‘జాతీయవాద సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ను పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాతో ఎలా పోలుస్తారు? ఒక జాతీయవాద సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశం పట్ల ప్రగాఢమైన భక్తిని కలిగి ఉంది. సాంస్కృతిక సంపద ఆధారంగా మన మహోన్నత దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలపాలన్న ఆశయం ఉన్న సంస్థ కూడా అదే. సరిగ్గా దీనికి  భిన్నమైన అభిప్రాయం కలిగి ఉండే సంస్థ పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా. వీళ్లు ఏం చేశారో అందరికీ తెలుసు. ఈ సంస్థను నిషేధించినప్పుడు ఇచ్చిన ఆరోపణల పత్రంలో కూడా ఈ సంస్థ సభ్యులు ఎంత వరకు తెగించారో కూడా స్పష్టంగానే ఉంది.’

ఈ మాటలు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రముఖుడు, లేదా బీజేపీ, విశ్వహిందూ పరిషత్‌ ‌ప్రముఖులు అన్నవి కావు. ప్రొఫెసర్‌ ‌టీజే జోసెఫ్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఈ మాటలను ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (అక్టోబర్‌ 1) ‌వెల్లడించింది. కేరళలో ముస్లిం మతోన్మాదం, పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా రక్తదాహం గురించి తెలిసిన వారికి టీజే జోసెఫ్‌ ‌పేరుతో అంతో ఇంతో పరిచయం ఉంటుంది. జూలై 4, 2010న పీఎఫ్‌ఐ ‌నరహంతకులు ఈయన కుడి చేతిని దారుణంగా నరికారు. తుడుపుజా అనేచోట ఉన్న న్యూమన్‌ ‌కళాశాలలో మలయాళ సాహిత్యం బోధించే జోసెఫ్‌, ‌మహమ్మద్‌ ‌ప్రవక్తను అవమా నించాడన్నది పీఎఫ్‌ఐ ఆరోపణ. అదే ఇలా ఆరోపించింది. అదే మధ్య యుగాల పద్ధతిలో శిక్ష విధించింది. బి.కాం. రెండో సంవత్సరం విద్యార్థుల కోసం ఆయన తయారు చేసిన ప్రశ్నపత్రంలో ప్రవక్త పట్ల జోసెఫ్‌ ‌దుర్భాషలకు పాల్పడ్డారన్నదే పీఎఫ్‌ఐ ఆరోపణ. ఇంతకీ ఆ ప్రశ్న రచయిత మహమ్మద్‌కు సంబంధించినది. జోసెఫ్‌ ‌స్వస్థలం మువట్టుపుజాలో ఆ రోజు హోలీ సండే ప్రార్థనలకు వెళ్లి కుటుంబంతో సహా తిరిగి వస్తుండగా పీఎఫ్‌ఐ ‌రక్తపిపాసులు బాంబులు వేసి కారును ఆపి, ఆయనను బయటకు లాగి కుడి చేయి నరికారు. కొట్టాయం జిల్లాలోని ఈరాట్టుపేట అనే చోట జరిగిన పంచాయతీ ఈ మేరకు శిక్ష విధించింది. ఎనిమిది మంది కలసి ఆ శిక్షను అమలు చేసేశారు. తన తల్లి, సోదరి కూడా కారులో ఉన్నారు. కాపాడడం కోసం ముందుకు వచ్చిన ఆ ఇద్దరి మీద కూడా మతోన్మాదులు దాడి చేశారు. వారి ఎదురుగానే ఈ దారుణం జరిగింది. ఇంతకీ జోసెఫ్‌ ‌తీసుకున్న ప్రశ్న పీటీ కుంజు మహమ్మద్‌ అనే రచయిత కథలోని ఒక పేరా నుంచే.

కొన్ని సంస్థల మీద ప్రభుత్వాలు నిషేధాలు విధించవచ్చు. నిషేధానికి గురైన ఆ సంస్థ మొత్తం వ్యవస్థకు చేసిన చేటు ఎలాంటిదో నిఘా సంస్థలు న్యాయస్థానాల ముందు పెట్టవచ్చు. మతోన్మాదం తలకెక్కి పైశాచికానందంతో స్వైర విహారం చేసే వరకు సంస్థలు ఎదగడానికి కొన్ని పార్టీలు, కొందరు దొంగ మేధావులు సహకరించవచ్చు. ప్రోత్సహించ వచ్చు. కానీ ఈ క్రమంలో ఇలాంటి సంస్థలు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా ధ్వంసం చేయగలవో సాధారణ ప్రజలకు సమాచారం ఉండదు. ముస్లిం మతోన్మాదులు, వామపక్ష తీవ్ర వాదులు, ఖలిస్తానీలు లేకుంటే ఇలాంటి పంథాలలో నడిచే ఇతర సంస్థలు చేసే ఒక హత్య వెనుక ఎంత విషాదం ఉంటుందో, ఎంత మౌనవేదన ఉంటుందో అర్ధం చేసుకోవడానికి జోసెఫ్‌ ‌జీవితం ఒక ఉదాహరణ. ఇలాంటివి ఇంకా ఎన్నో!

జోసెఫ్‌ ‌పనిచేస్తున్న విద్యా సంస్థ క్రైస్తవులకు చెందినదే. కానీ జోసెఫ్‌ ‌ముస్లిం మతోన్మాదుల ఘాతుకానికి గురైనప్పటికీ ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ రగడకు జోసెఫ్‌దే బాధ్యత అని సిరో మలబార్‌ ‌చర్చి తేల్చడం ఇంకొక విశేషం. అతడి మీద చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ‌సిఫారసు చేశాడు. నాటి విద్యామంత్రి ఎంఏ బేబీ, అలాంటి ప్రశ్నపత్రం రూపొందించడం అజ్ఞానమని వ్యాఖ్యా నించాడు. పోలీసులు జోసెఫ్‌ను, ఆయన కుమారు డిని కూడా వేధించారు. జోసెఫ్‌ ‌భార్య సలోమి మార్చి 20, 2014న 48వ ఏట ఆత్మహత్య చేసుకున్నారు. జీవితం అస్తవ్యస్తమైపోయింది. కుటుంబం కుదేలైంది. జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు జరిపి, ఇది పీఎఫ్‌ఐ ‌పనేనని నిర్ధారించి 13 మందిని దోషులుగా తేల్చింది. ఆయన మీద పెట్టిన కేసులన్నింటిని కోర్టు కొట్టివేసింది. ఇలాంటి మౌఢ్యానికి బలైన వ్యక్తి జ్ఞాపకాలు ఇప్పుడు అక్షరరూపం దాల్చాయి. దాని పేరే ‘తెగిపోవడానికి నిరాకరిస్తున్న జ్ఞాపకాలు’ (అత్తుపో కత ఊర్మకల్‌). ‌దీనికే కేరళ సాహిత్య అకాడమి పురస్కారం (2021) లభించింది. ‘వేయి కోతలు: ఒక అమాయక ప్రశ్న: ప్రాణాంతక సమాధానం’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు.

ఇటీవల పీఎఫ్‌ఐ ‌మీద కేంద్రం నిషేధం విధించిన తరువాత ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆయనతో ఇంటర్వ్యూ జరిపింది. ఇది చాలా చిన్నది. ఆయన మాటలలో ఎంతో నిర్వేదం కనిపిస్తుంది. ఆయన సమాధానాలను బట్టి తానొక జీవచ్చవాన్ని మాత్రమే నన్న ధ్వని వినిపిస్తుంది.

నిషేధం గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగితే, నేను వాళ్ల దుశ్చర్యల బాధితుడిని. ఒక బాధితుడు ఆ దుర్ఘటన గురించి ఎలా మాట్లాడ గలుగుతాడు? నేనొక మామూలు పౌరుడినే అయి ఉంటే నాకంటూ ఒక అభిప్రాయం ఉండేది. కేంద్రం పీఎఫ్‌ఐ ‌మీద విధించిన నిషేధం గురించి ఇంతకు మించి చెప్పడానికి నా దగ్గర ఏమీలేదు. అసలు కొన్నిసార్లు దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. పీఎఫ్‌ఐ ‌బాధితులు చాలామంది ఇప్పుడు మన మధ్య లేరు. వారికి సంఘీభావంగా నేను కూడా ఆ నిషేధం గురించి మౌనం వహిస్తున్నాను అన్నారాయన. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది రాజకీయ నిర్ణయం. అందులోను దేశభద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నది. కాబట్టి ఈ అంశం గురించి రాజకీయ నేతలు మాట్లాడితే బాగుంటుంది అని కూడా అన్నారాయన. ఆ తరువాత అడిగినదే పీఎఫ్‌ఐను నిషేధిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌నూ నిషేధించాలన్న కొందరు నాయకుల వికృత ఆలోచన గురించిన ఆ ప్రశ్న. దానికి ఆయన చాలా ఘాటుగానే స్పందించారు.

చిరకాలంగా ఐర్లెండ్‌లో తన కుమార్తె దగ్గరే ఉన్న జోసెఫ్‌ ‌కొద్దిరోజుల క్రితం తిరిగి స్వస్థలం చేరుకు న్నారు. కేంద్రం దేశభద్రత కోసం పీఎఫ్‌ఐని నిషేధించి ఉండవచ్చు. కానీ కేంద్రం, నిఘా వ్యవస్థలు ఇకపై కూడా అలాంటి వ్యక్తులు మళ్లీ ఏకం కాకుండా తగినంత జాగరూకతతో ఉండాలి అని జోసెఫ్‌ ‌చెప్పారు.

ఆ పుస్తకం గురించి నాలుగు మాటలు చెప్పు కోవాలి. కుడిచేయి నరికారు కాబట్టి జోసెఫ్‌ ‌దీనిని ఎడమ చేత్తో రాశారు. దేశాన్ని మధ్య యుగాలకు, ముస్లిం మౌఢ్య యుగంలోకి నెట్టుకుంటూ పోతున్న వారు ఒక వ్యక్తి మీద జరిపిన దౌష్ట్యం గురించి మాత్రమే ఇందులో రాశారని చెప్పలేం. భారతీయ జీవనాన్ని ఛిద్రం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం గురించి, ఇక్కడి మత సహనం మీద జరుగుతున్న క్రూర దాడి గురించి, కుహనా సెక్యులరిజం ప్రతి సందర్భంలోను ప్రదర్శిస్తున్న నీచాతి నీచ వైఖరి మీద, వెన్నెముక లేని తనం మీద తీవ్ర అభిశంసనగా ఈ రచనను చెప్పవచ్చు. జనవరి 2020లో ఈ పుస్తకం (మలయాళం) విడుదలైంది. కేరళలో మతోన్మాదుల వీరంగం గురించి అక్కడి ప్రజానీకంలో పెద్ద చర్చకు అవకాశం ఇచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించినవారు కె. నందకుమార్‌. ఈయన మహాకవి వల్లతోళ్‌ ‌నారాయణ్‌ ‌మీనన్‌ ‌మనుమడు కావడం విశేషం. ఉన్మాదులు ఏ మతంలో ఉన్నా వారిని ఉపేక్షించకూడదని జోసెఫ్‌ ఆశించడం అసహజం కాదు. ప్రశాంతంగా సాగే ఏ సమాజం లోకి అయినా మతోన్మాదులను అనుమతించడం ప్రమాదమని కూడా ఆయన చెప్పారు. జోసెఫ్‌ ఈ ‌పుస్తకాన్ని ఆత్మహత్యకు పాల్పడిన తన భార్యకే అంకితం ఇచ్చారు. తనపై దాడి, తరువాత జరిగిన పరిణామాలతో ఏర్పడిన వత్తిడి, క్షోభల కారణంగానే ఆమె మరణించిందని ఆయన ప్రకటించారు కూడా. ఇంకా చెప్పాలంటే ముస్లిం మతోన్మాదులు చేసిన ప్రాణాంతక దాడి కంటే, జోసెఫ్‌ ‌పనిచేసిన క్రైస్తవ మత సంస్థ పెట్టిన మానసిక క్షోభ ఎక్కువ హింసాత్మక మైనదని ఆయన భావించినట్టు కనిపిస్తుంది. అలాంటి సమయంలో తనను కళాశాల, చర్చి కూడా బహిష్కరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరాస్యతకు చిరునామా వంటి కేరళలో, ఒక ప్రశాంత సమాజానికి ప్రతీకగా ఉండే ఆ రాష్ట్రంలో సెమిటిక్‌ ‌మతాలు క్రైస్తవం, ఇస్లాం చేస్తున్న కీడు గురించి జోసెఫ్‌ ‌లోతైన విశ్లేషణ ఇచ్చారు. 300 పేజీల ఈ పుస్తకం నిండా ఒళ్లు గగుర్పొడిచే జ్ఞాపకాలే ఉన్నాయి. ‘అవన్నీ నా జ్ఞాపకాలే. కానీ కాగితం మీద పెట్టడం చాలా కష్టమైపోయింద’ని ఆయన చెప్పుకు న్నారు. వాటిలోని బీభత్సం, ఎడమ చేతితో రాయడం రెండూ ఆయనను తీవ్రంగానే కుంగదీసినట్టు కనిపిస్తుంది.

అనుచరులే లేకుంటే క్రైస్తవం, ఇస్లాంలలో మత పెద్దలు లేరు. ఈ అనుచరులలో ఉండే మూఢభక్తే దోపిడీకి అనువైన వాతావరణాన్ని నిర్మిస్తూ ఉంటుంది. మతమే అందులోని పెద్దలకు డబ్బు, అధికారం, ఇంకా వారు ఏది కోరుకుంటే అది సమకూరుస్తూ ఉంటుంది. తమ అనుచరులు చెదిరిపోకుండా చూసుకుంటూ ఆ పెద్దలు తమకు దక్కుతున్న సౌకర్యాలనూ నిలబెట్టుకుంటూ ఉంటారు. ఆ ప్రయోజనాల రక్షణ కోసమే కొత్త వాళ్లని చేర్చుకుంటూ ఉంటారు. సమాజం మతాల వారీగా విడిపోయేందుకు మతావేశాన్ని రెచ్చగొడుతూ ప్రకటనలు ఇస్తూ ఉంటారు.

ఇతర మతాలతో ఘర్షణ పడడానికి అనువుగా అనుచరులను మత పెద్దలు తయారు చేస్తారు. నిజానికి అనుచరులను తమ మతాలకి బానిసలుగా మార్చేస్తూ ఉంటారు. ఇదంతా అమానుషం, అనాగరికం. సెమిటిక్‌ ‌మతాలు క్రైస్తవం, ఇస్లాంలకు ఇతర మతాల వారి పొడగిట్టదు. ఈ మతాలు చెప్పే సూత్రాలు ఏవీ మత సామరస్యాన్ని కాపాడేవి కాదు. ఈ దేశంలో సెక్యులర్‌ ‌సూత్రాల విషయంలో ఇవి పూర్తి నిర్లక్ష్యంగా ఉంటాయి. ఇవి ఇతర మతాల వారి విశ్వాసాలను ఏ మాత్రం గౌరవించకపోవడం వల్లనే ఈ దేశంలో మత సామరస్యం అనే కల ఇప్పటికి పగటి కలగానే మిగిలి ఉంది. తమ చర్యల పట్ల ఏమాత్రం విచారం లేని మతోన్మాదుల చేతులలో బాధితుడిని నేను. ఇక్కడ నా మీద దాడి చేయడం ద్వారా స్వర్గంలో చోటు కేటాయింపు జరుగుతుందని నమ్మేవాళ్లు నా మీద దాడికి పాల్పడ్డారు. ఇతర మతాల వారి మనోభావాలను గాయపరచమని మతం బాహాటంగా ప్రోత్సహిస్తే ఈ దేశంలో సెక్యులరిజం భావన ఎలా నెలకొంటుంది? ఇలాంటి అనాచారాల నిర్మూలన కోసం ప్రతి మత గ్రంథాన్ని కాలానుగుణంగా సంస్కరించుకోవాలి. పర మత ద్వేషం గురించి కొత్త తరాల వారికి బోధించవద్దు. ఎలాంటి దురాలోచనలు, భయాలు లేకుండా వారిని ఎదగనిద్దాం. మతం సామాజిక జీవితంలో చొరబడకూడదు అంటూ జోసెఫ్‌ ‌తన గ్రంథాన్ని ముగించారు.

జోసెఫ్‌ ‌కుటుంబం వరకు సరే, సామాజికంగా చూసినా ఇది మధ్యయుగాల నాటి దుర్మార్గాలకు ప్రాణప్రతిష్ట చేసే ప్రయత్నమే. కాంగ్రెస్‌, ‌సీపీఎం పోటాపోటీగా పెంచి పోషించిన ఈ ఉన్మాద రక్కసికే జోసెఫ్‌ ‌బలయ్యారు. దాని మీదే ఆయన కలం స్పందించింది. ఏ ఒక్క మేధావి, ఏ కమ్యూనిస్టు దీని గురించి మాట్లాడలేదు. ఆ ఘటన మీదనే కాదు, ఇప్పుడు ఈ పుస్తకం గురించీ నోరు మెదపడం లేదు. ఇదీ మన సెక్యులరిజం! ఇదీ మన మేధావుల తీరు. వాస్తవాలు బయటపడినాయి. ఇప్పుడైనా మాట్లాడతారా? ఆ సూచలేవీ లేవు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram