప్రచురించారు. ఇందులో డాక్టర్‌జీ, అరవింద్‌ ఘోష్‌ల ఆలోచనా విధానంలో కనిపించే ఏకాత్మతను రచయిత ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ‘అరవిందులు గానీ, డాక్టర్‌జీ గానీ తమ ఆలోచనలను, ఊహలను కేవలం గాలిలో చేయలేదు. ఇరువురి ఆలోచనలకు ఒక భూమిక, ఒక మౌలిక ఆధారం ఉన్నది. అరవిందులు దానిని సనాతన ధర్మమంటే డాక్టర్‌జీ దానిని హిందూరాష్ట్రం అన్నారు’ అంటారు వ్యాసకర్త. మీరా కృష్ణన్‌, వేముగంటి నరసింహాచార్యులు, ఐతా చంద్రయ్య, విశాల శ్రీకాంతశర్మ, మన్నవ ఉపేంద్ర రావు (డాక్టర్‌జీ)ల ఉగాది కవిత్వం ఉంది. అయితే ఇందులో మిగిలిన పత్రికలలో వచ్చినట్టు ఉగాది ప్రసాదాన్ని వెక్కిరిస్తూ కార్టూన్లు రావడం కొంచెం వికృతంగానే ఉంది.

‘కాల ప్రవాహంలో లీనమవుతున్న ఈశ్వరనామ సంవత్సరం రోత పుట్టించిన పాత ప్రభుత్వాన్ని తనతోబాటు తీసుకొని పోతూ భారతిలో చైతన్యాన్ని నింపే నూతన ప్రభుత్వాన్ని బహుధాన్యకు అప్పగించి పోయింది. ఇది ఒక శుభ పరిణామం. శ్రీబహుధాన్య భారతదేశ చరిత్రలో నూతన శకానికి నాంది పలుకు తుందని ఆశిద్దాం!’ మార్చి 30, 1998, జాగృతి ఉగాది ప్రత్యేక సంచిక సంపాదక లేఖలోని పంక్తులివి. నిజమే, అప్పటి నుంచి హిందూ సమాజంలో చైతన్యం వెల్లివిరిసింది. ఒక నిర్లిప్తత వీడిపోయింది. అప్పుడే అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలో తొలి భారతీయ ప్రభుత్వం ఏర్పడిరది. అందులో అంతా బీజేపీని సమర్థించేవారు, అంటే భారతీయతను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవారు కాదన్నమాట నిజం. కానీ అది తరువాత స్వతంత్రంగా భారతీయత ఉన్న ప్రభుత్వాలు రావడానికి సోపానంగా ఉపకరించిన మాట వాస్తవం. అందుకే, ‘సత్యమేవ జయతే అని చాటి చెప్పే / భారతం/ కేశవమాధవ దత్తాత్రేయుల ఆశీర్వాదము/ జనగణమన `దీనదయాళామృతమూ/ నవమంత్రము/ కొండ నుండి కడలి వరకు ఒకటే ఏకాత్మగీత/ అదిగో వాజపేయి యజ్ఞహేష’ అన్నారు డాక్టర్‌ ముదిగొండ శివప్రసాద్‌ తన ‘బహుధాన్యం’ కవితలో. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపకులు డాక్టర్‌జీ అంతరంగం: హిందూ సంఘటన’ (సరస్వతి రచన) వ్యాసంలోను భారతీయతా ఘంటారావం ఎక్కడో వినిపిస్తూనే ఉంటుంది. యాదృచ్ఛికమో, ప్రయత్న పూర్వకమో తెలియదు కానీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఆ సమయంలో ‘శ్రీమద్రామాయణంలో సురాజ్యం’ అన్న వ్యాసం (డా.కిడాంబి నరసింహా చార్య) ఈ సంచికలో కనిపించడం శుభారంభమేనని పిస్తుంది. అప్పుడే బెంగళూరులో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సమావేశాలలో నాటి సరసంఘచాలక్‌ రజ్జూభయ్యా ప్రసంగం కూడా కొత్త రాజకీయ శకం గురించే ప్రస్తావించింది. హిందుత్వను బాహాటంగా సమర్ధించే ఏకైక జాతీయ రాజకీయ పక్షం పట్ల చాలా పార్టీలలో అప్పటి వరకు ఉన్న అంటరానితనం నెమ్మదిగా తొలగిపోతున్న వైనాన్ని ఆచార్య రజ్జూభయ్యా అద్భుతంగా ఆవిష్కరించారు. ‘పంచాంగము ప్రాముఖ్యం’ శీర్షికతో జొన్నవిత్తుల యజ్ఞనారాయణశాస్త్రి అందించిన వ్యాసం మంచి సమాచారం ఇచ్చింది. ‘స్వరాజ్యమైతే సాధించాం: ఇక ‘సు’రాజ్యం సాధించాలి’ అన్న శీర్షికతో ఇదే సంచికలో వెలువరించిన వ్యాసం (సూర్యపుత్ర) భారతీయులలో పురివిప్పిన జాతీయ భావాలను ప్రతిబింబించేదే. అలాగే బీజేపీకి ఒక అంతిమ లక్ష్యం ఉంది. అది భారతీయ హృదయానికి సంబంధించినది. కాబట్టి అ లక్ష్యాన్ని మరచిపోరాదని పేర్కొంటూ నాటి సహసర్‌ కార్యవాప్‌ా సుదర్శన్‌జీ మాటలు ఉన్న ఇంటర్వ్యూకు చోటు కల్పించడం సందర్భోచితమే.

మార్చి 15, 1999 ఉగాది ప్రత్యేక సంచికలో డాక్టర్‌జీ ఆలోచన కేంద్ర బిందువుగా వెలువడిన ‘మాతాతీమైన హిందుత్వం’ వ్యాసం విశిష్టమైనది హిందూ సమాజ సంఘటన గురించి భారతదేశం మొత్తం ఆలోచించక తప్పని వాతావరణం ఎలా ఏర్పడిరదో వివరించే ప్రయత్నం ఈ వ్యాసంలో రచయిత చేశారు. హిందువుల ఐక్యత అంటే మైనారిటీలను అణచివేయడమేనన్న దుష్ప్రచారం మొదలయిన సంగతిని కూడా ఈ వ్యాసం వెల్లడిర చింది. ‘వసంత కవి కోయిలలతో ప్రతిధ్వనించే సుకవితోద్యానవనం’ పేరుతో ఆచార్య శ్రీవత్స రాసిన సాహిత్య వ్యాసం లోతైన అంశాలను వెల్లడిరచింది. వేటూరి ప్రభాకరశాస్త్రి, విశ్వనాథ, గుంటూరు శేషేంద్రశర్మ వంటి ఉద్దండుల వసంత వర్ణనలను ఇందులో పరిచయం చేశారు. మార్చి 19, 2001 నాటి ప్రత్యేక సంచికలో డాక్టర్‌జీ జీవితంలోని మరొక విస్మృత కోణాన్ని ఆవిష్కరించింది. ఆయనకు ముస్లింలతో ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిదో, ‘డాక్టర్‌జీ ముస్లింలతో స్నేహ సంబంధాలు’ అన్న వ్యాసంలో పొందుపరిచారు.

ధార్మికదృష్టి, సమరసత, దేశీయత, స్వదేశీ భావన, నాగరికత ఇస్తున్న సందేశం పట్ల అనురక్తి` తార్కికదృష్టి, దేశభక్తి, పుట్టిన నేల మీద మమకారం వంటి అంశాలను ప్రతి పౌరుడిలో ఏకకాలంలో నిర్మించే ప్రయత్నం ఆర్‌ఎస్‌ఎస్‌లో జరుగుతుంది. ఇలాంటి బహుముఖీన వ్యక్తి నిర్మాణం చేసే దృష్టికి బీజం వేసినవారు పరమ పూజనీయ డాక్టర్‌ కేశవరావ్‌ బలీరామ్‌ హెడ్గెవార్‌. ఇవన్నీ దేశం కోసం రోజూ ఒక గంట సేపు ఆలోచిద్దాం అన్న సూత్రంతో సాధ్యం చేయవచ్చునని కూడా ఆయన కనుగొన్నారు. అన్నింటికీ మించి వ్యక్తిపూజ లేని వ్యవస్థ నిర్మాణం కావాలన్న ఆయన ఆశయం అజరామరమైనది. ఎప్పటికీ మార్గదర్శక మైనది. అవే వందేళ్ల సందర్భానికి అతి చేరువగా వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌కు మూలసూత్రాలుగా, శిరోధార్యాలుగా ఉన్నాయి. ఇంత బలీయమైన సంస్థకు అవే బలం. డాక్టర్‌జీ మాటలతో కాదు, ఆచరణతో ఇవన్నీ రుజువు చేశారు. అందుకే భారతదేశంలో అనేక మంది మహనీయులు ఉన్నప్పటికీ డాక్టర్‌జీ స్థానం ప్రత్యేకం. ఆయన 135వ జయంతి సందర్భంగా జాగృతి ఆ మహాపురుషుడికి సవినయంగా అంజలి ఘటిస్తున్నది.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram