భాగ్యనగర్‌ ‌కేంద్రంగా మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన బీజేపీ (భారతీయ జనతా పార్టీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పాయి. ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఉపముఖ్యమంత్రులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన అగ్ర నాయకులు రెండురోజుల పాటు భాగ్యనగర్‌లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. సమావేశాల ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కూడా అగ్ర నాయకులంతా ఒకే వేదిక పంచుకున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన నలుగురూ ఒకే వేదికను పంచుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని, బలగాన్ని, పటిష్ట నాయకత్వాన్ని ప్రదర్శించింది. దీన్నిబట్టి జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్న విషయం స్పష్టమవుతున్నది. కూకటివేళ్లతో ‘కల్వకుంట్ల’ కుటుంబ పాలనను పెకిలించాలని బీజేపీ జాతీయ నాయకత్వం కృతనిశ్చయంతో ఉన్నదనేది అర్థమవు తున్నది. ఇన్నిరోజుల పాటు తెరాస (తెలంగాణ రాష్ట్ర సమితి)కి ప్రత్యామ్నాయం తామే అన్న బీజేపీ ఈసారి తామే అధికారంలోకి వస్తామన్న ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించి, స్పష్టమైన సంకేతం ఇచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధించింది.

బీజేపీకి పెరుగుతున్న ఆదరణ

పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా ఐదు విషయాలు స్పష్టంగా అర్థమవు తున్నాయి. మొదటిది, తెలంగాణలో మోదీ బ్రాండ్‌ ఇమేజ్‌ ‌సరికొత్త స్థాయికి చేరుకున్నదని స్పష్టమైంది. మోదీ వేదికపైకి చేరుకుంటున్నప్పుడు, సభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు వచ్చిన స్పందనను బట్టి ఆయనకు తెలంగాణలో ఎంత క్రేజ్‌ ఉం‌దో అర్థం చేసుకోవచ్చు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ‘మోదీ.. మోదీ..’ నినాదాలు హోరెత్తాయి. రెండవది, బీజేపీ పట్ల ప్రజల్లో ఆసక్తి, ఆదరణ పెరుగుతున్నదని రుజువైంది. బీరు, బిర్యానీ, నోటు… ఏమీ ఆశించ కుండా లక్షలాది మంది కుటుంబాలతో సహా ఎంతో దూరం నుంచి, సొంత ఖర్చులతో హాజరయ్యారు. మూడవది.. అవినీతి, అరాచక, నియంతృత్వ, నిరంకుశ కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి బీజేపీ జాతీయ నాయకత్వం ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. నాల్గవది.. తెలంగాణ వామపక్ష భావజాలంతో ప్రభావితమైన ఒక ప్రాంతమని, ఇక్కడ బీజేపీ ఎదగడం సాధ్యంకాదని, దక్షిణాదిలో పార్టీకి స్థానంలేదని అంటున్న రాజకీయ పండితుల వాదనలో పస లేదనేది నిరూపితమైంది. ఒకవేళ ఈ మేధావులు చెప్పేదానిలో వాస్తవం ఉంటే విజయ సంకల్పసభకు ఇంత ఆదరణ ఎందుకు లభించేది?

దక్షిణాదిలో బీజేపీ లేదా?

దక్షిణాదిన ఇప్పటికే కర్ణాటక, పాండిచ్చేరిలలో బీజేపీ ప్రభుత్వాలు కొలువుదీరాయి. మరి అలాంటప్పుడు దక్షిణాదిలో బీజేపీ లేదని ఎలా అనగలరు? తెలంగాణలో నాలుగు ఉపఎన్నికలు జరిగితే రెండు ఉపఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ముప్ఫై శాతం ఓట్లు సాధిస్తుంటే బీజేపీ లేదని ఎలా అంటారు? తమిళనాడులో ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అనూహ్య రీతిలో పార్టీ పుంజుకున్నది. ఐదవది.. కేసీఆర్‌, ‌తెరాస పార్టీ అభద్రతా భావంలో కొట్టుమిట్టాడు తున్నారనేది తేలిపోయింది. గతంలో రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహిం చాయి. ఏ పార్టీ ప్రభుత్వం వాటిని ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు. కానీ భాగ్యనగర్‌ ‌వేదికగా బీజేపీ సమావేశాలు నడుస్తుంటే తెరాస ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టడం దేనికి సంకేతం? మంది పెళ్లిళ్ల భరాత్‌లో వీళ్లెందుకు డ్యాన్సులు వేస్తు న్నారు? గ్రామస్థాయిలో జరిగే ఫ్లెక్సీల పంచాయితీని రాష్ట్ర స్థాయిలో చూడల్సి రావడం నిజంగా దురదృష్టకరం. ఆఖరికి ప్రధాని వస్తున్న వైమానిక మార్గంలో గాలిలోకి నల్ల బెలూన్లు వదలడం కేసీఆర్‌ ‌కొంచపుబుద్ధికి నిదర్శనం.

ప్రజల నాడిని పట్టగలిగే కేసీఆర్‌.. ‌ప్రజల్లో తన పాలన పట్ల పెరుగుతున్న అసంతృప్తిని, అసహనాన్ని కూడా పసిగట్టగలిగారు. అలాగే బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను కూడా అంచనా వేయగలిగారు. అందుకే ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారు. కేవలం బీజేపీని తిట్టడానికే ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారు. ఆ మాత్రం గమనించలేని స్థాయిలో తెలంగాణ ప్రజలు ఉన్నారనుకుంటున్నారా? కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌ల కురుస మనస్తత్వాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించలేరా?

కేసీఆర్‌వి చిల్లర రాజకీయాలు

ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాను పిలిపించి పదివేల మందితో బైక్‌ ‌ర్యాలీ నిర్వహిం చడం వింతగా, వికారంగా ఉంది. రాష్ట్రపతి ఎన్నికలకు ఓట్లు వేసేది ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ సామాన్య ప్రజలు కాదు కదా? గల్లీలో బైక్‌ ‌ర్యాలీ ద్వారా ఏం సాధిస్తారు? అవేమైనా హైదదాబాద్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు అనుకుంటున్నారా? ఆ తర్వాత యశ్వంత్‌ ‌సిన్హాతో కలిసి ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్‌ ‌దిగజారి నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడి తెలంగాణ పరువు తీశారు.

దేశ ప్రధానమంత్రి, పందొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వస్తే కనీసం స్వాగతం పలకకపోగా ప్రధానిని ‘సేల్స్‌మ్యాన్‌’ అని తిట్టడం ఏంటి? అవును, మోదీ బ్రాండ్‌ ఇం‌డియాకి సేల్స్‌మ్యాన్‌. ‌సేల్స్‌మ్యాన్‌ ‌మాత్రమే కాదు, ఆయన ••ఎశీశ్రీ శీ• •వశ్రీ•శ్రీవ •వతీఙఱమీవ అన్న విషయం మర్చిపోవద్దు. ‘అతిథి దేవోభవ’ అన్నది మన తెలంగాణ సిద్ధాంతం. కానీ కేసీఆర్‌ ఆ ‌సిద్ధాంతాన్ని గౌరవించడం లేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఒక ఇంటెలిజెన్స్ అధికారిని పంపి తీర్మానం కాపీలు దొంగిలించే విఫలయత్నం చెయ్యడం దేనికి సంకేతం? బాధ్యత గల పోలీస్‌ అధికారులను సొంత పాలేర్లుగా వాడుకొని, వారిపై ఒత్తిడి తెచ్చి మరీ బలవంతంగా రాజకీయాల కోసం వాడుకోవడం ఎంతవరకు సబబు? చివరకు ప్రధాని మోదీ ప్రసంగం సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశ్యపూర్వకంగా విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం కలిగించారు. విజయ సంకల్పసభ ముగిసిన తర్వాత ఆ వార్త ప్రజలకు కనిపించకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక పత్రికల్లో మొదటి పేజీ మొత్తం తెరాస ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారు. ప్రజల దృష్టిని బీజేపీ వైపు నుండి తెరాస వైపు మళ్లించడం కోసం కేసీఆర్‌ ‌చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు కూడా గ్రహించారు. వాస్తవానికి కేసీఆర్‌ ‌పిరికివాడు అని తన వెంట సన్నిహితంగా తిరిగే చాలా మంది సీనియర్‌ ‌రాజకీయ నాయకులు చెబుతుంటారు. ఈ ఘటనలు చూసాక అది వాస్తవమేనన్న అనుమానం కలుగుతున్నది. కేసీఆర్‌ ‌తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎంతకైనా దిగజారుతారని తెలిసిన ప్రధాని మోదీ కేసీఆర్‌ ‌వ్యాఖ్యలను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు.

రాష్ట్రమేమైనా మీ జాగీరా?

ప్రధానిని పట్టుకొని ఇరానీ చాయ్‌, ‌బిర్యానీ బాగుంటాయి, తిని, తాగి వెళ్లండని కేటీఆర్‌ ‌పదే పదే అనడం ద్వారా ఈ రాష్ట్రాన్ని తన సొంత ఎస్టేట్‌గా భావిస్తున్నారన్న అహంకార భావం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. కేసీఆర్‌, ‌కేటీఆర్‌లు లేకముందు హైదరాబాద్‌లో ఇరానీ చాయ్‌, ‌బిర్యానీలు లేవా? వీళ్లే ఇరానీ చాయి, బిర్యానీలను కనిపెట్టినట్లు, వీళ్ల వింతమాటలు ప్రజలకు విరక్తి కలిగిస్తున్నాయి. తెలంగాణ ఏమైనా మీ జాగీరా? కేసీఆర్‌ ‌రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మోదీ దేశానికి, అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి. ఈ సోయి కూడా వీళ్లకు లేకపాయె! ప్రాంతీయ, కుటుంబ పార్టీలు రాష్ట్రాలను తమ సొంత ఎస్టేట్‌లుగా మార్చేస్తున్నాయి. వాటన్నింటిని అంతంచేయడానికే బీజేపీ కంకణం కట్టుకున్నది. కశ్మీర్‌ ‌నుండి కన్యాకు మారి వరకు బీజేపీ అలాంటి అనేక సామ్రాజ్యాలు కూలదోస్తూ వచ్చింది. ఇప్పుడు ‘కల్వకుంట్ల’ కుటుంబ సమయం వచ్చింది.

ఎక్కడి సమస్యలు అక్కడే..

కేసీఆర్‌ ‌వైఫల్యాలే బీజేపీ ఆయుధాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. రైతుబంధు సకాలంలో అందడం లేదు. పాఠశాలల్లో కనీసం సుద్దముక్కలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. బడులు ప్రారంభమై మూడు వారాలు గడిచినా పాఠ్య పుస్తకాలు ముద్రణ కాలేదు. మధ్యాహ్న భోజనానికి నిధులు లేవు. సంక్షేమ హాస్టల్‌లలో పురుగులన్నం పెడుతున్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో కనీస వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు వర్షంలో ధర్ణాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కల్యాణ లక్ష్మీ వంటి పథకాలు డబ్బుల్లేక నెలల తరబడి అందడంలేదు. విద్యార్థుల స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏళ్లకొద్ది పెండింగ్‌లో ఉన్నాయి. ‘ధరణి’తో గ్రామాల్లో అనేక భూ పంచాయితీలు నడుస్తున్నాయి. దుబారా, అవినీతి, క్రమశిక్షణా రాహిత్యంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇక చేసేదేంలేక కేంద్ర ప్రభుత్వంతో మమ్మల్ని అప్పులు ఎందుకు చేసుకోనివ్వరు అంటూ గిల్లికజ్జాలు పెట్టుకునే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. దీన్ని పసిగట్టిన బీజేపీ.. బహిరంగ సభ ముగియగానే, అటు రాష్ట్ర స్థాయిలో ఇటు అసెంబ్లీ స్థాయిలో చేరికల ద్వారా బలపడాలని ఒక కమిటీ వేయడం, దానికి ఈటల రాజేందర్‌ను కన్వీనర్‌గా నియమించడం.. అనుభవం, ఆలోచన కలిగిన నాయకులను సభ్యులుగా ఎంచుకోవడం బట్టి చూస్తే తెరాసను గద్దె దింపడానికి ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తుందని చెప్పవచ్చు. బీజేపీ ధాటికి రానున్న రోజుల్లో తెరాస పార్టీ మంచుగడ్డలా కరిగిపోవడం ఖాయం. జాతీయ కార్యవర్గ సమా వేశాలు గడిచిన రెండు రోజులకే కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్‌ ‌ప్రవాస్‌ ‌యోజన ఏర్పాటు చెయ్యడం, కేంద్ర మంత్రుల స్థాయిలో ఇంచార్జిలను నియమించడం, వారి పర్యటనలను ఖరారు చేయడాన్ని బట్టి చూస్తే కేసీఆర్‌తో తాడో పేడో తేల్చుకోవడంలో బీజేపీ సీరియస్‌గా ఉందని స్పష్టంగా కన్పిస్తుంది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన బీజేపీ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తప్పక నెరవేరుస్తుంది. వాస్తవానికి బీజేపీకి, తెలంగాణకు ఉన్న సంబంధం పేగు బంధం లాంటిది. 1997లో కాకినాడ తీర్మానం, ఉద్యమంలో అగ్రభాగాన నిలవడం, పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదాలో సంపూర్ణ మద్దతు తెలపడం ద్వారా రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీజేపీ, నేడు తెలంగాణలో ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం, కుటుంబ నియంతృత్వ, అవినీతి పాలనను అంతం చేయడం కోసం మరో పోరాటానికి సిద్ధమైందన్న సందేశాన్నిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తోంది. అది తన బాధ్యత అని కూడా చాటి చెబుతున్నది. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిన ప్రతిసారి బీజేపీ ముందుండి పోరాడుతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ ఎన్ని అక్రమ అరెస్ట్‌లు, హత్యలు చేసినా ధీటుగా ఎదుర్కొంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌ ‌ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కరరావు కూల్చే ప్రయత్నం చేసినప్పుడు ప్రజా మద్దతుతో గెలిచిన ఎన్టీఆర్‌ అం‌డగా నిలబడింది. కేసీఆర్‌కు రాజ్యాంగం అన్నా, ప్రజాస్వామ్యం అన్నా లెక్కలేకుండా పోయింది. ముఖ్యమంత్రి పదవిని తన ఎడమకాలి చెప్పుతో సమానం అని కించపరచారు. అలాగే రాజ్యాంగాన్ని మార్చాలంటూ రాజ్యాంగాన్ని అవహేళన చేశారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేసీఆర్‌ను గద్దెదించడం కోసం బీజేపీ అన్ని శక్తులను ఒడ్డుతోంది. నాడు నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటానికి సర్దార్‌ ‌పటేల్‌ అం‌డగా నిలబడ్డారు. నేడు నయా నిజాం కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటానికి బీజేపీ తప్పక అండగా నిలబడుతుంది.

  • ఏనుగుల రాకేశ్‌రెడ్డి,  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి

About Author

By editor

Twitter
Instagram