– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌సీమగర్జన పేరుతో వైకాపా నాయకులు తమను మోసం చేస్తున్నారని రాయలసీమవాసులు భావిస్తున్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది సెంటిమెంటుగా మారిన తరుణంలో అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొనడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటుందని ప్రభుత్వాన్ని సీమవాసులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలతో రాయలసీమకు మంచి జరుగుతుందని భావించి ఈ ప్రాంత ఓటర్లు వైకాపాకు భారీ మెజారిటీ కట్టబెట్టారు. రాయలసీమ 4 జిల్లాల్లో 54 సీట్లుంటే 51 వరకు గెలిపించారు.

అయితే వైకాపా ప్రభుత్వం వారి ఆశలను అడియాశలు చేసింది. అధికారం పొంది మూడున్న రేళ్లయినా పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో దేనిని నెరవేర్చలేదు. అపరిష్కృత సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. కొత్త ప్రాజెక్టు ఒక్కటీ చేప•్టలేదు. ఉద్యాన రైతులకు యంత్రపరికరాలు అందించలేదు. నిరుద్యోగులకు ఉపాధినిచ్చే భారీ ప్రాజెక్టు ఒక్కటీ నిర్మించలేదు. వ్యవసాయానికి ప్రోత్సాహకం అందక రైతులు, నిరుద్యోగులు ఉపాధి కోసం వలస పోతున్నారు. ఇప్పటికీ ప్రతి గ్రామం నుంచి వందలాది మంది వలస వెళ్లిపోవడం కనిపిస్తోంది. ఇక కడపలో స్టీల్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు, రహదారులు, రైల్వేలైన్లపై తెదేపా, వైకాపా రెండూ ప్రజలను మభ్యపెట్టాయి. ఇవికాక వైకాపా ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు తాగడానికి నీరు ఇవ్వలేకున్నా మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తోంది. సీమగర్జన పేరుతో కర్నూలులో తిష్ఠవేసిన 9 మంది మంత్రులు తాము ‘సీమ’కు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పగలరా?

రాజకీయ పైచేయి కోసమే

రాయలసీమలో హైకోర్టు కోసం.. వికేంద్రీ కరణకు మద్దతుగా కర్నూలు ఎస్‌టీబీసీ మైదానంలో జేఏసీ ఆధ్వర్యంలో ‘రాయలసీమ గర్జన’ పేరుతో వైసీపీ అధిష్ఠానం భారీసభ నిర్వహించింది. పేరుకు హైకోర్టు, వికేంద్రీకరణ అని చెబుతున్నా ప్రభుత్వ ఉద్దేశ్యం మాత్రం వేరు. మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉంది అని చెప్పించడమే ఈ సభ ప్రధాన లక్ష్యం. రాజకీయ పైచేయి కోసం తెదేపా నాయకులు చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన చేస్తే, ఇప్పుడు తమదే పైచేయిగా చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం రాయలసీమ గర్జన సభను వేదికగా చేసుకుంది. కాని ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. వైకాపా, తెదేపా తమ ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ పార్టీల ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

సుప్రీంలో ఒక మాట.. సీమలో మరో మాట

సీమ ప్రజలకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు సెంటిమెంటుగా మారింది. అందువల్లే భారతీయ జనతా పార్టీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేస్తోంది. కాని గత తెదేపా ప్రభుత్వం గాని, ఇప్పటి వైకాపా ప్రభుత్వం గాని సీమ ప్రజల సెంటిమెంటును గౌరవించలేదు. హైకోర్టు రాయల సీమకు రాకపోవడానికి టీడీపీ ఎంత కారణమో వైసీపీ కూడా అంతే కారణం. రాజధాని, హైకోర్టు రెండూ అమరావతిలోనే పెట్టాలని, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం పెట్టగా ప్రతిపక్ష నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ఇచ్చారు. అందువల్లనే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేస్తూ ఆనాటి రాష్ట్రపతి డిసెంబర్‌ 26, 2018‌న గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాయలసీమ గర్జన సభను ఏర్పాటు చేసే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అని బీజేపీ ప్రశ్నిస్తోంది.

‘సీమ’కు వైకాపా హామీలు, చేసిన శంకుస్ధాపనలు

రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ ‌పేరుతో రూ.33,862 కోట్లతో 23 సాగునీటి ప్రాజెక్టులకు సీఎం జగన్‌ ‌హడావిడిగా శంకుస్థాపనలు చేశారు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం 5 శాతం పనులు కూడా పూర్తిచేయలేదు.

స్టీలు ప్లాంట్లు ఏం చేశారు?

కడప జిల్లా మైలవరం మండలంలో టీడీపీ ప్రభుత్వం 3,500 ఎకరాల్లో రాయలసీమ స్టీల్‌ ‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసింది. కాని దానిని నిర్మించ లేదు. జగన్‌ ‌సీఎం అయ్యాక ఆ ప్లాంట్‌ను రద్దు చేసి.. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల్లో ఏపీ హైగ్రేడ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ (‌వైఎస్‌ఆర్‌ ‌స్టీల్స్) ‌నిర్మాణానికి డిసెంబరు 23, 2019న శంకుస్థాపన చేశారు. 3,148.69 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. మూడున్నరేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కర్నూలు జిల్లాలో 33 వేల ఎకరాల్లో ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌లో ఈ మూడున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటే కాలేదు.

సిద్దేశ్వరం అలుగు

శ్రీశైలం జలాశయం ఎగువన 854 అడుగుల లెవల్‌లో సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి పాద యాత్రలో జగన్‌ ‌హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడున్నరేళ్లయినా దాని ప్రస్తావనే లేదు.

‘గుండ్రేవుల’ జోలికీ పోలేదు

 గుండ్రేవుల జలాశయం నిర్మిస్తామని పాద యాత్రలో జగన్‌ ‌హామీ ఇచ్చారు. కాని మూడేళ్లయినా దానిని పట్టించుకోలేదు. కేసీ కాలువ పరిధిలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. తుంగభద్ర నదీజలాల్లో కేసీ కాలువకు 39 టీఎంసీలు వాటా ఉంది. ఆ నీటిని నిలుపుకునే జలాశయం లేదు. సుంకేసుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మించాలని సీమ రైతుల డిమాండ్‌. ‌గత టీడీపీ ప్రభుత్వం రూ.2,900 కోట్లు మంజూరు చేసి జీవో ఇచ్చి చేతులు దులుపుకుంది. జగన్‌ ‌కూడా అదే తీరున దీని నిర్మాణ ఊసే ఎత్తలేదు.

వేదావతి ఎత్తిపోతల పథకం ఏమైంది?

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగు నీటి అవసరాల కోసం నిర్మించ తలపెట్టిన వేదావతి ఎత్తి పోతల పథకం కూడా అసంపూర్తిగా మిగిలి పోయింది. రూ.1,985 కోట్లతో ఆర్డీఎస్‌ ‌కుడి కాలువ, రూ.1,995 కోట్లతో వేదావతి ఎత్తిపోతల పథకం ఇక్కడ అమలుచేయాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఆ పనులు ఆపేసి.. ఆ తరువాత మొదలు పెట్టినా నిధులు లేక అసంపూర్తిగా ఆగిపోయాయి. వీటిని ఎందుకు పూర్తి చేయడం లేదు?

హంద్రీనీవా ఎత్తిపోతల అంతేనా?

హంద్రీనీవా ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 10 వేల క్యూసెక్కులు లిఫ్ట్ ‌చేసేలా సమాంతర కాలువ నిర్మిస్తామని జగన్‌ ‌పాదయాతలో చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత సామర్థ్ధ్యం మేరకు 3,800 క్యూసెక్కులు లిఫ్ట్ ‌చేయాల్సి ఉండగా 2 వేల క్యూసెక్కులు కూడా లిఫ్టు చేయడం లేదు. పూర్తి సామర్థ్యంలో లిఫ్టు చేయాలనే లక్ష్యంగా రూ.350 కోట్లతో విస్తరణ పనులు చేపట్టాలి. కాని వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ పనులు ఆపేశారు. సమాంతర కాలువ ఊసే లేదు.

కడపలో నీటి వనరుల సంరక్షణపై శ్రద్ద ఏదీ?

కడప జిల్లాలో వర్షాధారంగానే వ్యవసాయం జరుగుతోంది. అడపాదడపా వచ్చే వర్షాలు, వరదలతో మాత్రమే నీరు కనిపిస్తుంది. ఇలా వచ్చిన నీటిని వడిసి పట్టడం వీలుకావడం లేదు. ఈ జిల్లాలో 77.287 టీఎంసీలు నిల్వ చేసేందుకు గండికోట, చిత్రావతి, బ్రహ్మసాగర్‌, ‌మైలవరం, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్‌.. ‌వంటి జలాశయాలు ఉన్నాయి. సాగునీరు అందించే పిల్ల కాలువలు, వివిధ నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. సుమారు రూ.450 కోట్లు వెచ్చిస్తే పిల్లకాలువలను పూర్తి చేయ వచ్చని ఇంజనీర్లు అంటున్నారు. ఆ పనులు ఎందుకు చేపట్టలేదు? అని ప్రశ్నలు రేగుతున్నాయి. అమెరికా లోని అయోవా యూనివర్సిటీ సహకారంతో మెగా సీడ్‌ ‌హబ్‌కు కర్నూలులో ఏర్పాటు చేయాల్సి ఉన్నా వైకాపా ప్రభుత్వం దానిని రద్దు చేసింది. సీడ్‌ ‌హబ్‌ ‌కొనసాగించి ఉంటే రైతులకు మేలు జరిగేది.

About Author

By editor

Twitter
Instagram