మార్చి 12, 1993… గుర్తుందా? ‘మిలీనియంలో ఎక్కడా కనిపించనంత దారుణం’ చోటు చేసుకున్న రోజు అది. ఇప్పుడు ముంబై అని పిలుస్తున్న బొంబాయిలో జరిగింది. ఆ ఒక్క రోజే 12 వరస బాంబు పేలుళ్లు జరిగాయి. 257 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. 700 నుంచి 1400 మంది వరకు గాయపడ్డారు. ఇదంతా దావూద్‌ ఇ‌బ్రహీం అనే అండర్‌ ‌వరల్డ్ ‌డాన్‌ ‌డీ కంపెనీ నిర్వాకం. ఆ కేసులోనే యాకూబ్‌ ‌మెమన్‌ అనే నేరగాడికి ఉరిశిక్ష పడింది. జూలై 30, 2015న ఇతడిని నాగపూర్‌ ‌కేంద్ర కారాగారంలో ఉరి తీశారు కూడా. దావూద్‌ ‌ముఠాలోని వాడు యాకూబ్‌ ‌మెమన్‌, ‌టైగర్‌ ‌మెమన్‌ అనే వాడితో కలసి ఈ ఘోరకలిని సృష్టించాడు. కేసు చాలాకాలం పాటు అగమ్య గోచరంగా ఉండిపోయింది. ఇందుకు కారణం శరద్‌ ‌పవార్‌ ఇచ్చిన ఒక తప్పుడు ప్రకటన అని చెబుతారు.

అదంతా ఒకటి. ఇప్పుడు యాకూబ్‌ ‌మెమన్‌ అనేవాడి సమాధికి హఠాత్తుగా అలంకరణలు చేయడం ఒకటి. ఈ రెండో అంశమే దేశాన్ని క్షోభ పెడుతున్నది.ఈ అంశం హఠాత్తుగా తెర మీదకు వచ్చింది. సెప్టెంబర్‌ 8‌వ తేదీన మహారాష్ట్ర బీజేపీ శాఖ ఒక నరహంతకుడి సమాధికి అలంకరణలు చేసిన విషయాన్ని బయటపెట్టింది. పాకిస్తాన్‌ అం‌డతో, దావూద్‌ ‌పథకంతో, ముస్లిం మతోన్మాదం తలకెక్కిన ఈ మహా హంతకుడి సమాధికి అలంకారాలు చేసే అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్య మంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రే, ఆయన ప్రభుత్వానికి కొమ్ము కాసిన ఎన్‌సీపీ నేత శరద్‌ ‌పవార్‌, ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ జాతికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ కోరుతోంది.

ఉరిశిక్ష పడిన యాకూబ్‌ ‌మెమన్‌ ‌సమాధిని పాలరాతి పలకలతో తాపడం చేయించారు. పూలు పెట్టి, ఎల్‌ఇడి దీపాలు కూడా అమర్చారు. ఆ సమాధిని ఒక మజర్‌ (‌గుమ్మటం)గా మార్చాలన్న ఆలోచనతోనే ఇవన్నీ జరిగాయని, అప్పుడు మహా వికాస్‌ ఆగాడి అధికారంలో ఉన్నదని బీజేపీ ఆరోపిస్తున్నది. ఉద్ధవ్‌ ‌ఠాక్రే నాయకత్వంలో శివసేన ప్రభుత్వం ఉండగా ఇదంతా జరిగిందంటే వాళ్ల దేశభక్తి ఏపాటిది? ముంబై మీద వారికి ఉన్న ప్రేమ ఎలాంటిది అంటూ బీజేపీ సహజంగానే ప్రశ్నలు కురిపించింది. ఆదరాబాదరా పోలీసులు రంగ ప్రవేశం చేసి బడి రాత్‌ ‌సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ దీపాలంకరణను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇంతకీ పాలరాతి పలకల అంకరణ కొన్నేళ్ల క్రితమే జరిగింది. ఆ సమాధి ఉన్న చోట ఒక చెట్టు కూలడంతో, దానిని ఆసరా చేసుకుని పాలరాళ్లు పరిపించారు. ఇందుకు శ్మశానవాటిక ట్రస్టీలు అనుమతి ఇచ్చిన మాట నిజమేననీ, అలా చేయకపోతే సమాధి కింద ఉన్న ఎముకలు బయట పడతాయని పోలీసులు వివరణ ఇవ్వడం విశేషం.

అసలు సంగతేమిటిని ఆరా తీస్తే-దక్షిణ ముంబైలో ఉన్న బడా ఖబర్‌స్తాన్‌లో యాకూబ్‌ ‌సమాధిని అలంకరించకుంటే చావు తప్పదంటూ 2019, 2020లలో  ఏఆర్‌ ‌మెమన్‌ ‌లేదా రవూఫ్‌ ‌మెమన్‌ ‌లేదా మర్చంట్‌ ‌బెదిరించాడని ఆ శ్మశానవాటిక మాజీ ట్రస్టీలు చెప్పారు. తాజాగా దానిని విద్యుత్‌ ‌దీప తోరణాలతో అలంకరించారు. ఈ ఏఆర్‌ ‌మెమన్‌ ‌యాకూబ్‌ ‌మెమన్‌ ‌కుటుంబీకుడే. ఇతడు మహా వికాస్‌ అగాడి ప్రభుత్వ మంత్రులతో కలసి ఉన్న ఫొటోలను రిపబ్లిక్‌ ‌టీవీ చానల్‌ ‌బయట పెట్టింది. అందులో ప్రధానంగా కనిపిస్తున్నవాడు నవాబ్‌ ‌మాలిక్‌. ఇతడు ఎన్‌సీపీ సభ్యుడు. పైగా ఇతడి శాఖ మైనారిటీ వ్యవహారాలు.మరొక మంత్రి అస్లామ్‌ ‌షేక్‌ (‌కాంగ్రెస్‌)‌తోను మెమన్‌ ‌కుటుంబీకుల ఫొటోలు ఉన్నాయి. బడా ఖబర్‌స్తాన్‌లో మెమన్‌ ‌కుటుంబీకులకు ప్రత్యేక స్థలం కేటాయించి ఉంచకపోతే చావు తప్పదని అతడు హెచ్చరించాడని మాజీ ట్రస్టీలు జజీల్‌ ‌నవరంగే, పర్వేజ్‌ ‌సర్కారే చెప్పారు. యాకూబ్‌ ‌చనిపోయినా, టైగర్‌ ‌మెమన్‌ ‌బతికే ఉన్నట్లు గుర్తుంచుకోవాలని కూడా అతడు బెదిరించాడు. తమ కుటుంబానికి శాశ్వతంగా స్థలం కేటాయిస్తున్నట్టు ఒక ప్రకటన కూడా చేయాలని మర్చంట్‌ ఆదేశించినా, ఆ ఇద్దరు ట్రస్టీలు అందుకు ఒప్పుకోలేదు. పైగా మర్చంట్‌ ‌నుంచి తమకు బెదిరింపులు వచ్చాయని జనవరి 6, 2020న ఆ ఇద్దరు ట్రస్టీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతయినా అండర్‌వరల్డ్ ‌మనుషులు కదా! వెంటనే మర్చంట్‌ ‌మరొక చోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బడా ఖబర్‌స్తాన్‌లో స్థలం కేటాయిస్తామని, అందుకు రూ. 3 లక్షలు ఇవ్వాలని అడిగారని దాని సారాంశం.

ఒక కరడుగట్టిన మతోన్మాదికి, నేరగాడికి, రక్త పిపాసికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసింది. కానీ శివసేన అనే పార్టీ కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో కలిశాక అతడి సమాధికి అలంకరణలు చేయడానికి అవకాశం ఇచ్చింది. ఈ మహా హంతకుడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు ఎంత ఘోషిస్తాయో తెలియదు గానీ, ఇదంతా చూస్తున్న దేశం మాత్రం తీవ్రంగా క్షోభిస్తున్నది. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ‌ఠాక్రే ఆత్మ మాత్రం నిస్సందేహంగా ఆక్రోశిస్తుంది. శివసేన అనే హిందూత్వ పార్టీ చివరికి అధికారం కోసం దేశద్రోహులను అంటకాగే, హిందూ వ్యతిరేకులకు అండగా నిలిచే కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

About Author

By editor

Twitter
Instagram