‘నిండు నూరేళ్లూ జీవించు’ అంటాం. శత సంవత్సరాలూ ఆరోగ్యభాగ్యంతో ఉండాలని కోరుకుంటాం. చిరాయువుగా నిలవాలని ఆశించడం, ఆశీర్వదించడమూ సహజమే. వీటన్నింటినీ మించిన ఆశలూ ఆశీస్సుల చిరునామా – తిమ్మక్క. స్వచ్ఛమైన ఆమె మనసువంటి తెల్లని జుట్టు. నుదుటిమీద నిండుగా ఎర్రటి బొట్టు. చూడచక్కని దంత సౌభాగ్యం. చూపుల్లో  అదే పదును. నవ్వులో వెల్లివిరిసే ఆత్మవిశ్వాస పటిమ. ఒక్కసారి తనను చూసినా, మాట్లాడినా, మాట్లాడుతున్నప్పుడు విన్నా – మన జన్మ ధన్యమైందని అనిపిస్తుంది. కాదా మరి? తనకిప్పుడు మూడు ఒకట్ల వయసు. అక్షరాలా, అంకెలారా 111 ఏళ్లు. నూట పదకొండు అని రాస్తుంటేనే కలం పులకితమవుతోంది. వయసును జయించిన కథానాయిక ఇదిగో…ఈ మధ్యనే భాగ్యనగరాన ఒక్కసారిగా తళుక్కుమంది.        


పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి తెలుగు నేలకు చేరిన తల్లి తిమ్మక్క మనందరికీ ఏం చెప్పిందో తెలుసుకోవాలని ఉందా? శతాధిక వృద్ధురాలైనా, శారీరక మానసిక శక్తి సంపత్తిలో ఇప్పటికీ అగ్రగామి గానే ఉన్న తన గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియాల్సింది మరెంతో ఉంటుంది.అతి పెద్ద వయస్కురాలైనా, ఆ అవ్వ మనసు మాత్రం చక్కటి మొక్క వంటిది! నాటిన విత్తనం కాలక్రమంలో మొక్కయి, చెట్టయి ఎందరెందరికో నీడ నిస్తుంటే ప్రకృతికి పులకింత. వృక్ష పరిరక్షణలో పర్యావరణ మంతా వెల్లివిరిస్తే అంతటికీ సార్థకత. ఈ అన్నీ నిండిన ధన్య జీవితం కాబట్టే ఆమె మానవ జీవన కావ్య నాయకురాలు. ఆ క్రమం ఏమిటంటే….

పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు. అందరూ చెప్పే మాటే ఇది. ఆకుపచ్చదనమే పురోగతికి సంకేతం. అంతటా వినిపించే నినాదమూ ఇదే. వనం-మనం అంటున్నాం. హరితహారం కోరుకుంటున్నాం. ‘చేతు లారా తీసుకో మొక్క… సరైన చోట నాటు ఎంచక్కా’ అని ఊరూవాడా మోత మోగిస్తున్నాం. అవునవును. చెట్లే మన మౌన నేస్తాలు. వనాలు పెరిగితేనే వానలు కురుస్తాయి. జలమైనా, జీవమైనా అదే. చెట్ల గాలి పీలిస్తేనే మన బతుకుల్లో వెలుగులు. ఆ చెట్లకింద చేరితేనే సేదతీరేది. వాటిని చక్కగా సంరక్షిస్తేనే మానవాళికి మనుగడ. జీవ వైవిధ్యంతోనే మనషుల ఉనికీ మనికీ. నేలపటుత్వాన్ని పెంచాలన్నా, లోపలి సారాన్ని పరిరక్షించుకోవాలన్నా అన్నింటికీ వృక్షాలే. మిగతావారికీ, తిమ్మక్కకీ తేడా-వారు ఆలోచిస్తారు, ఆమె చేస్తారు. ఇతరులు చెప్పేవాటిని తాను చేసి చూపిస్తారు. తన ఇంటిపేరు సాలుమరద. తనలో ఆశయాల వరద. రామనగర ప్రాంతంలోని హులికల్‌ ఆమె గ్రామం. ఊళ్ళోవాళ్ళంతా చెట్లమీద ఆమెకున్న మక్కువ చూసి దానినే ఇంటిపేరుగా మార్చేశారు. పుట్టిన, మెట్టిన ఊళ్ళలోనివారు చెట్టుకు పర్యాయ పదంగా తిమ్మక్కనే చెప్తుంటారు. మొక్కలు నాటాలన్న చిన్నప్పటి ఆసక్తికి పెళ్ళయ్యాక ఆ శక్తి తోడైంది. తొలి నుంచీ ఎందుకు అంత వృక్షాభిమానమంటే ఏమని బదులిస్తారో తెలుసా?‘మొక్కలు, పిల్లలు ఒక్కట నిపిస్తుంది.ఎంతగా పెంచితే అంత బాగా పెరుగుతారు పిల్లలంతా. మొక్కలూ అంతే. వాటిని మనం కాపాడితే, అవీ మనల్ని కాపాడితీరతాయి. మరో మాట..మనలా వాటికీ మాటలుంటాయి. వినే ఓపికా, తీరికా మనకుండాలి కానీ ఆ ప్రతీ మాట తేనెల ఊట. అందుకే నేను మొక్కల్ని చేతితో కాదు, మనసుతో నాటుతాను. మనసు పెట్టి చెట్లను పెంచుతాను. ఇదేదో సేవ అనిపించదు నాకు. నా రోజువారీ బాధ్యతగా చూసుకుంటాను? ’ ఇవిగో ఈ పలుకులే వృక్షాలపాలిట ప్రేమ చినుకుల య్యాయి. భర్త చిక్కయ్య తోడ్పాటు తిమ్మక్కకు అలవాటుగా పరిమళించింది. తిరిగిరాని తీరాలకు ఆయన తరలి వెళ్ళిపోయినా అలవాటునే కొన సాగిస్తూ వస్తోందామె.

ఒక్క మొక్క నాటరాదూ?

వయసుతోపాటు శక్తీ పెరగడం ఆ బామ్మ ప్రత్యేకత. పెద్దావిడ కనుక ‘మీరు’ అని పిలిస్తే నవ్వుతూ వారిస్తుంది. ‘ఈ గౌరవం, అభిమానం చెట్ల మీద చూపండర్రా’ అంటుంది. చూసిన ప్రతివారినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వింటుంది. అన్నీ విన్నాక చివర్లో ‘నువ్వూ ఒక మొక్క నాటుతావా?’ అని అడుగుతుంది. కాదని ఎవరంటారు?ఆ పని చేయకుండా ఎలా ఉంటారు? ఆ విధంగా చూస్తుండగానే చెట్లు పెరిగిపోయాయి. అడవుల పెంపకం కార్యక్రమాలకు దారితీశాయి. హులికల్‌ ‌మొదలు కుడురు దాకా కిలోమీటర్ల మేర రోడ్ల పక్కన చెట్లే చెట్లు. అన్నింటికంటే ఎక్కువ మర్రి వృక్షాలు. శాఖలుగా, ఊడలుగా విస్తరించి ఎంతగానో ఆశ్రయం కల్పిస్తున్నాయి. మర్రిమాను అనగానే ఆంధప్రదేశ్‌లోని కదిరి ప్రాంత ‘తిమ్మమ్మ’ గుర్తుకొస్తుంది. వందల సంవత్సరాలుగా సేవ. తెలంగాణలోని మహబూబ్‌నగర పరిసరాల్లోని ‘పిల్లల మర్రి’ మదిలో మెదులుతుంది. తిమ్మక్క స్వరాష్ట్రంలో ఉన్న కుంబల్‌గోడ్‌ ఊళ్ళో గల భారీ తరువూ తలుపుకొస్తుంది. మనందరికీ తెలిసిందే – మర్రితో ఔషధ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. బెరడు సహా దాని ఆకులు, మొగ్గలు, పాలు, పళ్లు అన్నీ బహుళ ప్రయోజకాలే. అటువంటి చెట్లను పెంచి పోషిస్తూ, తన ప్రాంతంలో అవ్వ చేసిన నిరంతర కృషి బహుదా విస్తరించింది. చుట్టూ ఉండేవి పరిసరాలైతే, వాటి మౌలిక అంశాల సమాహారమే పర్యావరణం. పరిసర పరిశుభ్రత, అందులో భాగంగా కాలుష్య నివార, మంచి గాలితోనే అదంతా సాధ్యమవుతుంది. ప్రాణ సమాన వాయువు వచ్చేది చెట్ల నుంచే, చెట్లతోనే. అంతటి ప్రాణ ప్రదానం చేసినందుకే తిమ్మక్కకు పురస్కారాల పరంపర.

ప్రగతి భవనాన దీపమాలిక

భారత ప్రభుత్వం ఆ క్రియాశీలిని జాతీయస్థాయి పౌర పురస్కారంతో ఘనంగా సత్కరించింది. ‘పద్మశ్రీ’ పురస్కారం మూడేళ్ల క్రితం వరించింది. వృక్షమిత్ర, కర్ణాటక కల్పవల్లి, పంపవతి పర్యావరణ పురస్కృతి ఆమెకే. వీటన్నిటికన్నా మిన్నగా ఆమె పేరున ‘తిమ్మక్కాస్‌ ‌రీసోర్సెస్‌ ‌ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌’ ‌సంస్థ ఏర్పాటైంది. మన దేశంలో కాదు, అమెరికాలో. అక్కడి (లాస్‌ ఏం‌జెలిస్‌, ‌కాలిఫోర్నియా, ఓక్లాండ్‌) ‌పర్యావరణ సంస్థలు మూడింటికీ ఆమె పేరే. పల్లెటూరు మొదలు అగ్ర దేశం వరకు సేవల విస్తరణ. స్వస్థలంలో వర్షపు నీటి నిల్వకు ఒక పెద్ద ట్యాంకు నిర్మాణం జరిగితే ముందుండి పనులు జరిపించింది ఆమె. సుదూర దేశాల్లో జరిగిన, జరుగుతున్న భారీ నిర్మాణ నిర్వహణలకూ దీప్తి ఈ పర్యావరణవేత్తే. ఇంతటి ప్రశస్తిని గమనించిన స్వరాష్ట్రంలోని కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్‌ ‌ప్రదానం ద్వారా తనను తాను సన్మానించుకున్నట్లు అయింది. పెద్ద చదువేమీ లేని చిన్నపాటి కార్మికురాలిగానే తప్ప మరి ఏ ఇతర జీవనాధారమూ కనిపించని ఆమె ఎంతో సమున్నత స్థాయికి చేరినందునే హంపి యూనివర్సిటీ ఏనాడో ప్రత్యేక అవార్డు బహూకరించింది. మహిళా సంక్షేమ శాఖ విశిష్టపురస్కారాన్ని ప్రదానం చేసింది. బెంగళూరు కేంద్రంగా గల ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‌ప్రశంసా పత్రం అందించింది. ఆర్ట్ ఆఫ్‌ ‌లివింగ్‌, ‌ఫౌండేషన్లు తదితర వ్యవస్థలు పెద్ద యెత్తున సన్మానిం చాయి. ‘గ్రీన్‌ ‌ఛాంపియన్‌’ ‌విజేతను చేశాయి. మరీ ప్రధానంగా బ్రిటిష్‌ ‌బ్రాడ్‌కాస్టింగ్‌ ‌కార్పొరేషన్‌ (‌బీబీసీ) వందమంది ప్రభావాత్మక మహిళల్లో ఒకరిగా తిమ్మక్కను ప్రకటించింది. ఇది ఆరేళ్ళనాటిది. నేటికీ పర్యావరణ సంరక్షణే ప్రాణంగా ఉన్న ఆమెను తెలం గాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సాదరంగా ఆహ్వానించారు. అధికారిక ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి తోడ్కొని వెళ్లారు. అక్కడున్న ప్రతీ ఒక్కరికీ ప్రత్యక్షంగా పరిచయంచేసి, గౌరవ సత్కారాలతో కృతజ్ఞత చాటారు.ఆమెను మించిన దేశభక్తురాలు ఇంకెవరుంటారని పలు విధాలుగా కీర్తించారు. ‘తల్లి తిమ్మక్కది మంచి ఆరోగ్యం. మొదటి నుంచి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తోంది. చెట్ల పెంపకం వటి మహోన్నత పనిలో దశాబ్దాలుగా మమేకం కావడమే తన విజయ రహస్యం’ అన్నారాయన. ప్రతిస్పందన ఇంకెంత గొప్పగా ఉందో చెప్పమంటారా? ‘మీరు ఎన్నెన్నో సంరక్షణలు చేస్తున్నారు. మీకు ఇంకా ఏవైనా మొక్కలు కావాలన్నా నేనిస్తా’ అని. అదీ వృక్షమాత నిబద్ధత.

మొక్కలూ పిల్లలూ…

కవి హృదయం పలికినట్లు – పర్యావరణం ఓ వికసిత వదనం, పురివిప్పిన పరవశం, పదిలపరచు కోవాల్సింది మనిషే. చెట్లను పెంచితే క్షేమం, నరికితే క్షామం. మొక్కలనేవి దైవప్రేమకు ప్రతిరూపాలు. వాటిని కాదూకూడదంటే మిగిలేవన్నీ అనర్థాలే. ప్రతి నీటిబిందువూ, ఆత్మబంధువని తెలుసుకుంటేనే ప్రాణికోటికి మనుగడ. మొక్కలుంటేనే వర్షాలు, లేకుంటే సకల కష్టాలు. వీటిని నాదాలకో,నినాదాలకో పరిమితం చేస్తే ఒరిగేదేముంటుంది? రాతల్లోనివి చేతలుగా మారకుంటే ఉపయోగం ఇంకేమిటి? తిమ్మక్క జీవితం మనకు పాఠాలెన్నో నేర్పుతోంది. ఆయువును పెంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుం దని తెలియచెబుతోంది.కూడు, గూడు, గుడ్డ, పాడి, కాడి అన్నీ తానే అయిన వృక్షానికి రక్షకులమవుదాం. ‘కావాలి మన జీవనం పర్యావరణ సహితం; ప్రకృతితో కలగలిసిన జీవితం సర్వప్రాణులకూ హితం’. ఈ సూత్రమే వర్తించేలా చేసినప్పుడు ఆశా శ్వాసా కలకాలం నిలబడతాయి. ప్రకృతి పరిరక్షణ అనేది ‘దారితప్పిన పసివాడికి తల్లి ఒడిలాంటిది /వడగాలి ఉమిసే నోటికి పాలజడి వంటిది / ఆ తేజం విశ్వచరితకు అభినవ భూమిక / ఆ జ్ఞానం నవ్య మానవతకు అఖండ దీపిక’అన్నారు ఆచార్య సి.నారాయణరెడ్డి. అంతటి తేజాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న తిమ్మక్క మీకూ నాకూ అందరికీ ఆదర్శప్రాయం. చెట్ల పెంపకంలో దైవాన్ని, బాల్యాన్ని చూడగలిగిన ఆ వృక్ష మాతది సార్థక చరిత. ధన్యత అంటే నీదేనమ్మా!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram