వరుస అత్యాచార ఘటనలతో ఏపీలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. రోజూ అనేకచోట్ల జరుగుతున్న అత్యాచారాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయి. ముష్కరులు ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల ముదుసలి వరకు ఎవరినీ వదలడం లేదు. బయటకు వెళ్లిన కుమార్తె గురించి ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నేరస్తుల కులం, మతం, రాజకీయాల ఆధారంగా కేసులు నమోదుచేస్తున్నారని, నిందితులను తప్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మూడేళ్లుగా రాష్ట్రంలో  పోలీసు వ్యవస్థ తీరును పరిశీలించిన వారికెవరికైనా అది నిర్వీర్యం అయిపోయిందని అర్థం అవుతుంది. అరెస్టులు లేవు, ఎక్కడా శిక్షలు లేవు. నేరస్తులకు భయమే లేదు. అసలు ఏపీలో శాంతిభద్రతలే లేవు.

ఒక్కసారి గెలిపిస్తే గొప్ప మార్పుతెస్తానన్న జగన్‌ ‌మహిళల జీవితాలను తారుమారు చేశారు. రేపిస్టులు రెచ్చిపోయి అత్యాచారాలు చేస్తున్నా అదుపు చేయక మహిళలకు అన్యాయం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడేళ్ల కాలంలో మహిళలకు భద్రతే లేకుండా పోయింది. వారిపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు ఒకటి రెండు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క ఏప్రిల్‌ ‌నెలలోనే 31 అత్యాచారాల కేసులు నమోదవడం అరాచకానికి పరాకాష్ట. అసలు పాలన అనేది ఉందా? అన్నది ప్రశ్నార్థకం అవుతోంది. పోలీసులు నిందితులకు అనుకూలంగా ప్రవర్తించడం చేస్తూంటే తమను దేవుడే రక్షించాలని మహిళలు వేడుకుంటు న్నారు. ఎంతో మంది మహిళలు వారిపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. పేద కుటుంబాలకు చెందిన బాలి కలు, మహిళలు తీవ్రమైన అభద్రతా వాతావరణంలో జీవిస్తున్నారు.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో, రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఒక గదిలో సామూహిక అత్యాచారానికి దుండగులు ఒడిగట్టారు. బాధిత తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు వ్యవహరించిన తీరును సభ్యసమాజం తప్పుపడుతోంది. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో నిర్బంధించారన్న విషయం ఆమె తల్లిదండ్రులు చెబితే తప్ప ఆసుపత్రి, పోలీసు అధికార యంత్రాంగం గుర్తించలేకపోవడం సిగ్గుచేటు. విజయనగరం ఉడా కాలనీలో ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళపై పోలీసు ఉద్యోగి కుమారుడే అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. రేపల్లెలో రైల్వేస్టేషన్‌ ‌ప్లాట్‌ఫారంపై భర్తపై దాడిచేసి అతని భార్యపై అత్యాచారానికి ఒడిగట్టారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు లంక గ్రామంలో మరో మహిళ హత్యకు గురైంది. రాత్రివేళ రైల్వేస్టేషన్‌లో తలదాచుకున్న మహిళకు అన్నంపెట్టిస్తామని తీసుకెళ్లి ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన దాచేపల్లిలో జరిగింది. ఈ ఘటనలు మరువక ముందే సత్యసాయి జిల్లా గోరంట్లలో బీఫార్మసీ విద్యార్ధినిపై సామూహికంగా అత్యాచారం జరిపి హత్యచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో.. ఇంకా రాష్ట్రంలో చాలా చోట్ల అనేక ఘటనలు జరిగాయి. చాలా మంది మహిళలు తమకు జరిగిన అన్యాయాలను ఎవరికీ చెప్పకుండా తమలో తాము కుంగిపోతున్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వైకాపా ప్రభుత్వం మత సంతుష్టీకరణ విధానాలను అను సరిస్తూ నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నట్లు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముస్లిం మతానికి చెందిన వ్యక్తులపై అనుమానాలున్నా, నేరం చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నా నిందితులను అరెస్టు చేయ డానికి సాహసించడం లేదు.

గోరంట్లలో మరణించిన విద్యార్ధిని బోయ కులానికి చెందిన బాలిక. గోరంట్ల మండలం మల్లా పల్లికి చెందిన సాదిక్‌కి, ఆమెకు మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు రోజుల క్రితం ఆమెను కారులో సాదిక్‌ ‌తీసుకువెళ్లాడు. మల్లాపల్లి వద్ద ఉన్న తన గదిలో బంధించి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు, రాజకీయపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిందితుడు ముస్లిం కాబట్టి అతనిని అరెస్టు చేస్తే ముస్లింల ఓట్లు ఎక్కడ కోల్పోతామేమోనన్న భయంతో వైకాపా ప్రభుత్వం వారిని అరెస్టు చేయడానికి జంకుతోందని బహిరంగంగా బాధిత వర్గం విమర్శిస్తోంది. హిందు వుల ఆలయాలపై దాడులు జరిపినా, అక్రమ మసీదులు నిర్మిస్తోన్నా, గోవధలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేవడం లేదు. పైగా దీనిని అడ్డుకుంటున్న హిందువులను, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసులు జైళ్లలో పెడుతున్నారు. అరాచక ముస్లిం యువత పోలీసు స్టేషన్‌లపై దాడులు చేసినా బాలురని, పేదలని పేర్కొంటూ వారిని వదిలేస్తున్నారు.

పోలీసు వ్యవస్థ నిస్తేజం!

వైకాపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిస్తేజం చేసిందనేది వాస్తవం. అధికారం చేపట్టిన నాటి నుంచి విపక్షాల నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, బెయిల్‌ ‌రాకుండా చేయడం, పార్టీలు మారేలా ఒత్తిడి చేయడం, స్ధ్థానిక ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులెవరూ పోటీ చేయకుండా అడ్డుకోవడం అందరికి తెలిసిన విషయమే. ఎస్‌.ఐ, ‌సి.ఐ స్థాయి అధికారులు తమకు కావాల్సిన ప్రాంతంలో పోస్టింగ్‌ ‌కోసం ఎమ్మెల్యేలతో సిఫారసులు చేయించుకుంటున్నారు. వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఉభయులు జేబులు నింపుకుంటున్నారనేది బహిరంగ ఆరోపణ. దీనిని ఖండించలేని పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం ఉంది. ప్రజాప్రతినిధులకు సేవలు, ప్రజా ఉద్యమాల అణచివేత పోలీసుల విధిగా ప్రభుత్వం మార్చేసింది. పోలీస్‌ అధికారులు హత్యాచారానికి గురైన బాధితులనే తప్పు బడుతూ ప్రకటనలు చేస్తున్నారు. పోలీసులు వైకాపా నాయకులకు అనుకూలంగా వ్యవహరించి నేరస్తులను వదిలేయడంతో ఇక వారికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఈ ప్రభుత్వ హయాంలో తాము ఏ తప్పు చేసినా పోలీసులు ఏం చేయలేరని భావించి నేరాలు కొనసాగిస్తున్నారు. విచ్చలవిడిగా అమ్ముతున్న మద్యం వల్ల కూడా నేరాల ఉధృతి పెరిగిపోయింది. హోం మంత్రేమో తల్లుల పెంపకం సరిగా లేకనే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొనడం బాధ్యతారాహిత్యమే. అత్యాచారం జరిగితే అక్కడకు వెళ్లి బాధితురాలికి పరిహారం పేరుతో డబ్బులిచ్చి, ఫొటోలు దిగి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది.

మద్యపానంతోనే దారుణాలు

రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యా చార ఘటనలకు మద్యపానం ప్రధాన కారణమవు తోందని అందరూ అంటున్నారు. మద్యం సేవనం వల్ల మైకంలో ఉచ్ఛనీచాలు మరచి దుశ్చర్యలకు తెగ బడుతున్నారు. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో చేసినవే. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో వైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మచిలీపట్నం తాలూకా కరగ్రహారం శివారు పల్లిపాలెం బీచ్‌లో స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల కిందట జరిగింది. నిందితు లిద్దరూ మద్యం మత్తులో ఆ యువతి స్నేహితుడిని కట్టేసి మరీ అతని ఎదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సీతానగరం పుష్కర్‌ ‌ఘాట్‌కు.. కాబోయే భర్తతో కలిసి విహారానికి వెళ్లిన యువతిపై మద్యం, గంజాయి సేవించిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మత్తులో ఓ వ్యక్తిని హతమార్చారు. ఖజానా నింపడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలు, ఆ మత్తులో జరిగే నేరాలకు బాధ్యత వహించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. ఆనంద్‌ ‌వెంకటేశ్‌ 2019 ‌మార్చిలో తీర్పు ఇచ్చారు. ఇలాంటి నేరాలకు నష్టపరిహారం ఇవ్వడం మాట అటుంచి కనీసం వైకాపా ఇచ్చిన మద్యనిషేధం హామీని అయినా అమలు చేయాలి. హైదరాబాద్‌లో ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆంధప్రదేశ్‌లో అలాంటి దారుణాలు జరగనివ్వబోమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించి దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు, దిశ యాప్‌ అం‌టూ హడావిడి చేశారు. వీటన్నింటిలోనూ ప్రచార ఆర్భాటం తప్ప అకృత్యాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలు ఏమీ కనిపించడం లేదు. ప్రజా ఉద్యమాలను అణచివేయడంపై, 2024 ఎన్నికల్లో 175 సీట్లు ఎలా సాధించాలి? అనే విషయాలపై ఉన్నటువంటి శ్రద్ధ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టడంపై లేకపోవడం శోచనీయం.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram