ప్రపంచంలో రాజకీయంగా భారత్‌ ‌పాత్ర కీలకంగా మారుతోందనడానికి ఇటీవలి పరిణామాలే ఉదాహరణ. ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యం నుంచి ప్రపంచ క్రమంలో శరవేగంగా మారుతున్న పరిణామాలు ‘భారత్‌ను కేంద్రస్థానం’లో నిలబెట్టాయి. అమెరికా, రష్యా, బ్రిటన్‌, ‌జపాన్‌, ‌యూరోపియన్‌ ‌యూనియన్‌, ఆ‌ఫ్రికా దేశాలు, ఇస్లామిక్‌, ‌నార్డిక్‌ ‌దేశాలు (డెన్మార్క్, ‌ఫిన్లాండ్‌, ఐస్‌ల్యాండ్‌, ‌నార్వే, స్వీడన్‌) ‌సమస్య పరిష్కారానికి భారత్‌వైపే చూసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మనదేశాన్ని వ్యతిరేకించే స్థితి ప్రస్తుతం ఏ దేశానికి లేదు.

చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియాలతో పాటు నాటో కూటమి దేశమైన టర్కీపై కూడా ఆంక్షలు విధించిన అమెరికా సహా పాశ్చాత్య దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా ధైర్యంగా వ్యవహరించలేని స్థితి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం భారత్‌ అనుసరిస్తున్న ‘అందరితో స్నేహంగా ఉంటాం.. కానీ ఎవ్వరితోనూ కూటమి కట్టం’ అనే విధానం. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ ఉటంకించే ‘వసుదైక కుటుంబకం’ అనే సనాతన సంప్రదాయాన్ని అనుసరిస్తూ రావడం. విచిత్ర మేమంటే పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధా లను అందిస్తూ, రష్యాతో యుద్ధానికి ఎగదోస్తుంటే, ఈ రెండు దేశాలకు ఆహార పదార్థాలు, నిత్యావస రాలు సరఫరా చేస్తున్న దేశం ఒక్క భారత్‌ ‌మాత్రమే. ఇది మాత్రమే కాదు మనదేశం మధ్యప్రాచ్యానికి, పశ్చిమదేశాలకు మధ్య భౌగోళికంగా కీలకస్థానంలో ఉండటం మరో ముఖ్యాంశం. ముఖ్యంగా ఇండో- పసిఫిక్‌ ‌ప్రాంతంలో మనదేశం ప్రపంచ దేశాలకు అత్యంత కీలకం. ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆగడాలను అడ్డుకోవాలంటే వాటికి భారత్‌ ‌సహాయం చాలా అవసరం. ఈ ప్రాంతంలో వాటి వాణిజ్య, భౌగోళిక ప్రయోజ నాలు చైనా వల్ల దెబ్బతినే పరిస్థితి నెలకొంది. మనదేశ ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఇతర కారణాలు కూడా తమ వంతు పాత్రను పోషించాయి. అందులో ఒకటి రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం.

అట్లాంటిక్‌ ‌నుంచి ఇండో-పసిఫిక్‌కు బదిలీ

ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ‌భూటాన్‌, ‌బ్రూనై, కంబోడియా, ఫిజి, ఇండియా, ఇండొనేసియా, జపాన్‌, ‌లావోస్‌, ‌మలేసియా, మాల్దీవులు, మయ న్మార్‌, ‌నేపాల్‌, ‌న్యూజిలాండ్‌, ‌పపువా న్యూగునియా, ఫిలిప్పైన్స్, ‌సింగపూర్‌, శ్రీ‌లంక, తైవాన్‌, ‌థాయ్‌ ‌లాండ్‌, ‌తిమోర్‌ ‌లెస్తె, యునైటెడ్‌ ‌స్టేట్స్, ‌వియత్నాం.. ఈ దేశాలను ఇండో పసిఫిక్‌ ‌దేశాలంటారు. ఇప్పటివరకు అట్లాంటిక్‌ ‌మహాసముద్రం కేంద్రంగా సాగిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఇండో- పసిఫిక్‌ ‌ప్రాంతానికి బదిలీ అవుతోంది. జి20 దేశాల్లో ముఖ్యమైన ఆరు దేశాలు (ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, ఇండొనేసియా, జపాన్‌, ‌దక్షిణకొరియా) ఇదే ఇండో పసిఫిక్‌ ‌ప్రాంతంలోనే ఉన్నాయి. యూరప్‌, ‌పర్షియన్‌ ‌గల్ఫ్‌లను పసిఫిక్‌ ‌దేశాలకు అనుసంధానించే సముద్ర వాణిజ్య మార్గాలు హిందూ మహాసముద్రం, ఆగ్నేయాసియా దేశాల గుండా వెళుతుండటంతో ఈ ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విధంగా ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడుల్లో ఈ ప్రాంత వాటా పెరుగుతూ రావడం వల్ల ప్రపంచీకరణలో దీని ప్రాధాన్యం అగ్రస్థానానికి చేరుకుంది. భారత్‌, ‌జపాన్‌, ఆ‌స్ట్రేలియాలు ప్రధానంగా ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించడం, ఆసియన్‌ ‌దేశాలు మద్దతిచ్చే ప్రాంతీయ బహుముఖ విధానం వంటివి ఫ్రాన్స్‌తో పాటు యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌దేశాలను కూడా ఇటువైపు దృష్టి మరల్చేవిధంగా చేసింది.

