షింజో అబే… జపాన్‌కు సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నేత. 2006-07 సంవత్సరంలో, తిరిగి 2012-20 మధ్యకాలంలో ఆయన జపాన్‌ ‌ప్రధానిగా పని చేశారు. భారత్‌ అం‌టే గొప్ప అభిమాని, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి గొప్ప స్నేహితుడు. జూలై 8న ఒక ఆగంతకుడి కాల్పుల్లో అసువులు బాసిన ఆయనకు సంతాప సూచికంగా ప్రధాని నరేంద్రమోదీ జూలై 9వ తేదీని మన దేశంలో సంతాప దినంగా ప్రకటించారంటే షింజో అబే ఆయనకు ఎంతటి మిత్రుడో వేరే చెప్పాల్సిన అవసరంలేదు. 2020లో అనారోగ్య కారణాల వల్ల ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నానని షింజో అబే ప్రకటించినప్పుడు కూడా ‘ప్రియమైన స్నేహితుడా… నీ అనారోగ్యం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నాను. నీవు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ నరేంద్రమోదీ ట్వీట్‌ ‌చేశారు.


2006-07లో షింజో అబే ప్రధానిగా తొలిసారి భారత్‌ను సందర్శించి నప్పుడు మన పార్లమెంట్‌లో ప్రసంగించారు. తర్వాతి కాలంలో తిరిగి ప్రధానిగా ఎన్నికైన తర్వాత 2014, 2015, 2017ల్లో మనదేశం సందర్శించారు. మరే ఇతర జపాన్‌ ‌ప్రధాని షింజో అబే మాదిరిగా భారత్‌ను ఇన్నిసార్లు సందర్శించ లేదు. 2014 గణతంత్ర వేడుకల పరేడ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన తొలి జపాన్‌ ‌ప్రధాని కూడా షిజో అబేనే. ఇవన్నీ భారత్‌ ‌పట్ల ఆయనకున్న అభిమానానికి, అనుసరించిన స్నేహపూర్వక వైఖరికి ప్రత్యక్ష నిదర్శనాలు. నిజానికి 2012 నుంచి షింజో అబే భారత్‌తో సంబంధాలను మరింత పరుగులు పెట్టించారు. నరేంద్రమోదీ గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు జపాన్‌ను సందర్శించిన అభిమానంతోనే 2014లో ప్రధాని పదవి చేపట్టిన తర్వాత, మన పొరుగు దేశాలను మినహాయిస్తే, ఆయన సందర్శించిన తొలి విదేశం జపాన్‌ ‌మాత్రమే! భారత్‌ అణుపరీక్షలు జరపడంపట్ల జపాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అక్కడి వారిని ఒప్పించి భారత్‌తో 2016లో అణు ఒప్పందం కుదుర్చుకున్న ఘనత షింజో అబేదే. ఇది భారత్‌కు ఎంతో కీలకం. ఎందు కంటే ఫ్రాన్స్, ‌యు.ఎస్‌. అణుసంస్థలు జపాన్‌లో పెట్టుబడులు పెట్టడమో లేక దేశీయ సంస్థలతో భాగస్వాములుగా ఉండటమో జరుగుతోంది. మోదీ- అబేలు అప్పటి వరకు ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం’ స్థాయికి తీసుకెళ్లారు. దీంతో ఇరుదేశాల మధ్య పౌర అణు ఒప్పందం, సముద్ర భద్రత, బుల్లెట్‌ ‌రైళ్ల నుంచి నాణ్యమైన మౌలిక సదుపాయాలు, లుక్‌ ఈస్ట్ ‌పాలసీ నుంచి ఇండో- పసిఫిక్‌ ‌వ్యూహం స్థాయికి గాఢమైన సంబంధాలు ఎదిగాయి.

అసాధారణ ఒప్పందం

2008లో అబే హయాంలోనే ఇరుదేశాల మధ్య విదేశాంగ మంత్రులు, రక్షణశాఖ మంత్రుల 2+2 సమావేశం జరపాలన్న నిర్ణయం జరిగింది. అప్పుడే ‘అక్విజిషన్‌ అం‌డ్‌ ‌క్రాస్‌ ‌సర్వీసింగ్‌ ఒప్పందం’- సైనిక లాజిస్టిక్‌ ‌సపోర్ట్ ఒప్పందం-కుదిరింది. 2015లో రెండు దేశాలు రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం పరస్పర బదలాయింపు ఒప్పందంపై సంతకాలు చేశాయి. నిజం చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మరో దేశంతో జపాన్‌ ‌కుదుర్చుకున్న అసాధారణ ఒప్పందం ఇదనే చెప్పాలి. 2019లో మొట్టమొదటిసారి ఇరుదేశాల విదేశాంగ, రక్షణశాఖ మంత్రులు సమావేశమయ్యారు. అబే హయాంలోనే ఇండో- పసిఫిక్‌ ‌ప్రాంతానికి చెందిన ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత సన్నిహిత మయ్యాయి. 2007లో అప్పటి జపాన్‌ ‌ప్రధానిగా ఉన్న షింజో అబే ‘క్వాడ్రిలేట్రల్‌ ‌సెక్యూరిటీ డైలాగ్‌’ ‌లేదా ‘క్వాడ్రిలేట్రల్‌ ఇనిషియేటివ్‌’ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అప్పటినుంచి భారత్‌… ‌జపాన్‌, ఆ‌స్ట్రేలియా, అమెరికాలతో బహుముఖ చర్చలు జరుపుతూ ఇందులో భాగస్వామి అయింది. ‘డెమోక్రటిక్‌ ‌పీస్‌’ (‌ప్రజాస్వామిక శాంతి) నమూనా భావనతో ఈ నాలుగు దేశాల మధ్య ఏర్పడిన రక్షణ ఏర్పాటు ఘనత మాత్రం షింజో అబేకి దక్కుతుంది. ‘క్వాడ్‌’ ‌గ్రూప్‌ ఏర్పడిన తర్వాత 2007లో ఆయన మాట్లాడుతూ, దీన్ని ‘రెండు సముద్రాల సంగమం’గా వ్యాఖ్యానించారు. అయితే తర్వాతి కాలంలో చైనా ఆగ్రహించిన కారణంగా భారత్‌ ‌దీన్నుంచి వైదొలగింది. తర్వాత 2017 నవంబర్‌లో జరిగిన ఆసియన్‌ ‌దేశాల సమావేశం సందర్భంగా అప్పటి జపాన్‌ ‌ప్రధాని షింజో అబె… భారత్‌, ఆ‌స్ట్రేలియా, యు.ఎస్‌. అధినేతలను చర్చలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఫ్రీ అండ్‌ ఇం‌డో-పసిఫిక్‌’ ‌వ్యూహాన్ని ముందుకు తెచ్చారు. పసిఫిక్‌, ‌హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడు పెరగడం, 2017లో డోక్లాం ప్రతిష్టంభన, షింజో అబే ‘క్వాడ్‌’‌ను పునరుద్ధరించాలన్న భావనను ముందుకు తీసుకొని రావడానికి ప్రధాన కారణం. అదే ఏడాది ఇండియా, జపాన్‌, ఆ‌స్ట్రేలియా, యుఎస్‌ ‌దేశాల అధికార్లు, తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా సమావేశ మయ్యారు. 2013 నుంచి భారత్‌-‌చైనా సైనికుల మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రతి సందర్భంలోనూ షింజో అబే భారత్‌కే పూర్తి మద్దతునిచ్చారు. యథాతథ స్థితిని మార్పు చేస్తున్న చైనా వైఖరిని జపాన్‌ ‌తీవ్రంగా ఖండించింది.

బుల్లెట్‌ ‌ట్రైన్‌ ‌ప్రతిపాదన

2015లో షింజో అబే భారత్‌ను సందర్శించి నప్పుడు ‘షింకన్‌సెన్‌ ‌సిస్టమ్‌’ (‌బుల్లెట్‌ ‌ట్రైన్‌)‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం జరిగింది. అబే నాయకత్వం లోనే ‘యాక్ట్ ఈస్ట్ ‌ఫోరం’ ఏర్పాటైంది. ఈశాన్య భారత్‌లో కొత్త ప్రాజెక్టులను జపాన్‌ ‌చేపట్టడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. మాల్దీవులు, శ్రీలంక వంటి చైనా పలుకుబడి ఉన్న దేశాల్లో రెండు దేశాలు ఉమ్మడిగా ప్రాజెక్టులు చేపట్టాయి. జి-7 దేశాల్లో షింజో అబే భారత్‌కు అత్యంత విలువైన మిత్రుడిగా పరగణించారు. మోదీ జపాన్‌ ‌వెళ్లినప్పుడు యమనషిలోని తన పూర్వికుల గృహంలో తేనీటి విందు ఇచ్చారు. అదేవిధంగా అబే భారత్‌కు వచ్చిన ప్పుడు అహమ్మదాబాద్‌లో రోడ్‌షోలో పాల్గొనడం గమనార్హం. 2020లో ఆయన గువహతిని సందర్శించాల్సి వుంది. కానీ అప్పట్లో మన దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. 2022, మార్చి 19న ప్రస్తుత జపాన్‌ ‌ప్రధాని ఫుమియో కిషిడా మనదేశాన్ని సందర్శిం చినప్పుడు, వచ్చే ఐదేళ్లకాలంలో 5ట్రిలియన్‌ ‌యన్‌ల మేర మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పడం విశేషం.

సంబంధాల్లో ఒడిదుడుకులు

స్వాతంత్య్రానంతరం ప్రచ్ఛన్నయుద్ధ రాజకీయాల నేపథ్యంలో అలీనవిధానం అనుసరించిన మనదేశంతో జపాన్‌కు సంబంధాలు పెద్దగా లేవనే చె•ప్పాలి. అయితే ‘లుక్‌ ఈస్ట్ ‌పాలసీ’ని అనుసరించిన 1980నాటి నుంచి జపాన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభమైంది. క్రమంగా 1986 నుంచి మనదేశానికి పెద్ద మొత్తంలో సహాయం అందించే దేశంగా జపాన్‌ అవతరించింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. 1998లో పోఖ్రాన్‌-2 ‌పరీక్షలు జరిపిన తర్వాత జపాన్‌ ‌మనదేశంపై ఆంక్షలు విధించడంతో సంబంధాలు మళ్లీ దెబ్బతిన్నా, మూడేళ్ల• తర్వాత ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్లీ గాట్లోపడ్డాయి. 2000లో జపాన్‌ ‌ప్రధాని మనదేశంలో పర్యటించి నప్పుడు ‘21వ శతాబ్దంలో జపాన్‌-ఇం‌డియా ప్రపంచ భాగస్వామ్యం’ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగింది. 2001లో అప్పటి మన ప్రధాని వాజ్‌పేయి జపాన్‌లో పర్యటించినప్పుడు రెండు దేశాలు ‘ఉమ్మడి ప్రకటన’ను విడుదల చేశాయి. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చాక జపాన్‌తో సత్సంబంధాలను కొనసాగించింది. 2005లో అప్పటి జపాన్‌ ‌ప్రధాని కొయిజుమి భారత్‌ ‌పర్యటించి నప్పుడు గ్లోబల్‌ ‌పార్ట్‌నర్‌షిప్‌పై విడుదల చేసిన ప్రకటనపై ఇరుదేశాల ప్రధానులు సంతకాలు చేశారు. ప్రస్తుతం భారత్‌లో పెట్టుబడులు పెట్టిన దేశాల్లో జపాన్‌ ‌మూడో స్థానంలో ఉంది. 2000-2019 మధ్యకాలంలో 30.27 బిలియన్‌ ‌డాలర్ల వరకు జపాన్‌ ‌పెట్టుబడులు విస్తరించాయి. ఇదేకాలంలో మనదేశంలో మొత్తం ఎఫ్‌డీఐల్లో ఇది 7.2%. ఢిల్లీ-ముంబయ్‌ ‌మధ్య 4.5 బిలియన్‌ ‌డాలర్ల వ్యయంతో రైల్వే ప్రాజెక్టును జపాన్‌ ‌చేపట్టేందుకు వీలుగా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. విదేశాల్లో జపాన్‌ ‌చేపట్టిన మొట్టమొదటి అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జపాన్‌ ‌నుంచి మనదేశానికి అయ్యే 90 శాతం దిగుమతులకు, మనదేశం నుంచి అక్కడికి అయ్యే 97శాతం ఎగుమతులకు సుంకాలను తొలగించడం రెండుదేశాల మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాలకు మరో ప్రత్యక్ష నిదర్శనం.

ఇరుదేశాల సంబంధాలకు రాధాబినోద్‌పాల్‌ ‌ప్రతీక

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌పై జరిగిన యుద్ధనేరాల విచారణ ‘టోక్యో ట్రైల్స్’‌గా ప్రసిద్ధి చెందింది. ఈ విచారణ కోసం ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్‌ ‌మిలిటరీ ట్రిబ్యునల్‌ ‌ఫర్‌ ‌ఫార్‌ ఈస్ట్’‌లో నియమించిన ఆసియా ప్రాంతానికి చెందిన ముగ్గురు న్యాయమూర్తుల్లో మనదేశానికి చెందిన ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడు రాధాబినోద్‌పాల్‌ ఒకరు. ‘అందరు ప్రతివాదులు నేరస్థులు కారు’ అంటూ జపాన్‌కు అనుకూలంగా తీర్పును ఇచ్చిన ఒకే ఒక న్యాయమూర్తి రాధాబినోద్‌పాల్‌. 1235 ‌పేజీల ఈయన తీర్పును యుఎస్‌ ‌నిషేధించింది. ఇప్పటికీ భారత్‌-‌జపాన్‌ ‌సంబంధాలకు ఒక చిహ్నంగా ఆయన పేరు నిలుస్తోందనడంలో అతిశ యోక్తి లేదు. 1951 సెప్టెంబర్‌ 8‌న శాన్‌‌ఫ్రాన్సిస్కోలో జపాన్‌తో ‘ట్రీటీ ఆఫ్‌ ‌పీస్‌ ‌విత్‌ ‌జపాన్‌’‌పై సంతకాలు జరిగాయి. 49 దేశాలు సంతకాలు చేసిన ఈ ఒప్పందం 1952 ఏప్రిల్‌ 28 ‌నుంచి అమల్లోకి వచ్చిం ది. అప్పటివరకు పాల్‌ ‌తీర్పుపై ఉన్న నిషేధం కూడా దీంతో తొలగి పోయింది. చైనాను ఈ సమావేశానికి ఆహ్వానించ లేదు. బర్మా, యుగొస్లా వియా, భారత్‌లను ఆహ్వానించినప్పటికీ ఇవి హాజరు కాలేదు. ఈ ఒప్పందంలో పేర్కొన్న కొన్ని నిబంధనలు జపాన్‌ ‌సార్వభౌమాధికారాన్ని పరిమితం చేస్తున్నా యంటూ భారత్‌ ‌విమర్శించి, తర్వాత జపాన్‌తో ప్రత్యేకంగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

1966లో పాల్‌ ‌జపాన్‌ ‌సందర్శించినప్పుడు, జపాన్‌ ‌చక్రవర్తి ఆయన్ను ‘ఆర్డర్‌ ఆఫ్‌ ‌ది సేక్రెడ్‌ ‌ట్రెజర్‌’ ‌పురస్కారంతో సత్కరించారు. జపాన్‌లోని ప్రముఖ దేవాలయాలు ‘యశుకుని’, ‘క్యోటో రయోజన్‌ ‌గొకొకు’ల్లో ఆయన స్మారక చిహ్నాలను జపాన్‌ ‌ప్రభుత్వం నెలకొల్పింది. భారత్‌-‌జపాన్‌ ‌స్నేహ సంబంధాల విషయంలో మనదేశ దౌత్యవేత్తలు, రాజకీయ నేతలు ప్రముఖంగా రాధాబినోద్‌పాల్‌ను ప్రస్తావిస్తుంటారు. 2005 ఏప్రిల్‌ 29‌న అప్పటి మన ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌, ‌మనదేశానికి వచ్చిన నాటి జపాన్‌ ‌ప్రధాని జునిచిరో కోయ్‌జుమి గౌరవార్థం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విందులో, 1951లో జపాన్‌తో అలయన్స్ ‌దేశాల ఒప్పందాన్ని భారత్‌ ‌తిరస్కరించడం, ప్రత్యేకంగా ఆ దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న సంఘటనలను ప్రస్తావించారు. అదేవిధంగా 2006 డిసెంబర్‌ 14‌న మన్మోహన్‌ ‌సింగ్‌ ‌జపాన్‌ ‌పార్లమెంట్‌ ఉభయసభల (జపాన్‌ ‌జాతీయ డైట్‌) ‌సమావేశంలో ప్రసంగించి నప్పుడు రాధాబినోద్‌ ‌పాల్‌ ‌తీర్పును ప్రస్తావిస్తూ, నేటికీ ఈ తీర్పును జపాన్‌ ‌ప్రజలు గుర్తుంచుకున్నారని పేర్కొన్నారు. 2007 ఆగస్టు 23న అప్పటి జపాన్‌ ‌ప్రధాని షింజో అబే కోల్‌కతాలో నివసిస్తున్న పాల్‌ ‌కుమారుడు ప్రశాంతను కలుసుకున్నప్పుడు, ఆయన మొత్తం నాలుగు ఫోటోలు షింజో అబేకి బహూక రించగా, అందులో రెండు తన తండ్రి పాల్‌, ‌షింజో అబే తాతగారైన నొబుషికె కిషి (ఈయన కూడా జపాన్‌ ‌ప్రధానిగా పనిచేశారు)తో దిగినవి కావడం విశేషం. వీరిద్దరు కోల్‌కతా సిటీ హోటల్‌లో అరగంటసేపు ముచ్చటించుకోవడం విశేషం.

బౌద్ధంతో బలీయబంధం

క్రీ.శ.727లో మనదేశానికి చెందిన బౌద్ధ సన్యాసి బోధిసేన, జపాన్‌కు చెందిన ‘నారా’ పట్టణం లోని ‘తొడాయ్‌-‌జి’ దేవాలయంలో బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు చారిత్రకాధారాలున్నాయి. జపాన్‌లో హైందవం తక్కువే. కానీ అక్కడి సంస్కృతి అభివృద్ధికి హైందవం పరోక్షంగా ఎంతో దోహదం చేసింది. ముస్లింల దండయాత్రల వల్ల మనదేశంలో ఆవిర్భవించిన బౌద్ధం ఇక్కడ సమూలంగా తుడిచి పెట్టుకు పోయినప్పటికీ, ఆగ్నేయాసియా దేశాలు, చైనా, జపాన్‌లలో బౌద్ధం ప్రధాన మతంగా కొనసాగు తోంది.

భారతీయ బౌద్ధ సన్యాసి బోధిసేన బౌద్ధమత వ్యాప్తికి కృషిచేస్తూ క్రీ.శ.760లో అక్కడే మరణిం చారు. ఈ బౌద్ధం ఇరుదేశాల సంస్కృతులను ఒక్కటిచేసి సన్నిహిత సంబంధాలకు దోహదకారి అవుతోంది. శాంతి, అహింసలు బోధించే బౌద్ధంతో ఏర్పడిన సాంస్కృతిక బంధం ఇరుదేశాలను శాంతి కాముక దేశాలుగా మార్చివేసింది.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram