ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీలు ఇస్తున్న హామీలు రాష్ట్రాలను అధోగతి పాలుచేస్తున్నాయి. దీనికి ప్రధాన ఉదాహరణ ఆంధప్రదేశ్‌. 2019‌లో అధికారంలోకి వచ్చిన వైకాపా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించి విలువైన ధనాన్ని వృథా చేసింది. ‘నవరత్నాలు’ పేరుతో నెలకో పథకం అమలుచేస్తూ ప్రతినెలా వేలకోట్లు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం నిధులు పంచేయడంతో ఖజానా ఖాళీ అయింది. రాష్ట్ర ఆదాయం సరిపోక, కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లించి మరి నగదు చెల్లింపులు చేస్తోంది. ఇవి కూడా చాలక ప్రతి నెలా వేలకోట్ల రూపాయలు అప్పుల కోసం తాహసీల్దార్‌ ‌కార్యాలయాల నుంచి కలెక్టర్‌ ‌కార్యాలయాల వరకు, ప్రభుత్వాసుపత్రుల నుంచి పార్కుల వరకు తాకట్లు పెట్టేస్తోంది. ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల్లో చేసిన అప్పులు రూ.6 లక్షల కోట్లకు పెరిగిపోయాయి.


చేసిన అప్పులకు వడ్డీలే ఏటా రూ.42 వేల కోట్లు చెల్లించాలి. నెలకు రూ.3,500 కోట్లు వడ్డీలే కట్టాలి. ఈ పరిస్థితుల్లో ప్రతినెలా ఉద్యోగుల జీతాలకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. జీతాలు, నెలవారీ ఖర్చులు గడిచేందుకు పలు రకాల పన్నులు వేస్తోంది. 20 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన ఇళ్లకు పట్టాలిస్తామని చెప్పి వన్‌టైం సెటిల్‌మెంట్‌ అనే పేరుపెట్టి డబ్బులు కట్టాలని ఆదేశించింది. మూడేళ్లుగా ఒక్క అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించ లేదు. అంతకుముందు ప్రారంభించిన వాటిని పూర్తిచేయలేదు. రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసినా కనీసం అందులో 25 శాతమైనా మూలధన పెట్టుబడులుగా ఖర్చు చేయకపోవడం విచారకరం. సంక్షేమం అవసరమే. కానీ అవసరాలకు మించి అప్పులు తెచ్చి పంచేస్తోంది. ఆదాయ మార్గాలపై దృష్టి సారించకపోవడంతో ప్రభుత్వ నిర్వహణ కష్టంగా మారింది. ఈ రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తమ నవరత్నాల పథకాలకు 1.50 లక్షల కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు ప్రభుత్వమే ప్రకటిం చింది. అంతేకాదు, మరో రెండున్నరేళ్ల పాటు ఈ పథకాలకు డబ్బులు తేవాలి. ఈ ఆర్థిక అసమ తుల్యంతో ఆంధప్రదేశ్‌ ‌దివాళా తీసే పరిస్థితికి వచ్చిందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందు తున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వం కోరి తెచ్చుకున్నది. ఎన్నికల్లో గెలుపుకు ప్రతి మనిషికి ఉచిత హామీలు ప్రకటించడాన్ని, దానికి నిధులెలా సేకరిస్తారని ఎన్నికల కమిషన్‌ ‌వివరణ అడగకపోవడమే ఆంధప్రదేశ్‌ ‌పట్ల శాపమైంది.

డబ్బు ఇస్తామంటే ఎవరూ కాదనరు. 2019 ఎన్నికల్లో వైకాపా నవరత్నాల పేరుతో హామీలిచ్చింది. ఇవన్నీ నగదు పంపిణీకీ సంబంధించినవే. వైకాపా ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేవే. రేషన్‌ ‌కార్డున్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఏదొక పథకం అందేలా ఎన్నికల ఎజెండాను రూపొందిం చారు. జగన్‌ ‌తన పాదయాత్రలో ఎదురైన అందరికీ వరాలిచ్చేశారు. అవి పరిష్కరించే అవకాశం ఉందా, లేదా? అనేది కూడా ఆలోచించలేదు. ప్రభుత్వోద్యో గులకు సీపీఎస్‌ ‌విధానం తొలగిస్తామనేది ఈ రకంగా ఇచ్చినా హామీనే. ఎన్నికలకు ఏడాది క్రితం నుంచి ఈ నవరత్నాల పథకాలపై ప్రచారం చేశారు. ఎన్నికల సమయానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి తెలిసేలా ప్రచారం కొనసాగింది. నవ రత్నాల పథకాలు ఓటర్లకు ఆశ కల్పించడంతో వారంతా వైకాపాకు ఓట్లేసి 151 సీట్లు గెలిపించారు.

ఎన్నికల్లో గెలిచిన వైకాపా ప్రభుత్వం ‘నవ రత్నాలు’ అమలుకే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ తొమ్మిది పథకాల్లో కొన్ని అప్పటికే అమలవుతున్నవే. వాటికి పేర్లు మార్చారు. ఇలా ఒక్కో పథకానికి ఏడాదికి రూ.2 వేల కోట్ల నుంచి అత్యధికంగా అమ్మఒడి పథకానికై రూ. 6,760 కోట్లు నగదు బదిలీ చేస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం, హౌసింగ్‌ ‌ప్రాజెక్టులు, రైల్వే భాగస్వామ్య నిధులు, జిల్లాల రహదారులు ఇలా అన్ని పనులను పక్కన పెట్టింది, ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ ‌విధానాన్ని అమలుచేస్తామని ఇచ్చిన హామీని పక్కనపెట్టేశారు. చివరికి సీపీఎస్‌పై ఉద్యోగులు ఆందోళన చేయడంతో అవగాహన లేక హామీ ఇచ్చినట్లు చెప్పి వదిలించుకునే ప్రయత్నం చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న ఫిట్‌మెంట్‌ ‌కూడా 23 శాతానికి తగ్గించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో జీతాలకే అత్యధిక శాతం నిధులు ఖర్చయిపోతున్నాయి. అయినా సరిపోవడం లేదు. అంతేకాదు, ఆ నెల ఇవ్వాల్సిన పథకాల డబ్బు కోసం అప్పులు చేసి చెల్లిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీల కోసం ఢిల్లీలోనే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌రెడ్డి మకాం వేశారు. ఆయన ఏపీలో కంటే ఢిల్లీలోనే ఎక్కువ కాలం ఉంటున్నారు.

చెల్లింపుల పేరుతో ఓట్ల కొనుగోలు

సంక్షేమం పేరుతో ప్రజలకు చెల్లించే నగదు బదలాయింపులన్నీ 2024 ఎన్నికల్లో ఓట్ల కొను గోలుకు ఉద్దేశించినవే. 2019లో అధికారం చేపట్టినప్పటి నుంచి 2024 ఎన్నిక గురించే ఈ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే ముందు నుంచే ఓట్ల కొనుగోలు పక్రియను చేపట్టింది. తెల్లరేషన్‌ ‌కార్డు ఉన్న కుటుంబాల ఓట్లన్నీ గంపగుత్తగా వేయించుకునేలా ప్రణాళిక వేశారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు, అమ్మఒడి, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసే వైఎస్‌ఆర్‌ ‌చేయూత, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపువారికి ఏడాదికి రూ.18,750 చెల్లించే వైఎస్‌ఆర్‌ ఆసరా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇలా 9 రకాల పథకాలు అమలు చేస్తున్నారు. అన్నిటితో కలిపి 5 కోట్ల మందికి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర జనాభానే 5 కోట్లు. ఈ లెక్కన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. అయితే రెండు పథకాల ద్వారా ఒక్కరే లబ్ధి పొందుతున్నవారు కోటి మందికిపైగా ఉన్నారు. మొత్తం అయిదేళ్లలో నవరత్నాల అమలుకు సుమారు రూ. 3 లక్షల కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది.

పాలన అంటే అప్పులు చేసి తెచ్చిన సొమ్మును మీటనొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వేయడమేనని వైకాపా అనుకుంటోంది. అప్పులు తేవడం తప్పించి ఆదాయం సృష్టించే మార్గాలపై ఈ ప్రభుత్వానికి అసలు అవగాహన లేదని విపక్షాలు విమర్శి స్తున్నాయి. డబ్బులు పంచడానికి మద్యం ధరలు పెంచి పేదల జీవితాలను సర్వనాశనం చేయడాన్ని మహిళలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక ఇసుకను దొరక్కుండా చేసి మొత్తం నిర్మాణరంగాన్నే దెబ్బతినేలా చేయడంతో తమ జీవితాలు నాశనమై పోయినట్లు సుమారు 20 లక్షల మంది కార్మికులు ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతున్నారు.

కేంద్రం నుంచేమో నిధుల వరద!

కేంద్రం నుంచి వస్తున్న నిధులను కూడా తమ పథకాల కోసం దారి మళ్లిస్తున్నట్లు భాజపా ఆరోపిస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంఘం ద్వారా రూ.27,294 కోట్ల నిధులు రాష్ట్రానికి వచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్స రంలో రూ.77,538 కోట్లు వచ్చాయి. అంటే ఆర్థిక సంఘం నిధులు 2014తో పోలిస్తే రూ. 50 వేల కోట్లు పెరిగాయి. రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపేణా కేంద్రానికి రూ.55 వేల కోట్లు మాత్రమే వెళితే, ఆంధప్రదేశ్‌కు రూ.77,538 కోట్లు ఇచ్చారు. అంటే రూ. 20 వేల కోట్లు అదనంగా కేంద్రం ఇచ్చింది. పన్నుల వికేంద్రీకరణ రూపంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.13,692 కోట్ల నిధులు రాష్ట్రానికి వస్తే ఇప్పుడు రూ.24 వేల కోట్లు వచ్చాయి. అంటే పదివేల కోట్లు పెరిగాయి. ప్రత్యేక హోదాకు బదులు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు రూ.15 వేల కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు కేంద్రమే నిధులు చెల్లిస్తుంది. ఎయిడెడ్‌ ‌ప్రాజెక్టుల కింద వివిధ సంస్థల నుంచి తీసుకునే రుణాలకు వడ్డీతో సహా కేంద్రం చెల్లిస్తుంది. ఈ నిధులను దారి మళ్లించి తన పథకాలుగా వైకాపా ప్రచారం చేసుకుంటోంది. రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు మిగతావన్నీ కేంద్రం చేస్తున్న పనులే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని చేయకపోగా రాష్ట్రాన్ని ఎంతో ఆదుకుంటోందన్న కేంద్రంపై ఆరోపణలు చేయడంపై ఇటీవల నిర్వహించిన మేధావుల సదస్సులో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్‌ ‌నరసింహారావు మండిపడ్డాడు.

ఆంధప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ప్రమాదపు అంచున ఉంది. ఎంత ఆదాయం వస్తుంది. ఎంత ఖర్చ వుతుంది. ఎంత మిగులుతుంది. దాంతో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించి దాని ప్రకారమే అమలుచేస్తారు. మిగులు మొత్తాల్లో ఎక్కువ భాగం మూలధన పెట్టుబడులకు కేటాయిస్తారు. దీనివల్ల మౌలిక వసతులు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. కాని వైకాపా ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్‌ ‌చూస్తే ఏ మాత్రం అవగాహన లేనట్లు కనిపిస్తుంది. ఎందు కంటే బడ్జెట్‌ అం‌చనాల్లో బ్యాలెన్స్ ‌తప్పడమే ఇందుకు కారణం. బడ్జెట్‌లో చూపినదానికి విరుద్ధంగా ఖర్చులు చేయడం మూడేళ్లుగా జరుగుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును రూ.37 వేల కోట్లుగా చూపించింది. కాని ద్రవ్యలోటు తొమ్మిది నెలల్లోనే రూ.58వేల కోట్లకు చేరింది. రెవెన్యూ లోటును రూ.5 వేల కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొంటే మొదటి తొమ్మిది మాసాల్లోనే రూ.45 వేల కోట్లకు పెరిగింది. అంటే అదనంగా ఎంత ఖర్చుచేశారో తెలుస్తోంది. ఈ పరిస్థితిలో మిగతా రెండేళ్లలో పథకాలకు డబ్బులు ఎలా చెల్లించాలనే అంశంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. అప్పులు తీసుకోవడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పరిశీలిస్తున్నారు. అందిన కాడికి అప్పులు చేస్తూ అపసవ్య దిశలో ప్రభుత్వం వెళ్తోంది.

ఆంధప్రదేశ్‌ ఆర్థిక క్రమశిక్షణ తప్పి దివాళా దిశగా నడవడానికి కారణం నాడు వైకాపా ఓటర్లకు ఇచ్చిన హామీలే. ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా ఇచ్చిన హామీలపై ఎన్నికల కమిషన్‌ ‌స్పందించలేదు. ఆ పార్టీ ప్రకటించిన తాయిలాలకు నిధులు ఎలా సమీకరి స్తారని కమిషన్‌ ‌వివరణ కోరితే వైకాపా సమాధానం చెప్పాల్సి వచ్చేది. ఆ పార్టీ వివరించే ఆదాయ మార్గాలపై ఆర్థిక నిపుణులు లేదా కమిషన్‌ ‌సంతృప్తి చెందకుంటే వాటిని మేనిఫెస్టో నుంచి తొలగించే ఏర్పాటు జరిగేది. కాని ఎన్నికల కమిషన్‌ ‌పట్టించు కోకపోవడంతో ఇప్పుడు ఏపీ ఆర్థికంగా దిగజారి పోయింది. అందువల్ల ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలు ఇచ్చే హామీలపై నిధులు ఎలా సేకరిస్తారని ఎన్నికల కమిషన్‌ ‌వివరణ కోరాలని ఇటీవల ఒక సమా వేశంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ ‌కృష్ణారావు పేర్కొనడం చర్చనీయాంశం అయింది. ఎన్నికల్లో అప్పటికప్పుడు జరిగే ఓట్ల కొనుగోలును మాత్రమే ఎన్నికల కమిషన్‌ ఓటర్లను ప్రలోభపెట్టే నేరంగా పరిగణిస్తుంది. కేవలం గెలవడం కోసమే ఇచ్చే ఉచిత హామీలను కూడా ప్రలోభాలుగా పరిగణించి ఇలాంటి మేనిఫెస్టోలను కట్టడిచేసి ప్రజాధనం వృథా కాకుండా చూసే బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందనే వాదన బలపడుతోంది.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram