– క్రాంతి

అతిథిగా వచ్చిన వాడు ఆతిథ్యం ఇచ్చిన వారిని పొగడకున్నా పర్వాలేదు. వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే చాలు. వారి గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కనీస మర్యాద, ఇంగిత జ్ఞానం. గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవానికి జ్యూరీ హెడ్‌గా వ్యవహరించిన ఇజ్రాయెల్‌ ‌దర్శకుడు నడావ్‌ ‌లాపిడ్‌కు ఈ ఇంగిత జ్ఞానం లోపించి ఏకంగా ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడేశాడు. ‘ది కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రం మీద అనాలోచిత వ్యాఖ్యలు చేసేశాడు. ఆయన చేసిన పనిని ఇజ్రాయెల్‌ ‌ప్రభుత్వం ఖండించడంతో పాటు క్షమాపణలు చెప్పుకొని విజ్ఞత చాటుకుంది.


ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదం. ప్రపంచశాంతికి ఈ సమస్య అతిపెద్ద ముప్పుగా మారింది. ఐక్యరాజ్య సమితితో పాటు చాలా దేశాలు ఉగ్రవాదాన్ని ప్రపంచ శత్రువుగా గుర్తించి, ఈ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో పోరాటం చేయాలనే అభిప్రాయాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేయడం మనందరికీ తెలుసు. ఉగ్రవాద బాధిత దేశాల జాబితాలో భారత్‌ ‌పేరు ప్రముఖంగా కనిపిస్తుంది. అందునా మన దేశంలో ఉగ్రవాద బాధితుల్లో మొదటి స్థానం కశ్మీర్‌ ‌పండితులదే. 1990వ దశకంలో వారిపై సాగిన మారణకాండను ‘ది కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రం కళ్లకు కట్టినట్లు చూపింది. ఆలాంటి చిత్రంపై విదేశీయులు ఏమైనా మాట్లాడితే వారికి సమస్య అంతగా అర్థం కాలేదని భావించవచ్చు. కానీ మన మిత్ర దేశానికి చెందిన వ్యక్తి తప్పుగా మాట్లాడితే ఎలా సహించగలం? ఇజ్రాయెల్‌ ‌దర్శకుడు నడావ్‌ ‌లాపిడ్‌ ‌చేసిన పని ఇదే.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గోవాలో 53వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం (ఇఫి) అట్టహాసంగా జరిగింది. నవంబర్‌ 20‌వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ మహోత్సవానికి మన దేశ చలనచిత్ర పరిశ్రమతో పాటు పలు దేశాల చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు వచ్చారు. 79 దేశాలకు చెందిన 280 సినిమాలు ప్రదర్శించారు. ఇందులో భారత్‌కు చెందిన 25 ఫీచర్‌ ‌ఫిల్మస్‌తో పాటు 20 నాన్‌-‌ఫీచర్‌ ‌ఫిల్మస్‌ను ‘ఇండియన్‌ ‌పనోరమ’లో ప్రదర్శిం చారు. 183 చలన చిత్రాలు అంతర్జాతీయ పోగ్రామింగ్‌లో భాగంగా ప్రదర్శించారు. ఇఫి కార్యక్రమాల నిర్వహణతో పాటు ఇక్కడ ప్రదర్శించే చిత్రాలకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించడానికి ఒక జ్యూరీ ఉంటుంది. దానికి హెడ్‌ (‌నాయకుడు)గా ఇజ్రాయెల్‌ ‌దర్శకుడు నడావ్‌ ‌లాపిడ్‌ ‌వ్యవహ రించారు. అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం విజయవంతంగా ముగిసినందుకు అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆతిథ్య దేశమైన భారత్‌ను ఇబ్బంది పెట్టే ఘటన చోటు చేసుకుంది. ఇందుకు స్వయంగా ఇఫి హెడ్‌ ‌బాధ్యుడు కావడం విచారకరం.

విషం కక్కిన నడావ్‌

‌ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రాన్ని అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా నవంబరు 22న ప్రత్యేకంగా ప్రదర్శించారు. ‘ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు. కళలకు, జీవితానికి అవసరమైన విమర్శ నాత్మక చర్చను ఈ ఫెస్టివల్‌ ఎప్పటికీ స్వాగతిస్తుంది. అందుకే నేను నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెబుతున్నా’ అని జ్యూరీ హెడ్‌ ‌నడావ్‌ ‌లాపిడ్‌ ‌ముగింపు వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు అందరిని దిగ్భ్రాంతి పరిచాయి.

స్వయాన జ్యూరీ హెడ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. దీంతో ఇఫి జ్యూరీ బోర్డు ఓ ప్రకటన విడుదల చేస్తూ, కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌చిత్రంపై లాపిడ్‌ ‌చేసిన వ్యాఖ్యలు.. పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని, దీనిపై జ్యూరీ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘జ్యూరీ సభ్యులుగా.. ఒక సినిమా సాంకేతికత, నాణ్యత, సామాజిక-సాంస్కృతిక ఔచిత్యాన్ని మాత్రమే మేం అంచనా వేస్తాం. అంతేగానీ సినిమాలపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోం. ఒకవేళ జ్యూరీ సభ్యులెవరైనా అలా చేస్తే.. అది పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అని జ్యూరీ బోర్డు ప్రకటనలో పేర్కొంది. జ్యూరీ సభ్యుడు సుదీప్తో సేన్‌ ‌మాట్లాడుతూ, లాపిడ్‌ ‌వ్యాఖ్యలతో తనకు, జ్యూరీలోని ఇతర సభ్యులకు సంబంధం లేదని ప్రకటించారు. అవి ఆయన వ్యక్తిగతమైనవని తేల్చి చెప్పారు. ఈ వివాదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేసింది జ్యూరీ. అయితే నడావ్‌ ‌లాపిడ్‌ ‌వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కశ్మీరీ పండిట్ల బాధల పట్ల ఆయనకు ఎలాంటి విచారం లేదంటూ పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటు: అనుపమ్‌ ‌ఖేర్‌

ఇఫి జ్యూరీ హెడ్‌ ‌నడావ్‌ ‌లాపిడ్‌ ‘‌కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రంపై చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు అనుపమ్‌ ‌ఖేర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్వయంగా ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. ‘యూదులపై దారుణమైన మారణహోమం వంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నాడు యూదులపై నరమేధం నిజమైతే.. కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా’ వ్యాఖ్యానించారు.

‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌సినిమాలో వాస్తవాలను చూపించడం కొందరికి రుచించట్లేదంటూ అనుపమ్‌ ‌ఖేర్‌ ‌మండిపడ్డారు. ‘నిజాలు చూడలేకపోతే.. నోరు మూసుకుని కూర్చోవాల’ని సూచించారు. ‘కొందరికి ఉన్నది ఉన్నట్లుగా చూపించే అలవాటు ఉండదు. దాన్ని తమకు ఇష్టమొచ్చినట్లుగా మార్చి చూపిస్తుంటారు. అలాంటి వారు కశ్మీర్‌ ‌నిజాలను జీర్ణించుకోలేకపోతున్నారు. గత 25-30 ఏళ్లుగా కశ్మీర్‌ను మరో కోణంలో చూపిస్తున్నారు. దాన్ని కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌బహిర్గతం చేసింది. ఇది మా విషాద చరిత్రలో ఒక భాగం. మీకు అది తెలియకపోతే.. ఆ విషాదాన్ని అనుభవించిన వారిని కలిసి తెలుసుకోండి. ఎందు కంటే ఇదే మా కశ్మీర్‌లో జరిగిన నిజం’ అని విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశారు ఖేర్‌.

‌భారత్‌, ఇ‌జ్రాయెల్‌.. ‌రెండు దేశాలూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి అని గుర్తు చేశారు అనుపమ్‌ ‌ఖేర్‌. ‘‌కశ్మీరీ హిందువుల బాధను ఇజ్రాయెల్‌లో సామాన్య వ్యక్తి కూడా అర్థం చేసుకోగలరు. అయితే.. ప్రతి దేశంలోనూ దేశ ద్రోహులు ఉంటారు కదా’ అని అనుపమ్‌ ‌ఖేర్‌ ‌మండిపడ్డారు. తమది కేవలం సినిమా మాత్రమే కాదని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఉద్యమమని ఖేర్‌ ఈ ‌సందర్భంగా అన్నారు. ఈ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు టూల్‌కిట్‌ ‌గ్యాంగ్‌లు ప్రయత్నిస్తూనే ఉంటాయని ఆరోపించారు.

అవాస్తవం అయితే తప్పుకుంటా: వివేక్‌ అగ్నిహోత్రి

‘ది కశ్మీర్‌ ‌ఫైల్స్’‌లో ఒక్క అవాస్తవ దృశ్యం ఉన్నా సినిమాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు ఆ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. తన సినిమాలో ఒక్క కల్పిత సన్నివేశం చూపించినా ఇకపై చిత్రాలు తీయబోనని నడావ్‌ ‌లాపిడ్‌కు సవాల్‌ ‌విసిరారు. ‘ప్రపంచ మేధావులకు, ఈ మహా గొప్ప ఇజ్రాయెల్‌ ‌దర్శకుడికి ఇదే నా సవాల్‌… ‌ది కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌చిత్రంలో ఒక్క ఫ్రేమ్‌ ‌కానీ, ఒక్క డైలాగ్‌ ‌కానీ, ఒక్క ఘటన కానీ అసత్యం అని నిరూపించండి చాలు… నేను ఇక సినిమాలు తీయడం మానేస్తా’ అని వివేక్‌ అగ్నిహోత్రి పేర్కొన్నారు. ‘సత్యమనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. అందుకే ప్రజలు అసత్యాలు చెబుతుంటారు’’ అని అగ్నిహోత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు. ఉగ్రవాద మద్దతుదారులు, నరమేధానికి పాల్పడలేదని చెప్పుకునేవారు ఎప్పటికీ నా నోరు మూయించలేరు అని స్పష్టం చేశారు. తన వ్యతిరేకులతో ఘర్షణను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌ ‌దౌత్యవేత్తల క్షమాపణలు

ఇజ్రాయెల్‌ ‌దర్శకుడి వ్యాఖ్యలపై భారత్‌లోని ఇజ్రాయెల్‌ ‌రాయబారి నావొర్‌ ‌గిలాన్‌ ‌స్పందించారు. లాపిడ్‌ ‌వ్యాఖ్యలను ఖండించడమేకాక భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. ‘భారతీయ సంప్రదాయంలో అతిథిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి దేశానికి వచ్చి ఇఫిలో జడ్జి ప్యానెల్‌కు హెడ్‌గా ఉన్న మీరు(లాపిడ్‌).. ఆతిథ్య మిచ్చిన దేశాన్నే అవమానించారు. చారిత్రక ఘటనల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాటి గురించి వ్యాఖ్యానించడం సరికాదు. మీ వ్యాఖ్యల పట్ల ఇజ్రాయెల్‌ ‌దేశస్థుడిగా నేను సిగ్గుపడుతున్నా. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని గిలాన్‌ ‌ట్విటర్‌లో పోస్టులు పెట్టారు.

భారత్‌లోని ఇజ్రాయెల్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌ ‌కొబ్బి షోషానీ కూడా లాపిడ్‌ ‌వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయం తెలియగానే ఆయన అనుపమ్‌ ‌ఖేర్‌కు స్వయంగా ఫోన్‌ ‌చేసి క్షమాపణలు తెలియజేశారు. ‘లాపిడ్‌ ‌వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమే. దీనికి ఇజ్రాయెల్‌తో అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ విషయం గురించి తెలియగానే నేను నా స్నేహితుడు అనుపమ్‌ ‌ఖేర్‌కు ఫోన్‌ ‌చేసి క్షమాపణలు చెప్పాను. ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌ప్రచార చిత్రం కాదు. కశ్మీరీల బాధలను చెప్పిన బలమైన చిత్రం’ అని షోషానీ అన్నారు.

ఇజ్రాయెల్‌ ‌రాయబారికి విద్వేష సందేశాలు

మరోవైపు నడావ్‌ ‌లాపిడ్‌ ‌చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయెల్‌ ‌రాయబారి నావొర్‌ ‌గిలాన్‌కు ట్విటర్‌ ‌వేదికగా ద్వేషపూరిత సందేశాలు వచ్చాయి. స్వయంగా ఆయన ఈ విషయం తెలిపారు. ‘మీలాంటి వ్యక్తులను అంతం చేసిన హిట్లర్‌ ‌గొప్ప వాడు. వెంటనే భారత్‌ ‌నుంచి వెళ్లిపోండి. హిట్లర్‌ ‌గొప్ప వ్యక్తి’ అని అందులో రాసి ఉంది. పీహెచ్‌డీ చేసిన ఓ వ్యక్తి ఈ మెసేజ్‌ను పంపినట్లు తెలుస్తోందని చెబుతూ.. అతని వివరాలు గోప్యంగా ఉంచారు. ఈ క్రమంలోనే పలువురు గిలాన్‌కు మద్దతుగా నిలిచారు. అనంతరం ఆయన మరో ట్వీట్‌ ‌చేస్తూ.. ‘ఇంకా కొందరిలో జాతివివక్ష భావాలు ఉన్నాయని ఈ పోస్ట్ ‌ద్వారా గుర్తుచేయాలనుకున్నా. మనమంతా కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించాలి’ అని పేర్కొన్నారు.

అన్ని వర్గాల నుంచి ఆగ్రహం

ఇజ్రాయెల్‌ ‌దర్శకుడు నడావ్‌ ‌లాపిడ్‌ ‌చేసిన వ్యాఖ్యలపై బీజేపీతో పాటు వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ‘హిట్లర్‌ ‌హయాంలో లక్షలాది యూదులను హతమార్చిన హోల్‌కాస్ట్‌ను ప్రజలు చాలాకాలం విశ్వసించలేదు. అలాగే షిండ్లర్స్ ‌జాబితాను ప్రచారంగా పేర్కొన్నారు.. ప్రస్తుతం ‘ది కశ్మీర్‌ ‌ఫైల్స్’‌పై కొందరు అదే విధంగా వ్యవహ రిస్తున్నారు. సత్యమే చివరకు విజయం సాధిస్తుంది’’ అని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ ‌మాలవీయ పేర్కొన్నారు. ‘క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలియని వ్యక్తుల నుంచే అటువంటి వ్యాఖ్యలు వస్తాయి. నిరాశ్రయులైన కశ్మీరీ పండిట్లు ఆశ్రయం పొందుతున్న జమ్ము-కశ్మీర్‌లోని క్యాంపులను లాపిడ్‌ ‌సందర్శించాలి’ అని జమ్ము-కశ్మీర్‌ ‌బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ ‌రైనా సూచించారు. ‘ది కశ్మీర్‌ ‌ఫైల్స్’‌పై లాపిడ్‌ ‌వ్యాఖ్యలు… గతంలో భయానక పరిస్థితులను ఎదుర్కొన్న కశ్మీర్‌ ‌హిందువులను అవమానించడమే నని బీజేపీ గోవా అధికార ప్రతినిధి సావియో రోడ్రిగ్స్ అభివర్ణించారు. ద్వేషం ఎప్పటికైనా నాశనమవు తుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే వ్యాఖ్యానించారు.

నడావ్‌ ‌లాపిడ్‌ ‌క్షమాపణలు

నడావ్‌ ‌లాపిడ్‌ ‌చేసిన వ్యాఖ్యలపై అనూహ్యంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన కొంత దిగి రాక తప్పలేదు. అయితే డొంక తిరుగుడుగానే స్పందించారు.. తాను చేసిన వ్యాఖ్యలతో బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. తానెప్పుడూ ఎవరినీ అవమానించాలనుకోనని, అది తన ఉద్దేశం కూడా కాదని తెలిపారు. చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కోపాన్ని తాను అర్థం చేసుకు న్నానని పేర్కొన్నారు నడావ్‌. ‌కశ్మీరీ పండిట్ల పట్ల తనకు సానుభూతి ఉన్నదని తెలిపారు. తాను కేవలం సినిమా గురించి మాట్లాడుతున్నానని, ఘటన గురించి కాదని చెప్పారు.

కశ్మీరీ పండిట్లను లేదా వారి బంధువులను కించపరచలేదని, బాధితులను తాను గాయపరచ లేదని చెబుతూనే తన వ్యాఖ్యలను డావ్‌ ‌లాపిడ్‌ ‌సమర్థించుకున్నారు. తనతో పాటు తోటి జ్యూరీ సభ్యులు కూడా ఆ సినిమా ఒక వల్గర్‌ ‌ప్రాపగాండ గానే చూశారని, అలాంటి ప్రతిష్ఠాత్మక ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమా పోటీ పడటం సరికాదని, ఇదే విషయాన్ని మళ్లీమళ్లీ చెప్పమన్నా చెబుతానని అన్నారు. కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌సినిమాటిక్‌ ‌మ్యానిపులేషన్‌లో ఉన్నదని చెప్పారు. హింస, విద్వేషం చిమ్మడానికే ఈ సినిమాను వినియోగించుకున్నట్టు తామంతా భావించామని నడావ్‌ ‌లాపిడ్‌ ‌తెలిపారు.

ఇఫి జ్యూరీ హెడ్‌ ‌నడావ్‌ ‌లాపిడ్‌ ఇ‌జ్రాయెల్‌ ‌పౌరుడు కాబట్టి మిత్రదేశమైన భారత్‌ ‌పట్ల సానుభూతితో ఉంటారని భావించాల్సిన అవసరం లేదు. మనదేశంలో ఇజ్రాయెల్‌ ‌పట్ల భిన్నాభి ప్రాయాలు ఉన్నట్లే, అక్కడా భారత్‌ ‌విషయంలో మాట్లాడేవారున్నారు. లాపిడ్‌ ఈ ‌కోవకు చెందిన వాడే. స్వతహాగా నడావ్‌ ‌లాపిడ్‌ ‌వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి. గతంలో ఆయన తమ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఆయన సినిమాల్లో పాలస్తీనా అనుకూల వైఖరి, ఇజ్రాయెల్‌ ‌పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది. పాలస్తీనా హక్కులను ఇజ్రాయెల్‌ ‌తీవ్రంగా అణచివేస్తున్నట్లు తన సినిమాల్లో చూపించే లాపిడ్‌, ‌కశ్మీర్‌ ‌విషయంలో ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు..

సొంత దేశానికే వ్యతిరేకంగా మాట్లాడే లెఫ్టిస్టు ఇజ్రాయెలీ పౌరుడైన నడావ్‌ ‌లాపిడ్‌కు భారతదేశంపై గౌరవం ఎలా ఉంటుంది? యూదులపై జరిగిన అరాచకాల గురించే మాట్లాడని వాడు, కశ్మీరీ పండిట్ల కష్టాలపై ఎలా మాట్లాడతాడు? ఆయన్ని గోవా ఫిల్మ్ ‌ఫెస్టివల్‌కు ఆహ్వానించే ముందే ఆలోచించి ఉండాల్సింది. ఆహ్వానితుల అర్హతలను పరిగణనలోకి తీసుకొని ఉంటే ఇలాంటి పొరపాట్లు తప్పేవి… అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫిల్మ్ ‌ఫెస్టివల్‌లో ఆయన కొందరు భారత చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తులతో సమావేశమయ్యారు. వారిలో కొందరు ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రం విషయంలో నడావ్‌కు తప్పుడు అభిప్రాయాలు కలిగేలా చెప్పి ఉంటారు. ఈ విషయంలో నిజానిజాలను ఆయన నిర్ధారించు కోవాలి. కానీ ఆ పని చేయలేదు. అనుపమ్‌ ‌ఖేర్‌ అన్నట్లు నడావ్‌ ఇ‌జ్రాయెల్‌ ‌పౌరుడు, యూదు జాతీయుడు కావొచ్చు కానీ లెఫ్టిస్ట్.. ‌లెఫ్ట్ ‌లిబరల్‌ ‌టూల్‌ ‌కిట్‌లో ఆయన కూడా ఒక భాగం.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram