– డా।। చింతకింది శ్రీనివాసరావు

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

పరిస్థితులన్నీ ఈ చందాన సాగిపోతుండగానే విజయదశమి దాటిన వారం రోజులకల్లా విదియ తిథి రానే వచ్చింది. మినుములూరు రాచ సంప్ర దాయం ప్రకారం చెయ్యవలసిన పార్వేట సందర్భమూ వచ్చేసింది. వేటంటే పెద్ద వేట కాదది. కోట ఆచారం మేరకు యువరాజు తప్పక చెయ్యవలసిన పని. పిట్టనో జంతువునో కొట్టి సాయంత్రానికల్లా రాచ భవనానికి పట్టుకురావాలి. మహంకాళికి అర్పించాలి.

ఎప్పటిలాగానే విదియనాటి ప్రభాతవేళ వేటకు సంసిద్ధుడయ్యాడు సంజీవరాజు. రంగుల దుస్తులు ధరించాడు. పట్టు తలపాగా చుట్టాడు. నార విలుబద్ద పట్టాడు. పక్షి ఈకలతో పింజరికట్లు కట్టిన అమ్ములను వెదురు ఒగ్గులో కూర్చాడు. తూణీరంగా దాన్ని వీపుకు కట్టుకున్నాడు. సూటిగా గుండెల్లో ఒక్క దెబ్బకు దిగి పోగల బాకులను నడుముకున్న తోలుపట్టీల నరదల్లో ఇముడ్చుకున్నాడు. కరవాలాన్ని పోలిన కేలంకిని చేతబట్టి భుజాన డేగతో తల్లి దగ్గరకు వచ్చాడు.

ఎన్నో సంవత్సరాలుగా విదియ వేటకు సంజీ వుడు తరలివెళుతూనే ఉన్నాడు. వెళ్లేముందు తల్లి పాదాలకు వందనాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ఈ ఏడాదే ఆ పార్వేటవేళ తల్లి మోదమ్మ ఎడద మిశ్రమ స్పందనలతో నిండిపోయింది. మానసికంగా నలిగి పోయి నట్టున్న కుర్రవాడు వేట పూర్తిచేసుకుని ఎలా వస్తాడోనన్నట్టుగా అమ్మ హృదయం ఆందోళన పడుతోంది. యువరాజు ఎంతగా రోషాల వేటగాడి అవతారం ఎత్తినా కళతప్పిన వదనం కన్నపేగుకు కనబడకుండా పోదు. ఆ ముఖం మథనానికి వేదికగా మారిన మనిషిలోని అంతర్ముఖాన్ని పట్టి చూపక పోదు. అప్పటికే జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన రాజమాత. సహజంగానే ఆమె ఆలోచనలు ఆమెకుంటాయి. ఆమె సందేహాలు ఆమెను పీడిస్తుంటాయి. అందుకే ఆశీస్సులు తీసుకునేందుకు మందిరానికి వచ్చిన యువరాజును మాతృమూర్తిగా ప్రేమారా దగ్గరకు తీసుకుంది. ఆ క్షణాన ఆమె నేత్రాలు ధారాపాతంగా వర్షించడం మొదలైంది.

‘‘బిడ్డా! జాగ్రత్త.’’ మనసు మూలుగుతుండగా కంటతడితో దీవెన ఇచ్చింది.

‘‘ఎన్నడూ లేనిది. కన్నీరుపెడుతూ పంపు తున్నావే.’’ అడిగాడు తనయుడు.

‘‘నువ్వు మాత్రం ఎప్పుడూ వచ్చినంత సుము ఖంగా రాలేదు కదూ? నీలో వ్యాకులత ఛాయలు కనిపిస్తున్నాయి కదూ?’’ చెప్పింది తల్లి.

‘‘అవునమ్మా. నా మనసు కొంతలో కొంతగా గతి తప్పి ఉంది. రాజధర్మాన్నీ, జీవితాన్నీ అను సంధానం చేసుకుని సాగడం సుల•వు కాదని ఎప్పుడూ నువ్వు చెప్పేమాట ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది.’’ అన్నాడు సంజీవరాజు. చిరుదరహాస అయింది మోదమ్మ. ఇంతలోనే,

‘‘మరేం భయంలేదమ్మా. నేను వెళుతున్నాను కదా. మన కోనల్లోని జంతువులన్నీ కకావికలమై పోవా. నా సంగతి వేరుగా చెప్పేదేముంది.’’ క్షణాలకిందటే కత్తీకఠారుతోనూ, లోకరక్షడేగతోనూ అక్కడికి చేరిన జాజిరాజు గొప్పగా తన గురించి తానే చెప్పేసుకున్నాడు. అతని మాటలకు మోదమ్మా సంజీవురాజులిద్దరూ నవ్వుకున్నారు.

‘‘ముందు నీ చేతి మీది డేగను జాగ్రత్తగా చూసుకో. లేదంటే నీ ముక్కు పొడిచేయగలదు.’’ సంజీవుడు పలకడంతో పెద్ద నవ్వే నవ్వింది తల్లి. డేగ కూడా ఆలా పొడిచేద్దామా అన్నట్టుగానే జాజి వైపు చూసింది. కంగారు పడ్డాడు జాజిరాజు. ఎందు కయినా మంచిదని డేగ కూర్చుని ఉన్న తన కుడి చేతిని దూరంగా చాచుకున్నాడు. అప్పుడే ఆ గెద్దను ప్రేమగా చేతుల్లోకి తీసుకుని భుజాన పెట్టుకున్నాడు సంజీవరాజు. తల్లి పాదాలకు మరోసారి నమస్కరించి వెనుతిరిగాడు. రాణీ మోదమ్మకు జాజీ వినయంగా పాదాభివందనాలు చెల్లించాడు. రాజువెనుక మంత్రిలా బయలుదేరాడు. కోటకిందిభాగానికి చేరిన మిత్రులిద్దరూ అశ్వారూఢులై పూలగండువనం వైపుగా దౌడాయించారు.

******

ఆ వైపు సంజీవరాజు మినుములూరునుంచి గుర్రం మీద ఎప్పుడయితే పూలగండువనం దారి పట్టాడో, సరిగ్గా అప్పుడే గరికను తోడు తీసుకుని కూరలు ఏరేందుకు మండివలస నుంచి బయలు దేరింది గంగు. ఊళ్లల్లో కోలగాళ్ల కుటుంబాల వారు వారానికొకసారి కొండల్లోకి పోయి రకరకాల ఆకు కూరలు తెంపి తీసుకురావాలి. వాటిని ఊరుమ్మడిగా అందరికీ పంచి ఇవ్వాలి. ఇది గ్రామకట్టు. ఈ కట్టుబాటును అనుసరించి రెండునెలలకు ఒక్కసారి ఆ పని చేయడం కోలన్న వంతు అవుతుంది.

సాధారణ పరిస్థితుల్లోనయితే కోలన్నో, రేకమ్మో కూర తెంపుడుకు పోతారు. ఈ రోజున గ్రామచావిట్లో పంచాయితీ పనులు చాలానే ఉన్నాయి. కోలన్నకి కుదరలేదు. రేకమ్మకయితే ఒళ్లు బాగాలేదు. కొంతకాలంగా వేధించుకు తింటున్న ఒరిబొమ్మ నొప్పి ఆనాటి వేళ తీవ్రమైపోయింది. ఇది కళ్లకు మీద భాగాన ఒకవైపు కణతన వచ్చే పార్శనొప్పి. నులుముకు తింటుంది. శొంఠిగంధం నూరుకుని, పట్టుగా వేసుకుని, మూలుగుతూ పడుక్కుంది రేక. పిల్లను తప్పనిసరి స్థితిలోనే కూర ఏరుకు రమ్మని పురమాయించింది. గరిక తోడుగా ఉంది గనక నిశ్చింతగా పంపుతోంది. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలనూ ఆడగుంటలిద్దరికీ చెబుతూనే ఉంది.

‘‘ఇట్టే వెళ్లి అట్టే రావాలి. చీకటి పడకుండా ఇల్లు చేరాలి. పూర్తిగా మండేబు అటువైపుగా దిగిపోకండి. జంతువులతో భద్రం. ఎందుకయినా మంచిది కొమ్ముల బల్లెం, వొలవలు ఆయుధాలుగా పట్టుకు పోండి. దుంపల తవ్వకానికీ పనికొస్తాయి.’’ ఒకటికి పదిమార్లుగా పలికి, అంబలిదిప్పలు చేతికిచ్చి, వారిని అడవికి అంపకం పెట్టింది.

గంగు బుద్ధిమతి అని రేకమ్మకు తెలియంది కాదు. కానీ, మొన్న మినుములూరు వెళ్లినప్పుడు జరిగిన గొడవల వల్ల కొద్దిపాటి అధైర్యమేదో చోటుచేసుకుంది. అనవసరంగా పెద్దలతో తగవు పడ్డామేమో అనే సందేహం పట్టిపీడిస్తున్నట్టుగా ఉంది. కొన్ని దినాలుగా గంగు సైతం పూర్వం గంగులా లేదు. మాట్లాడితే సంజీవరాజునే తలుస్తోంది. అతని భుజాన ఉండే డేగను పొగుడుతోంది. యువరాజు అందచందాలనే కాకుండా అతని తగుమనిషితనాన్నీ, మంచితనాన్నీ పొద్దస్తమానమూ ప్రశంసిస్తూ వస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే సంజీవరాజు తలంపు రాగానే గంగు వదనం మెరుపుల నిలయమవుతోంది. గమనిస్తోంది రేకమ్మ. ఇదంతా దేనికి దారితీస్తుందో ననే భయమూ ఆమెకు లేకపోలేదు. తల్లి తల పోతలతో తనకేమీ సంబంధం లేనట్టుగా అరణ్యానికి బయలుదేరింది గంగు. అడుగులు వేసింది గరిక.

అది ఉదయం వేళ. చలి ఇంకా చిందులు వేస్తూనే ఉంది. ఆడుతూపాడుతూ ఊరు దాటి పోయారు గరికాగంగులు. మండివలస మీరి కొద్దిదూరం వెళితే చాలు. మండేబుగిరి పాదభాగం తగులుతుంది. ఆ కొండ మరీ ఎత్తుకాదు. కాకపోతే బూసి, పనస, మామిడి, తుమ్మికె, తంగుడు, వేగిస చెట్లు ఎడాపెడా పెరిగిపోయి ఉంటాయి. దారి చేసుకుని వెళ్లడం కష్టం. దారి చూసుకునే వెళ్లాలి. గ్రామస్తులు కొండమీదికి పోయి కట్టెలు తెచ్చుకునే బాట పట్టాలి. అలా పట్టిపోతే విశాలంగా ఉండే కొండవెన్నువేనం మీదికి పోవచ్చును. అక్కడ మునగ, అవిసె, బలుసు, గుమ్మడి, మండి వంటి ఆకుకూరలు అక్షయం. కోసుకున్నవాడికి కోసుకున్నంత. రుచికరమైన వైడు, సార, గింటుగు, చవిడి, చేద దుంపలయితే పుష్కలం. తవ్వుకున్నవాడికి తవ్వు కున్నంత. ఈత, పర్మి, పుల్లపర్మి, పోల, బొడ్డ, అనాసపళ్లయితే అగ్గజం.

ఈ పళ్ల చెట్ల మధ్యనుంచి, ఈ వృక్షచ్ఛాయల కింద నుంచీ ఒక భుజాన దిప్పతో, మరు భుజాన వేళ్లాడుతున్న వొలవలతో మెల్లగా గిరికన్నెలు కదులుతున్నారు. ఎదురైన లొవ్వలు, చెలకలు, కోరాలు, జవుకులు, కట్టువలు, వగ్గలు చాకచక్యంగా దాటుకుంటూ మండేబువేనం మీదికి మెల్లగా పోగలిగారు.

అప్పటికి బొమ్మెత్తువేళ దాటింది. దూరాభారాలు నడచివచ్చారేమో ఇద్దరమ్మాయిలకీ దాహంతో నాలుకలు పిడచకట్టుకుపోయాయి. సూర్యుడు మధ్యందిన మార్తాండుడయ్యాడు. అప్పుడిక దిప్పల్లోని అంబలి నీళ్లను గొంతుల్లో ఒంపుకున్నారు ఇద్దరూను. ఆ మీద ఒక చెట్టుమానుకు చల్లగా చేరబడ్డారు. కొంతసేపు బడలిక తీర్చుకున్నారు. ఆ తర్వాత,

‘‘గంగూ! కూరలు ఏరుదామే. సమయం వృధా చెయ్యడం దేనికి.’’ గరిక పలికింది. మనసెక్కడో ఉన్నట్టుగా చెట్టుమానుకు ఆనుకొని ఉన్న గంగు వినిపించుకోలేదు. చేసేదిలేక గంగు తలను రెండు చేతులతోనూ గట్టిగా ఊపుతూ,

‘‘ఈ లోకంలోకి రావే తల్లీ! పద పద. కూరాకులు కోద్దాం.’’ అప్పటికిగానీ గంగు ఈ లోకంలోకి రాలేదు. గరిక మాటలకు తొలుత చీకాగ్గానే ముఖం పెట్టినా తర్వాత ప్రసన్నచిత్త అయింది. అలా అవుతూనే,

‘‘పులివేళకి కదా ఇంటికి చేరేది. ఇంకా మధ్య సిత్రమే కాలేదు. గరికా! ఒక్కసారి మండేబుగిరికి అటువైపుగా దిగేసి అక్కడి పూలగండువనానికి పారివద్దామా!’’ మనసులోని మాటలను ఆత్రంగానూ అంతులేని ఆనందంతోనూ బయటపెట్టేసింది.

ఆలకించిన గరిక ఒక్కసారిగా గలగలానవ్వింది. కొన్ని క్షణాలపాటు నవ్వుతూనే ఉంది. గంగుకు అంతుబట్టలేదు. నవ్వు ఆపుకున్నాక,

‘‘నీ సంగతి తెలుసులే. పూలగండువనం ఎందుకు వెళదామంటున్నావో అదీ తెలుసు. నువ్వు నచ్చుకున్న యువరాజు కలుస్తాడేమోనన్న ఆశతోనే కదూ. నీ వాలకం చూస్తుంటే పూలగండువనం దాటేసి, మినుములూరు పోయేసి, మోదమ్మను కలిసేసి, సంజీవరాజును పెనిమిటిగా ఇమ్మనమని ఆ తల్లిగారినే అడిగేటట్టున్నావే.’’ కొంటెగా అనేసింది గరిక. తన మనసు దీనికి ఎలా తెలిసిందో కదా అనే యాతనతో బుంగమూతి పెట్టింది గంగు. తప్పదన్నట్టుగా, ‘‘అదేంకాదు. నీకన్నీ అలాంటి ఆలోచనలే. పూలగండువనం గొప్పతనం అందరూ చెబుతుంటారు కదా. అదేంటో చూసివద్దామనేదే నా తెంపు. అయినా సంజీవుడి కోసం నేనెందుకు వెళతాను. వస్తే అతగాడే నా దగ్గరకు రావాలి.’’ గర్రాగా పలికినట్టు పలికింది.

‘‘అది సరేలేవే. అయితే నాకో అనుమానం. ఇప్పుడు కొండ దిగితే మళ్లీ మనం సాయంవేళకి ఇల్లు చేరగలమా?’’ సందేహపడింది గరిక.

‘‘ఎందుకుచేరలేం! అక్కడ మనకేం పని. ఇలా వనాన్ని చూసి అలా రావడమే కదూ. ముందు నువ్వు నడవ్వే.’’ గభాలున చెట్టుమానును వదిలిపెట్టి లేచింది గంగు.

వెనువెంటనే కొండవేనాన్ని స్నేహితురాళ్లు వదిలిపెట్టేశారు. గిరి దిగుడు మొదలుపెట్టేశారు.

వాళ్లకి ఆ అద్రి కొత్తకాదు. మన్యంలో పుట్టి పెరిగినవారు. అందుకే చకచకా కొండకొన నుంచి ఆవైపు పల్లానికి అర్థగంట గడవకుండానే చేరి పోయారు. అక్కడ తగిలింది వాళ్లకి పూలగండువనం పడమర భాగం.

వనం అన్నందుకు అది అచ్చమైన వనమే. అక్కడ పూలుపూయని తీగలేదు. పండు పండని చెట్టులేదు. కాయ కాయని వృక్షం లేదు. నయన మనోహరంగా ఉంది. ఆ వనంలో నడిచి వెళుతున్న కొద్దీ సన్నటి వాగులు, చక్కని వంకలూ ఎవరో ప్రణాళికాబద్ధంగా గీత గీసినట్టే నీళ్లను పారిస్తున్నాయి. బెట్టుడతల అలికిడి, కొండమేకల అరుపులు, పక్షుల కిలకిలలు, నెమళ్ల క్రేంకారాలు మనసును రంజిల్లజేస్తున్నాయి. సకల పుష్పఫల సౌరభాలు హృదయాలను మరో లోకానికి తీసుకువెళుతున్నాయి.

మధురానందం పొందిన గరికగంగులు ఆకలి, అలసట ఎరుగని దేవతల్లా మారిపోయారు. వాగునీళ్లల్లో కాళ్లు కడిగారు. ఏటితరగతో చేతులు కలిపారు. మయూరాలతో నృత్యం చేశారు. ఆడారు. పాడారు. ఆనందభరితులయ్యారు. కొంతసేపు వారి సంబరం అంబరాన్ని తాకాక మెల్లగా అక్కడే ఉన్న విశాలమైన కొండరాళ్ల మీదికి చేరి కూర్చున్నారు.

వాళ్లూ ఆ బండలమీద స్థిమితపడి అంబలి తాగుతుండగా ఒకానొక చిత్రం అప్పుడే చోటు చేసుకుంది. వాళ్లెప్పుడూ కలలోనయినా ఊహించని చిత్రమది. గొప్ప విచిత్రమది. ఆ పరిణామానికి కొంతసేపయితే వాళ్లు మాటలురాక మూగగానే ఉండిపోయారు.

ఉన్నట్టుండి నీలాకాశాన్ని చీల్చుకుంటూ, రెక్కలు కదుల్చుకుంటూ, ఒకానొక డేగ వచ్చి వీళ్లు కూర్చున్న బండల అంచున వాలిపోయింది. వాలింది వాలినట్టుగా ఉండకుండా మెల్లని నడకలతో గంగు దగ్గరకే తిన్నగా వచ్చేసింది. ఆమె చేతిమీదకి చేరి స్వతంత్రంగా కూర్చుండిపోయింది. ఆశ్చర్యపోయింది గంగమ్మ. విస్మయం పాలయింది గరిక. ముందుగా కొద్దిపాటి గందరగోళం పడినా ఆ డేగను అంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ముఖాలు పెట్టారు ఇద్దరూను. అప్పుడు వాళ్లకు తట్టింది ఆ గెద్దపిల్ల ఆనుపాను. ఆ మీదట వాళ్లల్లో అంతకు ముందటి భయం చెదిరిపోయింది.

‘‘ఇది సంజీవరాజు డేగ. దీన్ని మనం వంటల మామిడిలో చూశాం. దీని కాళ్లకున్న వెండి మురుగులు, మెడలోని తోలుపట్టీలు, రెక్కలకున్న బంగారపు మువ్వలబులాకీలు బాగా గుర్తున్నాయి గరికా!’’ గంగు సంతోషపడుతూ చెప్పుకొచ్చింది.

‘‘అవునవును. నేనూ చూశాను దీన్ని. అబ్బో. ఇది టక్కులాడి టముకు. యువరాజు భుజానికెక్కి ఆ వేళ ఎంతగా నీలుగుడు నీలిగిందనుకున్నావు.’’ గరిక ఇలా అనగానే లోకరక్ష కిర్రుకిర్రుమంది. గరికవైపు కోపంగా చూసింది. కొరుకుతాను జాగ్రత్త సుమా అన్నట్టుగానూ కళ్లు చికిలించింది.

‘‘బాలడేగకు కోపం వచ్చిందే. సరిగ్గా మసులు కోకపోతే నీ పని అంతేను. దాన్ని ఏదయినా అంటే యువరాజును అన్నట్టేను.’’ గొడవను సర్దినట్టుగా గంగు పలికింది. మూతివిరిచింది గరిక. గంగు మాటలకు తలఎత్తి గర్వంగా ఆమెను చూసింది డేగ.

వెనువెంటనే సంజీవరాజు మీద, అతని పరివారంమీద తనకున్న అభిమానాన్ని చాటు కునేందుకే అన్నట్టుగా గళం సవరించింది గంగు. డేగపిల్లరెక్కలను చక్కగా నిమురుతూ,

‘చిట్టిమువ్వల చిన్నమరిది – నీ శిరసుకు దండము.

బంగారు మువ్వల బాలమరిది – నీ పాదాలకు దండము

వేనూరిచ్చిన వెండి కుచ్చుల డేగ – ఏనూరిచ్చిన బంగారు కుచ్చుల డేగ..’

అప్పటికప్పుడే పాటకూర్చి లోకరక్షను పొగడ్తల్లో ముంచెత్తుతూ పాడింది. ప్రసన్నురాలయింది డేగ. ఇంతలోనే చిత్రం మీద చిత్రంలా మరో ఘటనా సంఘటిల్లింది.

పంచకల్యాణి వంటి ఒక శ్వేతాశ్వం పెద్దగా డెక్కల చప్పుడు చేసుకుంటూ అక్కడికి వాయువేగంతో దూసుకు వచ్చేసింది. వచ్చింది వచ్చినట్టుగా గంగు కూర్చున్న తావున ఆగింది. ముందున్న రెండుకాళ్లూ ఒక్కసారి పైకెత్తి సకిలింపుచేస్తూ పలకరింపులకూ దిగింది. అలా వచ్చిన గుర్రంమీద ఉన్నది వేరెవరో కాదు. నంద, మత్స్యరాజ్యాలకు కాబోయే ప్రభువు సంజీవరాజు. అతని వెనకగా మరో గుర్రం మీద వచ్చింది అతని ప్రియనేస్తుడు జాజిరాజు.

ఎప్పుడైతే సంజీవరాజును లోకరక్ష చూసిందో ఠక్కున గంగుచేతిని వదిలిపెట్టి రివ్వున వెళ్లిపోయింది. రాజు స్కంధాన వాలిపోయింది.

ఆ రోజు, ఆ చోట, ఆ వేళ అనుకోకుండా, ఆకస్మికంగా సంజీవరాజును అలా చూడటంతో అప్పటికే చేష్టలుడిగిన గంగు ఈ లోకంలోకి రావ డానికి కొన్ని క్షణాలు పట్టింది. గరికయితే దాదాపుగా శోష వచ్చినట్టుగా అయిపోయింది. అటు గంగు, ఇటు గరిక అసంకల్పితంగానే కూర్చున్న చోటునుంచి లేచి రాతిబండల మీద నిలుచుండిపోయారు. తత్తరపాటుపడుతూనే యువరాజుకు వందనాలు చెల్లించారు. వాటిని చనువారా అందుకున్నాడు సంజీవరాజు. ప్రతి నమస్కారాలూ చేశాడు.

ఆ సందర్భంలో అక్కడ గంగు ఉంటుందని యువరాజు తలపోయనేలేదు. అందుకనే ఊహంచని దేదో జరిగినట్టుగా చకితుడయ్యాడు. వెతుకుతున్న తీగె కాలికి తగిలినట్టూ అయ్యాడు. రుణానుబంధం అంటే ఇదేనేమో అనీ అనుకున్నాడు. చేసిన వేటలను గుర్రంపై వేసుకుని తన వెనగ్గా వచ్చిన జాజిరాజుకు కళ్లతోనే సైగలు చేశాడు. వాటిని అర్థం చేసుకున్న జాజి గుర్రాన్ని దూరంగా తరలించుకుపోయాడు. ఆ క్షణంలోనే సంజీవరాజు గరికవైపు సైతం అదోలా చూశాడు. ఆ చూపుల సారాంశాన్ని గ్రహించిన ఆమె కూడా బండల పక్కలంట పోయింది. తనూ అక్కడ ఉండకూడదన్నట్టుగా రాజును వదిలిపెట్టి రెక్కలు కొట్టుకుంటూ ఎక్కడికో ఎగిరిపోయింది లోకరక్ష.

(ఇంకా ఉంది)

By editor

Twitter
Instagram