ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు ‘అష్టలక్ష్ములు’. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎనిమిది మూలస్తంభాలు! ఈ ప్రాంతాల అభివృద్ధే, ఇక్కడ నెకొన్న సమస్యలకు గొప్ప పరిష్కారమన్న సత్యాన్ని గుర్తించడమే గత ఎనిమిదేళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో ఆయన 50సార్లు పర్యటించడానికి ప్రధాన కారణం. గత ప్రభుత్వాల కాలంలో ఈశాన్య భారత్‌ ‌పూర్తి నిర్లక్ష్యానికి గురికావడమే కాదు, దేశ ప్రధాన స్రవంతిలో కలవలేదు. ఫలితంగా ఉగ్రవాదం, అంతర్యుద్ధం, తిరుగుబాట్లతో ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అభివృద్ధి మాత్రం కలగానే మిగిలిపోయింది. కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. పాలనను ఈ రాష్ట్రాల ముంగిటకు తీసుకెళ్లింది. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వారికి సేవలందించాలన్న దృక్పథంతో ‘కొండలకు తరలండి’ (గో టు హిల్స్), ‘‌గ్రామాలకు తరలండి’ కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల కారణంగా 2014 నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ రహదార్లు 50 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వంలో స్థానం కల్పించింది. పని సంస్కృతి పెరగడంతో క్రమంగా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొనడం మొదలై ప్రస్తుతం ఉగ్రవాదం, కనిష్ఠ లేదా అసలు ఉనికిలో లేని దశకు చేరుకుంది. అన్నింటికీ మించి త్రిపుర గత ఐదేళ్ల కాలంలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా రూపొందడం, గతంలో హింస, ఉగ్రవాదంతో ఇబ్బందులు పడిన రాష్ట్రం ఇప్పుడు లాజిస్టిక్‌ ‌హబ్‌గా, ఈశాన్య రాష్ట్రాలకు సరికొత్త ముఖద్వారంగా రూపాంతరం చెందడం విశేషం.

ప్రధానమంత్రి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమం కింద మొత్తం ఏడు ప్రాజెక్టులు గుర్తించగా ఇందులో రెండు మిజోరం ప్రాజెక్టు లున్నాయి. ఐజ్వాల్‌లో బైపాస్‌ల నిర్మాణానికి రూ.500 కోట్లు, ‘బాంబూ లింక్‌ ‌రోడ్డు’ నిర్మాణానికి మరో రూ.100 కోట్లు కేంద్రం కేటాయించింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ రోడ్లను అనుసంధాని స్తారు. ఇక పశ్చిమ సిక్కిం రాష్ట్రంలో పెల్లింగ్‌ ‌నుంచి సంగా-చోయ్‌లింగ్‌ ‌వరకు చేపడుతున్న ప్యాసింజెర్‌ ‌రోప్‌వే నిర్మాణ వ్యయం రూ.64 కోట్లు. ఇక దక్షిణ సిక్కిం ప్రాంతంలోని ధప్పర్‌ ‌నుంచి భలేయ్‌ధుంగ వరకు రూ.58 కోట్ల వ్యయంతో ప్యాసింజెర్‌ ‌రోప్‌వే నిర్మాణం చేపడతారు. పైన పేర్కొన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు, ‘డెడికేటెడ్‌ ‌సర్వీసెస్‌ ‌ఫర్‌ ‌ది మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ‌పెడియాట్రిక్‌ అం‌డ్‌ అడల్ట్ ‌హెమటో లింఫాయిడ్‌ ‌క్యాన్సర్స్ ఇన్‌ ‌నార్త్ ఈస్ట్ ఇం‌డియా’, ‘నెక్టార్‌ ‌లివ్‌లీహుడ్‌ ఇం‌ప్రూవ్‌ ‌మెంట్‌’ ‌ప్రాజెక్టులను నెలకొల్పేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధంచేసింది. వీటిని గువహతిలో నెలకొల్పుతారు. ఇవి ఈశాన్య ప్రాంతాలకు చెందిన అన్ని రాష్ట్రాలకు సంబంధించినవి కావడం విశేషం. అదేవిధంగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం కేటాయించిన రూ.1500 కోట్లలో రూ.537 కోట్లు గుర్తించిన ప్రాజెక్టుల కోసమే ఖర్చు చేస్తారు.

విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు

ఈశాన్య ప్రాంతంలో రవాణా సదుపాయాలు, కమ్యూనికేషన్‌, అనుసంధాన కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి వేగంగా కొనసాగు తుండటంతో పెట్టుబడిదార్ల దృష్టి క్రమంగా ఈ ప్రాంతం వైపునకు మరలుతోంది. 2017లో మిజోరంలో 60 మెగావాట్ల సామర్థ్యమున్న తుర హైడ్రోపవర్‌ ‌ప్రాజెక్టును ప్రధాని ప్రజలకు అంకితం చేశారు. దీంతో సిక్కిం, త్రిపురల తర్వాత మిజోరం ఈశాన్య ప్రాంతంలో మూడో మిగులు విద్యుత్‌ ‌రాష్ట్రంగా అవతరించింది. నిజానికి ఈ ప్రాజెక్టును 1998లో అటల్‌ ‌బిహారి వాజపేయి ప్రభుత్వం ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ విద్యావిధానం- 2020 (ఎన్‌ఈపీ 2020) క్రమంగా పుంజుకుంటోంది. మోదీ ప్రభుత్వం ఎన్‌ఈపీని సమర్థవంతంగా అమలు జరిపేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రితో పాటు వివిధ కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రాంతంలో తరచుగా పర్యటిస్తూ, అభివృద్ధి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా గతేడాది డిసెంబర్‌ 18‌న నార్త్ ఈస్ట్ ‌కౌన్సిల్‌ ‌గోల్డెన్‌ ‌జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న నరేంద్రమోదీ ‘గోల్డెన్‌ ‌ఫూట్‌‌ప్రింట్స్’ ‌పేరుతో ఒక స్మారక పుస్తకాన్ని విడుదల చేశారు. గత 50 ఏళ్ల కాలంలో నార్త్ ఈస్ట్ ‌కౌన్సిల్‌ ఈశాన్య భారత్‌ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడింది. ఇందులో వివరించారు. అదేవిధంగా ఎన్‌ఈసీ గత 50ఏళ్ల ప్రస్థానంపై ఒక షార్ట్ ‌ఫిల్మ్‌ను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. (నార్త్ ఈస్ట్ ‌కౌన్సిల్‌ 1971‌లో పార్లమెంట్‌ ‌చట్టం ద్వారా ఏర్పాటైనప్పటికీ లాంఛనంగా ప్రారంభమైంది మాత్రం నవంబర్‌ 7, 1972‌న మాత్రమే.) ఈ సందర్భంగా ప్రధాని త్రిపురలో రూ.4300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిల్లో ఖయాపూర్‌-అమ్‌తాలీ బైపాస్‌, ‌స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హోటల్‌ ‌మేనేజ్‌మెంట్‌- అగర్తలా, అగర్తలా డెంటల్‌ ‌కాలేజీ, ఐజీఎం ఆసుపత్రి ఉన్నాయి. అంతేకాదు పీఎంజీఎస్‌వై-3 కింద చేపట్టిన 323 కిలోమీటర్ల 32 రోడ్డు ప్రాజెక్టులు, 542 కిలోమీటర్ల పొడవైన 112 రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఆయన షిల్లాంగ్‌లో ఐఐఎం క్యాంపస్‌ను ప్రారంభించారు.

ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ ‌విత్‌ ‌ట్రాన్స్‌పోర్టేషన్‌

ఈశాన్య ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం, దేశ ప్రధాన భూభాగంతో అనుసంధానత లేకపోవడం. ఈ నేపథ్యంలో ‘ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ ‌విత్‌ ‌ట్రాన్స్‌పోర్టేషన్‌’ ‌పేరుతో ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. 3,800 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణాన్ని రూ.32 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. అంతే కాకుండా స్పెషల్‌ ‌యాక్సిలరేటెడ్‌ ‌రోడ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌పోగ్రామ్‌ ‌కింద మరో రూ.60 వేల కోట్లు, భారత్‌మాల ప్రాజెక్టు కింద రూ.30వేల కోట్లు ఈశాన్య భారత్‌లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఖర్చు చేసింది. అదేవిధంగా 2017లో ప్రధాని నరేంద్ర మోదీ.. పశ్చిమ మేఘాలయలోని తురి నుంచి షిల్లాంగ్‌ ‌వరకు 271 కిలోమీటర్ల రెండు లేన్ల జాతీయ రహదారిని దేశ ప్రజలకు అంకితం చేశారు.

అంతేకాదు, నరేంద్ర మోదీ 2022, జనవరిలో ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కేవలం మణిపూర్‌లోనే రూ.1850 కోట్ల వ్యయంతో నిర్మించిన 13 ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.2950 కోట్ల వ్యయం గల మరో తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల్లో 5 జాతీయ రహదారులున్నాయి. వీటి నిర్మాణ వ్యయం రూ.1700 కోట్లు. 37వ జాతీయ రహదారిపై బారక్‌ ‌నదిపై నిర్మించిన స్టీల్‌ ‌వంతెన, అస్సాంలోని ఇంపాల్‌- ‌సిల్చార్‌ల మధ్య ట్రాఫిక్‌ ‌రద్దీని తగ్గిస్తుంది. అదేవిధంగా ప్రధాని రూ.1100 కోట్ల వ్యయంతో నిర్మించిన 2387 సెల్‌ ‌టవర్స్‌ను కూడా ప్రజలకు అంకితం చేశారు. హెచ్‌ఐఆర్‌ఏ (‌హైవేస్‌, ఇం‌టర్నెట్‌ ‌సర్వీస్‌, ‌రైల్వేస్‌&ఎయిర్‌వేస్‌) ‌పథకం కింద అగర్తల (త్రిపుర)లో మహారాజా బీర్‌ ‌బిక్రమ్‌ ‌విమానాశ్రయంలో (ఎంబీబీ ఎయిర్‌పోర్ట్) ‌రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్‌ ‌బిల్డింగ్‌ను ప్రారంభించారు. అదేవిధంగా త్రిపురలో విద్యా స్థాయిల పెంపు లక్ష్యంగా మొత్తం వంద సీబీఎస్‌ఈ ‌పాఠశాలల్లో ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ, వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడం ప్రజల్లో విద్యావిషయిక నైపుణ్యాల స్థాయిని పెంచేందుకు దోహదం చేస్తుంది. ఇదిలా ఉండగా 2022 కేంద్ర బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టే సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌మాట్లాడుతూ రూ.1500 కోట్లను ఈశాన్య రాష్ట్రాకు చెందిన యువకులు, మహిళల్లో జీవనోపాధి కార్యక్రమాల పెంపునకు కేటాయించినట్టు పార్లమెంట్‌కు తెలిపారు. ఈ పథకాన్ని ‘ప్రధానమంత్రి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమం’గా పిలుస్తారు. ఈ కార్యక్రమం కింద ‘పి.ఎం. గతిశక్తి’ స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రాల అవసరాల మేరకు చేపట్టే సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులను ‘ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మండలి’ ద్వారా అమలు చేస్తారు. గతంలో మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు రూ.1150 కోట్ల వ్యయంతో ‘అమృత్‌ ‌సరోవర్‌ ‌ప్రాజెక్టు’ను అస్సాంలో ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 2950 నీటితావులను పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యం. దీంతో పాటు అస్సాంలో 7 క్యాన్సర్‌ ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, మొత్తం ఈశాన్య ప్రాంతంలో 17 క్యాన్సర్‌ ఆసుపత్రుల నిర్మాణం జరుగనుంది. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ.4వేల కోట్లుగా అంచనా. వీటితో పాటు కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి, ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన, ఆయుష్మాన్‌ ‌యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈశాన్య ప్రాంత ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ఇదే సమయంలో ఉచిత గ్యాస్‌, ‌విద్యుత్‌ ‌కనెక్షన్లు, మరుగు దొడ్లు, కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను ప్రభుత్వం అందజేసింది.

గణనీయంగా తగ్గిన హింస

2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం నేతృత్వంలో ఏర్పడిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు 75% తగ్గిపోయి, శాంతి సుస్థిరతలు క్రమంగా ఏర్పడుతున్నాయి. భద్రతా దళాలపై దాడులు 60%, సామాన్యుల మరణాలు 89% తగ్గిపోయాయి. గత ఏడెనిమిది సంవత్సరాల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సామాన్య స్థితులు నెలకొంటుండటం విశేషం. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం అమలును తొలగించారు. అదేవిధంగా ఈ రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ)పూర్తిగా ఎత్తేసేందుకు మోదీ ప్రభుత్వం యోచిస్తున్నది. హింస, ఉగ్రవాదం ఇక చరిత్రపుటకే పరిమితం కానున్నాయి. మోదీ ప్రవచించే ‘సబ్‌కా సాత్‌, ‌సబ్‌కా వికాస్‌, ‌సబ్‌కా విశ్వాస్‌’ ఈశాన్య రాష్ట్రాలను సరైన అభివృద్ధి మార్గంలో పయనింప జేసేందుకు దోహదం చేస్తోంది. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలు ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు దృఢమైన చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.

విమానాశ్రయాల అభివృద్ధి

ఈశాన్య ప్రాంతంలోని విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా రూ.3400 కోట్లు కేటాయించింది. సిల్చార్‌, ‌లీలాబెరి విమానాశ్రయాల్లో రన్‌వేల పునరుద్ధరణ, ఏవియేషన్‌ ‌మేన్‌పవర్‌ ‌ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ‌రూప్సి విమానాశ్రయ అభవృద్ధి, అగర్తలాలో సరికొత్త సమగ్ర విమానాశ్రయ నిర్మాణం, దిమాపూర్‌లో రన్‌వే నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ ‌బిల్డింగ్‌లో సమూల మార్పులు, షిల్లాంగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇన్‌‌స్ట్రుమెంట్‌ ‌ల్యాండింగ్‌ ‌సిస్టమ్‌, ‌తుర విమానాశ్రయ అభివృద్ధితో పాటు, వినియోగంలోకి తీసుకొని రావడం వంటి కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా పూర్తిచేసింది.

యాక్ట్ ఈస్ట్ ‌పాలసీ

దివంగత పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ‘లుక్‌ ఈస్ట్ ‌పాలసీ’ని, ప్రధాని నరేంద్ర మోదీ ‘యాక్ట్ ఈస్ట్ ‌పాలసీ’గా మార్చి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన రైలు, రోడ్డు మౌలిక ప్రాజెక్టులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని గతంలో ఎన్నడూ లేనిస్థాయికి తీసుకెళ్లాయి. అదీకాకుండా మోదీ ‘నార్త్ ఈస్ట్ అజెండా’ ఈ ప్రాంత ప్రజలను బీజేపీకి మరింత సన్నిహితం చేసింది. 2008లో మీటర్‌గేజ్‌ ‌రైల్వే లైను ప్రారంభమవడానికి ముందు త్రిపురకు మిగిలిన దేశంతో ఏ విధమైన అనుసంధానం ఉండేదికాదు. మోదీ ప్రభుత్వం దీన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చింది. అంతేకాదు అగర్తలా నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌, ‌త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టింది. 2016లో అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ‌ప్రభు ధనసిరి-కోహిమా మధ్య 88 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చు రూ.2315 కోట్లు. దీని ద్వారా కోహిమాను జాతీయ రైల్వే లైన్‌ ‌నెట్‌వర్క్‌కు అనుసంధానించడం సాధ్యమైంది.

అదేవిధంగా ఐజ్వాల్‌, ‌షిల్లాంగ్‌, ఇం‌పాల్‌ ‌రైల్వే ప్రాజెక్టులను కూడా కేంద్రం ప్రారంభించింది. ఈ ప్రాంతంలో రెండు డజన్లకు పైగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. త్రిపుర-చిట్ట గాంగ్‌ల మధ్య రైల్వేలైన్‌ ‌నిర్మాణానికి బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మోదీ ప్రభుత్వం యాక్ట్ ఈస్ట్ ‌పాలసీ కింద 1300 కిలోమీటర్ల పొడవైన ఇండియా- మయన్మార్‌- ‌థాయ్‌లాండ్‌ ‌త్రైపాక్షిక జాతీయ రహదారిని పూర్తిచేస్తోంది. దీని ద్వారా పై ఆగ్నేయాసియా దేశాలు త్రిపురకు అనుసంధానం కానున్నాయి. ఇది ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఎంతో మేలుచేయగలదు. ఇది మణిపూర్‌లోని మోరె పట్టణాన్ని థాయ్‌లాండ్‌ ‌లోని మాయ్‌సాట్‌ ‌పట్టణంతో కలుపుతుంది. వీటితో పాటు 15 కిలోమీటర్ల పొడవైన అగర్తలా-అఖౌరా (బంగ్లాదేశ్‌)‌ల మధ్య నిర్మించే రైల్వే ట్రాక్‌ ‌నిర్మాణం వచ్చే ఏడాది పూర్తికానుంది.

ఉపసంహారం

అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, అస్సాం, మణిపూర్‌, ‌మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, ‌త్రిపుర, సిక్కింలను ఈశాన్య రాష్ట్రాలుగా పేర్కొంటారు. మొత్తం ఈశాన్య ప్రాంతంలో ఒకే ఒక మెట్రోపాలిటన్‌ ‌సిటీ గువహతి. కాగా ఈ ప్రాంతం ఉత్తరాన టిబెట్‌తో 1395 కిలోమీటర్లు, తూర్పున మయన్మార్‌తో 1640 కిలోమీటర్లు, నైరుతి దిశలో బంగ్లాదేశ్‌తో 1596 కిలోమీటర్లు, పశ్చిమాన నేపాల్‌తో 97 కిలోమీటర్లు, ఈశాన్య దిక్కున భూటాన్‌తో 455 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. ఈశాన్య రాష్ట్రాల మొత్తం విస్తీర్ణం 2,62,230 చదరపు కిలోమీటర్లు. అంటే ఇది మొత్తం భారత్‌ ‌విస్తీర్ణంలో 8 శాతం. 1972లో సిక్కిం రాష్ట్రం ఏర్పాటు కావడానికి ముందు ఒకసారి ఆకాశవాణిలో నిర్వహించిన ఒక టాక్‌షోలో జ్యోతిప్రసాద్‌ ‌సైకియా అనే జర్నలిస్టు, మిగిలిన ఏడు రాష్ట్రాలను ‘ల్యాండ్‌ ఆఫ్‌ ‌సెవెన్‌ ‌సిస్టర్స్’ అనే పదాన్ని వాడారు. అప్పటినుంచి ఈ రాష్ట్రాలను (సిక్కిం రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు) కలిపి ఇదే పేరుతో పిలవడం పరిపాటైంది. ఇప్పుడు ప్రధాని వీటిని ‘అష్టలక్ష్ములు’గా (సిక్కింను కలిపి) వ్యవహరిస్తున్నారు. ఈ ఎనిమిది రాష్ట్రాలు మన దేశ ప్రధాన భూభాగంతో ఎంత గాఢంగా అనుసంధానమైతే దేశానికి అంత ప్రయోజనకరం. ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుండటం ముదావహం.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE