‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– తోట ప్రసాద్‌

తిరుమల సప్తగిరులు…

ఆషాఢ మాసపు మబ్బులు కొండ శిఖరాల పైన కిరీటాల్లా మెరిసి పోతున్నాయి.

వాన రానా-మాననా అని కన్నెపిల్ల బుగ్గల్లోకి రావడానికి తటపటాయించే సిగ్గులా తారట్లాడుతోంది. ‘‘ఓ హరి.. ఓ హరి.. హరి ఓం…హరి ఓం..’’ అని స్మరిస్తూ బోయలు అందంగా అలంకరించిన పల్లకీలు మోసుకుంటూ, ఆలయపు ప్రధాన ద్వారం వైపు వస్తున్నారు.

ఎదురుగా ఉన్న మంటపంలో కూర్చుని, తంబూరా శ్రుతి చేస్తూ, రెండు పదుల వయసున్న యువకుడు ‘కట్టెదుట వైకుంఠం కాణాచి అయిన కొండ’’ అని శ్రావ్యంగా ఆలపిస్తున్నాడు.

పల్లకీల వెనకే మేలు జాతి బుడతకీచు వారి అశ్వాలపై శ్రీకృష్ణదేవరాయలు, అతని మంత్రి తిమ్మరుసు, రాయల సోదరుడు అచ్యుతరాయలు తదితరులు విచ్చేసారు.

గుడి ముంగిట హడావిడి చూసిన ఆలయ పట్టపుటేనుగు ఘీంకరించింది.

రాయల పరివారానికి అది ఆహ్వానపు మంగళ వాయిద్యంలా ఉంది.

పల్లకిలో నుంచి పట్టపు రాణులు తిరుమలాదేవి, చిన్నాదేవి నేలపై పాదం మోపారు. దాసీలు వారి పాదాలు నీటితో ప్రక్షాళన చేశారు. మెత్తటి నూలు వస్త్రాలతో

ఆ పాదాలను అద్దారు.

రాయలను చూడగానే భట్టురాజులు స్తోత్రాలు అందుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఆపమన్నట్లుగా చేతితో వాళ్లకి సైగ చేశాడు.

‘‘గిరులపై హరి నామస్మరణ తప్ప, అన్య స్తోత్రాలకు తావు లేదు’’ అన్నాడు తిమ్మరుసు ఆ సంజ్ఞకి అర్థం వివరిస్తూ.

వైష్ణవాచార్యులు పూర్ణకుంభంతో రాయలకి, ఆయన పరివారానికి, స్వాగతం పలికారు.

రాయల చూపు మంటపంలోని గాయకుడి మీద పడింది.

‘‘ఇంత సంరంభం కూడా అతని పాటను చెల్లాచెదురు చేయలేకపోయిందే. రాయల దర్శనంపై కూడా దృష్టి నిలపలేని అతగాడెవరు?’’ అని తిమ్మరుసుని లోగొంతికతో అడిగాడు రాయలు.

‘‘వేంకటేశ్వర ప్రియవాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల మనవడు. తాళ్లపాక చిన్నయ్య. అతని తండ్రి పెదతిరుమలాచార్యులు కూడా నాకు తెలిసినవాడే. నా ప్రసాద కైంకర్యాల నిర్వహణ బాధ్యత ఆ కుటుంబానికే అప్పగించాను.

స్వామి స్మరణలో పడితే, స్పృహే ఉండదు చిన్నయ్యకి’’ అన్నాడు.

ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు మనసు పులకించి పోయినట్లయింది.

‘‘నా పరిస్థితీ అదే! ఆముక్తమాల్యద రచిస్తున్న ప్పుడు గోదాదేవిని నేనే అయ్యాను. భక్తి పార వశ్యం ప్రేమ కన్నా గొప్పది!’’ అని ధ్వజస్తంభం దగ్గరికి రాగానే నిలిచి మొక్కాడు రాయలు.

ఆ… లోపల… స్వామి గర్భగుడిలో కొలువై ఉన్నారనగానే రాయల శరీరం ఓ గగుర్పాటుకి లోనయింది.

పైగా ఆ దినం బృహస్పతి వారం. నిలువెత్తు శిలారూపం దాల్చిన శ్రీహరి ఏ ఆభరణం ధరించక, నిలువెత్తు నామాలే తన అలంకారంగా ముగ్ధమోహనంగా గోచరిస్తున్నాయి.

అర్చకులు పూజ ప్రారంభించగానే రాయలు వేంకటేశ్వరస్వామిని చూసిన తాదాత్మత్యతో.. ‘‘శ్రీ కమనీయ హారమణి జెన్నుగ దానును గౌస్తుంభంబునం దాకమలావధూటియు నుదారత దోప పరస్పరాత్మలం స్తోకతనందు దోచెనన శోభిల్లు వేంకట భర్త గొల్చెదన్‌’’ అని ముకుళిత హస్తాలతో స్వామిని స్తుతించాడు.                               తిమ్మరుసు ముఖం గాంభీర్యం దాల్చింది. స్వామి ముంగిట అర్చక స్వాములు తప్ప, మరొకరు మంత్ర పఠనం చేయరాదు, స్తుతించరాదు.

చక్రవర్తిని ధిక్కరించే ధైర్యం ఎవరికీ ఉంటుంది? అందరూ మౌనం దాల్చారు.

రాయల పక్కనే ఉన్న అతని సోదరుడు అచ్యుతరాయలు మనసులోనే మొక్కుకున్నాడు. ‘‘స్వామీ! నన్ను ఈ విజయసాగర సామ్రాజ్యానికి చక్రవర్తిని చేయ్‌! ‌నీ సన్నిధిలోనే పట్టాభిషేకం చేసుకుంటాను. నేనే విష్ణు సహస్ర నామావళితో అర్చన చేస్తాను’’ అనుకున్నాడు.

రాయలు తన తన్మయత్వంలో తానున్నాడు.

‘‘నా ప్రబంధ కావ్యంలో ప్రథమ పద్యం అని అర్చక స్వాములతో శ్రీకృష్ణదేవరాయలు చెబుతుంటే -ఆయన కంఠంలో కించిత్‌ ‌గర్వం.

కండ లడ్డు అంత ప్రమాణంలో కర్పూరపు ముద్ద వెలిగించి, శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ వెలుతురులో నిలువెత్తు దివ్య మంగళ రూపం చూస్తుంటే, రాయల ఆనందానికి అంతు లేదు.

సమరాలు, సామ్రాజ్యాలు- అన్నీ వదిలి, స్వామి ముంగిట తాను ఓ భక్తుడై, ఆ తాళ్లపాక చిన్నయ్యలాగా స్వామిని స్తుతిస్తూ, శేష జీవితం గడిపేస్తే ఎంత బాగుంటుంది? ఆ ఆలోచన క్షణికమే!

తిరుమలాదేవి రాయలవైపు క్రీగంట చూసింది. భక్తిరస భావోద్వేగం నుంచి తేరుకున్న రాయలు- ‘‘తిరుమలేశుడి వ్యాత్సల్యంతో- ఈ సువిశాల విజయనగర సామ్రాజ్య వైభవానికి వారసుడు ఉదయించాడు. ‘స్వామి అనుగ్రహపాత్రుడు కాబట్టి, తిరుమల రాయలుగా నామకరణం జరిగింది.

యువరాజు జన్మోత్సవం సందర్భంగా నవరత్న ప్రభావళి సహిత తిరుముడి- ఉదర బంధం, బాహు వలయం, తిరుచందనం కారై, పాదతాళ్యం నవినయంగా సమర్పించుకుంటున్నాం’’ అన్నాడు కృష్ణదేవరాయలు.

అచ్యుత రాయలు- ఓ బంగారు పళ్లెంలో ఉన్న కిరీటం, వడ్డాణం, వంకీలు మణికట్టు హారం, పాదహారాలు అర్చకులకు ఇచ్చాడు.

ఆలయ ప్రాంగణం నుంచి కాలు బయట పెట్టగానే వేద గురుకులం నుంచి వచ్చిన చిన్నారి పండితులు మధురమైన గొంతుతో వేద ఆశీర్వచనాలు పలికారు.

వారందరికి కనకపు రొక్కెంలతో పాటు తను రాసిన ‘ఆముక్త మాల్యద’ కృతి తాళపత్ర ప్రతులు కానుకగా స్వహస్తాలతో బహూకరించారు రాయలు.

ఓ భటుడిని పిలిచి, మంటపంలో ఉన్న తాళ్లపాక చిన్నయ్యకి కూడా తాళపత్ర గ్రంథాన్ని అందజేయమన్నాడు రాయలు.

జరుగుతున్న తతంగాన్ని అంతా మౌనంగా పరికిస్తున్నాడు తిమ్మరుసు.

ఆ రాత్రికి రాయల బస అక్కడే! జాబాలి తీర్థం సమీపంలో రాజ వంశస్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పర్ణశాల ఉంది. నల్లటి కొండలపై మరింత చీకటి కమ్ముకుంది.

ఆ రమణీయమైన ప్రకృతిని, ఆషాఢ మాసపు మబ్బుల నుంచి వెలువడుతున్న చంద్రుడి మసక వెన్నెలని, సప్తగిరులపై వెలసిన అరణ్య ఉద్యానవనాల నుంచి వీస్తున్న శీతల పరిమళాలు రాయల మనసుని ఆనంద డోలికల్లో విహరింప జేస్తున్నాయి.

అలా మాడవీధులు తిరిగి వద్దామని బయలుదేరాడు ‘శ్రీకృష్ణదేవరాయలు’. నలుగురు అంగరక్షకులు రాయలు ఏకాంతానికి భంగం కలిగించకుండా, దూరంగా అనుసరిస్తున్నారు.

ఆ నిశ్శబ్దంలో నుంచి ఎవరో ‘ఆముక్త మాల్యద’ కావ్య పఠనం కావించడం కృష్ణదేవరాయల చెవిన పడింది.

ఉన్న చోటునే నిలుచుండిపోయాడు. ఓ కవికి అంతకన్నా గొప్పదనం ఏముంది? ఆ ఇంటి తలుపు తట్టి, వారి ప్రశంసలు మనసారా అందుకోవాలనుకున్నాడు రాయలు.

ద్వారబంధం వరకు వచ్చిన రాయలు లోపల సంభాషణ విని, టక్కున ఆగిపోయాడు.

‘‘ఈ పదప్రయోగం, ఆ భాషా వైచిత్రి ఉంది. చూశావూ? అక్షరమక్షరం అల్లసాని వారి అల్లికలోనే ఉంది. పెద్దనామాత్యుల చేత రాయించు కుని, కావ్య రచనా కీర్తి కొట్టేశాడోయ్‌ ‌రాయలు. అందుకే గండపెండేరం పెద్దన కాలికి తొడిగి పల్లకీ మోశాడట రాయలు’’ అన్నదో కంఠం.

‘‘ఈ శూద్రుడికి పెద్దనామాత్యులు ఎందుకిస్తారు కవితా కన్యకని?

శ్రీకాకుళం అగ్రహారంలోని ఎవరో వెర్రి వైష్ణవ బాపనుడు ‘విష్ణుత్తీయం’ అని రాసుకుంటే వాడికి కానుకలిచ్చి, కత్తులు చూపి కావ్యంతో తస్కరించాడట సమ్రాట్‌’’ అం‌టోంది మరో కంఠం. ఆ వదరుబోతుల మాటలు విని, చలించిపోయాడు. ఆగ్రహవేశాలతో వణికిపోతూ, ఆ తలుపుని ఫెళ్లున తన్నబోతుంటే, ఓ వాత్సల్య పూరితమైన చేయి వచ్చి, రాయల భుజాన పడింది. తిరిగి చూస్తే, తిమ్మరుసు. ‘‘అప్పాజీ! ఈ ధూర్తుల దుష్ప్రచారం చూశారా?’’ ఆవేశంతో రాయల కంఠం వణుకుతోంది.

‘‘కృష్ణా’’ అని పిలిచాడు తిమ్మరుసు. ఆప్యాయంగా రాయల భుజం మీద చేయి వేసి, అలా ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్లాడు తిమ్మరుసు.

‘‘కొండపల్లి దుర్గాన్ని, కొండవీటి కోటను జయించిన తర్వాత శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణువు దర్శనం చేసుకోలేదూ?

నా ప్రభువు-విష్ణువు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఆదేశించారనే కదా- ఆముక్తమాల్యద కావ్యం రాసింది! కర్ణాటక ప్రభువు అయినా, నా మాతృమూర్తి నాగులాదేవి నేర్పిన నా మాతృభాష తెలుగులోనే కావ్యం రాశాను కదా! నా మీదనా ఈ నీలాపనిందలు?’’ అని ఆవేశం ఆవేదనగా మారగా అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు.

‘‘ఈ దుష్ప్రచారానికి తెరతీసింది నేనే! ‘ఆముక్తమాల్యద’ కావ్య రచన కృష్ణదేవరాయలు చేయలేదని దండోరా వేయిస్తుంది నేనే!’’ అన్నాడు తిమ్మరుసు. ఆ మాటలకి ఆశ్చర్యచకితుడయ్యాడు రాయలు.

ఈ అప్పాజీ నిజంగానే తన శ్రేయోభిలాషా? తన పొదిలోనే ఉన్న తేనె పూసిన విషపుకత్తా?

రాయలు కళ్లల్లోని సందేహాన్ని అర్థ్ధం చేసుకుంటూ చిన్నగా నవ్వాడు తిమ్మరుసు.

‘‘భరతావని మీద పరదేశీయుల కన్నుపడింది. తురుష్కలు, ముసల్మాను రాజుల దండయాత్ర ఒకవైపు- ఈ బుడతకీచువారు, మిగిలిన విదేశీ వర్తకుల వాణిజ్య కుతంత్రాలు- ఈ దేశాన్ని ఏదొకనాడు చిరిగిన విస్తరిని చేసాయి.

ఈ సమయంలో భరతజాతి మొత్తం ఒకమాట మీద ఉండాలి. అనైక్యత ఏ రూపానికి ప్రదర్శింపబడరాదు’’ అన్నాడు తిమ్మరుసు.

వృద్ధుడికి వయసుతో పాటు మతి పోయినట్లుంది అనుకున్నాడు రాయలు.

అసహనాన్ని అణుచుకోకుండా- ‘‘అయితే? దానికి నా ఆముక్తమాల్యద కావ్యానికి సంబంధం ఏమిటి?’’ అని గద్దించాడు శ్రీకృష్ణదేవరాయలు.

‘‘నీ వేదన నాకు అవగతమవుతోంది కృష్ణా! నీలోని కవి కన్నా, భక్తుడి కన్నా చక్రవర్తే ఈ దేశానికి అవసరం! ప్రభువు అనే వాడికి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉండొచ్చు. కాని బయట ప్రపంచానికి తెలియకూడదు.

ప్రభువుకి అన్ని ధర్మాలు సమానం కావాలి! అది వైష్ణవమైనా, శైవమైనా.

దివ్యక్షేత్రం శ్రీరంగంలో శైవులు, వైష్ణవులు ఎలాంటి ఘర్షణలు సృష్టించారో నిన్నటి చరిత్ర చెబుతోంది.

‘ఆముక్త మాల్యద’ కావ్య రచనతో నీకెన్ని కీర్తి కిరీటాలు దక్కుతాయో తెలియదు కాని సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవాన్ని కీర్తిస్తూ, ఓ కావ్యం రాశాడంటే మిగిలిన ప్రజల్లో భేదాభిప్రాయాలు ఏర్పడతాయేమో అన్నాడు తిమ్మరుసు.

‘‘మూర్ఖత్వం! కన్నడనాట వీరశైవ మూర్తి, భవచింతరత్న, సత్య్రేయ చోళ కవి మల్లనార్యుడి చేత రాయించలేదా?

నా అష్టదిగ్గజాల్లో ధూర్జటి రాసిన కాళహస్తి మహాత్మ్యం కావ్యాన్ని ఆస్వాదించింది నేను కాదా! తిరుమల ఎంతో, శ్రీకాళహస్తి నాకూ అంతే!

మత ధర్మంలో తారతమ్య భేదాలు ఈ రాయలులో ఏనాడయినా చూశారా? అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఆవేశంగా.

‘‘నీవు చూడవు. నేను చూడను. ప్రజలు చూస్తారు. ఎవడో సామాన్యుడి మాటలకి సీతా మహాసాధ్విని అరణ్యవాసానికి పంపిన అయోధ్యరాముడు పుట్టిన నేల ఇది. వ్యక్తిగత భావోద్వేగాలకు, బంధాలకు ప్రజల మాటనే ఆ దేవుడు అయినా చెల్లుబాటు చేసిన దేశం ఇది! తప్పదు. రాజధర్మం! నీ సార్వభౌమత్వం స్వారోచిర మన్వంతరం వరకూ ఉండాలంటే- ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు తప్పవు’’ అన్నాడు తిమ్మరుసు.

గాలికి ఎక్కడో ఆలయంలోని ధ్వజస్తంభం మీది గంటలు మోగుతున్నాయి.

‘‘వేంకటేశా! వచ్చే జన్మలో అయినా నన్ను కవిగా పుట్టించు. నా కావ్య రచనకి నాకే పేరు లభించేలా ఆశీర్వదించు’’ అని మనసులోనే ప్రార్థిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.

About Author

By editor

Twitter
Instagram