వర్తమాన ప్రపంచ రాజకీయ చరిత్రలో కుటుంబ పాలనలో ఉండే అవధులు దాటిన అహంకారం, బంధుప్రీతి, అవినీతి వల్ల కలిగే అనర్థాలకు గొప్ప ఉదాహరణగా శ్రీలంక మిగిలిపోతుంది. రాజపక్స సోదరుల నిర్వాకం వల్ల నిత్యావసరా లకు అల్లాడాల్సిన దుస్థితి ఏర్పడిన ప్రజలు దేశాధ్యక్ష, ప్రధానుల రాజీనా మాలు కోరుతూ ఏకంగా వారి అధికార నివాసాలనే ఆక్రమించు కొన్న విచిత్ర పరిస్థితి! ప్రధాని విక్రమసింఘే అధికార భవనానికి నిప్పుపెట్టారు. గొటబయ రాజపక్స తన అధికార నివాసాన్ని వదిలి పారి పోయారు. ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియదు. అయితే ప్రజలకు వంటగ్యాస్‌ ‌సరఫరా చేయాలని జూలై 9న ఆయన ఆదేశాలు జారీచేయడంతో, ఇంకా విధుల్లోనే ఉన్నారని భావించాలి. దేశాధ్యక్షుడితో పాటు ప్రధాని రణిల్‌ ‌విక్రమ సింఘే రాజీనామాలు చేసిన తర్వాతనే తాము ఈ భవనాలను ఖాళీచేస్తామని ఆందోళనకారులు తెగేసి చెప్పడంతో, దేశ భద్రతా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.

ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతలు తక్షణం రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్షాలు పిలుపు నిచ్చాయి. గొటబయ రాజపక్స జూలై 13న తాను రాజీనామా చేస్తానని ప్రధాని విక్రమ సింఘేకి అధికారికంగా తెలిపారు. విపక్షపార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి రాగానే రాజీనామా చేస్తానని రణిల్‌ ‌విక్రమ సింఘే చెబుతున్నారు. నిరసనకారులు విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని అక్కడ జరుగుతున్న సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఈ భవనాల్లోనే వంటలు వండుకోవడం, భోజనాలు చేయడం, నిత్యకృత్యాలు తీర్చుకోవడం వంటివి చేస్తున్నా, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారన్న వార్తలు వారిలోని బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేస్తున్నాయి. అంతేకాదు అధ్యక్ష భవనంలో తమకు లభించిన 17.85 మిలియన్‌ ‌రూపాయల (50వేల డాలర్లు)ను పోలీసులకు అప్పగించారు.

రాజపక్స సోదరుల తప్పిదాలు

2005లో మహింద రాజపక్స దేశాధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందు వీరి కుటుంబం దక్షిణ శ్రీలంకలో శక్తిమంతమైన భూస్వామ్య కుటుంబం. అప్పటికే ఎల్‌టీటీఈ ఉగ్రవాదంతో సతమతమవు తున్న దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బౌద్ధుల్లో జాతీయవాదాన్ని రగిల్చి మహింద రాజపక్స అధికారంలోకి రాగలిగారు. తర్వాతి కాలంలో రాజపక్స చేసిన ఘోరమైన తప్పిదాలు, తమిళ తీవ్రవాదాన్ని అణచివేయడం వంటివి సింహళ ప్రజల్లో ఆయన మీద ఉన్న గౌరవాన్ని దెబ్బ తీశాయి. అంతర్యుద్ధం సమయంలో ప్రభుత్వం తమిళులపై చేసిన దమనకాండ అంతర్జాతీయంగా అప్రతిష్టకు కారణమైంది. రాజపక్స సోదరులు అనుసరించిన చైనా అనుకూల విధానాలు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడం, వంటగ్యాస్‌, ఇం‌ధనం నిల్వలు కూడా నిండుకోవడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో, గత ఏప్రిల్‌ ‌నెలలో మంత్రివర్గంలోని ఆయన బంధువులు (ఆర్థిక మంత్రితో సహా) పదవుల నుంచి వైదొలిగారు. ఇదే సమయంలో ప్రభుత్వ మద్దతుదారులు నిరసనకారులపై జరిపిన దాడుల్లో తొమ్మిదిమంది అసువులు కోల్పోవడంతో ప్రధాని మహీంద రాజపక్సపై ప్రజాగ్రహం తారస్థాయికి చేరుకొని ఆయన రాజీనామా చేయాలన్న ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో నావెల్‌ ‌బేస్‌లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఇక దేశాధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స కూడా రాజీనామా చేయాలంటూ ప్రజలు చేస్తున్న డిమాండ్‌కు ఆయన తలొగ్గలేదు. ఇదే సమయంలో ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కించే ఆపద్బాంధవుడిలా రణిల్‌ ‌విక్రమసింఘే కనిపించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, అంతర్జాతీయంగా పరపతి కోల్పోతున్న దుస్థితి నుంచి దేశాన్ని బయట పడేయడానికి గత మే నెలలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన్ను ప్రధానిగా నియమించారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల విశ్వాసాన్ని చూరగొనడం, ఐఎంఎఫ్‌తో బెయిల్‌ ఔట్‌ ‌ప్యాకేజీపై చర్చించి ఏదోవిధంగా ఆర్థిక విపత్తునుంచి దేశాన్ని బయట పడేయడం ప్రధాని రణిల్‌ ‌విక్రమసింఘే ముందున్న తక్షణ లక్ష్యాలు. ఈ నేపథ్యంలో ఆయన నిండుకున్న ఖజానాను నింపే ఉద్దేశంతో వివిధ ఆర్థిక సంస్థలతో చర్చలు జరిపినప్పటికీ పెద్దగా ఫలితమివ్వ లేదు. కానీ ఆయన చేస్తున్న యత్నాలు ప్రజల్లో రగులుతున్న అసంతృప్తిని కొంతమేర చల్లార్చిన మాట వాస్తవం. ప్రస్తుత సంక్షోభానికి కారణమైన కేంద్రీకృత అధికారాన్ని తొలగించి వికేంద్రీకరణకు కృషి చేస్తానని కూడా విక్రమసింఘే హామీ ఇవ్వడమే కాకుండా, దేశాన్ని విపత్తు నుంచి బయటపడేసే చర్యల్లో భాగంగా పన్నులు పెంచారు. కానీ నిత్యవసరాలు అందుబాటులోకి తీసుకురావడంలో జరిగిన జాప్యం ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. నిజానికి విక్రమసింఘే దేశాన్ని ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ఐఎంఎఫ్‌తో కీలక చర్చలు జరిపారు. రాబోయే ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొ నేందుకు వరల్డ్ ‌ఫుడ్‌ ‌పోగ్రామ్‌తో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే రుణం పొందినప్పుడు, దాన్ని ఏవిధంగా వినియోగించేది, రుణం తీర్చే విధానంపై ఒక విస్పష్టమైన ప్రణాళికను వచ్చే ఆగస్టు నాటికి ఐఎంఎఫ్‌కు సమర్పిస్తేనే, రుణ ఒప్పందం ఖరారవుతుంది. ఐఎంఎఫ్‌తో ఒకవైపు చర్చలు జరుపుతూనే శ్రీలంక నేతలు, భారత్‌ ‌వంటి ఇతర దేశాల సహాయంపై ఆధారపడుతున్నారు. 2020 సాధారణ ఎన్నికల్లో విక్రమసింఘే పార్టీ ఘోరంగా ఓటమిపాలవడంతో ఆయనొక్కడే పార్టీ తరపున పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన మైత్రీపాల సిరిసేనతో ఒప్పందం కుదుర్చుకొని ప్రధాని పదవిని చేపట్టి నప్పుడే విక్రమసింఘే పలుకుబడి మసకబారింది. ముఖ్యంగా 2019లో జరిగిన ఉగ్రదాడుల్లో 290 మంది మరణించిన సంఘటనకు ఒక ప్రధాన కారణం ఇంటెలిజెన్స్ ‌వైఫల్యమైతే, రెండో ప్రధాన కారణం అప్పటి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనకు, ప్రధాని విక్రమసింఘేకు మధ్య సమాచార వైఫల్యం. ఇవన్నీ విక్రమ సింఘే పార్టీ ఘోర పరాజయానికి కారణం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ‘అతడే ఒక సైన్యం’ అనే పద్ధతిలో ఒంటరిపోరు చేయాల్సి వచ్చింది. ఆయనకెలాగూ ప్రజామద్దతు లేదు. రాజకీయ దృఢచిత్తం లేకపోవడమూ ప్రస్తుత స్థితికి తోడైంది. రాజీనామా ఒత్తిడిని తగ్గించుకోవడానికే రాజపక్స, ప్రధానిగా విక్రమసింఘేను నియమించా రంటూ బలమైన అభిప్రాయానికి వచ్చిన నిరసనకారులు విధ్వంసానికి పాల్పడటం, దీనికి రాజకీయ అస్థిరత కూడా తోడుకావడంతో విక్రమసింఘే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది.

విపక్షాల తర్జనభర్జనలు

కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై విపక్షాలు తర్జనభర్జనలు పడుతున్నాయన్న వార్తలు వస్తున్నప్పటికీ, ప్రధాన విపక్షనేత సజిత్‌ ‌ప్రేమదాస, దుల్లాస్‌ అలహ పెరుమల పేర్లను వరుసగా అధ్యక్ష, ప్రధాని పదవులకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అధికారాన్ని ఏవిధంగా పంచుకోవాలన్న విషయంపై వీరు ఒక అభిప్రాయానికి వస్తే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటులో విపక్షం ఏకాభిప్రాయానికి రాకపోతే ఏం జరుగుతుంది? అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేస్తే రాజ్యాంగం ప్రకారం ప్రధాని రణిల్‌ ‌విక్రమ సింఘే దేశాధ్యక్ష పదవి స్వీకరించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వీరిద్దరి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో విక్రమసింఘే కూడా ప్రధాని పదవికి రాజీనామా చేయకతప్పదు. అప్పుడు రాజ్యాంగం ప్రకారం మూడో స్థానంలో ఉన్న స్పీకర్‌ ‌మహింద యాప అభయవర్థన తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఈ దుస్థితికి చైనాయే కారణం

1948 తర్వాత తొలిసారి శ్రీలంక ఎదుర్కొంటున్న పెను ఆర్థిక సంక్షోభానికి చైనా అప్పులు కూడా కారణమన్నది జగద్విదితమే. చైనా బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ఇనిషియేటివ్‌ ‌కింద మహింద రాజపక్స గతంలో ఆ దేశం వద్ద 1.1 బిలియన్‌ ‌డాలర్లు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తంతో హంబన్‌తోట పోర్ట్ ‌నిర్మాణాన్ని చైనా చేపట్టి పూర్తిచేసింది. అయితే ఈ ‘డీప్‌ ‌వాటర్‌ ‌పోర్ట్’ ‌నుంచి చైనాకు అనుకున్న ఆదాయం రాకపోవడంతో శ్రీలంక తప్పనిసరి పరిస్థితుల్లో వేలాది ఎకరాల భూమితో సహా ఈ పోర్టును 2017లో ఆ దేశానికి 99 సంవత్సరాలకు ధారాదత్తం చేయాల్సివచ్చింది. చైనా ‘స్ట్రింగ్‌ ఆఫ్‌ ‌పెర్లస్’ ‌వ్యూహంలో ఈ పోర్టు అత్యంత కీలకం మాత్రమే కాదు, మనదేశ భద్రతకు పెను ప్రమాదం కూడా. అప్పట్లో ఈ ప్రణాళికను నిపుణుల కమిటీ తిరస్కరించినప్పటికీ రాజపక్స ఖాతరు చేయకుండా ముందుకెళ్లిన ఫలితాన్ని ప్రస్తుతం ఆ దేశం అనుభవిస్తోంది. ఈ ఒక్క పోర్టు మాత్రమే కాదు, మరికొన్ని చైనా చేపట్టిన ప్రాజెక్టులు ‘తెల్ల ఏనుగుల్లాగా’ మారాయి. ప్రస్తుత సంక్షోభానికి ఇవన్నీ కారణం.

‘సంక్షోభంలో ఉన్న శ్రీలంకను కొంత వెసులుబాటు ఇచ్చి ఆదుకుందామంటే ఆఫ్రికా, ఆసియా దేశాలు మాకు కూడా ఇటువంటి వెసులుబాటు కల్పించాలని డిమాండ్‌ ‌చేస్తాయన్న భయం వెంటాడుతోంది’ అనే కుంటిసాకు చెబుతూ తెప్ప తగలేయడం చైనాకే చెల్లింది. 1.5 బిలియన్‌ ‌డాలర్లు రుణంగా ఇవ్వడానికి అభ్యంతరం లేదు.. కానీ మూడు నెలల విదేశీమారక నిల్వలు ఉండాలంటూ ‘కొర్రి’ పెట్టడం చైనా గుంటనక్క వైఖరికి నిదర్శనం. నిజంగా సహాయం చేయాలన్న ఉద్దేశమున్న వారెవరూ ఇంత సంకు చితంగా వ్యవహరించరు. అదేవిధంగా ఐఎంఎఫ్‌తో చర్చించేటప్పుడు మద్దతుగా నిలుస్తానని, 75 మిలియన్‌ ‌డాలర్లు మానవత్వ సహాయం అందిస్తానని కూడా చైనా.. శ్రీలంకకు హామీ ఇచ్చింది. ఐఎంఎఫ్‌ ‌రుణం వచ్చేదెప్పుడో, తాను మద్దతు పలికేదెప్పుడో చైనాకే తెలియాలి.

భారత్‌ ఆపన్నహస్తం

సహాయం చేస్తాననడమే కాని, ముందుకు రాని చైనా వ్యవహారం కొనసాగుతుండగానే భారత్‌ ‌రంగంలోకి దిగి మిలియన్ల డాలర్ల విలువైన బియ్యం, పాలపొడి, వైద్యానికి సరిపడా మందులు, గ్యాసోలిన్‌, ‌డీజిల్‌ను శ్రీలంకకు సహాయంగా అందించింది. నాలుగు బిలియన్‌ ‌డాలర్ల రుణాన్ని సరళమైన నిబంధనలతో అందజేసింది. దేశం మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా ఆదుకోవడమే ఈ సహాయం ప్రధాన లక్ష్యం. శ్రీలంక విషయంలో భారత్‌ ఇప్పటికీ ‘పొరుగువారికి ప్రాధాన్యం’ అనే తన విధానానికి కట్టుబడే సహాయం చేస్తోంది. ఇదిలా ఉండగా మరో బిలియన్‌ ‌డాలర్లు తక్షణ సాయం కోసం భారత్‌తో చర్చలు జరుపుతున్నట్టు శ్రీలంక సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌గవర్నర్‌ ‌వెల్లడించారు. భారత్‌ ‌వ్యూహాత్మకంగా శ్రీలంకలో తన ఉనికిని క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. దశాబ్దాలుగా విస్తరించిన చైనా పలుకుబడిని గణనీయంగా తగ్గించాలన్నది మనదేశ లక్ష్యం. ముఖ్యంగా మనదేశాన్ని కట్టడి చేయడానికి చైనా అనుసరిస్తున్న ‘స్ట్రింగ్‌ ఆఫ్‌ ‌పెర్లస్’ ‌విధానానికి ముకుతాడు వేయడానికి ఈ సహాయం కొంతమేర ఉపయోగపడగలదు. అంతేకాదు మనం అందించే సహాయం నిజాయితీగా పారదర్శకంగా ఉంటుందని తెలియజెప్పడం కూడా ఉద్దేశం. ముఖ్యంగా సౌకర్యాల కల్పన ముసుగులో అప్పుల ఊబిలో దించుతున్న చైనా కపట వైఖరిని వారికి తెలిసేలా చేయడం, మనదేశం అనుసరిస్తున్న ఈ సహాయక విధానం వెనక మరో ప్రధాన లక్ష్యం. గతంలోనూ ప్రధానిగా పనిచేసిన రణిల్‌ ‌విక్రమ సింఘేకి భారత్‌ అనుకూలుడిగా పేరు. అదేవిధంగా రాజపక్స కుటుంబం చైనాకు అనుకూలం. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి చాలావరకు చైనా కారణమన్న సత్యం నిర్ధారణ అవుతుండటంతో, క్రమంగా రాజకీయంగా శ్రీలంక భారత్‌కు దగ్గరయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. శ్రీలంకలో సోలార్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్టును నిర్మించేందుకు గత మార్చిలో భారత్‌-శ్రీ‌లంకల మధ్య ఒప్పందం కుదిరింది. అదే నెలలో విండ్‌ ‌ఫామ్‌ను నిర్మించేందుకు చైనా కంపెనీతో కుదుర్చుకున్న 12 మిలియన్‌ ‌డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేయడం శ్రీలంకలో వస్తున్న మార్పునకు నిదర్శనం. శ్రీలంకను, చైనా దుష్టనీతి నుంచి దూరం చేయడం ప్రస్తుతం మనదేశం ముందున్న తక్షణ కర్తవ్యం. ఇది రెండు దేశాలకు మాత్రమే కాదు హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని శాంతిమండలంగా ఉంచడానికి ఎంతో కీలకం కూడా!

– మణి

By editor

Twitter
Instagram