చైనాతో ఇబ్బందులు!

హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాంతీయ శక్తిగా ఉన్న భారత్‌కు ఇప్పుడు చైనాతో ఇబ్బందులు మొదలయ్యాయి. శ్రీలంక, మయన్మార్‌ ‌దేశాల్లో పోర్టులు, రైల్‌ ‌లింక్‌లను ముఖ్యంగా భారత తీరప్రాంత సమీపంలో నిర్మిస్తుండటం ఇబ్బంది కరంగా మారింది. ఈ దేశాలను మౌలికవసతుల కల్పన పేరుతో చైనా అప్పుల ఊబిలోకి దించేస్తోంది. ప్రస్తుతం శ్రీలంక దివాలా పరిస్థితికి చైనా అనుసరించిన ‘ఆర్థిక విధానమే’ కారణం. నిండా మునిగిన శ్రీలంక దుస్థితి మహింద రాజపక్స పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికీ శ్రీలంకను ఆదుకుంటున్న దేశం భారత్‌ ‌మాత్రమే. శ్రీలంక మాదిరిగానే మాల్దీవులు, సీషల్స్, ‌మారిషస్‌, ‌బంగ్లాదేశ్‌ల్లో కూడా ‘మౌలిక వసతుల’ అభివృద్ధి పేరుతో చైనా తన కబంధ హస్తాలను విస్తరిస్తోంది. ఈవిధంగా పెట్టుబడుల పేరుతో హిందూ మహాసముద్రంలో చైనా ఊడలు పెంచుకోవడం భారత్‌కు పెద్ద ఇబ్బందిగా మారిన సంగతి ఫ్రాన్స్, అమెరికా, జపాన్‌, ఆ‌స్ట్రేలియా, బ్రిటన్‌, ‌జర్మనీ తదితర దేశాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో చైనా మోడల్‌కు ప్రత్యామ్నాయ నమూనాను అమలు పరచాల్సిన అవసరం ఉన్నదని ఈ దేశాలు భావిస్తున్నాయి.

రక్షణ ఛత్రాన్ని ఛిద్రం చేసిన చైనా

ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో తన ప్రాబల్య విస్తరణలో భాగంగా చైనా హాంకాంగ్‌ ‌నుంచి సూడాన్‌ ‌వరకు వ్యూహాత్మకంగా పోర్టులను నిర్మించింది. తైవాన్‌ ‌స్టైట్‌, ‌స్ప్రాట్లీ ద్వీపాలు, పరసెల్‌ ‌ద్వీపాలు, శంకాకు/డియోయు ద్వీపాల ప్రాంతాల్లో తన సైనిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటోంది. రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్నయుద్ధం కాలం ముగిసిన తర్వాత హిందూ, పసిఫిక్‌ ‌మహాసముద్రాల ప్రాంతంలో ఏర్పరచిన రక్షణ ఛత్రాన్ని పెరుగుతున్న చైనా ప్రాబల్యం దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో చైనాను నిరోధించడానికి భారత్‌ ‌కీలక పాత్ర పోషించగలదన్న అంశాన్ని అమెరికా, జపాన్‌, ఆ‌స్ట్రేలియాలతో పాటు ఫ్రాన్స్ ఇతర యూరప్‌ ‌దేశాలు గుర్తించాయి. శ్రీలంక, మాల్దీవుల నుంచి మారిషస్‌ ‌దీవుల వరకు భారత్‌కు సమీపంలో ఉండటంతో.. వాటి విదేశాంగ విధానాల ప్రభావం నేరుగా ఇండియాపై ప్రభావం చూపుతోంది. మారుతున్న ఈ పరిణామాలు భారత్‌ ‌తన విదేశాంగ విధానాన్ని ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంపై ఆధారపడి రూపొందించే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో భారత్‌ ‌ప్రాధాన్యాన్ని పెంచడానికి దోహదం చేస్తోంది.

ఆసియా-పసిఫిక్‌ ‌నుంచి ఇండో-పసిఫిక్‌కు ప్రాధాన్యం మారడానికి ప్రధాన కారణం ఇండియా, చైనా, జపాన్‌ ‌దేశాలు సాధిస్తున్న ఆర్థికాభివృద్ధి. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రపంచ జి.డి.పి.లో 50% ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలోనే నమోదవుతోంది. అయితే ఇండో-పసిఫిక్‌ ‌భావనను చైనీయులు అంగీకరించక పోయినప్పటికీ హిందూ, పసిఫిక్‌ ‌మహాసముద్రాల ఆర్థిక, సైనిక ప్రాధాన్యాన్ని చైనా గుర్తించి క్రమంగా ఈ ప్రాంతంలో తన ఉనికిని సుస్థిరం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. యుఎస్‌ ‌కూడా పదే పదే ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతాన్ని ప్రస్తావించడానికి ప్రధాన కారణం విస్తరిస్తున్న చైనా ప్రాబల్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే. ఇందులో భాగంగానే ‘క్వాడ్రిలేట్రల్‌ ‌స్ట్రాటిజిక్‌ అలయన్స్’ (‌క్వాడ్‌) ఏర్పాటు. ఇందులో యు.ఎస్‌., ఇం‌డియా, జపాన్‌, ఆ‌స్ట్రేలియా భాగస్వాములు. అమెరికా ఇండో-పసిఫిక్‌ ‌వ్యూహాన్ని అనుసరించడానికి మరో కారణం, దక్షిణ చైనా సముద్రంలో సంఘర్షణలు జరగకుండా అడ్డుకోవడానికి, చైనాకు కోపం తెప్పించడం ఇష్టంలేని ఇండొనేసియా, థాయ్‌లాండ్‌ ‌దేశాలను చిన్నగా తన వైపునకు తిప్పుకోవడానికి చేసే యత్నాల్లో భాగమే. ఈ నేపథ్యంలోనే ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని నిరోధించేందుకు యు.ఎస్‌, ‌జపాన్‌, ఆ‌స్ట్రేలియా దేశాలతో ముఖ్యంగా ఫ్రాన్స్ ‌నేవీలతో భారత్‌ ‌సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది.

మారిన యూరప్‌ ‌వైఖరి

యూరప్‌ ‌దేశాలతో గతంలో భారత్‌కు చారిత్రక, భౌగోళిక సంబంధాలు పెద్దగా ఏమీ లేవనే చెప్పాలి. ముఖ్యంగా స్థానిక, భౌగోళిక రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారత్‌ ఎప్పుడూ యూరప్‌ను.. యు.కె. కోణంలో లేదా ప్రచ్ఛన్నయుద్ధం పరిణామాల ఆధారంగానే చూసింది. యూరప్‌ ఆధిపత్యాన్ని నిరోధించడానికి గత ఆరు దశాబ్దాలుగా భారత్‌, ‌రష్యాతో కలిసి పనిచేసింది. యూరప్‌ ‌దేశాలు కూడా భారత్‌కు గతంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. పాన్‌-ఆసియన్‌ ‌భౌగోళిక రాజకీయాలో చైనాను మాత్రమే ఒక స్థిరీకరణ శక్తిగా అవి పరిగణించాయి. అయితే ఐరోపా సమాఖ్యలోని చాలా దేశాలు వ్యక్తిగతంగా భారత్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉండటం గమనార్హం. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఒక్కసారిగా ఐరోపా సమాఖ్య ఇప్పటివరకు తాను అనుసరిస్తున్న విధానాన్ని సమీక్షించుకునేలా చేసింది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతానికి పెరిగిన ప్రాధాన్యం నేపథ్యంలో కొత్త స్నేహితుల కోసం ఐరోపా సమాఖ్య ప్రయత్నించక తప్పలేదు. ముఖ్యంగా ఇప్పటివరకు తమ ఇంధన వనరుల కోసం రష్యాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించు కోవాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో తమ రక్షణ యంత్రాంగాన్ని ఇప్పటికిప్పుడు ఆధునికీక రించుకోవాల్సిన అవసరం లేదా అమెరికా నేతృత్వం లోని నాటో దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కూడా వాటికి ప్రస్తుతం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల జరిపిన జర్మనీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. నిజానికి ఇరుదేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలే ఉన్నాయి. అంతేకాదు రష్యా ఇంధనంపై అధికంగా ఆధారపడు తున్నారంటూ రెండు దేశాలు పశ్చిమ దేశాల విమర్శలను ఎదుర్కొన్నాయి కూడా. అయితే జర్మనీతో పోలిస్తే, రష్యా నుంచి మనం కొనుగోలు చేసే ఇంధనం చాలా పరిమితం. ఇదిలా ఉండగా భారత్‌ ‌పట్ల యూరప్‌ ‌దేశాల వైఖరి, వాణిజ్య భాగస్వామి పరిధి నుంచి క్రమంగా వ్యూహాత్మక స్థాయికి మారుతోంది. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునే దిశగా భారత్‌తో వాటి మైత్రి రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలోనే వాటివద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా చైనాను నిరోధించడానికి, భారత్‌కు తగిన వనరులు సమకూర్చడానికి యత్నిస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌తో పాటు జపాన్‌, ఆ‌స్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌, ‌సింగపూర్‌లతో కూడా యూరప్‌ ‌దేశాలు భాగ స్వామ్యాన్ని పెంచుకోవడానికి యత్నిస్తున్నాయి. ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. వస్తు సేవలకు సంబంధించి ప్రపంచ వాణిజ్యంలో ఇండో-పసిఫిక్‌, ‌యూరప్‌ ‌దేశాల వాటా 70%. ఇదే సమయంలో 60% విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు కూడా ఈ ప్రాంతంలో కొనసాగుతున్నాయి.

నార్డిక్‌, ‌ఫ్రాన్స్ ‌దేశాలు

ఇక నార్డిక్‌ ‌దేశాలైన ఫిన్లాండ్‌, ‌స్వీడన్‌, ఐస్‌ల్యాండ్‌ ‌నార్వే, డెన్మార్క్‌ల్లో తక్కువ జనాభా ఉండటమే కాదు అత్యంత సంపన్న దేశాలు కూడా. అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌ను అందిపుచ్చుకోవడం నార్డిక్‌ ‌దేశాలకు అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపేశక్తి భారత్‌కు మాత్రమే ఉన్నదని ఇవి విశ్వసిస్తున్నాయి. ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో భారత్‌ను ఒక బలీయమైన శక్తిగా ఇవి గుర్తించినందువల్లనే ఐదు నార్డిక్‌ ‌దేశాలు ఉమ్మడిగా ప్రధాని నరేంద్రమోదీతో సదస్సులో పాల్గొన్నాయి. ఈ విధంగా అవి పాల్గొనడం ఇది రెండోసారి. మొదటిసారి 2013లో అప్పటి యు.ఎస్‌. అధ్యక్షులు బరాక్‌ ఒబామాతో సమావేశమయ్యాయి. ప్రస్తుతం నార్డిక్‌ ‌దేశాల్లోని స్వీడన్‌కు సంబంధించి 170 జాయింట్‌ ‌వెంచర్లు భారత్‌లో నడుస్తున్నాయి. 2000 నుంచి మనదేశంలో కొనసాగుతున్న ఈ పెట్టుబడుల విలువ 1.4బిలియన్‌ ‌యు.ఎస్‌. ‌డాలర్లు. ఇక ఫ్రాన్స్‌కు చెందిన 93% ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఇండో- పసిఫిక్‌ ‌మహాసముద్రం ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ 1.5 మిలియన్ల సంఖ్యలో ఫ్రాన్స్ ‌జాతీయులు నివసిస్తుండటమే కాదు 8వేల మంది ఆ దేశ సైనికులు ఉన్నారు. దక్షిణ పసిఫిక్‌ ‌ప్రాంతం లోని ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్లలో న్యూ కేలడోనియా, వాలిస్‌, ‌ఫ్యుట్యునా, ఫ్రెంచ్‌ ‌పోలినేసియా ద్వీపాలు ఫ్రాన్స్ ‌నియంత్రణలో ఉన్నాయి. ఈ ఆర్థిక మండళ్లలో 1/3వ వంతు విస్తీర్ణం వీటిదే. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరిగితే ఈ దీవుల భద్రతకు ముప్పు తప్పదు. ఫ్రాన్స్‌కు ఇదొక సమస్య. ఈ నేపథ్యంలోనే భౌగోళికంగా అత్యంత కీలకంగా ఉండటమే కాదు, తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్‌తో సన్నిహిత సంబంధాలు చైనాకు ముకుతాడు వేయడానికి ఉపయోగపడతాయని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దేశాలు ఒకే అభిప్రాయానికి వచ్చాయి. ఇదే ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో భారత్‌ ‌ప్రాధాన్యం పెరగడానికి కారణం. అంతేకాదు అంతర్జాతీయ యవనికపై భారత్‌ ‌తనకంటూ ఒక ప్రత్యేక విదేశాంగ విధానాన్ని అనుసరించడం, వేగంగా బలీయమైన ఆర్థిక, సైనిక శక్తిగా ఎదుగుతుండటం కూడా ప్రపంచ దేశాల వైఖరిలో మార్పును తీసుకొచ్చింది.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram