‘మా బడికి వచ్చి వాళ్లు అలా ఎందుకు చేశారు?’ ఇది అమెరికాలోని రాబ్‌ ఎలిమెంటరీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలిక తన అత్తయ్య లోరెనా అగస్టేను అడిగిన ప్రశ్న. ఆ దేశ చరిత్రలోనే రెండో ఘోరమైన కాల్పుల దుర్ఘటన రాబ్‌ ఎలిమెంటరీలో మే 25వ తేదీన జరిగింది. ఆ ఘటన నుంచి క్షేమంగా బయటపడి, ఆ రాత్రే తన అత్తయ్యను అడిగింది ఆ బాలిక. మొత్తం 21 మందిని పొట్టన పెట్టుకున్న అత్యంత ఉన్మాద చర్య అది. నిజానికి ఆ ప్రశ్న ఆ బాలిక అమెరికా పాలకులను అడగాలి. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయడం కంటే ఆయుధాల వ్యాపారమే ముఖ్యమనీ, మనిషి ప్రాణం కంటే మానవహక్కులే ప్రధానమని అనుకుంటున్న నేతలను అడగాలి. ప్రపంచంలో ఏ చిన్న దుర్ఘటన జరిగినా (ముఖ్యంగా భారత్‌లో) ఆ దేశాలకు పుట్టగతులు లేకుండా చేయాలను కునే ‘వాషింగ్టన్‌ ‌పోస్ట్’, ‘‌న్యూయార్క్ ‌టైమ్స్’ ‌వంటి పత్రికల అంధత్వం గురించి నిలదీయాలి. మే 29న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌రాబ్‌ ఎలిమెంటరీని సందర్శించి మృతులకు నివాళి ఘటించారు. ఈ కాల్పుల ఘటనను అమెరికా  తీవ్ర విషాద ఘటనగా పరిగణించి జాతీయ పతాకాన్ని అవనతం చేయించింది.

టెక్సాస్‌లోని ఉవాల్డే పట్టణంలో ఆ ఘోరం జరిగింది. సాల్వడార్‌ ‌రామోస్‌ అనే 18 ఏళ్ల కుర్రాడు సాయుధుడై వచ్చి ఒక తరగతి గదిలో దూరి, తలుపులు బిగించి నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. 19 మంది చిన్నారులు చనిపోయారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులను కూడా పొట్టన పెట్టుకున్నాడు. బులెట్‌ ‌ప్రూఫ్‌ ‌జాకెట్‌తో, ఏఆర్‌ ‌సెమీ ఆటోమేటిక్‌ ‌రైఫిల్‌, ‌మరో హ్యాండ్‌ ‌గన్‌, ‌భారీ సంఖ్యలో బుల్లెట్లతో వచ్చినప్పటికీ అతడిని ఎవరూ అడ్డుకోకపోవడం విశేషం. ఈ విషయాన్ని పోలీసులే ధ్రువీకరించారు. చిత్రం ఏమిటంటే తెలుగు సినిమా పోలీసుల మీద ఉన్న ఆరోపణను అమెరికా పోలీసులు అమలు చేసి చూపించారు. పాఠశాలలో కలకలాన్ని రోడ్డు మీద నుంచే గమనించిన ఒక మహిళ తనకు కనిపించిన ఒక పోలీసును లోపలికి వెళ్లమని తొందరపెట్టింది. అతడు పోలేదు. చనిపోయిన విద్యార్థులంతా ఐదు నుంచి పదేళ్ల వయసు వారే. ఆ పాఠశాలలో మొత్తం 540 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. దుండగుడు ప్రవేశించిన ఆ తరగతి గదిలో 30 మంది ఉన్నారు. అదృష్టవశాత్తు కొందరు గాయాలతో బయటపడ్డారు.

అమెరికా వ్యవస్థనూ, గురవింద గింజ న్యాయా నికి ఏ మాత్రం తీసిపోని అక్కడి పత్రికలనూ ప్రశ్నించే ముందు భారతీయులు కూడా తమను తాము ప్రశ్నించుకోవాలి. అమెరికా! ఓ అమెరికా అంటూ పలవరించేవారు ఇలాంటి సంస్కృతినేనా భారత దేశానికి దిగుమతి చేయాలని అనుకుంటున్నారు? అమెరికా వెళ్లి చదువుకోవడం, ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించడం ఇవేమీ తప్పు కావు. కానీ అక్కడ సంస్కృతిని తమ వెంట తీసుకురావాలను కునే వారి పట్ల అప్రమత్తంగా ఉండవలసిందే. రెండు మూడేళ్లు మాత్రమే అమెరికాలో ఉండి వచ్చినవారు మొదలు, రెండుదశాబ్దాలు ఉండి అడపా దడపా వచ్చిన వారు కూడా ఆ సంస్కృతిని నెమ్మది నెమ్మదిగా భారతదేశానికి అంటిస్తున్నారు. అమెరికాలో కానరాని ప్రశాంతత, పెచ్చరిల్లిన వివక్ష, తుపాకీ సంస్కృతి కారణంగా చాలామంది పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారని ఇటీవలనే వార్తలు వెల్లువెత్తాయి. సామాన్య పౌరుడి ప్రాణానికి భరోసా లేని దేశం ఇప్పటికీ గొప్పదే అని అందామా?

ఈ సంవత్సరం సగం కూడా పూర్తి కాకుండానే ఇంతవరకు అమెరికా పాఠశాలల్లో 27 కాల్పుల ఘటనలు నమోదు కావడం ఎవరినైనా కలవరపెడ తాయి. ఇక దేశంలో సామూహిక కాల్పుల ఘటనలు ఈ ఏడాదిలో ఇంతవరకు 212 జరిగాయని గన్‌ ‌వయోలెన్స్ ఆర్కైవ్స్ అనే సంస్థ వెల్లడించింది. అంటే రోజుకు సగటున ఒకటి కంటే ఎక్కువే జరుగుతు న్నాయి. ఈ తుపాకీ సంస్కృతి ఇంతగా వెర్రితలలు వేసిన తరువాత గాని అమెరికా పాలకులకి ఈ సమస్యలోని అమానుషత్వం తకెక్కలేదు. ఇప్పటికీ కొందరికి తలకెక్కడం లేదు.

 జపాన్‌లో జరిగిన క్వాడ్‌ ‌సదస్సులో పాల్గొని తిరిగి వస్తుండగా విమానంలోనే అధ్యక్షుడు బైడెన్‌కు ఈ దుర్ఘటన గురించి తెలిసింది. గగనతలం నుంచే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అధ్యక్ష భవనంలో ప్రవేశించాక, భార్యతో కలసి మరొకసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అప్పుడే ఆయుధ లాబీలకి ముకుతాడు వేస్తానని ఓ మాట అన్నారు. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటూ తనకు ఎన్నో విన్నపాలు వచ్చిన సంగతిని ఆయన గుర్తు చేసు కున్నారు. నిజానికి క్వాడ్‌ ‌సమావేశం కోసం బైడెన్‌ ‌బయలుదేతున్న సమయంలోనే న్యూయార్క్‌లో పదిమంది నల్లజాతీయులను కాల్చి చంపిన దుర్ఘటన చోటుచేసుకుంది. మిగిలిన దేశాలలో అత్యంత అరుదైన ఇలాంటి ఘటనలు అమెరికాలోనే ఎందుకు విరివిగా జరుగుతున్నాయని ఆయన ఆత్మశోధనకు కూడా దిగారు.

రామోస్‌ ఇలా రక్తపిపాసిగా మారడానికి అమెరికా వ్యవస్థ వినిపిస్తున్న కారణాలు భయపెట్టేవి గానే కాదు, నమ్మడం కష్టమనిపించేలా ఉన్నాయి. నత్తితో బాధపడే రామోస్‌ ‌చిన్నతనంలో పాఠశాలలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడని, అదే అంతి మంగా ఇలాంటి కిరాతకానికి పాల్పడేటట్టు చేసిందని చెబుతున్నారు. మొదట అతడు తన నానమ్మను కాల్చబోతున్నాను అని ట్వీట్‌ ‌చేశాడు. తరువాత ఇప్పుడు పాఠశాలకు బయలుదేరాను అని కూడా సందేశం పెట్టాడు. వీటన్నిటికంటే ముందు లాస్‌ ఏం‌జెలెస్‌కు చెందిన ఒక యువతికి ‘ఇంకాసేపట్లో నేను’ అంటూ సగం సందేశం పంపాడు. 11.30 ప్రాంతంలో ఆ ఘోరం జరిగిపోయింది. హంతకుడు రామోస్‌ను సరిహద్దు గస్తీ బృందం కాల్చి చంపింది.

కానీ ఈ ఉదంతంలో పోలీసుల వైఫల్యమే చాలా ఎక్కువ అని జేవియర్‌ ‌కెజారెస్‌ ఆరోపిస్తున్నారు. పోలీసులు చురుకుగా వ్యవహరించలేదని ఆయన చెప్పారు. లోపల కలకలం రేగినా పోలీసులు బయటే గుమిగూడి ఉండిపోయారని అంటున్నారు. ఈయన కుమార్తె జాక్లిన్‌ ‌కెజారెస్‌ ఆ ‌పాఠశాలలోనే నాలుగో తరగతి చదువుతోంది. దురదృష్టవశాత్తు ఆ బాలిక కాల్పులలో చనిపోయింది. మనమే లోపలికి వెళదాం ఈ పోలీసులు ఏమీ చేయలేరు అని జేవియర్‌ అక్కడకు వచ్చిన వారిని ప్రేరేపించారు కూడా. ఇంతకీ రామోస్‌ ‌తరగతి గది నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఇద్దరిని కాల్చాడు, అప్పుడు మాత్రమే పోలీసులు ఎదురు కాల్పులకు దిగారని ఒక కథనం.

అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ‌ఘటన పట్ల కదిలిపోయి నట్టు కనిపించినా, మళ్లీ తుపాకీ సంస్కృతిని అరికట్టడం మీద తాజాగా వాదోపవాదాలు మొదలైనా ఆచరణలో గట్టి కార్యాచరణకు అవకాశం దాదాపు లేదనే విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు సంబం ధించి కీలకమైన సంస్కరణ ఏదీ తీసుకువచ్చే అవకాశం కూడా లేదని అంటున్నారు. అమెరికా సామాజిక వాతావరణం కూడా అందుకు తగినట్టే ఉంది. అక్కడి చాలా ప్రాంతాలలో తుపాకీ కలిగి ఉండడం సర్వసాధారణమైంది. నిత్య జీవితంలో తుపాకీ ఒక భాగమైందని చెప్పినా అతిశయోక్తి అనలేం. తుపాకీతోనే తమ స్వాతంత్య్రంతోపాటు, ఆస్తులకు కూడా రక్షణ సాధ్యమవుతుందని ఇప్పుడు చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. అసలు ఆయు ధంతో రక్షణ పొందవచ్చునంటూ రాజ్యాంగంలోని రెండో సవరణ అవకాశం కల్పించింది. కానీ ఎప్పుడు తుపాకీల మీద నియంత్రణ ఉండాలన్న అభిప్రాయం వెల్లువెత్తినా ఇదే రాజ్యాంగ సవరణను చూపించి రిపబ్లికన్లు ప్రభుత్వం నోరు నొక్కుతున్నారు. ఇలాంటి కాల్పుల ఘటనకు పాల్పడినవారిలో అత్యధికులు ఏదో మానసిక వ్యాధితో బాధపడేవారేనని, వారికి వైద్యం చేయించాలి తప్ప, తుపాకీ కలిగి ఉండే హక్కును హరించడం సరికాదని ఆ సంస్కృతి సమర్థకులు వాదిస్తున్నారు. 250 ఏళ్ల క్రితం జరిగిన ఆ రాజ్యాంగ సవరణను 2022లో కూడా గౌరవించ వలసిన అవసరం ఏమిటన్నదే ఇప్పుడు అక్కడ చాలామంది వేసే ప్రశ్న. తుపాకీతోనే హక్కులకు రక్షణ ఉంటుందన్న అనాగరిక, మధ్యయుగ భావన అగ్రరాజ్యంలో తిష్ట వేయడం నిజంగా వింతే.

స్వాతంత్య్రం, నిన్ను నీవు రక్షించుకోవడం అనేవి అక్కడ ప్రాథమిక హక్కులు. ఇప్పుడు ఈ రెండింటి సాధనను దేశ మౌలిక విలువగా పరిగణిస్తున్నారు. తుపాకులు కలిగి ఉండడానికి పౌరులకున్న హక్కు గురించి నేషనల్‌ ‌రైఫిల్స్ అసోసియేషన్‌ ‌గట్టిగా సమర్ధిస్తున్నది. భావ ప్రకటనా స్వేచ్ఛ మాదిరిగానే తుపాకీని కలిగి ఉండడం ప్రాథమిక హక్కుగానే అక్కడ భావిస్తున్నారు. అమెరికా సమాజంలో మితి మీరిన వ్యక్తి స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఆయుధం కలిగి ఉండడం తమ హక్కేనని 74 శాతం అమెరికన్లు నమ్ముతున్నారు. వ్యక్తిగత భద్రత కోసం తుపాకీ ఉండి తీరాలని 24 శాతం మంది చెబుతున్నారు. ఈ అభిప్రాయాలకు తగ్గట్టే వ్యక్తిగత ఆయుధాలు కలిగి ఉన్న ప్రజలు అత్యధికంగా ఉన్న దేశంగా ప్రపంచం లోనే అమెరికా నిలుస్తున్నది. 2020 ప్రకారం అమెరికా జనాభా 33 కోట్లు. వారి వద్ద ఉన్న వ్యక్తిగత ఆయుధాలు 40 కోట్లు.

 చిత్రం ఏమిటంటే 2012లో శాండీ హుక్‌ ‌ప్రైమరీ పాఠశాలలో జరిగిన రక్తపాతం(పాఠశాలలో జరిగిన కాల్పులకు సంబంధించి అమెరికాలో దీనినే మొదటిదిగా చెబుతారు) కూడా తుపాకీ కలిగి ఉండడం ప్రాథమిక హక్కు అన్న అభిప్రాయం నుంచి అమెరికన్లను బయటకు తేలేకపోయింది. ఆ పాఠశాలలో దుండగులు జరిపిన కాల్పులలో ఆరు గురు పెద్దలు సహా 20మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తుపాకీ సంస్కృతి, దానిలోని అమానవీయతల మీద అప్పుడు దేశం కొంచెం లోతు గానే ఆలోచించింది. మాజీ అధ్యక్షుడు, డెమాక్రటిక్‌ ‌పార్టీ నాయకుడు బరాక్‌ ఒబామా ఈ దిశగా కొంత ప్రయత్నం చేశారు. కొన్ని రకాల తుపాకులను నిషేధించాలని ఆయన భావించారు. దీనికి ప్రత్యర్థి రిపబ్లికన్‌ ‌పార్టీలోని కొందరు సభ్యుల నుంచి కూడా మద్దతు వచ్చింది. అయినా కార్య రూపం దాల్చలేదు. చట్టం తేవడానికి కాంగ్రెస్‌లో బలం చాలలేదు. డెమాక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఈ అంశం మీద ఉన్న విరుద్ధ అభిప్రాయాలు చాలా బలమైనవి.

ఒక్క టెక్సాస్‌ ‌రాష్ట్రంలోనే ఈ తుపాకీ సంస్కృతి ఎంత విచ్చల విడిగా ఉన్నదో చెప్పే కొన్ని దారుణ మైన ఉదంతాలు ఉన్నాయి. బ్లాక్‌ ‌లైవ్స్ ‌మేటర్‌ ఉదంతం దరిమిలా డల్లాస్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు పోలీసుల మీద కాల్పులు జరిపాడు. ఐదుగురు చనిపోయారు. మరో తొమ్మిదిమంది పోలీసులు గాయపడ్డారు. 2017 నవంబర్‌లో సదర్‌ల్యాండ్‌ ‌స్ప్రింగ్స్ ‌దగ్గరి ఫస్ట్ ‌బాప్టిస్ట్ ‌చర్చ్ ‌దగ్గర 26 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. 26 మంది చనిపోయారు. అతడి మీద స్థానికుడు ఒకరు కాల్పులు ప్రారంభించడంతో పరారయ్యాడు. తరువాత తనకు తాను కాల్చుకున్నాడు. 2018 మే హ్యూస్టన్‌లోని శాంటా ఫె ఉన్నత పాఠశాలలో 17 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. 8 మంది చనిపోయారు. 2019 ఆగస్ట్‌లో 21 ఏళ్ల యువకుడు డల్లాస్‌ ‌దగ్గర వాల్‌మార్ట్‌లో కాల్పులు జరిపి 23 మందిని బలిగొన్నాడు. ఆ తరువాత మిడ్‌ల్యాండ్‌లో 36 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపితే ఏడుగురు కూలిపోయారు.

 శాండీ హుక్‌ ‌దుర్ఘటన తరువాత 14 రాష్ట్రాలు తుపాకీ హక్కు మీద నిబంధనలను కఠినతరం చేశాయి. అవన్నీ డెమాక్రటిక్‌ ‌పార్టీ అధికారంలో ఉన్నవే. ఎంత దారుణమంటే అమెరికాలో పిల్లలు, యువతరం మరణించడానికి వెనుక ఉన్న కారణా లలో తుపాకీదే ప్రథమ స్థానం. 2020 నుంచి పరిశీలిస్తే తుపాకీ కాల్పుల ఘటనల కారణంగా 18 ఏళ్ల వయసు యువకులు 4,300 మంది చని పోయారు. ఇదే సమయంలో 50 మంది అమెరికా పోలీసులు మరణించారు. రాను రాను తుపాకీతో సాగుతున్న హింస పట్ల చాలామంది తీవ్రంగా స్పందించడం మొదలయింది. తుపాకీ సంస్కృతిని నివారించే సాహసం లేకున్నా, కనీసం తుపాకీ ఉపయోగించుకోవడానికి నిబంధనలను క్రమబద్ధం చేయాలన్న డిమాండ్‌ ‌కూడా వచ్చింది. తమ ప్రాణాలు కాపాడుకునే హక్కు పేరుతో తుపాకీ సంస్కృతి పెరుగుతున్నది. మరి పాఠశాలకు వెళ్లి చదువుకోవడానికి బాలలకు ఉన్న హక్కు మాటేమిటని ఇప్పుడు చాలామంది నిలదీస్తున్నారు.

మనిషి ప్రాణం కంటే మానవహక్కుకే తొలి ప్రాధాన్యం ఇచ్చే ఒక యాంత్రిక సంస్కృతి అమెరి కాలో ప్రబలిన మాట సుస్పష్టం. దీనిని భారత్‌లోకి రాకుండా చూసుకోవడమే ప్రథమ కర్తవ్యం. ఇందుకు కారణాలలో ఒకటిగా కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోవడమేనని రాబ్‌ ‌పాఠశాల కాల్పుల తరువాత మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ‌చెప్పడం విశేషం. దీనిని అంతా గమనించాలి. శాంతియుత జీవనం గొప్పత నాన్ని మన సంస్కృతికి అందించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారి బాటలో నడవాలి.

– జాగృతి డెస్క్

By editor

Twitter
Instagram