– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో హిందూ సంస్కృతిని అణచివేసే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడాన్ని హిందువులంతా వ్యతిరేకిస్తున్నారు. హిందూ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని అణచివేసి పరమతా లను ప్రోత్సహిస్తూ, మరో కేరళగా మార్చివేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. హిందూ సంస్కృతిలో పండుగల నిర్వహణ అత్యంత కోలాహలంగా జరగడం ప్రధాన లక్షణం. అందులోనూ వినాయక చవితి ఉత్సవాలు దేశంలోనే పేరెన్నికగన్నవి. ఇవి ఉత్సవాలే కాదు. స్వాతంత్రోద్యమంలో ప్రజలంతా ఐకమత్యంగా ఉండి బ్రిటిష్‌ ‌ప్రభుత్వంపై పోరాడటానికి ఈ ఉత్సవాలు దోహదపడ్టాయి.. అంతటి ఘన చరిత్ర ఈ గణేష్‌ ఉత్సవాలకు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా అత్యంత ఘనంగా ఉత్సవాలు జరిగేవి. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. కాని ఆంధప్రదేశ్‌లో మాత్రం స్వేచ్ఛగా నిర్వహించుకునే అవకాశం కనిపించడం లేదని హిందువు లంటున్నారు. గత ఏడాది కోవిద్‌ ‌పేరుతో చవితి వేడుకలను అడ్డుకోడానికి ప్రయత్నించిన ప్రభుత్వం ఈ ఏడాది పలురకాల అనుమతుల పేరుతో ఆంక్షలు విధించి వేడుకలకు అడ్డుపడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చవితి వేడుకల్లో చిన్న పందిళ్లే అధికం. స్ధానికంగా ఉండే యువత చందాలు పోగుచేసి ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే చిన్నపందిళ్లు వేసి పండుగను వారానికిపైగా అత్యంత ఉత్సాహంగా జరుపు కుంటారు. కాని ఇప్పుడు ప్రభుత్వం విధించిన నిబంధనలతో ఈ పందిళ్లు వేసే అవకాశం కనిపించం లేదు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలను అడ్డుకునే ప్రభుత్వం, ఇతర మతాలకు చెందినవారు చేసే నెల, వారం, రోజూ చేసే వేడుకలను ఎలా అనుమతిని ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

నియమ నిబంధనలు

వినాయక ‘‘విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళను’’ ఏర్పాటు చేసుకోవడానికి, ఊరేగింపునకు తప్పని సరిగా కొన్ని అనుమతులను తీసుకోవాలని పోలీసులు ప్రకటించారు. ముందుగా మున్సిపాలిటీ, ఫైర్‌, ఎలక్ట్రికల్‌ ‌పంచాయతీ శాఖల అనుమతి పొందిన తరువాత మాత్రమే పోలీస్‌ ‌శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. మండపాల వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నిబంధనలు-2000 ప్రకారం రెసిడెన్సియల్‌ ఏరియా నందు పగలు 55, రాత్రి 45 డెసిబల్స్‌కు మించకుండా ఉండే విధంగా స్పీకర్లను ఉపయోగించాలి. లౌడ్‌ ‌స్పీకర్లను సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి స్పీకర్లను ఎట్టి పరిస్థితులలోను ఉపయోగించరాదు. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలి. మండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్‌ ‌వైర్లను ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రత్తలు వహించాలి. ఎలక్ట్రిక్‌ ‌షార్ట్ ‌సర్య్కూట్‌ ‌జరగకుండా వైరింగ్‌ ‌జాగ్రత్తగా చేయించుకోవాలి. భద్రత కోసం రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్‌ ‌కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలి. మండపాల వద్ద ఏ విధమైన అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు నీరు, ఇసుకను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పందిరి వద్ద నిర్వాహకులు సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు, 24/7 సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. మండపం పటిష్టతను దృష్టిలో ఉంచుకుని పూజ నిర్వహించే సమయంలో మండపంపై ఎక్కువ మంది జనం లేకుండా చూడాలి. విగ్రహ పందిళ్ళ చుట్టుప్రక్కల వాహనాలను పార్కింగ్‌ ‌చేయరాదు. పందిళ్ళకు దూరంగా పార్కింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదు. బ్యానర్లు కానీ, ఫ్లెక్సీలు రోడ్డుపైన పెట్టరాదు. వినాయక పందిళ్ళ వలన ఎటువంటి ట్రాఫిక్‌ ఇబ్బంది కలిగించరాదు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో రంగులు చల్లడం, లౌడ్‌ ‌స్పీకర్లు ఉపయోగించడం, మందుగుండు సామగ్రిని పేల్చడం చేయరాదు. ఊరేగింపు సమయంలో పోలీసుల అనుమతి లేకుండా వేషధారణలు ఎక్కువ శబ్ధం వచ్చే వాయిద్యాలు అనగా డీజే అనుమతించరాదు. పందిళ్ళ వద్ద ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరగకుండా మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు లేకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలి. ఈ నిబంధనలు పాతవే కాని కొన్ని నిబంధనలపై మాత్రం వివాదం నెలకొంది. కరెంటు సరఫరా, అగ్నిప్రమాద నివారణ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలనడం, ఊరేగింపు సమయంలో ఇతర కులాలు, మతాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ప్లకార్డులు బ్యానర్లు ప్రదర్శించడం చేయరాదనడం, అలాగే ఊరేగింపుతో పాటు వెళ్లే మతనాయకులు వేరే మతాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా మత సామరస్యం పాటించాలి అనడం మాత్రం అభ్యంతరకరంగా మారాయి. ఇటీవల నెల్లూరులో జరిగిన హనుమాన్‌ ‌శోభాయాత్రపై ఒక మసీదులోని ముస్లింలు దాడులు చేయడం, హిందూ ధర్మ వ్యతిరేక నినాదాలు చేయడం అందరికీ తెలిసిందే. సహంగా ఇలాంటివి చేసేది అన్యమతస్తులే. ఈ నిబంధనలు వారికి వర్తించవా?

చిన్న పందిళ్లపై ఆర్ధిక భారం

రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలకు 2014 నుంచి అమలులో ఉన్న టారిఫ్‌ ‌ప్రకారం 500 వాట్స్‌కి రూ.1000, 1000 వాట్స్‌కి రూ.2,250, 1,500 వాట్స్‌కి రూ.3,000, 2000 వాట్స్‌కి రూ.3,750, 2,500 వాట్స్‌కి రూ.4,550, 3000 వాట్స్‌కి రూ.5,250, 3,500 వాట్స్‌కి రూ.6,000, 4000 వాట్స్‌కి రూ.6,750, 5000 వాట్స్‌కి రూ.8,250, 6,000 వాట్స్‌కి రూ.9,750, 10,000 వాట్స్‌కి రూ.15,750 చొప్పున చెల్లించి తాత్కాలిక విద్యుత్‌ ‌కనెక్షన్లను తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులు సూచించారు. విద్యుత్‌ ‌శాఖ నిబంధనల మేరకు ఈ కనెక్షన్ల ద్వారా పది రోజులపాటు విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. వినాయక చవితి ఉత్సవాల పందిళ్లకు విద్యుత్‌ ‌సరఫరా అవసరమే. స్థానికంగా వేసే చిన్న పందిళ్లకు మాత్రం స్ధానికులే కరెంటు సరఫరా ఇస్తారు. వాటిని ఆ ఇంటి యజమానే భరిస్తారు. పెద్ద పందిళ్లకు మాత్రం నిర్వాహకులు విద్యుత్‌ ‌శాఖ నుంచి సరఫరా తీసుకుంటారు. కాని ఇప్పుడు అన్ని పందిళ్లకు విద్యుత్‌శాఖ నుంచే సరఫరా పొందాలని అందుకు అనుమతులు తీసుకోవాలని నిబంధనలు విధించారు.

దీని వల్ల చిన్న పందిళ్లపై ఆర్ధికభారం పడి నిర్వహణకు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రతి పందిరి నిర్వాహకులు రోజుకు తమకు రూ.1000 చెల్లించాలని పోలీసులు అడుగుతున్నారని నిర్వాహకుల నుంచి విమర్శలు రావడంతో పోలీసులు ఉన్నతాధికారులు ఎవరికీ డబ్బులు ఇవ్వరాదని ప్రకటించారు. పందిరి నిర్వహణలో నిబంధనలు లేవని ప్రకటించారు. పోలీసులు విధించిన నిబంధనలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. నిబంధనలు లేవంటూనే ఫైర్‌, ‌విద్యుత్‌,‌పోలీస్‌ ‌పర్మిషన్స్ ‌తీసుకోవాలని చెప్పడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పు పడుతున్నారు. ఇవి నిబంధనలు కావా అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదులో వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ వేడుకలు చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో ప్రజలు తరలి వస్తారు. ఏపి సీఎం అక్కడికి వెళ్లి అందులో పాల్గొంటే అప్పుడు ఆ ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇక్కడ పెట్టిన నిబంధనలు అన్నీ వెంటనే తొలగించాలి. నిబంధనల పేరుతో పండుగని అడ్డుకోవాలంటే బిజెపి చూస్తూ ఊరుకోదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ నిబంధనలు ఏమీ పట్టించుకోవద్దు. రాజమండ్రిలో వినాయక చవితి వేడుకల్లో నేను పాల్గొంటాను. దానికి ఎలాంటి అనుమతులు తీసుకోను. దమ్ముంటే నన్ను అడ్డుకోండి, అరెస్ట్ ‌చెయ్యండంటూ ఆయన సవాల్‌ ‌విసిరారు.

వారికి నిబంధనలు లేవా?

రాష్ట్రంలో వేల కొద్దీ ఇతర మతాలకు చెందిన ప్రార్థన స్థలాలున్నాయి. మసీదుల్లో రోజుకు అయిదుసార్లు లౌడ్‌ ‌స్పీకర్లతో ప్రార్థనలు చేస్తారు. రంజాన్‌ ‌సమయంలో రోజూ వేలాది మంది ఒకే ప్రాంతంలో గుమిగూడి ప్రార్థనలు చేస్తారు. మొహరం రోజూ వేలాది మంది బహిరంగంగా ర్యాలీలు నిర్వహించి ప్రదర్శనలు చేస్తారు. పలుమార్లు రెచ్చగొట్టేలా నినాదాలు చేయడం అందరూ చూశారు. చర్చిల్లో హిందూమతాన్ని, దేవతలను దూషిస్తూ, అవమానిస్తూ మాట్లాడినప్పుడు ఈ నిబంధనలు ఏమయ్యాయి? వైకాపాకు ఓటువేయాలని ముల్లాలు, ఫాస్టర్లు మసీదులు, చర్చిల్లో ప్రచారం చేసినప్పుడు, దేవుని రాజ్యం రావాలని, అదే కొనసాగాలని ప్రసంగాలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? అని హిందువులు ప్రశ్నిస్తున్నారు.

ఉద్దేశపూర్వకంగా అణచివేత

రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి అణచివేత చర్యలు చేపట్టిందని హిందువులు, హిందూమత సంస్థలు, భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నాయి. తమకు 100 శాతం ఓట్లు వేసి మద్దతిచ్చారని అన్యమతాలను అనుసరించేవారికి ప్రోత్సాహం ఇచ్చి, అదే సమయంలో హిందూ మతంపై పరమతాల దాడులు, మతమార్పిడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆరోపిస్తు న్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం వారి ఓట్లు పొందేందుకు ప్రభుత్వం ఇలా హిందూమత వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. ఆలయాల కూల్చివేత, విగ్రహాలు, రథాలను ధ్వంసం చేసినా ప్రభుత్వం దానిని పిచ్చోళ్ల పనిగా ప్రకటించడం వంటివి హిందువులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి.

 కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో గోవులను అక్రమంగా వధిస్తున్నారనే సమాచారం ఇచ్చిన యువకులపై దాడులు, నిందితులను వదిలేసి సమాచారం చెప్పిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, గోవధ నిషేధం సాధ్యం కాదని ఎమ్మిగన్నూర్‌ ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పడం, అక్కడ జరిగిన హింసా కాండను ఏమాత్రం పట్టించుకోకపోవడం, దానికి తోడు కడప జిల్లా ప్రొద్దుటూరులో స్థానిక వైకాపా ఎమ్మెల్యే ప్రోత్సాహంతో టిప్పుసుల్తాన్‌ ‌విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం, శ్రీశైలంలో తిష్టవేసుకున్న అన్యమతావలంబికుడు, దేవస్థానం నిర్వహణలో పాల్గొనడం, కాంట్రాక్టు పనుల్లో అక్రమ జోక్యం, పూలమాటున మద్యం సరఫరా చేయడం, మాంసం కోసమే గోశాలలో గోవులు మరణించేలా చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరులో అనుమతి లేని మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకించి ఫిర్యాదు చేసినందుకు నంద్యాల జిల్లా బీజేపీ నాయకుడు డాక్టర్‌ శ్రీ‌కాంత్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు అధికారపార్టీ కార్యకర్తలుగా మారి బాధితుడిపైనే అక్రమకేసులు పెట్టారు. పరిపానా వైఫల్యాలతో ప్రజల మద్దతు కోల్పోయిన ప్రభుత్వం, రాబోయే ఎన్నికల్లో పరమతాలకు అనుకూలంగా ఉండి, వారిని ప్రసన్నం చేసుకుని ఓట్లు వేయించుకుని గెలవాలనే తలంపుతోనే హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని హిందువులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ కోణం

వినాయక చవితి పందిళ్లకు అనుమతులు ఇవ్వడంలో విధించిన ఆంక్షలక• రాజకీయకోణం కూడా ముడివడి వున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ పందిళ్లు వేసే వారిలో అన్ని పార్టీల వారు కూడా ఉంటారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలు, ఇతర పార్టీల అణచివేత చర్యలను పరిశీలిస్తే పోలీసులు, ఫైర్‌, ‌విద్యుత్‌ ‌సంస్థల అనుమతులు ఇతర పార్టీల యువత నిర్వహించే పందిళ్లకు రాకుండా చేస్తాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం వైకాపా నాయకులు వేసే పందిళ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చి మిగతావారి పందిళ్లకు అనుమతులు రాకుండా చేసే పన్నాగంగా అనుమానిస్తున్నారు.

About Author

By editor

Twitter
Instagram