ఆధునిక కాలంలో రాజకీయాలను, నేరాలను వేరు చేసి చూడలేం. రెండూ కలగాపులగమయ్యాయి. రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండింటి మధ్య సంబంధం నానాటికీ బలపడుతోంది తప్ప బలహీనపడటం లేదు. దేశంలో పెద్ద రాష్ట్రమైన, దేశానికి గుండెకాయ వంటి ఉత్తర ప్రదేశ్‌లో ఇది మరింత వెర్రితలలు వేస్తోంది. దాని ఫలితాలను ఇప్పుడు చవిచూస్తోంది. రాజకీయ పార్టీలన్న తరువాత అక్కడక్కడా కొన్ని చీడపురుగులు ఉండటం సహజం. కానీ ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీల్లో ఇలాంటి చీడపురుగులకు లెక్కేలేదు. ఈ రెండు పార్టీలు నేరగాళ్ల అడ్డాగా మారిపోయాయి. నేరగాళ్ల కేంద్రంగానే అక్కడ రాజకీయాలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ నేరగాళ్లకు చిరునామాగా మారింది. ఆ పార్టీలో రౌడీలు, గూండాలు, దోపిడీదార్లు, కిడ్నాపర్లకు కొదవలేదు. తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి అతిక్‌ అహ్మద్‌కు కిడ్నాప్‌ ‌కేసులో ప్రయాగ రాజ్‌లోని ప్రజాప్రతినిధుల (ఎంపీ, ఎమ్మెల్యేలు) న్యాయస్థానం జీవితఖైదు, జరిమానా విధించింది.

ఈ కేసులో మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా అతిక్‌తో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషులుగా నిర్థరించింది. నిందితుల్లో ఒకరు కేసు విచారణ సమయంలో మరణించారు. మరో ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. నలుగురు దోషులూ ఉమేష్‌ ‌పాల్‌ను హతమార్చాలన్న ఉద్దేశంతో కిడ్నాప్‌ ‌చేశారన్న ప్రాసిక్యూషన్‌ ‌వాదనను కోర్టు విశ్వసించింది. ప్రాసిక్యూషన్‌ ‌తరఫున గులాబ్‌ ‌చంద్‌ అ‌గ్రహరి వాదించారు. న్యాయమూర్తి దినేష్‌ ‌చంద్ర శుక్లా తీర్పు వెలువరించారు. తీర్పు సందర్భంగా అహ్మదాబాద్‌ ‌లోని సబర్మతీ జైల్లో ఉన్న అతిక్‌ను పోలీసులు భారీ బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపరిచారు. తొలుత గుజరాత్‌ ‌నుంచి యూపీలోని నైనీ జైలుకు, అక్కడి నుంచి నిందితులను కోర్టుకు తరలించారు. శిక్ష ప్రకటన అనంతరం వెంటనే దోషులను మళ్లీ అదే జైలుకు తరలించారు.

అతిఫ్‌ అహ్మద్‌ ఆషామాషీ నాయకుడు కాదు. అదే సమయంలో సాధారణ నేరగాడు కూడా కాడు. నేరాలే శ్వాసగా బతుకుతున్న వ్యక్తి. ఆయనపై వందకు పైగా క్రిమినల్‌ ‌కేసులు వివిధ పోలీస్‌ ‌స్టేష•న్లలో నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తన కండబలంలో వరుసబెట్టి చట్ట సభలకు ఎన్నికయ్యాడు. అలహాబాద్‌ (‌పశ్చిమ) ప్రస్తుత ప్రయాగరాజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు గెలుపొందిన వీరుడు. 2014లో శ్రావస్తి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. కారాగారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. మధ్యలో పార్టీ బహిష్కరించడంతో బీఎస్పీలో చేరారు. తరవాత రోజుల్లో మళ్లీ ఎస్పీ పంచన చేరారు. తొలిరోజుల్లో పూల్పూర్‌ ‌నియోజకవర్గం నుంచి నేరుగా పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. ప్రథమ ప్రధాని పండిట్‌ ‌నెహ్రూ వంటి ప్రజాస్వామ్యవాది పోటీచేసిన నియోజకవర్గమిది. అలాంటి స్థానం నుంచి కరడుగట్టిన నేర చరితుడు పోటీ చేయడం, గెలుపొందడం చూసిన తరువాత ప్రజాస్వామం ఎటుపోతోందో అన్న బాధ, ఆవేదన కలగక మానదు.

తాజాగా ఒక హత్య కేసులో సాక్షి అయిన ఉమేష్‌ ‌పాల్‌ ‌కిడ్నాప్‌ ‌కేసులో ప్రయాగరాజ్‌లోని ప్రజా ప్రతినిధుల (ఎంపీ, ఎమ్మెల్యేల)కోర్టు మార్చి 29న కోర్టు జీవితఖైదు, రూ.5000 జరిమానా విధించింది. ఉమేష్‌ ‌పాల్‌ ‌జిల్లా పంచాయతీ బోర్డు సభ్యుడు. ఇది ఇప్పటి కేసు కాదు. దీనికి దాదాపు రెండు దశాబ్దాల చరిత్ర ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అయిన అతిక్‌ ‌నేర సామ్రాజ్యంలో చెలరేగిపోయేవాడు. ముఖ్యంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. ఆ పార్టీ అధినేతలకు కుడిభుజంలా, నోట్లో నాలుకలా ఉండేవాడు. అధినేతల పరోక్షమద్దతు, భరోసా, సహకారంతో అతని నేర కార్యకలాపాలకు హద్దే ఉండేది కాదు. బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ అధి కారంలో ఉన్నప్పుడు కూడా ఆయన కార్యకలాపాలకు పెద్దగా అడ్డేమీ ఉండేది కాదు. ఆ సర్కారు కూడా ఆయన్ని చూసీచూడనట్లు వదిలేసింది. దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా అతిక్‌ ‌నేర సామ్రాజ్యం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఆయన 2006లో బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ శాసనసభ్యుడు రాజుపాల్‌ ‌హత్య కేసులో ప్రథమ ముద్దాయి. ఈ కేసులో ఉమేష్‌ ‌పాల్‌ ‌ప్రత్యక్ష సాక్షి. దీంతో పాల్‌ ‌బతికుంటే తనకు ఎప్పుడైన ముప్పు తప్పదని, తనకు కటకటాలు తప్పవని భావించిన అతిక్‌, అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించు కోవాలను కున్నాడు. దీంతో 2007లో అతన్ని కిడ్నాప్‌ ‌చేశాడు.

కానీ నేరచరితులపై కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు, బీజేపీ నేత యోగి ఆదిత్య నాథ్‌ 2017‌లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టడంతో ఒక్కసారిగా రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయింది. యోగి కఠినంగా వ్యవహరిస్తూ, నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. పోలీసులకు స్వేచ్ఛను ఇచ్చి వారిని కట్టడి చేశారు. మరీ ముఖ్యంగా 2022లో యోగి తిరిగి అధికారంలోకి వచ్చిన ఆయన నేరగాళ్లపై మరింత పకడ్బందీగా ఉక్కుపాదం మోపారు. నేరగాళ్లను వెతికి వెతికి పీచ మణిచారు. వారికి ఊపిరాడకుండా, ఉక్కపోత పోసేలా చేశారు.

జైల్లో ఉండగా అతిక్‌ ‌చేసిన వాదన వింతగా ఉండేది. యూపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్‌కౌంటర్లు చేస్తోందని ఆరోపించారు. అందువల్ల తనకు రక్షణ కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందుకు కోర్టు తిరస్కరించింది. అతిక్‌ ‌వాదన పూర్తిగా అర్థరహితం. జైల్లో ఉన్న వారిని ఎలా ఎన్‌కౌంటర్‌ ‌చేస్తారో ఎవరికీ అర్థం కాని విషయం. దానికి తందానా అన్నట్లు ఎస్పీ, బీఎస్పీ నాయకులు ప్రకటనలు చేయడం గమనార్హం. నేరస్తులపై ఉక్కుపాదం మోపడం, ఎన్‌కౌంటర్‌ ‌చేయడం వేర్వేరు అన్న విషయాన్ని విస్మరించ రాదు. నేరగాళ్లను అణచివేయడం, వారిపై ఉక్కుపాదం మోపడం చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ బాధ్యత. శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వ విహిత కర్తవ్యం. యోగి సర్కారు గత అయిదేళ్లుగా చేసింది, ఇప్పుడు చేస్తున్నది అదేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చట్టవ్యతిరేకంగా సర్కారు వ్యవహరిస్తే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులు సదా సిద్ధంగా ఉంటాయన్న విషయాన్ని విస్మరించరాదు. గత అయిదేళ్లలో, ఇప్పుడూ నేరగాళ్ల అణచివేత విషయంలో సర్కారు వ్యవహార శైలిపై కోర్టులు జోక్యం చేసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. అటు కింది స్థాయి న్యాయ స్థానాలు గానీ, ఇటు ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానం కానీ జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. కేసులు దాఖలైన పరిస్థితీ లేదు.

ఈ నేపథ్యంలో యోగీ సర్కారు నేరగాళ్లను ఎన్‌కౌంటర్‌ ‌చేస్తోందని విపక్షాలు ఎలా చెప్పగలవు? ఆధార రహిత ఆరోపణలు ఎలా చేయగలవు? ఇక కోర్టుల సంగతిని పక్కన పెడితే నిజంగా యోగి సర్కారు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే 2017 తరవాత 2022లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఎలా విజయం సాధించ గలదు? అందునా యోగి సాధించిన విజయం సాధారణ విజయం కాదు. సంపూర్ణ మెజార్టీతో ఆయన ఎన్నికైన విషయాన్ని మనం గుర్తించాలి. అరకొర మెజార్టీతోనో, మిత్రపక్షాల మద్దతుతోనో ఆయన ఎన్నికల గండం గట్టెక్కలేదు. చిల్లర రాజకీయాలకు స్వస్తి పలికి శాంతిభద్రతల పరిరక్షణలో సర్కారుకు సహకరించడం విపక్షాల విహిత కర్తవ్యం.

నేరచరిత గల నాయకులు ఎన్నికల్లో పోటీచేయడం, గెలుపొందడం, మంత్రి పదవులు చేపట్టడం కొత్తేమీ కాదు. దేశవ్యాప్తంగా ఉన్న కథే. కానీ యూపీలో మాత్రం అది పరాకాష్టకు చేరుకుంది. ఉదాహరణకు 2022 ఫిబ్రవరి 21న యూపీలో అయిదోదశ ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ 59 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, వారిలో42 మంది నేరచరితులే కావడం విశేషం. ఇంత పెద్దసంఖ్యలో నేరచరితులను బరిలోకి దించిన ఘనత ఆ పార్టీకే చెల్లింది. మిగతా పార్టీలు నేరచరితులను పోటీకి దించలేదా? అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కావచ్చు. బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ, కాంగ్రెస్‌, ‌బీజేపీలు ఏమన్నా పులుకడిగిన ముత్యాలా? అంటే కానేకాదు. కానీ ఎస్పీ పార్టీ బరిలోకి దించిన నేరచరితుల సంఖ్య ముందు ఇతర పార్టీలలో అలాంటివారి సంఖ్య దిగదుడుపే అని చెప్పడం అతిశ యోక్తి కాదు. గ్రహించాల్సిన అసలు విషయం ఇదీ.

– జీవీపీ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram