స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ -1

– ‌డాక్టర్‌ ‌శ్రీరంగ్‌ ‌గాడ్బొలే

స్వతంత్ర దేశంగా భారత్‌ 75‌వ సంవత్స రంలో అడుగు పెడుతున్న వేళ స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ అద్భుత సందర్భానికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. అది రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌శతాబ్ది ఉత్సవం. స్వాతంత్య్రోద్యమం, ఆర్‌ఎస్‌ఎస్‌ (‌సంఘ్‌) అనే పదాలను కలిసికట్టుగా విన్నప్పుడు తరచు ఒక ప్రశ్న వినబడుతుంది. అది ‘స్వాతంత్య్రోద్యమంలో సంఘ్‌ ‌పాత్ర ఏమిటి? ఈ వ్యాసం ఆ అంశాన్ని పరిశీలించడానికి ప్రయత్నిం చింది. ఈ వ్యాసానికి ఆధారాలు సంఘ్‌ ఆర్కైవ్స్‌లో ఉన్న పత్రాలు, ‘కేసరి’ లాంటి సమకాలీన మరాఠి దినపత్రికలు, పుణే, నాగపూర్‌ల నుండి వెలువడిన వారపత్రికలు.

సంఘ్‌- ‌స్వయంసేవకులు

‘స్వాతంత్య్రోద్యమంలో సంఘ్‌ ‌పాత్ర ఏమిటి?’ ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే- స్వరాజ్య సమరంలో సంఘ్‌ ‌పాత్ర కనిపించదు కానీ, స్వయంసేవకుల పాత్ర చాలా ప్రముఖమైనదే. ఈ మాట మిమ్మల్ని అయోమయానికి గురిచేసినట్లుంది. ఈ అయోమయం నుండి బయటికి రావాలంటే ఒకసారి సంఘ్‌ ‌వ్యవస్థాపకులు, పరమ పూజనీయ    డా।। కేశవ బలిరామ్‌ ‌హెడ్గేవార్‌ ఆలోచన విధానాన్ని పరిశీలించాలి. ఈ విధానమే ఈనాటికీ సంఘ్‌ ‌విధానాన్ని నిర్దేశిస్తున్నది.

‘మనకు స్వాతంత్య్రం ఎప్పుడు వస్తుంది?’ అనే ప్రశ్న అందరి మనసులను తొలచివేస్తున్న సమయంలో డా।। హెడ్గేవార్‌ ‌మనసును వేరే ప్రశ్న వేధించేది. ‘మనం స్వాతంత్య్రాన్ని ఎందుకు కోల్పోయాం, దాన్ని ఎలా కాపాడుకోవాలి?’ అనేదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్నను డా।। హెడ్గేవార్‌ ‌లోతుగా పరిశీలించారు. బాగా ఆలోచించి, ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టిన లోపాల నుండి సమాజాన్ని విముక్తి చేయడానికి ఒక సంస్థకు రూపకల్పన చేసి, దానిని ప్రారంభించారు.

ఆయన ఆశయం జాతి నిర్మాణం. కానీ అందుకు చాలా సమయం పడుతుంది. అది దీర్ఘకాలిక లక్ష్యం. ఆందోళనలు, వాటి స్వభావరీత్యా ఆ సమయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉంటాయి. ఒకవైపు జాతి నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, మరోవైపు ఆందోళనలను కొనసా గించడం, రెండింటిని సమన్వయం చేయడం ఒక సవాలు. కానీ హెడ్గేవార్‌ ‌వంటి మేధావి ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నారు.

బాల్యదశలో ఉన్న తన సంస్థను ఆందోళనల ఆటుపోట్ల నుండి కాపాడుతూ, అదే సమయంలో స్వయంసేవకులను నాటి ఆందోళనలలో పాల్గొనడా నికి అనుమతించారు.

తన ప్రవర్తన ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచే వ్యక్తిత్వం కలిగిన డా।। హెడ్గేవార్‌ ‌స్వయంగా అలాంటి ఆందోళనలలో పాల్గొంటూనే, సంఘ్‌ను వాటికి దూరంగా ఉంచేవారు. అలాంటి ఆందోళనల అవసరం ఉండదో అలాంటి సమాజాన్ని హెడ్గేవార్‌ ‌కలలు కన్నారు. ఆయన దృష్టిలో సంఘ్‌ ఒక బలహీన సమాం కోసం తాత్కాలికంగా సహకరించే, పోరాడే ఒక సంస్థ కాదు. ఆయన హిందూ సమాజ శక్తిని ఎంతగా పెంచాలని ఆశించారంటే, అసలు దానికి సంఘ్‌ అవసరం పడనంత!

దీనికి తోడు ఇంకో మౌలికమైన ఆలోచన ఆయన మదిలో ప్రముఖంగా ఉండేది. సంఘ్‌, ‌హిందూ సమాజం వేర్వేరు అనే ద్వంద్వ వైఖరిని ఆయన అసహ్యించుకునేవారు. సంఘ్‌ను ఆర్య సమాజ్‌, ‌రామకృష్ణ మిషన్‌ ‌లాంటి హిందూ సమాజం లోనే ప్రత్యేకమైన సంస్థలుగా ఆయన ప్రారంభించ లేదు. సంఘ్‌ను హిందూ సమాజ సంస్థగా చూసారే కానీ హిందూ సమాజంలో ఒక సంస్థగా కాదు. ఈ భేదం మనకు హెడ్గేవార్‌ ‌జీవితంలో కనీసం రెండు సందర్భాలలో కనిపిస్తుంది.

ఒకటి, 1938లో హైదరాబాద్‌ ‌సంస్థానంలో హిందువు లపై నిజాం అకృత్యాలకు వ్యతిరేకంగా పౌర ప్రతిఘటన ఉద్యమం (Civil Resistance Movement) ప్రారంభమైంది. ఈ సందర్భంలో సంఘ్‌ ‌శాఖలను ఆ పోరాటంలో పాల్గొనమని ఆదేశాలు ఇవ్వడానికి డా।। హెడ్గేవార్‌ ‌నిరాకరించ డంతో హిందూ వర్గాల నుండి విమర్శల• వచ్చాయి. కానీ అదే హెడ్గేవార్‌ ఆ ‌పోరాటంలో పాల్గొన్న వారిని ప్రశంసిస్తూ ఉత్తరాలు రాయడం విధిగా పెట్టు కున్నారు. ఆయన ఆలోచన ప్రకారం -స్వయంసేవక్‌ ‌హిందూ సమాజంలో ఒక సభ్యుడు అక్కడ రాజీనామా చేసి సంఘంలోకి రాడు. కాబట్టి హిందూ సమాజం కోసం చేసే పోరాటంలో సాధారణ వ్యక్తి ఏం చేస్తాడని ఆశిస్తారో, అదే చేయడానికి స్వయంసేవక్‌కి స్వేచ్ఛ ఉంది. (Sangh archives, Hedgewar papers, Registers/Register 1 DSC_ 0056).

రెండు, సంఘం ఒక సంస్థగా ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నా కూడా, ఆ ఉద్యమంలో తగినంత మంది పాల్గొనేటట్లు హెడ్గేవార్‌ ‌జాగ్రత్త తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రాంతీయ హిందూ సభ కార్యదర్శి శంకర్‌ ‌రామచంద్ర దాతే ఈ ఉద్యమంతో మొదటినుండి అనుబంధం కలిగి ఉన్నారు. మే 1938లో హెడ్గేవార్‌ ‌హిందూ యువత సమావేశాలకు అధ్యక్షత వహించ డానికి వచ్చి పుణేలో ఉన్నారు. దాతే హెడ్గేవార్‌ను కలిసి కనీసం 500 మంది కార్యకర్తలను సిద్ధం చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు. దాతేకు హెడ్గేవార్‌ ‌భరోసా ఇస్తూ, ‘‘మీకు కావలసింది కేవలం 500 మంది కార్యకర్తలు మాత్రమేనా! చింతించ కండి. మీరు మిగతా ఏర్పాట్లు చూసుకోండి.’’ అని ధైర్యం చెప్పారు. హెడ్గేవార్‌ ‌సానుభూతితో చెప్పిన ఈ మాటలు దాతే హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి (Sangh archives, Hedgewar papers, Dr. Hedgewar Athavani 2 0001-A to 0001-D). సంఘం ఒక సంస్థగా పాల్గొనకున్నా, సంఘ శాఖలలో దేశభక్తితో పాఠాలు నేర్చిన స్వయంసేవకులు దేశ ప్రయోజనం కోసం తమ సంస్థ గుర్తింపును పక్కన పెట్టి (dissolve) ఆ ఉద్యమంలో పాల్గొంటారని హెడ్గేవార్‌ ‌నమ్మారు.

హెడ్గేవార్‌ ‌నమ్మకం వమ్ము కాలేదు. చాలామంది స్వయంసేవకులు, కార్యనిర్వహణ సభ్యులు ఈ ఉద్యమంలో సాధారణ హిందువులుగా పాల్గొన్నారు. సతారా జిల్లా, దక్షిణ మహారాష్ట్ర రాజ్యాలలో ఈ ఉద్యమానికి దిశా నిర్దేశం చేయడానికి ఒక యుద్ధ కౌన్సిల్‌ను ఫిబ్రవరి 1939లో ఏర్పాటు చేశారు. దీని అధ్యక్షుడు సతారా జిల్లా సంఘచాలక్‌ ‌శివరామ్‌ ‌విష్ణు మోదక్‌, ‌సభ్యుడు కాశీనాథ్‌ ‌భాస్కర్‌ ‌లిమాయే. ఇతను మహారాష్ట్ర ప్రాంత సంఘచాలక్‌ (‌కేసరి, 17 ఫిబ్రవరి 1939).

 ఏప్రిల్‌ 22, 1939 ‌నాడు హిందూ మహాసభ నాయకుడు ఎల్‌.‌బి. బోపట్‌కర్‌ ‌నేతృత్వంలో మరుసటి రోజు బయలుదేరుతున్న 200 మంది ప్రతిఘటన దారులకు వీడ్కోలు పలకడానికి శనివార్‌వాడా మైదానంలో సభ, భారీ ర్యాలీ ఏర్పాటయ్యాయి. హెడ్గేవార్‌ ‌వేదిక మీద ఉన్నారు (కేసరి, 24 ఏప్రిల్‌ 1939). ఆ ‌మరుసటి రోజు హెడ్గేవార్‌ ‌స్వయంగా రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఆ ప్రతిఘటనదారులకు వీడ్కోలు పలికారు. దీంట్లో వందల కొద్ది స్వయంసేవకులు తమ వ్యక్తిగత సామర్థ్యంతో ఈ పౌర ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో హెడ్గేవార్‌ ‌మేనల్లుడు వామన్‌ ‌కూడా ఉన్నారు. వామన్‌ను నిజాం పోలీసులు నిర్భంధించి చీకటిగదిలో నాలుగురోజులు చితకబాదారు (కేసరి, 9 జూన్‌ 1939).

ఏ‌ప్రిల్‌ 1939‌లో పుణే జిల్లా మెజిస్ట్రేట్‌ ‌సోన్య మసీదు ముందు సంగీత వాద్యాలు మోగించరాదని, ఆ శబ్దంతో దగ్గరలో ఉన్న టంబోలి మసీదులో నమాజ్‌కు ఇబ్బంది అవుతుందన్న సాకుతో వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనికి వ్యతిరేకంగా పుణేలోని హిందువులు సత్యాగ్రహం చేశారు. ఆ సమయంలో హెడ్గేవార్‌ అక్కడికి వెళ్లవలసి వచ్చింది. స్థానికులు హెడ్గేవార్‌ని ఇలా ప్రశ్నించారు. -‘‘సంఘం ఈ సత్యాగ్రహంలో ఏం చేస్తుంది?’’ హెడ్గేవార్‌ ‌నవ్వుతూ ఇలా బదులిచ్చారు. -‘‘ఈ సత్యాగ్రహం ప్రజలందరి కోసం. వందలాది స్వయంసేవకులు సాధారణ పౌరులుగా దీంట్లో పాల్గొంటారు. ఒకవేళ వాళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉండాలంటే, అది ఆవశ్యకమైతే నేను వారి తలపై రెండు కొమ్ములు పెడతాను’’. హెడ్గేవార్‌ అం‌తకుముందే తన నాగపూర్‌ ‌నివాసంలో గోడకు తగిలించడానికి జత దున్నపోతు కొమ్ములు కొన్నారు. ఇదే విషయం తన జవాబులో ప్రస్తావించారు (Sangh archives, Hedgewar papers Nana Palkar/Hedgewar Notes-5, 5_141).

ఇక్కడ మనం గమనించాల్సింది, హెడ్గేవార్‌ ‌స్వయంగా ఈ సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. కాని ఆయన సంఘ్‌ను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి గట్టిగా నిరాకరించారు. హెడ్గేవార్‌ ‌నియమాలకు ఒక ప్రముఖమైన మినహాయింపు ఉంది. డిసెంబర్‌ 1929 ‌నాటి లాహోర్‌ ‌భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సమావేశాలలో పూర్ణ స్వరాజ్యం అనే లక్ష్యాన్ని నిర్ణయించారు. జనవరి 26, 1930 తేదీని పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా జరపాలని కూడా నిర్ణయించారు. అప్పటిదాకా కాంగ్రెస్‌ ‌లక్ష్యం Dominian Status మాత్రమే. పూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా ఉన్న హెడ్గేవార్‌ ‌కాంగ్రెస్‌ ‌తీసుకున్న ఈ నిర్ణయంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆయన -‘‘జనవరి 26, 1930న అన్ని సంఘ శాఖలలో (సంఘం జరిగే స్థలాలలో) అందరు స్వయంసేవకులతో సమావేశం పెట్టి భగవ భగధ్వజానికి వందనం చేయాలి. స్వాతంత్య్రం అంటే ఏమిటి, దానిని ప్రథమ కర్తవ్యంగా ఎలా పెట్టుకోవాలి అన్న అంశం మీద ఉపన్యాసం ఇవ్వాలి. ఆపై స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌ను అభినందిస్తూ ఆ కార్యక్రమాన్ని ముగించాలి’’ (Sangh archives, Hedgewar papers, A Patrak by Dr.Hedgewar to the Swayamsevak 21 Jan 1930) అని కోరారు. మనం హెడ్గేవార్‌ ఆలోచనను అర్థం చేసుకున్నట్ల యితే, స్వాతంత్య్రోద్యమంలో సంఘ పాత్ర ఏమిటి అనే ప్రశ్న అనవసరం అనిపిస్తుంది. ఇప్పుడు మనం అటవీ సత్యాగ్రహం విషయానికి వద్దాం.

శాసనోల్లంఘన ఉద్యమం

భవిష్యత్తులో భారత రాజ్యాంగ రూపురేఖలు ఎలా ఉండాలో బ్రిటిష్‌ ‌పార్లమెంటులో లేదా రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో చర్చించాల్సి ఉంది. కానీ బ్రిటిష్‌ ‌ప్రభుత్వం నవంబర్‌ 8, 1927‌న భారతదేశ భవిష్యత్‌ ‌రాజ్యాంగాన్ని సిద్ధం చేయడానికి సైమన్‌ ‌కమిషన్‌ను ప్రకటించింది. ఇందులో ఒక్క భారతీయ సభ్యుడూ లేడు. దీనితో పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయుడు వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో 28-31 ఆగస్ట్ 1928 ‌మధ్య లక్నోలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అంతకుముందే కాంగ్రెస్‌ ‌నిర్ణయం మేరకు మోతీలాల్‌ ‌నెహ్రు నేతృత్వంలో సిద్ధమైన రాజ్యాంగ ముసాయిదాను లక్నోలో ఏకగ్రీవంగా ఆమోదిం చారు. కానీ Dominian Status ఇస్తామన్న భరోసా వెంటనే బ్రిటిష్‌ ‌ప్రభుత్వం నుండి రాలేదు. దీనితో కేంద్ర, ప్రాంతీయ చట్టసభలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలను బహిష్కరించాలని లాహోర్‌ ‌సమావేశంలో (డిసెంబర్‌ 1929) ‌కాంగ్రెస్‌ ‌పిలుపునిచ్చింది. అలాగే శాసనోల్లంఘన, పన్నుల నిరాకరణోద్యమాలను పరిస్థితులను బట్టి ప్రారంభించే అధికారం కూడా ఆ సమావేశాలు అఖిల భారత కాంగ్రెస్‌ ‌కమిటీకి అప్పగించాయి. ( P 326)

లాహోర్‌ ‌కాంగ్రెస్‌ ‌సమావేశం చేసిన పూర్ణ స్వరాజ్‌ ‌తీర్మానంలో ఇంకా ఇలా పేర్కొన్నారు. భారత్‌ను ఆర్థికంగా నాశనం చేశారు. మన ప్రజల నుంచి వచ్చిన ఆదాయం మన ప్రజల సంపాదనకు దామాషాగా లేదు. రోజుకు మన సగటు సంపాదన 7 పైసలు, మనం కట్టే ఈ భారమైన పన్నులలో 20% భూమి శిస్తు, 3% ఉప్పు పన్ను ద్వారా వసూలు చేస్తున్నారు. ఈ ఉప్పు పన్ను ముఖ్యంగా పేదవారి మీద పెను భారం మోపుతుంది (R.C. Majumdar, History of the Freedom Movement in India vol 3, Firma KL Mukhopadyaya, Calcutta, Paublication data unknown, pp.326, 331).

శాసనోల్లంఘన ఉద్యమానికి పథక రచన చేయడానికి 14,15 ఫిబ్రవరి 1930 నాటి సమావేశాలలో కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ గాంధీజీకి అధికారం ఇచ్చింది. స్త్రీ, పురుష సత్యాగ్రహులు 79 మందిని ఎంచుకుని గాంధీజీ 241 మైళ్లు, 24 రోజల పాటు నెమ్మదిగా నడిచి దండి వద్ద సముద్ర తీరం చేరుకున్నారు. ఏప్రిల్‌ 16, 1930‌న గాంధీజీ సముద్రపు అలలు వదిలివెళ్లిన కొంచం ఉప్పును తీసి చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ చర్య దేశమంతా ఒక ప్రభంజనమైంది. చాలా చోట్ల ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. నగరాలలో కూడా పెనాలు పెట్టి ఉప్పు తయారుచేశారు. అసంఖ్యాకంగా అరెస్ట్‌లు జరిగాయి. 60 వేల మంది రాజకీయ ఖైదీలను జైలులో పెట్టారు (Majumdar, pp 334, 338).

అటవీ సత్యాగ్రహం

ఉప్పు సత్యాగ్రహానికి మధ్య పరగణాలు (నేటి యూపీ), బేరార్‌ ‌ప్రాంతాలలో నామమాత్రపు స్పందన వచ్చింది. మధ్యపరగణాలలో, మరాఠి మాట్లాడే నాగపూర్‌ ‌విభాగంలో నాగపూర్‌, ‌వార్దా, చంద్రపూర్‌, ‌బండారా ప్రాంతాలు ఉండేవి. హిందీ మాట్లాడే ప్రాంతంలోని మూడు విభాగాలు నర్మదా (నిమార్‌, ‌హోషంగాబాద్‌, ‌నరసింహాపూర్‌, ‌బెతుల్‌, ‌చింద్‌వాడా జిల్లాలు), జబల్‌పూర్‌ (‌జబల్‌పూర్‌, ‌సాగర్‌, ‌దామోహ, సియోని, మాండ్లా జిల్లాలు), ఛత్తీస్‌ఘడ్‌ (‌రాయ్‌పూర్‌, ‌బిలాస్‌పూర్‌, ‌దుర్గ్ ‌జిల్లాలు) ఉండేవి. బేరార్‌ (ఇప్పటి విదర్భ) విభాగంలో అమరావతి, యవత్‌మాల్‌, అకోలా, బుల్దానా జిల్లాలు ఉండేవి. ఈ ప్రాంతాలతోపాటు మధ్యపరగణాలలో (సెంట్రల్‌ ‌ప్రావిన్స్) ఉప్పు ‌కర్మాగారాలు గాని, సముద్రతీరం గాని లేవు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా ఏప్రిల్‌ 13, 1930 ‌నాడు ఉప్పును తొలిసారి రెండు గ్రామాలలోని ఉప్పు బావులనుండి తీసారు. అవి దహిహందా (అకోలా), భామోద్‌ (అమరావతి జిల్లా). బేరార్‌లో ఈ సత్యాగ్రహం 13 మే 1930 దాకా కొనసాగింది. (KK Chaudhary, ed.Source Material for a History of Freedom Movement, Civil Disobidience Movement, April-September 1930, vol XI, Gazetteers Department, Government of Maharashtra, Bombay, 1990, pp. 873, 921). ఉప్పును తయారుచేయడానికి ఉన్న ఈ ఇబ్బందులను అధిగమించడానికి మధ్య పరగణాలు, బేరార్‌లలో కఠిన చట్టాలను లక్ష్యంగా చేసుకున్నారు ఆందోళనకారులు.

భారత అటవీ చట్టం-1927, బేరార్‌ ‌రైతుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించేది. ఈ చట్టం రాక ముందు కలప, అటవీ సంపద, పశుగ్రాసం మీద ఎలాంటి పన్ను ఉండేది కాదు. ఎలాంటి నిర్భంధాలు ఉండేవి కావు. అడవుల రక్షణ, విస్తీర్ణం పెంపు సాకుతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. దీనితో పరిస్థితులు మారాయి. రైతుల సంక్షేమం చూడాల్సిన ప్రభుత్వం తన ఖజానాని నింపు కోవడంపై దృష్టి పెట్టింది. గడ్డి కోయడం, పశువులను అడవులకు తోలడం నిషేధించడం వల్ల పశుగ్రాసం కొరత వచ్చి, ధర పెరిగింది. దీనికి తోడు అటవీ అధికారులు తమ అహంకారంతో పరిస్థితిని మరీ ఘోరంగా మార్చారు. ప్రభుత్వానికి చేసిన విన్నపాలు, ప్రాంతీయ కౌన్సిల్‌, ‌బహిరంగ సభల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇక వేరే దారి లేక, బేరార్‌లో శాసనోల్లంఘన ఉద్యమం నిర్వహిస్తున్న, చూస్తున్న వార్‌ ‌కౌన్సిల్‌ ‌నిషేధిత అడవులలో లైసెన్స్ ‌లేకుండా గడ్డిని కోసి ఈ అటవీ చట్టాన్ని ఉల్లంఘించాలని నిర్ణయించింది. సత్యాగ్రహుల మొదటి జట్టుకు పూసద్‌లో (యావత్‌మాల్‌ ‌జిల్లా) మాధవ్‌శ్రీ‌హరి, అలియాస్‌ ‌బాపూజీ నాయకత్వం వహించాలని జూలై 10, 1930న నిర్ణయించారు (Chaudhary, p 957).

హింగన్‌ఘాట్‌ ‌దోపిడి

ఈ ఆందోళనల వేళ హెడ్గేవార్‌ ఎక్కడున్నారు? బ్రిటిష్‌ ‌నిఘాలో ఉన్నారు. ఆగష్టు 1908 నుండి మొదలు, 1925లో సంఘాన్ని ప్రారంభించిన తర్వాత కూడా గూఢచారులు ఆయనను వెంబడించే వారు. 1926వ సంవత్సరం వరకు నాగపూర్‌, ‌వార్దా సంఘ శాఖలు బాగా పనిచేశాయి. ఆ సమయంలో హెడ్గేవార్‌ ‌సహచర ఆందోళనకారులు కొందరు, మధ్యపరగణాలకు చెందినవారు, పంజాబ్‌లో చిక్కుకుపోయారు. వారిని తిరిగి తీసుకువచ్చేందుకు ఒక పథకం రచించారు. హెడ్గేవార్‌ ‌సహచరులు దత్తాత్రేయ దేశ్‌ముఖ్‌, అభద్‌, ‌మోతిరామ్‌ ‌శ్రవణేలు ఈ పథక రచన చేశారు. మనుషులను, ఆయుధాలను తీసుకురావడం వారి లక్ష్యం. దీనిని 1926-27లో ఆచరణలో పెట్టారు. హెడ్గేవార్‌ ‌తిరుగుబాటు సహచరుడు కామ్రేడ్‌ ‌గంగాప్రసాద్‌ ‌పాండే దీని బాధ్యత స్వీకరించారు. ఈ పథకం నిర్వర్తించిన తర్వాత పాండే అనారోగ్యానికి గురై, 1929లో వార్దా వెళ్లాడు. ఆ సమయంలో ఆయన తన ఆత్మరక్షణ కోసం తన వద్ద పెట్టుకున్న పిస్టల్‌ ఆయన మిత్రుని చేతిలోకి వెళ్లింది. 1928లో ప్రభుత్వ ఖజానా పెట్టెను తీసుకువెళుతున్న రైలు మీద హింగన్‌ఘాట్‌ (‌వార్దా జిల్లా) స్టేషన్‌ ‌వద్ద దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. అప్పటి దినపత్రికలు ఈ రాజకీయ దోపిడీ ప్రయత్నంలో పిస్టల్‌ ఉపయోగించారని కథనాలు రాశాయి. పాండేకు ఆ పిస్టల్‌ ‌తనదని తెలుసు. దానిని జాగ్రత్తగా తెప్పించాడు. పోలీసు దర్యాప్తు వార్దాలో ఉన్న పాండే వద్దకు దారితీస్తుందని గ్రహించి హెడ్గేవార్‌, ఆయన కుడి భుజమైన హరికృష్ణ అలియాస్‌ అప్పాజి జోషి (Central Provinces Congress Committee Secretary Member of all India Congress Committee, Wardha District Sangachalak) రాత్రికి రాత్రే పాండే నివసిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కాచుకొని కూర్చున్న గూఢచారిని చితకబాది, జారుకున్నారు. అప్పటినుండి హెడ్గేవార్‌, అప్పాజీ జోషిలు కఠినమైన నిఘాలో ఉండేవారు. వారి నివాసాలే కాదు, సంఘ శాఖలలో, బయటకు కూడా వారి కదలికలు, కార్యక్రమాలపై గట్టి నిఘా ఉండేది. వారిని కలవడానికి ప్రజలు భయపడేవారు.

1930 మొదట్లో డీఎస్‌పీ అప్పాజీని పిలిపిం చాడు. ‘‘మీరు కాంగ్రెస్‌లో ఉన్నా కూడా సత్యా గ్రహంలో పాల్గొనలేదు. కాని శాఖకు వెళ్తారు. మీరు యువకులు. మీకు రాడికల్‌ ‌భావాలు ఉన్నాయి. హెడ్గేవార్‌ ‌నాయకత్వం తిరుగుబాటు పద్ధతి (Revolutionary)కి సంబంధించినది. మీరు సత్యాగ్రహంలో పాల్గొనట్లేదు కాబట్టి మీరు అహింసా పద్ధతిని నమ్మరని ప్రభుత్వం ఎందుకు సందేహించ కూడదూ? మీ దగ్గర ఆయుధ సామాగ్రి ఉందని మా దగ్గర సమాచారం ఉంది’’ అని చెప్పారు.

‘‘మీరు చెప్పేది నిజమైతే, మాపై నిఘా పెట్టడం ద్వారా వాటిని కనుగొనగలమని అనుకుంటున్నారా? మీ నాటకం ఆపండి’’ అన్నారు అప్పాజీ. ఆయన చెప్పిన మాటల వల్ల కావలసిన మార్పు వచ్చింది. హెడ్గేవార్‌, అప్పాజీ మీద ఉన్న నిఘా తగ్గింది. హింగన్‌ఘాట్‌ ‌రాజకీయ దోపిడికి సంబంధించిన కేసు పూర్తి అయి, అనుమానితులకు శిక్ష పడింది. హెడ్గేవార్‌ ఇక విప్లవకారుడు (Revolutionary) కాదు అని ప్రభుత్వానికి చూపించే అవసరం ఏర్పడింది. అప్పాజీ కూడా ఈ ఘట్టానికి ముగింపు పలకాలని అనుకున్నాడు.

ఫిబ్రవరి 1930న హెడ్గేవార్‌కు రాసిన ఉత్తరంలో తాను బాగా ఆలోచించి సత్యాగ్రహంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు అప్పాజీ తెలిపారు. దానికి హెడ్గేవార్‌ ‌బదులిస్తూ, తాను సంఘ ట్రైనింగ్‌ ‌క్యాంప్‌ ‌తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. క్యాంప్‌ ‌తర్వాత అప్పాజీ మళ్లీ హెడ్గేవార్‌కు ఉత్తరం రాశారు. కొన్ని కారణాల వల్ల హెడ్గేవార్‌ ‌వెంటనే బదులు ఇవ్వలేదు. కానీ అప్పాజీ మరోసారి రాయడంతో హెడ్గేవార్‌ ‌తన సుముఖతను వెల్లడించారు. వారిద్దరు కలుసుకొని చివరికి సత్యాగ్రహంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. (Sangh archives, Hedgewar papers, Nana Palkar/Hedgewar Notes 55_84-91; as narrated by Appaji Joshi to Hedgewar’s biographer Narayan Hari alias Nana Palkarకి చెప్పిన విషయం).

About Author

By editor

Twitter
Instagram