‌కేరళ రాష్ట్రాన్ని ఏలుతున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇం‌డియా (మార్క్సిస్టు) ఇకపై చివరి మూడు అక్షరాలు మార్చుకోవలసిందే. మార్చుకుని కొత్త తోక తగిలించుకోవలసిందే. ఆ కొత్త పేరు ఏమిటి? సీపీఐ(ముస్లిమీన్‌). ‌వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చాం కదా అని ఇంతకు తెగిస్తే, ఇక మూడోసారి కూడా అధికారంలోకి వస్తే సీపీఐ (ముస్లిమీన్‌)‌గా ముమ్మాటికీ మారుతుంది. లేదా ముస్లింలే మారుస్తారు. బుజ్జగింపు రాజకీయాలలో సీపీఎం ఏనాడో కాంగ్రెస్‌ను మించిపోయింది. పైగా కేరళలో ఆ రెండు పార్టీలకే పోటాపోటీ. అందుకే మైనారిటీల బుజ్జగింపులోనూ ఆ రెండు పార్టీలు పోటీ పడుతూ ఉంటాయి. సౌదీ అరేబియా సహా ప్రపంచంలో ముస్లిం దేశాలు షరియాను కాస్త సడలించుకుని ముస్లిం సమాజాన్ని ఆధునిక ప్రపంచానికి చేరువగా తీసుకువెళ్లాలని కోరుకుంటూ ఉంటే, కేరళలో సీపీఎం మాత్రం వారిని క్రీస్తుశకం 900 సంవత్సరంలోకి నెట్టాలని చూస్తున్నది.

‘ముస్లిం పర్సనల్‌ ‌చట్టాలకు పునాది వంటివి కాబట్టి షరియా చట్టాలు కూడా రాజ్యాంగం పరంగా చెల్లుబాటు అవుతాయి.’ ఈ మాట మతోన్మాదం తలకెక్కిన ఎవరో ముస్లిం మత గురువు అన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ఇటీవలే దాదాపు కన్నుమూసిన పాప్యులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా చివరి కోరిక అనుకున్నా అనుకోవచ్చు. కానీ ఇవేమీ కాదు. కేరళ ఏలుతున్న లేదా సొంత జాగీరులా చూస్తున్న నాస్తిక సీపీఎం ప్రభుత్వం ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదించబోతున్నది. కాబట్టి పీఎఫ్‌ఐ ఆశయాన్ని కేరళ సీపీఎం ప్రభుత్వం అందిపుచ్చుకున్నదంటే సత్యదూరం కానేకాదు. షరియా చట్టాల రాజ్యాంగ బద్ధత గురించి తన ఆమోదాన్ని తెలియచేస్తూ సీపీఎం ప్రభుత్వం అందచేయనున్న ప్రమాణపత్రాన్ని త్వరలోనే సుప్రీంకోర్టు అందుకోబోతోంది. అంతేనా! అసలు షరియా అంటే ‘ప్రవక్త నిజ వ్యక్తీకరణ’ అని నమ్మి తీరాలని కూడా మార్క్సిస్టు నాస్తిక సర్కారు తేల్చి పారేసింది. ముస్లిం పర్సనల్‌ ‌లా లోని అంశాలకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి షరియాను సమర్థించి తీరాలని కూడా సుప్రీంకోర్టుకు పాఠం చెప్పబోతోంది సీపీఎం.

చిత్రం ఏమిటంటే ముస్లిం మహిళకు ఆ మతం లోని పురుషులతో సమాన హక్కులు కల్పించాలని అదే రాష్ట్రం నుంచి ఒక మహిళ చేస్తున్న న్యాయ పోరాటానికి వ్యతిరేకంగా సీపీఎం ఇలాంటి అఫిడవిట్‌ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేయబోతోంది. ఇది నిజం. ఆర్థిక సమానత్వం ప్రపంచంలో ఉండాలి కానీ, తాము చిరకాలం అధికారం ఉండాలని అనుకుంటున్న కేరళలో కాదని ఆ పార్టీ చెప్పినట్ట యింది. ఇస్లాంలో, ఆ మతం పాటించే చట్టాలలో స్త్రీకి సమాన హక్కులు లేవు. మార్క్సిజం ప్రకారం అందరికీ సమాన ఆర్థిక హక్కులు ఉండాలని సీపీఎం చెప్పాలి. కానీ అలా చెబితే అక్కడ ముస్లిం మతోన్మా దులు అలుగుతారు. రేపు ఓట్లు వేయరు.

ముస్లిం మహిళలకు పురుషునితో సమానంగా ఆస్తిహక్కు కల్పించడం గురించి హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని సవాలు చేస్తూ ఖురాన్‌ ‌సన్నత్‌ ‌సొసైటీ అధ్యక్షురాలు వీపీ ఝురా, ఇతరులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తన వాదనగా ఈ అఫిడవిట్‌ను సమర్పించ బోతున్నది. ఝురా కొజికోడ్‌ ‌కేంద్రంగా నడుస్తున్న నిసా అనే సంస్థ అధ్యక్షురాలు కూడా. ఇది ప్రగతిశీల ముస్లిం మహిళల వేదిక. ముస్లిం మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఆస్తిలో హక్కు ఇవ్వాలని కోరుతూ ఆమె 2018లో సుప్రీంకోర్టును ఆశ్ర యించారు. అలాగే ముస్లిం వివాహ చట్టాలను సమీక్షించాలని కూడా ఆ స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌లో కోరారు. ఇంకా, తమ మహిళలను కూడా తమతో సమానులుగా ఇస్లాంలో పురుషులు భావించాలని కూడా ఆమె కోరుతున్నారు. అంతేకాదు, దేశంలోని అన్ని మసీదులలోను పురుషులతో పాటు ముస్లిం స్త్రీలకు కూడా ప్రార్థనలు చేసుకునే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. ఝురా అక్కడితో ఆగలేదు. ఇమామ్‌ ‌పదవి చేపట్టడానికి కూడా మహిళలను అనుమతించాలని కోరారు. మతంలో మహిళకు సమాన స్థాయి కల్పించాలన్న తన ఉద్యమానికి ప్రేరణ ఏమిటో కూడా ఆమె వెల్లడించారు. అదే- అన్ని వయసుల మహిళలను శబరిమలై ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈమె గురించి చెప్పుకున్నప్పుడు మరొక అంశాన్ని కూడా చెప్పాలి. ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌వ్యతిరేక న్యాయ పోరాటంలో ఈమె ఒక పిటిషనర్‌. ‌శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు వారైనా ప్రవేశించే హక్కు కలిగి ఉన్నారని అత్యున్నత న్యాయ స్థానం తీర్పు చెప్పినప్పుడు, అదే న్యాయస్థానం ముస్లిం మహిళలకు మసీదులో ప్రార్థనలను ఎలా వ్యతిరేకించగలదు?

షరియా పునాదిగా ఉన్న ముస్లిం పర్సనల్‌ ‌లా స్త్రీల పట్ల వివక్ష చూపుతున్నదని ఝురా తన స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌లో సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.ఆ వాస్తవం సుప్రీంకోర్టుకు తెలియనిది కాదు. కానీ ఎవరో ఒకరు తనను ఆశ్రయిస్తే తప్ప ఆ అంశంలో న్యాయస్థానం కల్పించుకోలేదు. చట్టం ముందు అంతా సమానులేనన్న భారత రాజ్యాంగం స్ఫూర్తిని ముస్లిం పర్సనల్‌ ‌లా భంగపరుస్తున్నదని కూడా ఆమె ఆరోపించారు. మతం, జాతి, కులం, లింగభేదం, స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ విషయంలో ఎవరూ వివక్షకు గురి కారాదని రాజ్యాంగం చెబుతుంది. అయితే మొదట ఈ అంశం కేరళ హైకోర్టు ముందుకు వచ్చింది. కానీ అది తమ పరిధిలోనిది కాదని హైకోర్టు చేతులు దులుపుకుంది. ఇందుకు సంబంధించి కేరళ శాసనసభే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కానీ ఈ మేరకు ఎలాంటి చట్టం తీసుకురాకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ముందు పలువురు మత నాయకులతో ప్రభుత్వం సమావేశమైంది. ప్రభుత్వంతో సమావేశమైనవారంతా ప్రస్తుతం షరియా ఆధారంగా ముస్లింల వరకు ఎలాంటి చట్టాలు అమలవుతున్నాయో వాటిని యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా కోరారు. కాబట్టి ఇస్లాంలో వివక్ష ఉన్నదంటూ ఆ మతానికి చెంది నప్పటికీ ఏ వ్యక్తి కూడా ఫిర్యాదు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఈ మార్క్సిస్టులే హిందూధర్మాన్ని ప్రగతిపథంలో నడుపుతామంటూ, సంస్కరిస్తా మంటూ గప్పాలు కొడుతూ ఉంటారు.

ఇంత కథ జరుగుతూ ఉంటే కేరళ ముస్లింలు మౌనంగా ఉంటారా? అది మోప్లా హత్యాకాండ జరిగిన ప్రాంతం. పీఎఫ్‌ఐకి జన్మనిచ్చిన ప్రదేశం. ఆస్తిలో ముస్లిం మహిళకు సమానవాటా ఇవ్వాలన్న కోరికను గానీ, అసలు షరియా చట్టాలను సవరించా లని గానీ ఎలాంటి డిమాండ్‌ ‌వచ్చిన అంగీకరించ వద్దని కేరళ నద్వతుల్‌ ‌ముజాఇదీన్‌ అనే సంస్థ 2022 ఆగస్ట్‌లోనే ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌కి వినతిపత్రం ఇచ్చింది. నిజానికి ఇదొక హెచ్చరిక. అసలు షరియాలో వివక్ష ఉన్నదని ఏ ముస్లిం మతస్థుడు చెప్పడం లేదని కేరళ సద్వతుల్‌ ‌ముజాహిదీన్‌ ‌నాయకుడు ఉమర్‌ ‌సలామి తేల్చేశాడు కూడా. స్త్రీ వివక్ష అనే అంశం కేంద్రంగా షరియా చట్టానికి సవరణ చేయాలని ఎవరు కోరినా, ప్రయత్నించినా దానిని వ్యతిరేకిస్తామని కూడా అతడు అసలు విషయం బయట పెట్టాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ‌ప్రకారం ముస్లింలకు షరియాను ఆచరించే హక్కు ఉందని కూడా తేల్చి చెప్పాడు. దీనితో స్పష్టమయ్యే విషయం ఏమిటి? ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అంగీకరించడానికి ముస్లిం సమాజం ఒప్పుకోదని ఇతడు చెప్పినట్టే. కాబట్టి సెక్యులరిజాన్ని కూడా ప్రశ్నార్థకం చేశాడాయన.

 ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఇంకా ఏం చెప్పబోతున్నది? ఇస్లాం తమకు అర్ధమైన పరిధిలో, మత ఆచరణతో, అసలు పరంపరతో సంఘర్షిస్తూ ఇస్లాం చట్టాలతో విభేదించేవారు వారి మనస్సాక్షి ప్రకారం నడుచుకోవచ్చు. కానీ తమ అభిప్రాయాలను కోర్టుల ద్వారా ఇతరుల మీద రుద్దలేరు కదా! ఇదీ కేరళ సీపీఎం చెప్పబోయేది. మరి ఇదే తర్కం మిగిలిన మతాలూ, సంస్కృతులూ, జీవన విధానాల విషయాలలో ఎందుకు గుర్తుకు రావడం లేదని చాలామంది ఇప్పుడు సీపీఎంను ప్రశ్నిస్తున్నారు. అసలు ఎవరి మనస్సాక్షి ప్రకారం వారు నడుచుకోవా లని అనుకుంటే ఇంక మనకు చట్టాలు ఎందుకు? వాటిని తయారు చేసే చట్టసభలు ఎందుకు? వ్యాఖ్యానించి అమలు చేయించే కోర్టు ఎందుకు అంటున్నారు వారు.

షరియా అంటే ఇస్లామిక్‌ ‌చట్టం. ఆ మతానికి సంబంధించి మౌలిక నిబంధనావళి. అందుకే షరియాను దేవుడి వ్యక్తీకరణగా ఆ మతస్థులు గౌరవిస్తూ ఉంటారు. కానీ షరియా అంటే ముస్లిం నిబంధనావళి అని ముందే చెప్పుకున్నాం. అది ఆ సమాజం వరకే. అంతేకాదు, సంప్రదాయక షరియా పాశ్చాత్య విధానానికి రెండు అంశాలలో పూర్తిగా విరుద్ధమైనది. మొదటి అంశం, షరియా పరిధి చాలా విస్తృతమైనది. ఇది వ్యక్తుల జీవితాన్ని సైతం శాసించడమే కాదు, ఇరుగుపొరుగుతో వ్యక్తి వ్యవహ రించవలసి తీరును కూడా నిర్దేశిస్తూ ఉంటుంది. అలాగే దేశంతో కూడా. షరియా మూలాలు ఎక్కడ ఉన్నాయి? మదీనాలో మహమ్మద్‌ ‌ప్రవక్త నాయ కత్వంలో క్రీ.శ. 622లో ముస్లిం సమాజం ఆవిర్భవించిన తరువాత ఖురాన్‌ ‌సూత్రాలనే సామాజిక మార్గదర్శకాలుగా అనుసరించేవారు. కానీ ఖురాన్‌లో పూర్తిస్థాయి చట్టాలు లేవని భావించిన కారణంగా మహమ్మద్‌ ‌ప్రవక్త జీవించి ఉన్న కాలంలో ఆయనే న్యాయవ్యవస్థను కూడా నిర్వహించారు. తరువాత విస్తరిస్తున్న ఇస్లాం సమాజానికి అనుగుణంగా నిపుణులు చట్టాన్ని కూడా నిర్వచించారు. అదే తరువాత ముస్లిం సమాజానికి శిక్షాస్మృతిగా, చట్టంగా అవతరించింది.

కేరళ ప్రభుత్వం షరియాకు రాజ్యాంగ బద్ధ గౌరవం కల్పించాలని అఫిడవిట్‌ ‌దాఖలు చేయడానికి దారి తీసిన కారణాలు ఏమిటి? మొదటిది ముస్లిం మహిళలకు ఆస్తి హక్కు. ముస్లిం చట్టాల ప్రకారం వారసత్వంగా వచ్చిన ఆస్తికీ, వ్యక్తులు సంపాదించిన ఆస్తికీ మధ్య తేడా లేదు. ఒక ముస్లిం స్త్రీ సంతానం కలిగి ఉంటే, భర్త ఆస్తిలో నుంచి ఎనిమిదింట ఒక వంతు వాటాగా పొందవచ్చు. అలా కాకుంటే నాలుగింట ఒక వంతు వాటాకు అర్హురాలు. తల్లిదండ్రులు మరణిస్తే వారి కుమార్తె కూడా ఆస్తిలో వాటాకు అర్హురాలే. అయితే కుమా రుడు పొందిన వాటాలో సగానికే అర్హురాలు. కానీ హిందూ స్త్రీ తన పుట్టింటి నుంచి తన సోదరుడితో సమంగా వాటాకు అర్హురాలు.

ఇంతకీ సౌదీ అరేబియాలో కూడా పాక్షికంగా అయినా హిజాబ్‌ను నిషేధించారు. పరీక్షా కేంద్రాలలో హిజాబ్‌ ‌ధరించడాన్ని ఆ దేశ ప్రభుత్వం నిషేధించింది. పైగా హిజాబ్‌ ‌కంటే కితాబ్‌ ‌మీకు ముఖ్యమని చెప్పింది. కానీ ఇప్పుడు సీపీఎం ఏలుబడిలోని రాష్ట్రంలోనే ముస్లిం బాలికలకు చదువు కంటే హిజాబ్‌ ‌ముఖ్యమన్న మత సూత్రానికి మద్దతు ఇస్తున్నది.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను బట్టి, షరియా చరిత్ర, అమలును బట్టి కేరళ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయానికి రావడం ఎంతవరకు హేతుబద్ధంగా ఉంది? ఆ మాటకొస్తే ఇప్పటికే కేరళలోని కొన్ని ప్రాంతాలలో షరియా అమలులోనే ఉందని రుజువులతో కూడిన వాదనలు ఉన్నాయి. కొన్ని చోట్ల లౌకిక విద్యను అందించే అన్ని పాఠశాలలు మూసేశారు. మదర్సాలు మాత్రమే పనిచేస్తాయి. ఒక స్త్రీ బయటకు రావాలంటే మగతోడుతో మాత్రమే రావాలి. కానీ ఇది సీపీఎం సిద్ధాంతానికే కాదు, ఆధునిక సామాజిక దృష్టి కోణానికి కూడా సరిపడని అంశం. ఈ నేపథ్యంలో షరియాను ఆమోదించాలని సెక్యులర్‌ ‌దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి సిఫారసు చేయడం సబబేనా? షరియాను తు.చ. తప్పకుండా పాటించాలని ఆదేశాలు ఇస్తున్న అఫ్ఘానిస్తాన్‌లో ఏం జరుగుతున్నది? నిన్నగాక మొన్న యువతులను విశ్వవిద్యాలయాల నుంచి బహిష్కరించారు. ఏమిటీ అన్యాయమని యువతులు కన్నీటి పర్యంతమవుతూ ఉద్యమం ఆరంభించారు. యువతులను ఆ దుస్థితికి తీసుకువచ్చిన చట్టాన్ని ఇప్పుడు భారతదేశంలోకి ఆహ్వానించాలని సీపీఎం కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది. అంతేకాదు, ఒక దేశం, రెండు రాజ్యాంగాలు అన్న విపరీత వైఖరికి కూడా ప్రాణప్రతిష్ట చేయాలని భావిస్తున్నది. దీనిని కశ్మీర్‌లో కొద్దికాలం అమలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఇంతకీ సుప్రీంకోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నది? అది ఏదైనా పెద్ద మలుపే అవుతుంది. ఒక దేశంలో రెండు చట్టాల అమలును ఎలా అనుమతిస్తారన్నది ఒక ప్రశ్న. రెండు, ఒక మతచట్టాన్ని సెక్యులర్‌ ‌దేశంలో ఎలా అమలు చేస్తారు? ఈ ప్రశ్న ప్రగతి శీల మహిళా సంఘాలు వేయాలి? అందుకు సిద్ధపడతాయా?

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram