‘కులం పేరెట్టి వ్యాఖ్యలు చేయడం సీపీఐ(ఎం) నాయకుల నోటి నుంచే నేను వింటూ ఉంటాను. బీజేపీ వాళ్లు అలా మాట్లాడనే మాట్లాడరు. టీజే అంజలోస్‌ను వీఎస్‌ అచ్యుతానందన్‌ ‌మాత్రమే జాలరి కులం వాడు అని, అదేదో అవమానమైనట్టు ప్రస్తావించాడు.’ ఈ మాటలు అన్నది ఆశా లారెన్స్. ‌సీపీఎం అంటే అసహ్యించుకునే, విరుచుకుపడే నేపథ్యం కాదు ఈమెది. ఏ సామాజికవేత్తో కూడా కాదు.  కమ్యూనిస్టుల గురించి సామాజిక అధ్యయనమూ చేయడం లేదు. ఆశ సాక్షాత్తు కేరళ సీపీఎం ప్రముఖుడు ఎం.ఎం. లారెన్స్ ‌కూతురు. ఈ ఫిబ్రవరి 21న హత్యకు గురైన సీపీఎం కార్యకర్త హరిదాస్‌ ‌గురించి తన తండ్రి సేవించుకుంటున్న  పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకి ఆమెకి కడుపు మండిపోయింది. ఒక ఆలయం వద్ద నిర్వహించే ఉత్సవం విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారికీ, సీపీఎంకు చెందిన హరిదాస్‌ అతని సోదరునికి మధ్య విభేదాలు ఉన్నాయి. హరిదాస్‌ ‌హత్య వివాదం సందర్భంగానే ఆమె తన తండ్రి పార్టీకి చక్కని స్థానం కేటాయించింది. ‘ఇంతటి కులం పట్టింపు ఉన్న, ఆధిపత్య ధోరణి ఉన్న పార్టీ ఈ యావత్ప్రపచంలో మరొకటి లేదు’ అని చెప్పేసింది. పైపా న్యూస్‌ అనే వార్తా సంస్థ మరొక విశేషణం కూడా చేర్చింది.  సీపీఎంలో జాతి వివక్ష ఉందని ఆశా చెప్పిందని ఆ సంస్థ పేర్కొన్నది.

హరిదాస్‌ను సోమవారం తలస్సెరి అనే చోట కొందరు హత్య చేశారు. ఈ హత్య మీద ఎంవీ జయరాజన్‌ అనే సీపీఎం నాయకుడు చేసిన వ్యాఖ్యతో ఆమె చిర్రెత్తుకు వచ్చింది. ముందుగా జయరామన్‌ ‌వ్యాఖ్య ఏమిటో చూద్దాం! ‘జాలరి కులస్థుడైన హరిదాస్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చంపిందంటే, జాలర్ల పట్ల ఆ సంస్థకు ఉన్న ద్వేషం, దానిలోని ఆధిపత్యధోరణి ఎంతటివో కూడా తెలుస్తున్నాయి’ అన్నాడు జయరామన్‌. ఆ ‌సందర్భంలో సీపీఎం, అనగా తన తండ్రి పార్టీ నిజరూపమేదో చెప్పక చెప్పారామె.

అక్కడితో ఆగలేదామె. టీజే ఆంజలోస్‌ అనే జాలరి కుటుంబం నుంచి వచ్చిన 20 సంవత్సరాల అబ్బాయిని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాయకులు ఎవరూ అతడి కులం ఏమిటో ప్రస్తావించలేదు. ఆ పని మాజీ ముఖ్యమంత్రి, పెద్ద సీపీఎం నాయకుడు వీఎస్‌ అచ్యుతానందన్‌ (98) ‌చేశారని ఆశా విమర్శించింది. ఇలా సోషల్‌ ‌మీడియాలో పెట్టిన పోస్టులో సీపీఎం వారు ఎంతటి కుల ప్రేమికులో వెల్లడించింది.

సీపీఎం కార్యకర్తలు వాళ్లని పరిచయం చేసుకున్నప్పుడు, వాటితో కులం పేరును జోడించి మరీ సంకల్పం చెబుతారని తెగేసి చెప్పారు ఆశా. వాళ్ల పేర్ల పక్కన వాళ్ల కులం పేరు మాతమ్రే చెప్పుకుంటే అదొక ముచ్చట. అలాక్కాదట. పార్టీలోనే అవతలి వ్యక్తులను విమర్శించవలసిన సందర్భంలో కూడా ఆ కులం వాళ్లంతే అన్నట్టే ఉంటుందంటు న్నారామె. ‘ఓ, వాడా! వాడి కులం అది కదా! కాబట్టి వాడు అలా తప్ప ప్రవర్తించడు. ఇది సహజం’ అని అంటారని ఆశా పేర్కొన్నారు. ఇదంతా ఇండియా టుడే వెబ్‌సైట్‌ ‌ఫిబ్రవరి 24న నమోదు చేసింది. ‘అసలు సీపీఎంలో ఉన్నంత జాతి, కుల, ఆర్థిక వివక్ష మొత్తం ప్రపంచంలోని మరే ఇతర పార్టీలోను ఉండదు’ అని తెగేసి చెప్పింది ఆశా. పార్టీని ‘పవిత్రం’గా చూసుకుంటారని కూడా వ్యంగ్యంగా చెప్పింది.

ఇక్కడే ఆశా మేడమ్‌ అమాయకత్వం బయట పడింది. సీపీఎం నాయకుల్లారా! మీ ఆత్మసాక్షిని మోసగించవద్దని ఆమె హితవు పలికారు. ఇంత పెద్ద మాట వాళ్ల విషయంలో ఎందుకు తల్లీ! కిజాకాంబళం అనేచోట దీపు అనే ఒక ఎస్‌సీ యువకుడిని (20) హత్య చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులు సీపీఎం కార్యకర్తలేనంటూ మర్మగర్భంగా తన తండ్రి పార్టీకి ఎస్‌సీల మీద ఉన్న ప్రేమ గురించి తెలియచెప్పింది ఆశా.

ఆశా లారెన్స్ ఇలా ‘వివాదాస్పదం’ కావడం ఇది రెండోసారి అట. మొదటిసారి ఎప్పుడు? దాని గురించీ తెలుసుకుందాం! నిజానికి ఆమె ఆక్రోశం, ఆవేదన, సీపీఎం అనే పార్టీ నుంచి ఆమె ఎదుర్కొంటున్న వేధింపులు ఈనాటివి కావు.

ఆశా లారెన్స్‌

ఆశా లారెన్స్‌కు ఒక కొడుకు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు మిలన్‌ ఇమ్మాన్యుయేల్‌ ‌జోసెఫ్‌. ఇతడు పాఠశాలకి వెళ్లే రోజులలోనే ఒక పని చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదేమిటంటే- బీజేపీ వాళ్లు నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరు కావడం.

‘మై నేషన్‌’ అనే పత్రిక అక్టోబర్‌ 30, 2018‌న ఫొటోతో సహా ప్రచురించిన ఈ విషయం, తదుపరి పరిణామాలు కూడా తెలుసుకోవాలి. శబరిమలై ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సీపీఎం చేసిన వీరవిహారం గురించి గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంగా ఒకరోజు కేరళ బీజేపీ వారు పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేశారు. వాటిలో పాల్గొనడానికి మిలన్‌ ‌జోఫెస్‌ ‌వెళ్లాడు. అప్పుడు జిల్లా కేంద్రాలలోను నిరశనలు జరిగాయి. విలేకరులు వెంటనే ఉత్సాహంగా ముందుకు వచ్చి, మీరు రాజకీయాలలోకి వస్తున్నారా? అసలు మీరు బీజేపీ వాళ్ల నిరాహార దీక్షలలో పాల్గొంటున్న సంగతి మీ ఇంట్లో తెలుసా? అని ప్రశ్నలు సంధించారు. ఇది స్వంత నిర్ణయం అని చెప్పాడు మిలన్‌ ‌జోసెఫ్‌. ‌తాను రాజకీయాలలోకి రావాలా? వస్తే ఏ పార్టీతో నడవాలి? వంటి సంగతులేమీ ఆలోచించలేదని కూడా  చెప్పాడా అబ్బాయి. ఈ మధ్య కుర్రాళ్లు చక్కని పరిజ్ఞానం సాధించుకుంటున్నారు. అందుకే ఒక సీపీఎం కుటుంబం నుంచి ఈ అబ్బాయి ఈ సభకు వచ్చాడని బీజేపీ కార్యకర్త విష్ణుసాయి వ్యాఖ్యానించారు. మనవడు బీజేపీ కార్యక్రమానికి వెళ్లడం గురించి ఎంఎం లారెన్స్ ‌కుమిలిపోయినట్టే ఉంది. ఇది చాలా తప్పు, అసలు ఆ సంగతే నాకు తెలియదు అని తేల్చారు. బీజేపీ ప్రతి కేరళ వాసిలోను మతోన్మాదం నింపాలని చూస్తోందని ఆక్రోశించాడు కూడా.

 కానీ సీపీఎం చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎంఎం లారెన్స్ ‌మనవడు  బీజేపీ దీక్షా శిబిరానికి వెళితే, మిలన్‌ ‌జోసెఫ్‌ ‌తల్లి ఆశాని ఉద్యోగం నుంచి ఆ పార్టీ ప్రభుత్వం తొలగించింది. నవంబర్‌ 2,2018‌న మై నేషన్‌లో ఈ వార్త కూడా వచ్చింది. ఈమె రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చిన్నతరహా పరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌. ‌తిరువంతనపురంలోనే పాల్యాం అనేచోట వీరి కార్యాలయం ఉంది. ఇంతకీ ఈమె అందులో శాశ్వత ప్రాతిపదికన పనిచేయడం లేదు. రోజువారీ వేతనంతోనే. అయినా తొలగించారు. తనను అక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఆశా ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌కార్యాలయం ఎదుట ఆమె ధర్ణా కూడా నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ పత్రిక ‘కేసరిలో’ వ్యాసం (ఏప్రిల్‌,2019) ‌రాశారు. వివాదం పెద్దదయింది. ఆఖరికి ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. కానీ తనను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవడానికి సంస్థ సుముఖంగా ఉన్నా, ఓట్టపాళెం మాజీ ఎంపి ఎస్‌. అజయ్‌కుమార్‌, ‌కేరళ మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ఎం‌సీ జోసఫీన్‌ అడ్డుకుంటున్నారని, వీళ్ల మీద చర్య తీసుకోవాలని ఆశా సీపీఎం అధినాయకత్వానికి ఆశా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పొలిట్‌ ‌బ్యూరోకీ, సెంట్రల్‌ ‌కమిటీకి ఆమె లేఖలు కూడా రాసినట్టు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ (ఆగస్ట్ 20, 2020) ‌రాసింది.

నిజానికి చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌కు రాక ముందు కూడా ఆశా లారెన్స్ ‌వేధింపులకు గురయ్యారు. అప్పుడామె ఎస్‌సీ/ఎస్టీ కమిషన్‌లో పనిచేశారు. అక్కడ ఆశాను వేధించే అవకాశం సీపీఎం ఇతరులెవరికీ ఇవ్వలేదు. అక్కడ ఆమెను వేధించినది ఒక మహిళే. ఆమె పేరు పద్మ. ఈమె మీద ఆశ వేధింపుల కేసు పెట్టారు. పద్మ  సీపీఎం కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ ‌దగ్గర బంధువు లిల్లీకి దగ్గర బంధువు. అవును, దూరపు  బంధువుకి దూరపు బంధువు. వేలు విడిచిన మేనరికం, బీరకాయ పీచు బాపతు. పద్మ మీద ఆశా తప్పుడు కేసు పెట్టారని పోలీసులు తీర్పు చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించడం పార్టీ నిర్ణయమని ఆమెకు కబురు వచ్చింది. ఇంతకీ ఈమె ఉద్యోగంలో చూపిన ప్రతిభకు మెచ్చి చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ రెండు పర్యాయాలు ప్రశంసాపత్రాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఎస్‌సీ/ఎస్టీ కమిషన్‌ ‌చైర్మన్‌గా ఉన్న మాజీ ఎంపీ అజయ్‌కుమార్‌ ‌తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని కూడా ఆశా ఆరోపిస్తున్నారు. తన తండ్రి అస్వస్థులుగా ఉన్నప్పుడు ఆయనకు సేవ చేయాలని వెళ్లినా పార్టీ తనను అనుమతించలేదని కూడా ఆశా ఆరోపించారు. చిత్రంగా తన కుమార్తె చేసిన ఆరోపణలేవీ వాస్తవాలు కావని ఆశా తండ్రి ఎంఎం లారెన్స్ ‌ప్రకటన ఇచ్చారు. మరి స్థానిక వార్తాపత్రికలలో దర్శనమిచ్చిన వార్తల సంగతేమిటో?

About Author

By editor

Twitter
Instagram