మతపరమైన రిజర్వేషన్‌లకు తాము వ్యతిరేకమని బీజేపీ మరొకసారి ఆచరణాత్మకంగా చూపించింది. మార్చి 25న కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్‌ ‌బొమ్మై ప్రకటించిన సరికొత్త రిజర్వేషన్‌ ‌విధానం ఇందులో భాగమే. ఈ రిజర్వేషన్‌లు ఒక వర్గంవారికి మోదం, మరో వర్గంవారికి ఖేదానికి కారణమయ్యాయి. ముఖ్యంగా లింగాయత్‌లు, ఎస్సీల్లో ఒక వర్గం దీన్ని ఆహ్వానించగా, ముస్లింలు, బంజారా వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వర్గాలు మార్చి 27న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ధర్ణాలకు, నిరసనలకు దిగాయి. అయినా విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీల అంతర్గత రిజర్వేషన్‌ ‌కేటాయింపుల్లో మార్పులు చేసి బొమ్మై ప్రభుత్వం గొప్ప సాహసమే చేసిందని చెప్పాలి.

శాసనసభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి కాస్త ముందు వెలువడిన ఈ నిర్ణయం నుంచి అనూహ్య ఫలితాలను మాత్రం ఆశించగలరు. ప్రభుత్వ వివరణ ప్రకారం రాజ్యాంగంలోని 341(2) అధికరణం మేరకు రాష్ట్రంలో ఎస్సీలు నాలుగు వర్గాలుగా ఉన్నారు. వీరికి కేటాయించిన మొత్తం 17% రిజర్వేషన్లలో ఎస్సీ (లెఫ్ట్) ‌వర్గం కిందికి వచ్చే మాదిగ, ఆది ద్రావిడ, బాంబి కులాలు ఇప్పుడు 6% అంతర్గత రిజర్వేషన్‌ ‌పొందుతారు. ఎస్సీ (రైట్‌) ‌వర్గం కిందికి వచ్చే ఆది కర్ణాటక హోలెయ, చల్వాది తదితర 25 కులాలకు 5.5%, ఇక ‘టచ్‌బుల్స్’ ‌కిందికి వచ్చే బంజారా, భోవి, కొరాచ, కొరమ కులాలకు 4.5%, ఆరె అల్మేరి, అల్మేరి అనే సంచార జాతులకు మిగిలిన 1% రిజర్వేషన్లు దక్కుతాయి. ఇదే సమయంలో గత 27 ఏళ్లుగా వెనుకబడిన వర్గాల కింద ముస్లింలకున్న 4% రిజర్వేషన్‌ను తొలగించింది. తాజా సవరణ ప్రకారం వీరిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కిందకు చేర్చారు. అంటే 10% రిజర్వేషన్‌ ‌కలిగిన బీసీయేతర వర్గాలు బ్రాహ్మణులు, వైశ్యులు, జైనులతో పాటు చేర్చింది. ముస్లింలకు తొలగించిన 4% రిజర్వేషన్‌ను రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన కులాలు లింగాయత్‌లు, వక్కళిగలకు చేర్చడంతో, లింగాయత్‌ల రిజర్వేషన్‌ 5% ‌నుంచి 7%కు, వక్కళిగల రిజర్వేషన్లు 4% నుంచి 6%కు పెరిగాయి.

బంజారాల ఆందోళన

ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లలో అత్యధింగా ప్రయోజనం పొందుతున్నది బంజారాలే. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లలో చేసిన మార్పుల కారణంగా తమ రిజర్వేషన్‌ ‌వాటా తగ్గిపోతుందన్న భయం బంజారాల్లో వ్యక్తమవు తోంది. దీని ఫలితమే వీరి ఆందోళన. తక్షణమే ఈ రిజర్వేషన్‌ను విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నది వారి డిమాండ్‌. ‌నిజానికి అంతకుముందు రాష్ట్రంలో అన్ని ఎస్సీ వర్గాలకు కలిపి 15% రిజర్వేషన్‌ అమల్లో ఉండగా, బీజేపీ ప్రభుత్వం దీన్ని 17%కు పెంచింది. ‘ఎస్సీ టచ్‌బుల్స్’ ‌కిందికి వచ్చే బంజారాలు ఈ కొత్త రిజర్వేషన్‌ ‌విధానంలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. అంతకుముందు అమల్లో ఉన్న రిజర్వేషన్‌ ‌విధానంలో బంజారాలకు ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లలో 10శాతం వరకు వాటా ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని 4.5శాతానికి కుదించడం వారి ఆగ్రహానికి కారణం. ఇది అశాస్త్రీయమని, బీజేపీ ప్రభుత్వం బహిరంగ చర్చకు అవకాశమివ్వ కుండా ఏకపక్షంగా సదాశివ కమిటీ నివేదికను అమలు చేస్తున్నదని బంజారాల ప్రధాన ఆరోపణ. బొమ్మై ప్రభుత్వం మాత్రం తాము కేబినెట్‌-‌సబ్‌కమిటీ సిఫారసులను మాత్రమే అమలు చేస్తున్నామని, సదాశివ కమిటీ నివేదికను కాదని స్పష్టం చేస్తున్నా వారు విశ్వసించడంలేదు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.

 ప్రభుత్వ వాదన-విపక్ష రాజకీయం

‘‘రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించి ఏవిధమైన నిబంధన లేదు. కేవలం కులాల వారీగా మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలని సాక్షాత్తు డా।।బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ముస్లింలను ఇప్పటి వరకు ఉన్న 2బి గ్రూపు నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ)కు మార్చాం’’ అని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన సరైనదిగానే ఉన్నప్పటికీ, ఇప్పటికే మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు చేసే కాంగ్రెస్‌, ఇతర విపక్షాలకు ఇది రేపు ఎన్నికల్లో ప్రధాన ఆయుధంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షులు శివకుమార్‌, ‌తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు 4% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని ప్రకటించడం గమనార్హం. ఇక మరో కాంగ్రెస్‌ ‌నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముస్లింలకు రిజర్వేషన్‌ ‌మార్పును తీవ్రంగా వ్యతిరేకించారు. కేవలం ఎన్నికల్లో ప్రయోజనం కోసమే బీజేపీ ఈ చర్యకు పాల్పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.

బీజేపీ వ్యూహం ఫలించేనా?

తన తాజా రిజర్వేషన్‌ ‌వ్యూహంతో బీజేపీ ఎస్సీ(లెఫ్ట్) ‌వర్గాల్లో సానుకూలతను పొందడం ద్వారా కాంగ్రెస్‌ ‘అహిందా’ (మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు)లోకి చొచ్చుకుపోవడంలో కొంతమేర విజయం సాధించిందనే చెప్పాలి. నిజానికి ఈ ఎస్సీ అంతర్గత రిజర్వేషన్‌లో మార్పుల డిమాండ్‌ ఇప్పటిది కాదు. బుజ్జగింపు రాజకీయాలకే పరిమితమైన గత ప్రభుత్వాలు, ఈ ‘తేనెతుట్టె’ను కదిలించడానికి భయపడి సమస్యను నాన్చుతూ వచ్చాయి. ముఖ్యంగా ఎస్సీల్లో ఆధిపత్య గ్రూపుల ఆగ్రహానికి గురికావడం నాటి ప్రభుత్వాలకు సుతరామూ ఇష్టంలేదు. ఎస్సీల్లో అంతర్గత కోటాల్లో మార్పులు చేయాలని సిఫారసు చేసింది జస్టిస్‌ ఎ.‌జె. సదాశివన్‌ ‌కమిషన్‌ ‌నివేదిక. ఈ కమిటీని 2005లో అప్పటి ప్రభుత్వం నియమించగా, 2012లో తన నివేదికను సమర్పించింది.

రాష్ట్రంలో లింగాయత్‌లు శక్తిమంతమైన కులమైతే, వీరిలో పంచమశాలి లింగాయత్‌లు బలీయమైన వర్గం. వీరు తమను 3బి (5%) రిజర్వేషన్‌ ‌కేటగిరీ నుంచి 2ఎ (15%) కేటగిరీకి మార్చాలని ఎప్పటినుంచో డిమాండ్‌ ‌చేస్తున్నా రు. ఒబీసీ 3ఎ కేటగిరీలో 4% రిజర్వేషన్‌ ‌సదుపాయాన్ని అనుభవిస్తున్న మరో బలమైన కులం ఒక్కళిగలు కూడా సరిగ్గా ఇదే చేస్తున్నారు. పాత మైసూరు ప్రాంతంలో తన పట్టును పెంచుకోవాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలో ఒక్కళిగ ప్రాబల్యం ఎక్కువ. ఒక పక్క ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో, ఒక్కళిగలను 2ఎ కేటగిరీలో, లింగాయత్‌లను 2డి కేటగిరీల్లో చేర్చడం ద్వారా వీరి రిజర్వేషన్‌ ‌కోటాలను పెంచడంలో బొమ్మై వ్యూహాత్మక వైఖరి అనుసరించారు. ఇప్పటి వరకు 3బి కేటగిరీలో ఉన్న పంచమశాలి లింగాయత్‌లు అంతర్గతంగా 5% రిజర్వేషన్‌ను వీరశైవ- లింగాయత్‌ ‌గ్రూపులు, మరాఠా, జైన్‌, ‌క్రైస్తవ, బంట్‌, ‌సాతాని కులాలతో కలసి పంచుకున్నారు. ఇప్పుడు వీరిని 2ఎ కేటగిరీకి మార్చడంతో కురుబ, ఇదిగ, దేవడిగ, కుంబర, విశ్వకర్మ, తిగాల వంటి గ్రూపులతో కలిసి రిజర్వేషన్లను పంచుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేపట్టకముందు కర్ణాటక ఓబీసీలో మొత్తం నాలుగు కేటగిరీలుండేవి -2ఎ, 2బి, 3ఎ, 3బి. ఈ గ్రూపుల్లో అన్నింటికన్నా వెనుకబడింది గ్రూపు 2ఎ. ఇక 2బి మధ్యరకం కాగా, 3ఎ, 3బి గ్రూపులు పై రెండు గ్రూపులకంటే కొంచెం మెరుగైనవి. ఒక్కళిగలు, పంచమశాలిలు 3ఎ, 3బి కేటగిరీల్లో కొనసాగేవారు.

 రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం

 ప్రభుత్వం 2022, అక్టోబర్‌ 6‌న ఎస్సీ/ఎస్టీల రిజర్వేషన్‌ ‌కోటాను పెంచుతూ బొమ్మై ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ‌జారీచేసింది. జస్టిస్‌ ‌హెచ్‌.ఎన్‌. ‌నాగమోహన్‌ ‌దాస్‌ ‌కమిషన్‌ ‌సిఫారసు మేరకు ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌నే ‘‘ది కర్ణాటక షెడ్యూల్డ్ ‌క్యాస్టస్ అం‌డ్‌ ‌షెడ్యూల్డ్ ‌ట్రైబ్స్ (‌రిజర్వేషన్‌ ఆఫ్‌ ‌సీట్స్ ఇన్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ అం‌డ్‌ అపాయింట్‌ ‌మెంట్స్ ఆర్‌ ‌ది పోస్టస్ ఇన్‌ ‌ది సర్వీసెస్‌ అం‌డర్‌ ‌ది స్టేట్‌) ‌బిల్‌-2022’’ ‌పేరుతో గత డిసెంబర్‌లో శాసనభలో ప్రవేశపెట్టగా సభ అందుకు ఆమోదం తెలిపింది. బెళగావిలో జరిగిన ఈ సమావేశంలో ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం అప్పటివరకు 15శాతంగా ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను 17శాతానికి, ఎస్టీలకు 3% నుంచి 7%కు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ (ఆధిపత్య) వర్గాలతో పోరాటం సలపలేని స్థితిలో ఉన్న ఎస్సీ (లెఫ్ట్) ‌వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లలో మార్పుల చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకుంది. ఈ రిజర్వేషన్లలో భాగంగానే పంచమశాలీలను 2ఎ కేటగిరీలో చేర్చింది. సరిగ్గా ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పంచమశాలీలు 2ఎ రిజర్వేషన్‌ ‌కే•గిరీలో మార్పుల చేయాలంటూ బెళగావిలోని ‘సువర్ణ సౌధ’ (శాసనసభ) ఎదుట డిసెంబర్‌ 22, 2022‌న పెద్దఎత్తున ధర్ణాకు దిగడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేసే రివైజ్డ్ ‌పాలసీ కింద 56% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రిజర్వేషన్లకు 50% సీలింగ్‌ ‌విధిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధం. మార్చి 23న కర్ణాటక హైకోర్టు తన ‘యథాతథస్థితి’ ఆదేశాలను తొలగించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచిన రిజర్వేషన్లకు రాజ్యాంగ పరమైన ఆమోదం కోసం, 9వ షెడ్యూలులో సవరణ చేపట్టాలంటూ కేంద్రానికి అదేరోజు లేఖ రాసింది. కేంద్రం ఈ విషయంలో రాజ్యాంగ సవరణ చేస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లతో ఎస్సీలకు-17%, ఎస్టీ-7%, ఓబీసీ-32%కు చేరుకున్నాయి.

హైకోర్టులో పిటిషన్‌

‌లింగాయత్‌ ఉపకులమైన పంచమశాలీలకు రిజర్వేషన్‌ ‌కల్పనను నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేయాలంటూ బెంగళూరుకు చెందిన డి.జి. రాఘవేంద్ర అనే వ్యక్తి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు, వక్కళిగలు, లింగాయత్‌ల రిజర్వేషన్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ గత జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్కళిగలకు 2సి, లింగాయత్‌లకు 2డి కేటగిరీలుగా పరిగణిం చడం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. కర్ణాటక వెనుకబడిన తరగతుల కమిషన్‌ ‌సిఫారసు మేరకు బీజేపీ ప్రభుత్వం 3ఎ, 3బి గ్రూపులను రద్దుచేసి వీటి స్థానంలో 2సి, 2డి గ్రూపులను ఏర్పాటు చేసింది. కాగా మార్చి 23న కర్ణాటక హైకోర్టు తన ‘యథాతథస్థితి’ ఆదేశాలను తొలగించడంతో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదించిన చట్టాన్ని అమలు చేసింది. రాష్ట్రంలోని లింగాయత్‌ ‌జనాభాలో పంచమశాలీలు 80% కాగా రాష్ట్రం మొత్తం జనాభాలో వీరి జనాభా 17%. నిజం చెప్పాలంటే 2000 నుంచి లింగాయత్‌లు బీజేపీకి మద్దతుదార్లు. ఇక ఒక్కళిగలు రాష్ట్ర జనాభాలో 14%. వీరు కూడా బీజేపీ మద్దతుదారులే. ఓల్డ్ ‌మైసూరు ప్రాంతంలో వీరి ప్రాబల్యం అధికం. అంతేకాకుండా ఒక్కళిగలు మొత్తం 89 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు. వీటిల్లో కాంగ్రెస్‌, ‌జనతాదళ్‌ (‌సెక్యులర్‌) ‌పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాలు కూడా ఉండటం విశేషం. రాష్ట్రంలో ముస్లింల జనాభా 12.92%. సంప్రదాయికంగా వీరు కాంగ్రెస్‌ ‌మద్దతుదార్లు.

ముస్లింల రిజర్వేషన్‌ ‌చరిత్ర

1916 ప్రాంతంలో నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొదలైన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం మైసూరు రాష్ట్రానికి కూడా పాకింది. అప్పటి మైసూరు పాలకుడు నాల్గవ శ్రీనల్వాడి కృష్ణరాజ వడయార్‌కు వక్కళిగలు, లింగాయత్‌ ‌వర్గాలకు చెందిన నాయకులు ‘బ్రాహ్మణేతరులకు’ మైసూరు సంస్థానంలో ప్రాతినిథ్యం కల్పించాలంటూ ఒక వినపతిపత్రం సమర్పించారు. దీనికి స్పందించిన మైసూరు పాలకుడు 1918లో నాటి ‘‘ఛీఫ్‌ ‌కోర్ట్ ఆఫ్‌ ‌మైసూరు’’కు చెందిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌మిల్లర్‌ ‌నేతృత్వంలో ఒక కమిటీని నియమించి ‘‘బ్రాహ్మణేతరులకు’’ మైసూరు ప్రభుత్వ సర్వీసుల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు అవకాశాలు పరిశీలించమని కోరారు. ఈ కమిటీ సిఫారసుల మేరకు మైసూరు మహారాజు, హిందువుల్లోని బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 1921లో ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో వక్కళిగలు, లింగాయత్‌లు వీరితో పాటు ముస్లింలు కూడా ఉండటం విశేషం. ఈ కమిటీ సిఫారసులను భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. అవకాశాలను ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికోసం మరిన్ని పాఠశాలలు ఏర్పాటుచేసి వారిని విద్యా వంతులు మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని వాదించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం రిజర్వేషన్ల కల్పన వల్ల ఏవిధమైన ఫలితం ఉండదని అభిప్రాయపడ్డారు. కేవలం ఈ వర్గాలను సంతృప్తిపరచడానికి మైసూరు మహారాజు ఈ చర్య తీసుకున్నాడని ఆయన విమర్శించారు కూడా. ‘బ్రాహ్మణ వ్యతిరేక’ ఉద్యమం వల్ల పూర్వ మైసూరు సంస్థానంలో (నేడు ఓల్డ్ ‌మైసూరు ప్రాంతం)ని ముస్లింలు, బ్రాహ్మణేతర వర్గాలతో పాటు రిజర్వేషన్‌ ‌సదుపాయాన్ని పొందుతూ వస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1962లో ఆర్‌. ‌నాగన గౌడ కమిషన్‌ ‌సిఫారసు మేరకు మైసూరుకు చెందిన ముస్లింలలోని కొన్ని కులాలకు ఓబీసీ (ఇతర వెనుకబడిన కులాలు) కేటగిరీ కింద మొట్ట మొదటిసారి రిజర్వేషన్‌ ‌కల్పన జరిగింది. దీని తర్వాత కర్ణాటక హైకోర్టు, భారత సుప్రీంకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటికి సంబంధించి హావనూర్‌ ‌కమిషన్‌, ‌వెంకటస్వామి కమిషన్‌, ‌చిన్నప రెడ్డి కమిషన్ల నివేదికలు కూడా కోర్టుల పరిశీలనలో కొనసాగాయి. ఈ లిటిగేషన్లు కొనసాగుతున్న తరుణంలోనే నవంబర్‌ 1,1956‌న ఏర్పాటైన మైసూరు స్టేట్‌ ‌పేరును, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద 1973లో కర్ణాటకగా మార్చారు. అయితే అప్పటికి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలు చేసిన లిటిగేషన్లు ఒక కొలిక్కి రాకపోవడంతో ఈ కమిషన్ల అభిప్రాయం మేరకు రాష్ట్రంలోని మొత్తం ముస్లిం వర్గాలను 2బి రిజర్వేషన్‌ ‌కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలకు 6శాతం రిజర్వేషన్‌ ‌సదుపాయం ఉంది. కాగా మండల్‌ ‌కమిషన్‌ ‌నివేదికపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఓబీసీ కోటాను 27శాతానికి కుదించింది. తదనుగుణంగా 1995లో ముస్లింల కోటాను ప్రభుత్వం 4%కు కుదించింది. అదే ఇప్పటివరకు కొనసాగుతోంది.

ఈ ఏడాది కర్ణాటక ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మిజోరం, రాజస్థాన్‌, ‌తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు, ఇతర రాష్ట్రాల్లో ఈ ఏడాది జరుగబోయే ఎన్నికలకు కర్ణాటక ఫలితాలను ప్రీఫైనల్‌గా విపక్షాలు గట్టిగా ప్రచారం చేయకమానవు. కర్ణాటక ఫలితాలు ఈ అంశానికి కొత్త కోణాన్ని ఇవ్వక తప్పదు.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram