– పాలంకి సత్య

ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

ఇదివరలో పారసీక దేశంలో ఉన్నప్పుడే రోమ్‌ ‌పాలకుల దుర్మార్గులని విన్నాడు వరాహమిహిరుడు. విజ్ఞానశాస్త్ర పఠనంలో మునిగి ఉన్నవానిని చంప డమా?

‘‘ఆ తర్వాత మా తాత ముత్తాతలను అనేక రాజ్యాలకి తీసుకుపోయి బానిసలుగా అమ్మివేసినారు. దాసులుగా జీవించినప్పటికీ మా ఇంట శాస్త్ర బోధన జరుగుతూనే ఉండేది. మా తండ్రిగారే నాకు చదువు చెప్పారు. కొంతకాలం క్రితం జరిగిన వారసత్వ యుద్ధంలో వారూ, సోదరులూ మరణించినారు. నా తల్లి నా చిన్ననాటనే చనిపోయినదట. నేను ఒక ఏకాకిని. క్లియోపాత్రా ఒకప్పటి చెలికత్తెని. ప్రస్తుతం పాంపేయా పరిచారికగా మిగిలాను’’.

మిహిరుని కంట కన్నీరు తిరిగింది.

‘‘పాంపేయా నన్ను రోమ్‌ ‌రమ్మంటున్నది. నా పూర్వీకులందరినీ నాశనం చేసినవారి రాజ్యంలో నేను అడుగు పెట్టను. అంతకన్న మరణమే మేలు’’.

‘‘పాంపేయా ఆశ్రయంలోకి ఎలా వచ్చావు?’’ అని వరాహమిహిరుడు ప్రశ్నించేలోగానే పాంపేయా, ఆమెకు కాబోయే భర్త వచ్చారు.

మిహిరుడామెతో తన విద్యాభ్యాసం పూర్తయిన దనీ, తిరిగి వెళ్లిపోతున్నాననీ చెప్పాడు.

రోమ్‌ ‌సైన్యాధికారి ‘‘త్వరలోనే వెళ్లిపోవడం మంచిది. టోలమీ సైన్యమెప్పుడైన దాడి చేయ వచ్చును’’ అన్నాడు.

 * * * * * * * * * *

మరునాడు ఉదయమే మిహిరుడు జపతపాలను ముగించుకుని ప్రయాణానికి సన్నద్ధమవుతున్నాడు. చేసికొనవలసినంత ప్రయత్నమేమీ లేదు. నాలుగు జతల బట్టలు, తన రచనకు సంబంధించిన పేపిరస్‌ ‌కాగితాలు, కొద్దిగా ఆహార పదార్థాలు. ఏ క్షణంలో నైనా శకటం రావచ్చు.

ఇంతలోనే వెలుపల శబ్దాలు మిన్నంటాయి. దగ్గరగా జనుల హాహాకారాలు, దూరంగా యుద్ధ సూచనలైన ధ్వనులు వినిపించాయి. ఏం జరుగు తున్నదని అనుకునే లోపుననే సెరిలియస్‌ ‌వచ్చి ‘‘పాంపేయా! టోలమీ తన నావికా దళంతో వచ్చి అలెక్సాండ్రియాను ముట్టడించాడు. సీజర్‌ ‌తన రోమ్‌ ‌సైన్యంతో, క్లియోపాత్రా తన అనుయాయులతో టోలమీని ఎదుర్కొంటున్నారు. నేను కూడా యుద్ధానికి వెళుతున్నాను. నీవిక్కడ ఉండడం క్షేమం కాదు. నిన్ను రహస్య స్థావరంలో ఉంచగలను. నాతో రమ్మ’’ని అన్నాడు.

పాంపేయా వెంటనే లేచి నిలబడి ‘‘హెలీనా, రా’’ అన్నది.

‘‘నేను రాను’’ హెలీనా అన్నది.

‘‘నిన్ను ఇక్కడ ఎవరు రక్షిస్తారు?’’ అడిగింది పాంపేయా.

హెలినా మిహిరుని వద్దకు వెళ్లి అతని చుట్టూ చేతులు వేసి, అతని వక్ష స్థలంపై తల పెట్టుకుని ‘‘మీరు నన్ను రక్షించగలరు కదా!’’ అన్నది.

పాంపేయా ఆమె వైపు తిరస్కార దృష్టితో చూసి నిష్క్రమించింది.

ఈ పరిణామానికి మిహిరుడు నివ్వెరపోయాడు. ఏమిటిది! పరకాంతా స్పర్శయా? ఇట్లయినదేమిటి? దీనికి నిష్కృతి ఏమిటి?

హెలీనా మరింత దగ్గరగా జరిగి ‘‘మీరు తప్ప నాకెవరూ లేరు’’ అన్నది.

మిహిరుడు తనను తాను తమాయించుకుని ఆమె తలపై చేయి వేసి ‘‘హెలీనా! భయపడకు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు’’ అని చెప్పి ఆమె చేతులను తన నుండి వేరు చేసి, కూర్చోపెట్టాడు.

అతనిలో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి. అలెక్సాండ్రియాలో అడుగు పెట్టినప్పుడే ఇరు వురు స్త్రీలు మాత్రమే ఉన్నచోట ఉండేందుకు సందేహించాడు. నాటి తన భయమీనాడు నిజమయిందా? రచనా వ్యాసంగ సమయములో తమ మధ్య సాన్నిహిత్యమేర్పడిన మాట వాస్తవమే. కానీ శాస్త్ర విజ్ఞానానికే పరిమిత మయిన స్నేహమది. స్నేహమన్న మాట నిజం. తన ప్రియ మిత్రుడు విక్రమాదిత్యుని ఆలింగనమిచ్చిన నాటి అనుభూతే ఇప్పుడూ కలిగింది. అంతకుమించి ఏమీ లేదు.

అతని ఆలోచనా ప్రవాహాన్ని నిలుపుతూ హెలీనా ‘‘దేవతలకే కానీ మానవులకు నమస్కరించరాదన్నది మా గ్రీకు సంప్రదాయం’’ అన్నది.

‘‘అవును.. పారసీక దేశంలో నా గురువులు చెప్పినారు’’.

‘‘అయినప్పటికీ నేను మీకు నమస్కరిస్తున్నాను. భయంతో మీ దగ్గరకొచ్చి, మీ చుట్టూ చేతులు వేశాను. కానీ ఆ శరీర సాన్నిహిత్యాన్ని ఇంకొక పురుషుడయితే తన శరీర సుఖానికి అనుకూలంగా మార్చుకుని ఉండేవాడు. అతని ప్రయత్నములకు నేనును లొంగిపోయే దాన్నేమో! నా కన్యత్వం కాపాడిన మీకు శతకోటి నమస్కారాలు’’ అంటూ హెలీనా ప్రణమిల్లింది.

కొంతసేపు మౌనం రాజ్యం చేసింది. ఆపైన మిహిరుడా మెతో నెమ్మదిగా ‘‘నీవు నా మనసుకు దగ్గరైన మాట నిజమే. కానీ నీపట్ల నేను ఆకర్షితుడైనది నీ విజ్ఞాన సంపద వల్లనే. అంతకు మించిన భావమేదీ నాలో ఏనాడూ కలగలేదు. నీవు నాకు ప్రియమైన నెచ్చెలివి. నా అనుంగు మిత్రుడైన విక్రముని సాంగత్యమిచ్చిన ఆనందమే నీ వలన కలిగింది’’ అన్నాడు.

హెలీనా కృతజ్ఞతాభావంతో అతని వంక చూసి మాట్లాడే లోగానే యుద్ధ ధ్వనులు మరింత ముమ్మరంగా వినిపించసాగాయి. అంతలో ‘‘మంటలు, మంటలు’’ అంటూ కొందరు వారి ఇంట్లో ప్రవేశించారు.

‘‘ఏమైనది?’’ అని మిహిరుడు ప్రశ్నించాడు.

టోలమీ నావికా దళాన్ని ఆపే ప్రయత్నంలో రోమ్‌ ‌సైనికులు అగ్ని బాణాలు విసిరి ఓడలను అంటించారు. కొన్ని గ్రంథాలయం మీద పడి పుస్తకాలు తగలబడిపోతున్నవి. చుట్టుప్రక్కల ఇళ్లు కూడ అంటుకున్నాయి. ఇళ్లలో వారు పారి పోతున్నారు. పారిపోతున్న వారిలో కొందరు వారి ఇంట ప్రవేశించారు.

మానవ ప్రకృతి విచిత్రమైనది. ఆపత్సమయంలో పలాయితుల మధ్య వాగ్వివాదం ప్రారంభమైంది. గ్రంథాలయం ప్రమాదవశాత్తు అంటుకొనినదని కొందరనగా రోమ్‌ ‌సైనికులు గ్రీకు విజ్ఞానం మీద అసూయతో అంటించారని మరి కొందరన్నారు. యుద్ధ ధ్వనులను మాటల యుద్ధ ధ్వనులు మించిపోయాయి.

మిహిరుడు నిట్టూర్చాడు. అలెక్సాండ్రియా నగరానికి శోభనిచ్చినవి రెండు. ఒకటి గ్రంథాలయం, రెండవది దీప స్తంభం. ఒకటి తగలబడిపోతున్నది. రెండవదైన మిగులుతుందా? ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కదా!

మిహిరుని మనసులో ప్రశ్నలుదయించాయి. ఈ యుద్ధం నుండి బయటపడడం ఎలా? భరతభూమికి చేరడం ఎలా? హెలీనాను రక్షించడం ఎలా? ఇంతకూ ఎవరి బారి నుండి ఆమెను రక్షించాలి?

కొంతసేపయిన తర్వాత తమ ఇళ్ల నుండి పారిపోయి వచ్చి తలదాచుకున్నవారు వెళ్లిపోయారు. హెలీనా కొన్ని పళ్లు తెచ్చి మిహిరునికి ఆహారంగా ఇచ్చింది. ఆమె కూడా తిన్న తర్వాత మిహిరుడామె భయకారణం అడిగాడు.

‘‘నేను క్లియోపాత్రా వద్ద పరిచారికగా ఉన్న సంగతిని మీకు ఇదివరలోనే తెలియ జేశాను కదా! ఆమె తండ్రి మరణా నంతరం క్లియోపాత్రాకూ, ఆమె సోదరుడు టోలమీకీ మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. నా తండ్రి, సోదరులు టోలమీకి బానిసలు. అందుచేత అతని పక్షాన్నే యుద్ధం చేశారు. ఆ విషయమై కోపగించిన క్లియోపాత్రా నన్ను ఇంటి నుండి పంపివేసినది. నేను నా తండ్రి వద్దకు పోగా గమనించిన టోలమీ నన్ను గూఢచారిణిగా అనుమానించి చంపబోయాడు. నేను పారిపోయి పాంపేయా ఇంట తలదాచుకున్నాను. యుద్ధంలో నా తండ్రి, అన్నలు మరణించారు. జూలియస్‌ ‌సీజర్‌ ‌సోదరీ, సోదరులకు రాజీ కుదిర్చి, వివాహం జరిపించాడు. కానీ నేను పాంపేయా ఇంటనే రహస్య జీవనం గడపవలసి వచ్చింది.’’

‘‘పాంపేయాకు నీపై ఆ అభిమానమెందుకు?’’

‘‘అది అభిమానం కాదు. వ్యయం లేకుండా దొరికిన బానిసను నేను. ఎక్కడ తప్పించుకొని పోతానోనని ఆమెకు భయం. మీతో మాట్లాడడడం కూడా అమెకు ఇష్టం ఉండేది కాదు’’.

మిహిరుడు ఆలోచించసాగాడు. ఏ పురుషుడో వ్యామోహంతో హెలీనాను పీడిస్తున్నాడనుకున్నాడు కానీ పాలకుల నుంచి రక్షించవలసి వస్తుందనుకో లేదు. ఉత్తమ క్షత్రియులకు సాధ్యమైన పని తన వల్ల అయ్యేనా? కానీ మాట తప్పరాదు.

 * * * * * * * * * *

వారం గడచింది. పళ్లు, ఇంటిలో కొద్దిగా మిగిలిన పిండితో చేసిన రొట్టెలతో ఆకలి తీర్చు కుంటున్న హెలీనా, మిహిరులకు యుద్ధ ధ్వనులు తగ్గి, విజయోత్సాహపు అరపులు విన్పించాయి. విషయ సమీకరణకై మిహిరుడు హెలీనా వారిస్తున్నా వీధిలోనికి వెళ్లాడు. అతని వస్త్రధారణ వల్లనో, సాత్విక ముఖకవళిక వల్లనో కానీ ఎవరూ ఆపలేదు. కొంత సేపటికి జనుల సంభాషణను బట్టి టోలమీ జయించాడనీ, క్లియోపాత్రా, సీజర్లను బంధించాడనీ తెలిసింది.

కొంత ప్రశాంత వాతావరణ మేర్పడింది. కాబట్టి తాను తిరిగి పోవచ్చునేమో! హెలీనా సంగతి ఏమిటి?

విషయం విన్న హెలీనా తాను వరాహమిహిరుని తోనే పయనిస్తాననీ, తనను ఈజిప్టు దాటించమని కోరింది.

‘‘ఆపైన ఏం చేస్తావు? ఎక్కడ ఉంటావు?’’

‘‘జ్యూస్‌ ‌దేవుడే దిక్కు’’.

మిహిరునికి ఏమి తోచలేదు. ఆనాటి రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఆమె కోరిక సమంజసమేనా, సాధ్యమేనా?

 * * * * * * * * * *

మరునాడు ఉదయమే వారి ఇంటి ముందు రథమాగింది. హెలీనా భయంతో లోపలకు వెళ్లి దాక్కున్నది. మిహిరుడు రథసారథిని గుర్తుపట్టినాడు. శకట చోదకుడు ‘‘బాబిలాను నగరంలో దింప మన్నారు కదా! నేడు కొంత ప్రశాంతంగా ఉంది. అలెక్సాండ్రియాను వదిలిన వెనుక భయపడే పని లేదు. మీరు కాలినడకన నైలు నదీ తీరం చేరుకోండి. అక్కడనుంచి నా రథంలో రావచ్చును’’ అన్నాడు.

‘‘నాతో పాటు ఒక యువతిని తీసికొని వెళ్లాలి’’ అని మిహిరుడు హెలీనాను పిలిచాడు.

రథసారథి కనుగిలుపు కానీ, పరిహాస సహిత మందహాసం కానీ వరాహమిహిరునికి నచ్చలేదు. కానీ అతడు వేరే ఊహ కలిగి ఉంటేనే మేలేమో!

నైలునదీ తీరంలో ఎక్కడ వేచి ఉండాలో నిర్ణయమైన తర్వాత రథ చోదకుడు వెళ్లిపోయాడు.

 * * * * * * * * * *

టోలమీ అలెక్సాండ్రియా నగరాన్ని ముట్టడిస్తున్న సంగతి తెలిసినప్పుడే సీజర్‌ ‌తనకు మరికొంత సైన్యం పంపమని రోమ్‌ ‌నగరానికి వార్త పంపించాడు. ఆ సైన్యం టోలమీతో యుద్ధానికి సిద్ధమై వచ్చింది. సీజర్‌ ‌కారాగారం నుంచి తప్పించుకుని, మిగిలిన సేనతో టోలమీని ఎదుర్కొన్నాడు. రోమ్‌ ‌నుంచి వచ్చిన సేన, సీజర్‌ ‌సేనల మధ్య అడకత్తెరలో పోక చెక్కలా నలిగిన టోలమీ తప్పించుకుని పారిపోతూ, నైలునదిలో పడి మరణించాడు. అతని తమ్ముడైన ఇంకొక టోలమీకీ, క్లియోపాత్రాకూ రాజ్యాధికారమిచ్చి, సీజర్‌ ‌ప్రేమ రాజ్యమేలుతూ ఉండిపోయాడు.

 * * * * * * * * * *

వరాహమిహిరుడు హెలీనాతో బాబిలాను నగరం చేరే సరికే యుద్ధ వార్తలు అక్కడికి చేరాయి. అలెక్సాండరు వలె విశ్వ విజేత కావలెనన్న కోరిక సీజర్‌కు ఉన్నదన్న వార్త విశ్వవిఖ్యాతమే. ఏనాడు యుద్ధమేఘాలు కమ్ముతాయోనన్న భయంతో ప్రజలున్నారు. వరాహమిహిరునికి రథం దొరకలేదు. కొంత దూరం నడచి పారసీక రాజ్యంలో ప్రవేశించిన తరువాత సులభంగా పయనించవచ్చును. హెలీనా తాను కూడా నడవగలననీ, ఈజిప్టు నుండి వీలైనంత దూరంలో తనను దింపమని కోరింది.

‘‘అదేమిమాట, హెలీనా’’

‘‘ఆలోచించిన కొలదీ నాకు సైతం ఈ అనార్య సంస్కృతిపై విముఖత కలుగుతున్నది. మీరు రామాయణ గాథను చెప్పినారు. ప్రజా సంక్షేమం కోసం శ్రీరాముడు ప్రియ సతిని పరిత్యజించాడు. ఆయన మరియొక వివాహం మాట తలపెట్టలేదు. ఆమె ఇంకొకరిని వరించలేదు. సీజర్‌, ‌పాంపేయా లను చూడండి. ఇటువంటివే ఎన్నో ఉదంతా లున్నాయి. మీకు ట్రాయ్‌కి చెందిన హెలెన్‌ ‌కథ చెప్పనా?

‘‘ఇప్పుడు కథలు వద్దు, పారసీకులు భారతీయుల వంటి వారే. నీకు అక్కడ వసతి కల్పించే ప్రయత్నం చేయగలను’’.

 * * * * * * * * * *

కొంతదూరం కాలినడకనా, మరికొంత దూరం బండి మీద ప్రయాణం చేసిన హెలీనా, మిహిరులు పారసీక రాజధానిని చేరుకున్నారు. హెలీనాను ఒక వసతి గృహంలో ఉంచి, వరాహమిహిరుడు తన గ్రీకు ఖగోళశాస్త్ర గురువు వద్దకు వెళ్లాడు. ఆచార్యులు సంతోషించి మిహిరుని గురించిన సమాచార మడిగారు. అలెక్సాండ్రియాలో గ్రీకు, రోమన్‌ ‌జ్యోతిష శాస్త్రాలు అభ్యసించిన సంగతినీ, పంచ సిద్ధాంతికను రచించిన విషయం తెలిపిన మిహిరుడు ‘‘గురువర్యా, గ్రీకు సిద్ధాంతం మీ పేరనే పాలిశ సిద్ధాంతమని వెలయించాను’’ అన్నాడు.

‘‘నేను నీకు నేర్పినది బహు స్వల్పం.’’

‘‘ఆచార్య! మీ నుండి ఒక సహాయం కోరి వచ్చాను’’ అన్న వరాహమిహిరుడు హెలీనా విషయం చెప్పి ఆమెకు వసతి ఏ విధంగా కల్పించాలో చెప్పమని అడిగాడు.

అంతా విన్న ఆచార్యుడామెను తన వద్దకు తీసికొనిరమ్మన్నాడు. తన ఇంటికి వచ్చిన హెలీనాతో మాట్లాడి ఆమె సాశీల్యానికీ, విజ్ఞానానికీ సంతృప్తి చెంది ఆమె తన ఇంటనే తన పుత్రిక వలెనే ఉండ వచ్చునన్నాడు. మిహిరుని నుండి ధనం స్వీకరించేం దుకు ఆయన ఇష్టపడలేదు. హెలీనాకు కొంత సొమ్ము ఇచ్చిన మిహిరుడు ‘‘ఈ నగరంలోనే నా మామగారు, బావమరుదులు నివసిస్తారు. నేను త్వరలోనే ఇక్కడకు రాగలను’’ అని ఆమెను ఓదార్చి, రాజ దర్శనానికి వెళ్లాడు.

పారసీక రాజు మిహిరుని చూసి, చాలా సంతోషించి ‘‘వరాహమిహిరాచార్యా, మీరు మా భాషలో రచించిన పంచతంత్రం పెద్దలనూ, పిన్నలనూ అలరిస్తున్నది. అందులోని రాజనీతిని నేర్చుకున్న పక్షంలో మా రాజ్యాన్ని ఎవరూ జయించ లేరు’’ అని గౌరవ సత్కారాలు నిర్వహించాడు.

పారసీక రాజ రథంలో, సకల రాజ లాంఛ నాలతో మిహిరుడు ఉజ్జయినీ నగరానికి చేరుకుని, తన ఇంటిలో ప్రవేశించిన వెంటనే జననీజనకులకు ప్రణమిల్లాడు. ఆపైన మామగారికి నమస్కరించి, ఖనాను ప్రీతి పూర్వకంగా పలకరించాడు.

ఆ వెనువెంటనే గోత్ర ప్రవరలు చెప్పి, తన పాదములను నమస్కరించిన కుమారుని చూసి పొంగిపోయిన వరాహమిహిరుని చూసి ఖనా చిరునవ్వు నవ్వింది.

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram