‌పచ్చని కశ్మీర్‌లో చిచ్చు పెట్టేందుకు దాయాది దేశం పాకిస్తాన్‌ ‌శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. పాకిస్తాన్‌ ‌తన నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ఇం‌టర్‌ ‌సర్వీస్‌ ఇం‌టలిజెన్స్) ‌ద్వారా భూలోక స్వర్గమైన కశ్మీర్‌లో అల్లర్లకు పాల్పడుతోంది. అల్‌ ‌ఖైదా తదితర ఉగ్రవాద సంస్థలకు అన్నివిధాలా అండగా నిలిచి కశ్మీర్‌లో రంగంలోకి దించుతోంది. పాకిస్తాన్‌లో నాయకత్వ మార్పు జరిగినా దాని బుద్ధి మారలేదు. నిన్న మొన్నటి దాకా ఇస్లామాబాద్‌ అధికార పీఠంపై కూర్చొన్న ఇమ్రాన్‌ఖాన్‌ ‌తరహాలోనే కొత్త అధినేత షెహబజ్‌ ‌షరీఫ్‌ ‌పైకి శాంతి వచనాలు పలుకుతూ తెరవెనక కుట్రలతో కశ్మీర్‌లో అశాంతికి కారణమవుతున్నారు. ఫలితంగానే గత కొంతకాలంగా కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు మొదల య్యాయి. కశ్మీరీ పండిట్లపై కాల్పుల మోత మోగుతోంది. కేవలం హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు దమనకాండకు దిగుతున్నారు. అమాయక పౌరులను తూటాలకు బలి చేస్తున్నారు.

ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. కశ్మీరీ పండిట్లను కాపాడుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిన బూనారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా జమ్ముకశ్మీర్‌ ‌గవర్నర్‌ ‌మనోజ్‌ ‌సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌ధోబాల్‌, ‘‌రా’ (రీసెర్చ్ అం‌డ్‌ అనాలసిస్‌ ‌వింగ్‌) ‌కార్యదర్శి సమంత్‌ ‌గోయల్‌, ఇం‌టలిజెన్స్ ‌బ్యూరో ప్రత్యేక సంచాలకుడు ఏఎస్‌ ‌రాజన్‌, ‌రాష్ట్ర డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీసు (డీజీపీ) దిల్‌బాగ్‌ ‌సింగ్‌ ‌తదితరులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఉక్కు పాదంతో అణచివేయాలని సూచించారు. పండిట్లను కాపాడుకోవాలని సూచించారు. అమాయక కశ్మీరీ పండిట్ల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. వారి భద్రతకు ప్రభుత్వం పూచీ వహిస్తుందని తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టిందని ఈ సందర్భంగా అమిత్‌ ‌షా గుర్తు చేశారు.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అవాంఛనీయ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నా యనడంలో సందేహం లేదు. పండిట్ల వరుస హత్యలు వారిని భయభ్రాంతులను చేస్తున్నాయి. గట్టి నిఘా, పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ ఉగ్రవాదులు రెచ్చి పోతున్నారు. అమాయక ప్రజలను తూటాలకు బలిచేస్తున్నారు. వీటన్నింటికీ తెరవెనక సూత్రధారి దాయాది దేశమన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు ఒక బ్యాంకు ఉద్యోగిని కాల్చిచంపారు. మే నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటిదాకా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్ర మూకలు జరిపిన హత్యాకాండలో ఇది ఎనిమిదోది. మృతుల్లో ముగ్గురు విధుల్లో లేని పోలీసులు కాగా అయిదుగురు స్థానికులు ఉన్నారు. దక్షిణ కశ్మీరులోని ఇలాఖీ దేహతీ బ్యాంకు మోహనపుర శాఖ మేనేజరు విజయ్‌కుమార్‌ ‌విధుల్లో ఉండగా దుండగుడు దారుణానికి తెగబడ్డాడు. బ్యాంకు ఆవరణలోకి చొరబడిన ఉగ్రవాది అతి సమీపంలో నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటన సీసీ టీవీల్లో రికార్డయింది. దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్‌ ‌కుమార్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. రాజస్తాన్‌లోని హనుమాన్‌ ‌ఘడ్‌ ‌విజయ్‌కుమార్‌ ‌స్వస్థలం. వారం కిందటే ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు. కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్‌ ‌పాలన యంత్రాంగం, స్టేట్‌ ‌బ్యాంకు ఆఫ్‌ ఇం‌డియా సంయుక్త అజమాయిషీలో ఈ బ్యాంకు పనిచేస్తుంది. అనంతనాగ్‌ ‌జిల్లాలోని కోకర్‌నాగ్‌ ‌శాఖ నుంచి విజయ్‌కుమార్‌ ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయనకు గత ఫిబ్రవరిలోనే వివాహమైంది.

మే 31న సాంబ జిల్లాలో రజనీ బాల అనే టీచరును ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. మే 12న బడ్గాం జిల్లాలో రాహుల్‌ ‌భట్‌ అనే ఉద్యోగిని కాల్చిచంపారు. అంతకుముందు శోపియాన్‌ ‌జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు జవాన్లను ఆస్పత్రికి తరలించగా వారు కోలుకుంటున్నారు. ఇది గ్రనేడ్‌ ‌దాడా లేక బ్యాటరీ పేలిందా? అనే విషయమై ఆరా తీస్తున్నట్లు కశ్మీర్‌ ‌జోన్‌ ఇన్స్పెక్టర్‌ ‌జనరల్‌ ‌విజయ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు.

విపక్షాల రాజకీయం

సహజంగా ఈ ఘటనను రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఖండిస్తారు. కానీ వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్‌ ‌వంకర బుద్ధితో మాట్లాడింది. దీనిని శాంతిసాధనలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన రాజస్తాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లౌత్‌ ‌పేర్కొనడం ఆయన అల్పబుద్ధిని చాటుతోంది. ఇది కేవలం కేంద్రంపై విమర్శ కాదు. కశ్మీరులో శాంతిభద్రతలు కాపాడేం దుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్లను కించపరచడమే అవుతుంది. అమాయక పౌరుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌ముఖ్య అధికార ప్రతినిధి రవీందర్‌ ‌శర్మ డిమాండ్‌ ‌చేయడం విస్తు గొల్పుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షిం చేందుకు కేంద్రం అక్కడ పెద్దఎత్తున బలగాలను మోహరించింది. రాష్ట్ర పోలీసులతో పాటు పారా మిలటరీ దళాలు కూడా కశ్మీర్‌లో పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు పౌరుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరడంలో అర్థం లేదు. కాంగ్రెస్‌ ‌నాయకుడి ప్రకటన ఏదో యథా లాపంగా, మొక్కుబడిగా చేసిన ప్రకటనలా కనపడు తోంది. నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా, ఆయన తనయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ (పీపుల్స్ ‌డెమొక్రటిక్‌ ‌ఫ్రంట్‌) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈ ఘటనను ఖండిం చారు. నిజం చెప్పాలంటే వీరి ఖండన మొక్కుబడి చర్య. పరోక్షంగా పాకిస్తాన్‌కు, ఉగ్రవాద సంస్థలకు వీరు మద్దతుగా మాట్లాడుతుంటారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని కోరుతుంటారు. అసలు మన దేశంలో అంతర్భాగమైన కశ్మీరుపై ఇంకో దేశంతో చర్చలు జరపాల్సిన అవసరమేమిటో ఎంత ఆలో చించినా ఎవరికీ బోధపడదు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు పోలీసులను విమర్శించడంలో చూపిన దూకుడు ఉగ్రవాదులపై వీరు చూపరు. దానిని తేలిగ్గా తీసుకుంటారు. ఉదాసీనంగా వ్యవహరిస్తారు. పైగా తప్పంతా పోలీసులదేనని తేల్చి చెబుతుంటారు. అందువల్ల కశ్మీరులో అశాంతికి కొంతవరకు వీరే కారణమన్న విమర్శలను తోసిపుచ్చడం కష్టం. ఉగ్రమూకల దాడులను కశ్మీరు లోయలో శాంతి పునరుద్ధరణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకు పాక్‌ ‌పన్నిన కుట్రగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రవీందర్‌ ‌రైనా వ్యాఖ్యానించారు. పండిట్ల హత్యలను అడ్డుకోవాలంటూ అవామీ ఆవాజ్‌ ‌పార్టీ కార్యకర్తలు రాజధాని శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ ‌వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. పండిట్లకు పటిష్ట భద్రత కల్పించాలని ‘పనున్‌ ‌కశ్మీర్‌’ ‌సంస్థ ఛైర్మన్‌ అజయ్‌ ‌చ్రుంగూ, ‘ఏక్‌ ‌జుట్‌’ ‌పార్టీ అధ్యక్షుడు, సీనియర్‌ ‌న్యాయవాది అంకుర్‌ ‌శర్మ వేర్వేరు ప్రకటనల్లో కోరారు. ఇందుకు భిన్నంగా కశ్మీరీల ప్రధాన స్రవంతి పార్టీలైన పీడీపీ, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ఎప్పుడూ కేంద్ర వ్యతిరేక ధోరణిని ప్రదర్శించడం గమనార్హం.

కశ్మీరులో చిచ్చుకు ఉగ్రవాద సంస్థలే కారణ మన్నది బహిరంగ రహస్యం. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఈ విషయం తేటతెల్లం చేస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ ‌ఖైదా అమాయక యువతను తమ సంస్థలో చేర్చుకుని వారికి శిక్షణ ఇస్తున్నట్లు ఐరాస తాజా నివేదిక హెచ్చరించింది. అల్‌ ‌ఖైదా ముఠాలో దాదాపు 400 మంది సభ్యులుగా ఉన్నారు. భారత్‌, ‌పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, ‌మయన్మార్‌ ‌నుంచి వారిని రిక్రూట్‌ ‌చేసుకుంది. వీరికి అఫ్ఘాన్‌లోని హెల్మండ్‌, ‌ఘజ్ని, కాందహార్‌, ‌నిమ్రుజ్‌, ‌జబూల్‌ ‌తదితర ప్రాంతాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు అఫ్ఘాన్‌లో తాలిబన్‌ ‌పెత్తనం నడుస్తున్నందున వారికి ఎదురులేకుండా పోయింది. ఒక్క అల్‌ ‌ఖైదానే కాకుండా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ ‌వంటి ఉగ్రవాద సంస్థలకూ అడ్డే లేకుండా పోయింది. వీటికి వనరులు పుష్కలంగా అందుతున్నాయి. దీంతో అవి కశ్మీరులో చిచ్చు పెట్టేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. అల్‌ ‌ఖైదా అగ్రనేత జవహరి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉంటున్నారు. అమాయక యువతకు ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్నారు. భారత్‌పై అదే పనిగా విద్వేషాన్ని వారి మెదళ్లలో నింపు తున్నారు. ఇతను అఫ్ఘాన్‌ ‌తూర్పు ప్రాంతంలోని జబూల్‌ ‌ప్రావిన్స్‌లో ఉంటున్నట్లు సమాచారం. 2021 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 8 సార్లు వీడియో సందేశాల్లో కనిపించాడు. ఇటీవల కర్ణాటకలో హిజబ్‌ ‌వివాదం తలెత్తినప్పుడు ముస్లిం మహిళలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. ఈ విషయాలను చెప్పింది భారత నిఘా సంస్థలు కాదు. స్వయంగా ఐక్యరాజ్య సమితి ‘విశ్లేషణాత్మక ఆధారం, ఆంక్షల కమిటీ’ తన 13వ నివేదికలో ఆధారసహింతగా ప్రస్తావించింది.

జమ్ముకశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం రద్దును పాకిస్తాన్‌తో పాటు ఉగ్రవాద సంస్థలు జీర్ణించుకోలేకపోతున్నాయి. 2019 ఆగస్టు 5న కేంద్రం ఈ అధికరణను రద్దుచేసిన నాటి నుంచి అవి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. అధికరణ రద్దు అన్నది భారత్‌ అం‌తర్గత విషయమన్న వాస్త వాన్ని విస్మరించి పేట్రేగిపోతున్నాయి. దీంతోపాటు నియోజకవర్గాల పునర్విభజనను జీర్ణించుకోలేక పోతున్నాయి. దాని ఫలితమే ఉగ్రవాదదాడులు. అయినా ఈ తాటాకు చప్పుళ్లకు భారత్‌ ‌బెదరదు. ఉగ్రవాదం పీచమణచేందుకు కృతనిశ్చయంతో ఉంది. ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా కశ్మీరీల మనసు గెలుచుకునేందుకు పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా కశ్మీరును ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు గట్టి సంకల్పంతో ఉంది. వెనకటి ప్రభుత్వాల మాదిరిగా కంటితుడుపు చర్యలతో సరిపెట్టకుండా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఎంతమాత్రం వెనకాడబోదు. ఈ దిశగా ప్రభుత్వానికి బాసటగా నిలబడటం విపక్షాల విహిత కర్తవ్యం.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌,  ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram