‘కొందరు సీపీఎం కార్యకర్తలు సంఘ పరివార్‌ ‌ప్రభావంలో పడిపోయారు. హిందూ కుటుంబాల మద్దతుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మెల్లగా, బలంగా వేళ్లూనుకుంటోంది’ నవ కేరళ పేరుతో ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ ‌మార్చి 1న ప్రవేశపెట్టిన విధానపత్రంలో వినిపించిన ఆక్రోశమిది. మార్చి 4వరకు ఎర్నాకులంలో పార్టీ 23వ సమావేశాలు జరిగాయి. సీపీఎం కార్యకర్తలు అటు వెళ్లిన సంగతి లేదా, వెళ్లిపోతున్న సంగతి ఏ మాత్రం పసిగట్టినా నిరోధించాలని పిలుపు కూడా ఇచ్చింది. ఇందుకు సీపీఎంకు ప్రత్యేకమైన శైలి ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల హత్యోదంతాలకు ముందే ఆర్‌ఎస్‌ఎస్‌ 3000 ‌మందికి శిక్షణ ఇచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ ‌చెప్పేశారు. మనం అధికారంలో ఉన్నా పార్టీ విస్తరించడం లేదని కార్యదర్శి వాపోయారు. అన్నింటిలోకి చొచ్చుకుపొమ్మని ఆదేశించారు. చిన్నా పెద్దా ఏ సంఘం, సంస్థ తలుపులు తెరచుకున్నా దూరిపొమ్మని చెప్పారు. ఎస్‌డీపీఐ, జమాత్‌ ఇ ఇస్లామీ కూడా మైనారిటీల కోసం ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని కొడియేరి చెప్పారు. 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని, బీజేపీని గద్దె దింపడమే ధ్యేయంగా పనిచేయాలని ముక్తాయించారాయన.


హిందువులకు సంఘ పరివార్‌ ‌దగ్గరవు తుంటే, మనం కూడా దగ్గరవుదాం అని కొడియేరి చెప్పలేదు. చెబితే అది సీపీఎం వేదిక ఎందుకవు తుంది? మనం ముస్లిం లీగ్‌తో దోస్తీ కట్టాలని కొడియేరి పిలుపునిచ్చారు. తెలిసో తెలియకో మరొక దేవ రహస్యం కూడా ఇక్కడ బయటపడింది. శాశ్వత శత్రువులను తయారుచేసుకునే అలవాటు మారాలని సమావేశం పిలుపునిచ్చింది. అది మైనారిటీల విషయంలో. సీపీఎంని మైనారిటీలు అక్కున చేర్చుకుంటున్నప్పటికీ కొందరు సభ్యులు వారి పట్ల వైమనస్యంతో ఉంటున్నారు. ఇది మారాలి అని పార్టీ పేర్కొన్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ను, హిందూత్వను విమర్శించ కపోతే సీపీఎం సమావేశాలకు పరిపూర్ణత రాదు. మైనారిటీలను నెత్తికెక్కించుకోకుంటే ఆశయసిద్ధి కాదు. ఇది పాత విధానమే. కానీ ఈసారి ఒక కొత్త పుంతలు తొక్కింది పార్టీ. అదే-రాష్ట్రంలోకి ప్రైవేటు పెట్టుబడులను, ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలోకి ఆహ్వానించడం. ఇదేమిటి? యూటూ ప్రైవేటు పోటా? అని ఎవరైనా అడుగుతారేమోనని, ఇది మాకు కొత్తకాదు, 1953లోనే ఇలా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించిన చరిత్ర పార్టీకి ఉందని మరచిపోవద్దంటూ ముందే వాదన తయారు చేసుకున్నారు. కాబట్టి సీపీఎం/ పాత కమ్యూనిస్టులు సహా ప్రైవేటుకు ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నమాటే! ప్రైవేటు వ్యతిరేకత కేరళ బయటే.

కేంద్రంలో మంచి ప్రతిపక్షంగా ఉంటుందను కుని కేరళ (కాంగ్రెస్‌ ‌నుంచి) 19 మంది ఎంపీలను పంపిస్తే, వారంతా ఎందుకూ పనిరాకుండా పోయారని కొడియేరి విమర్శించారు. సీపీఐ నుంచి సీపీఎంలోకి గోడ దూకుళ్లకు ఈ సమావేశాలు ఎర్ర తివాచీ పరిచాయి. సీపీఐ నుంచి సీపీఎంలోకి వచ్చే వారికోసం నిబంధనను సడలించారు. సీపీఐ నుంచి వస్తే నేరుగా అభ్యర్థికి సభ్యుని కిరీటం దక్కుతుందట. కానీ ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బ తీరుకు తీసిపోదు. గతంలోనే సీపీఎం వారికి సీపీఐ ఇలాంటి వెసులు బాటు కల్పించింది. సీపీఎం నుంచి వస్తే నేరుగా సభ్యత్వం కట్టబెడతామని చెప్పింది. ఇది రాష్ట్రంలో చాలాచోట్ల గడబిడ సృష్టించింది కూడా. కాబట్టి ఇది దానికి సీపీఎం ప్రతీకారమే. అంతేకాదు, పత్రికల పరిభాషలో చెప్పాలంటే కేరళ అధికార సీపీఎం, లెఫ్ట్ ‌సంకీర్ణంలోని సీపీఐకి మధ్య ఉన్న విభేదాలు ఈ సమావేశాల ద్వారా భగ్గుమన్నాయి. రెవిన్యూ, వ్యవసాయ మంత్రిత్వ శాఖల మీద కొందరు ప్రతినిధులు విరుచుకుపడ్డారు. ప్రముఖంగా ఇదుక్కి ప్రతినిధులు చీల్చి చెండాడారు. దశాబ్దాలుగా భూములు దున్నుకుంటున్నవారికి హక్కులు ఇవ్వడానికి రెవిన్యూ శాఖ నిరాకరిస్తున్నదని వారు ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలకు కొడియేరి కూడా వంత పాడారు. ఇంతకీ కేరళ వామపక్ష సంకీర్ణంలో ఆ రెండు మంత్రిత్వ శాఖలు సీపీఐ వారి చేతిలో ఉన్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నదని ఇంకొందరు సభ్యులు ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులకు సరైన ధరలు లభించడం లేదని కూడా దుమ్మెత్తి పోశారు. ఇదంతా చూస్తుంటే పినరయ్‌ ‌తన మంత్రులకు ఇంత స్వేచ్ఛనిస్తారా? అన్న ప్రశ్న వస్తుంది. ఇది నిజమైతే మన తెలుగు రాష్ట్రాల మంత్రులు కొంతయినా నేర్చుకోవాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేంద్ర కమిటీ అనుమతి మేరకు తగిన హోదాలు కట్టబెడుతున్నామని కొడియేరి చెప్పారు. ముస్లిం లీగ్‌ ‌తిరుగుబాటు నాయకుడు టీకే హమాస్‌, ఏఐసీసీ సభ్యుడు పీలిపోస్‌ ‌థామస్‌లకు ఇంతకు ముందు నేరుగా సభ్యత్వం ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కానీ కేటీ జలీల్‌ అనే నాలుగు పర్యాయాల ఎమ్మెల్యే దగ్గరకు వచ్చే సరికి కళ్లు తెరుచుకున్నాయి. ఈయనకి అలాంటి వైభవం దక్కలేదు. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌బొక్కబోర్ల పడిన తరువాత కాంగ్రెస్‌ ‌వారు సీపీఎం కార్యాలయాల ముందు బారులు తీరారట, సభ్యత్వం కోసం.

ఇదంతా చూస్తుంటే కమ్యూనిస్టు పార్టీలు కార్యకర్తల గళాలు విప్పడానికి అంగీకరిస్తున్నాయని ఒప్పుకోవాలని అనిపిస్తుంది. అవి కాకపోతే, ఈ సమావేశాలలో మహిళలు చెప్పిన మాటలు విన్నాక భావ ప్రకటనా స్వేచ్ఛను ఈ పార్టీలు కూడా గౌరవించడం నేర్చుకుంటున్నాయన్న కఠోర సత్యం అంగీకరించక తప్పదు. ‘పితృస్వామ్యం భావజాలం, మహిళా వ్యతిరేక ధోరణి ఇప్పటికీ పార్టీలో ఉన్నాయి’ అని మహిళలు చెప్పగలిగారు మరి.

పార్టీలో కొందరు నాయకులు మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌. ‌బిందు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీపీఎం వ్యవస్థా వ్యవహారాల నివేదిక మీద జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించారు. పార్టీలో కొంతమంది ఇప్పటికీ మహిళలతో అమర్యాదకరంగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాంటి నాయకుల మీద ఇచ్చిన ఫిర్యాదులను కూడా గట్టిగా పరిశీలించడం లేదని కూడా అన్నారు. అసలు వాటిని పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదని చెప్పారు. అళప్పుజ ప్రతినిధులు పార్టీలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేదని అన్నారు. కొన్ని శాఖలకు మహిళలు కార్యదర్శులుగా ఉన్నప్పటికీ ఇప్పటికీ పార్టీని పితృస్వామ్యం వీడలేదని ఆరోపించారు. అలాగే మహిళల సమస్యల గురించి శ్రద్ధ పెట్టడం లేదని చెప్పారు. ఈ సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కూడా నేతలకు లేదని ఆ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతినిధులు విమర్శిం చారు. ఇలాంటి పరిస్థితిలో ఒక మహిళను రాష్ట్ర సీపీఎం ప్రధాన కార్యదర్శిని చేస్తే చరిత్రాత్మకంగా ఉంటుంది కదా! సరిగ్గా ఇదే చెప్పారొక పెద్దాయన.

కేకే శైలజా టీచర్‌ను (మాజీ మంత్రి) కేరళ సీపీఎం కార్యదర్శిని చేయాలని ప్రముఖ రచయిత, పార్టీలో వయోవృద్ధుడు బెర్లిన్‌ ‌కుంజునాథన్‌ ‌నాయర్‌ అభిప్రాయపడ్డారు. నేను ఈ విషయం గురించి ప్రకాశ్‌ ‌కారత్‌కి చెప్పాను కూడా అంటున్నారాయన. తన ప్రతిపాదన వాళ్లు వ్యతిరేకం కాకపోవచ్చునని పెద్దాయన నమ్మకం. అది దురాశే. పినరయ్‌కి వ్యతిరేకంగా మాట్లాడితే ఎదుగుదల ఉంటుందా? నిన్నటి మంత్రివర్గంలో శైలజ మంత్రి. తానే సర్వంసహాధికారిగా ఉండాలని పినరయ్‌ ఆమెను మంత్రిమండలిలో రెండోసారి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తే జరిగిన అన్యాయాన్ని నివారించే అవకాశం వస్తుందని కుంజునాథన్‌ ‌కోరుకున్నారు. ఇది మాతృభూమి. కామ్‌కు చెప్పారు కూడా. అలా చేస్తే ఈ సమావేశాలు చరిత్రాత్మకం అవుతాయని ఆయన ఊహ. ఈసారి కాకపోతే వచ్చే దఫాకైనా శైలజికి ఆ అవకాశం ఇవ్వాలని కుంజునాథన్‌ ‌మార్గాంతరం కూడా సూచించారు. మహిళలకు సమానావకాశాలు అన్న పార్టీ విధానం మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలో కూడా చూపినట్టవుతుందని కుంజునాథన్‌ అభిప్రాయం. మేం మాటలకే పరిమితం అన్నారు నాయకులు. మళ్లీ కొడియేరినే కార్యదర్శిగా నియమించుకున్నారు. అయినా ఈ పెద్దాయనకు అసలు లౌక్యమే తెలియదనిపిస్తున్నది. ఎన్నికలకు ముందు శైలజ (ఆరోగ్య) మంత్రిగా ఉండేవారు. కొవిడ్‌ ‌వేళ మంచి పేరు తెచ్చుకున్నారు. తరువాత ఎన్నికలలో మంచి మెజారిటీ వచ్చింది. ఆవిడని మళ్లీ మంత్రిని చేస్తే తన ప్రభ మసకబారిపోతుందని పినరయ్‌ ఆమెకు పదవి ఇవ్వలేదు అని కుంజునాథన్‌ ‌చెప్పారు. ఆమె పినరయ్‌ ‌కంటే మంచి ప్రతిభ చూపిందని అమెరికాలో కూడా స్వాగతం పలికారని మరొక బాంబు కూడా పేల్చారు బెర్లిన్‌ ‌కుంజు నాయర్‌.

‌కేరళ అభివృద్ధి కోసం ప్రపంచం నుంచి పెట్టుబడులను ఉపయోగించుకోవడం అనివార్యమని ఈ సమావేశాలలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొడియేరి, ముఖ్యమంత్రి పినరయ్‌ ‌యుగళగీతం పాడారు. ఈ బాణీ పెను మార్పు. ప్రైవేటు పెట్టబడులకు అవకాశం కల్పించాలని ఈ విధానపత్రం పేర్కొంటున్నది. ఇందుకు ముఖ్యమంత్రి చెప్పిన రెండు కారణాలు మహా తమాషాగా ఉన్నాయి. కేంద్ర విధానాలు కేరళకు ఎలాంటి అవకాశాలు దక్కకుండా అన్ని దారులు మూసివేశాయి. అందుకే రాష్ట్రానికి ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక మార్గం గరిష్టంగా ప్రైవేటు పెట్టుబడులను అంగీకరించడమే అన్నారు పినరయ్‌. ఎటొచ్చి ‘ప్రమాద రహిత పెట్టుబడులను’ ఆహ్వానిస్తా మని చెప్పారు. మరొక కారణం-బూర్జువా భూస్వాములు రాష్ట్రాన్ని శాసించే స్థితిని ప్రైవేటు పెట్టుబడి ఎలా మారుస్తుందో కూడా ముఖ్యమంత్రి అరటిపండు ఒలిచి విప్పినట్టు చెప్పారు. కాబట్టి ప్రైవేటు పెట్టుబడులకు కేరళ సీపీఎం వ్యతిరేకం కాదు. కానీ అక్కడి కార్మిక సంఘాల మాటేమిటి? ఇక మీ ఆగడాలు చెల్లవు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ సభల ద్వారా హెచ్చరించడం మంచి పరిణామమే.

సీపీఎం రాష్ట్ర సభలలో బుధవారం ప్రవేశ పెట్టిన విధానపత్రం రాష్ట్రంలోని కార్మిక సంఘాల గురించి ప్రస్తావించింది. ఇది సీఐటీయూ (సెంటర్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌ట్రేడ్‌ ‌యూనియన్‌) ‌నేతల చేత కనుబొమలు ముడిపడేటట్టు చేసింది. అంతేకాదు, కార్మిక సంఘాల పంథాలను ముఖ్యమంత్రి విమర్శించడమే కాదు, ఆ సంఘాలలో తప్పుడు విధానాలు అమలవుతున్నాయని కూడా ఆరోపిం చారు. తప్పుడు విధానాల సంగతి తెలిసినప్పటికీ వాటినే కొనసాగిస్తున్నాయని కూడా విమర్శించారు. కొన్ని దశాబ్దాలుగా కార్మిక సంఘాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. తమవి కొన్ని తప్పుడు విధానాలు అని తెలిసినా కూడా కొనసాగిస్తున్నాయని దుయ్య బట్టారు. అది సమాజంలోని ఇతర వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. కేరళ వామపక్ష కార్మిక సంఘాలకు కావలసినంత చెడ్డపేరు తెచ్చి పెట్టిన ‘నొక్కు కూలి’ పద్ధతిని దృష్టిలో ఉంచు కునే పినరయ్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారు. ఈ పద్ధతి మీద ఈ మధ్య జరిగిన కొన్ని నిరసన ప్రదర్శనలు ప్రభుత్వ, సీపీఎం పార్టీల ప్రతిష్టను దెబ్బ తీశాయి. ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం, నొక్కు కూలి పద్ధతి మీద పార్టీ సమావేశంలో వచ్చిన విమర్శలను పరిశీలించిన తరువాత సీఐటీయూ నేతలలో చర్చ మొదలయింది. ఈ విధాన పత్రం ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం తెస్తుందని నేతలు భయపడుతున్నారట.

ఇక కాంగ్రెస్‌, ‌సీపీఎం బంధం గురించి ఈ సమావేశాలలో ఇంకా మేడ్‌ ‌డిఫికల్ట్ ‌చేశారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లను నిరోధించడానికి కాంగ్రెస్‌తో కలసి ప్రయాణించాలన్నదే ఆ పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి వాదన. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం (తన గంటన్నర ప్రారంభోపన్యాసంలో ఏచూరి ఒక్కసారి కూడా కాంగ్రెస్‌ ‌పేరు ప్రస్తావించలేదు) బలహీన పడిందని తేల్చారు. అసలు దేశంలో సీపీఎం బతికిబట్టకడుతున్నదంటే అందుకు కేరళ సీపీఎం కారణమన్న సత్యాన్ని కూడా తిరుగులేకుండా చెప్పేశారు. అంటే కేరళ సీపీఎం ముందు సాగిలబడ్డారు. అలాగే సెక్యులరిజం రక్షణలో, మతోన్మాద శక్తులను ప్రతిఘటించడంలో కేరళ సీపీఎం అద్భుతంగా పనిచేస్తోందట. అయితే ముస్లిం లీగ్‌తో అంటకాగుతున్నా అది సెక్యులర్‌ ‌పార్టీయే. కాషాయం గోల, ప్రైవేటు పెట్టుబడి ఇవన్నీ సరే, మొన్న వర్షాలతో రాష్ట్రం చచ్చి బతికితే పర్యావరణం గురించి ఒక్క ముక్కయినా విధాన పత్రంలో కనిపించదేం? అని సాధారణ కార్యకర్తలు ఉరుముతున్నారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు మీకెందుకు గుర్తుకు రాలేదని నిలదీస్తున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలను తెరుస్తారు సరే, అందులో అందరికీ స్థానం ఉంటుందా? మీ విధానపత్రంలో ఏదీ సమాధానం అంటున్నారు.

సీపీఎం తీసుకున్న కొత్త పంథా గురించి విద్యావంతులు, మేధావుల అభిప్రాయాలు కూడా గమనార్హంగా ఉన్నాయి. ప్రైవేటు విద్యాలయాల విషయంలో దానిని ప్రైవేటు పెట్టుబడి అనే కంటే ప్రైవేటు వ్యయం అంటే బావుంటుంది అని కేరళకు చెందిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎం. ‌కున్హామన్‌ అం‌టున్నారు. అశోక, ఆసిమ్‌ ‌ప్రేమ్‌జీ, జిందాల్‌ ‌విశ్వవిద్యాలయాలు ప్రైవేటు రంగంలో అద్భుతంగా, ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నాయని చెప్పారు కున్హామన్‌. ఇం‌కా, ‘ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చూసినా కమ్యూనిస్టు పార్టీలన్నీ ప్రైవేటు పెట్టుబడులకు వ్యతిరేకంగా లేవు. దానిని వ్యతిరేకించడం అర్ధరహితమని వాటికీ అర్ధమైంది. ఉన్నత విద్య ప్రాధాన్యం గురించి గుర్తించిన పెద్ద నేతలలో నెహ్రూ ఒకరు. ఐఐఎం, అహ్మదాబాద్‌ను ఆయనే నెలకొల్పారు. ఇప్పుడు అది ప్రపంచంలోని గొప్ప విద్యాసంస్థలలో ఒకటి. నిజానికి ఇవాళ్టి ప్రపంచంలో విదేశీయం, దేశీయం అనేవే లేవు. తూర్పు పడమర రెండూ వేర్వేరు కాదు. భూమి గుండ్రం అని ఈ అర్ధంలోనే నెహ్రూ అన్నారు. కాబట్టి సీపీఎం నెహ్రూ విధానాన్ని ఆశ్రయించినట్టు కనిపిస్తున్నది. అయితే దీనిని ఆ పార్టీ బహిరంగంగా వెల్లడించదు’ అని కూడా కున్హామన్‌ అన్నారు. ఒకప్పుడు సీపీఎం యంత్రీకరణనీ, కంప్యూటరైజేషన్‌ను కూడా వ్యతిరేకించింది. అప్పటికి అది సరైనదే. ఎందుకంటే ఉద్యోగాలు పోతాయని అందరికీ భయం. ఇప్పుడో, కంప్యూటర్‌ ‌లేకుండా బతకలేం. కాలాన్నిబట్టి మారాలని సీపీఎం నిర్ణయించుకుంటే దానిని స్వాగతించవలసిందే అన్నారు కున్హామన్‌.

– ‌జాగృతి డెస్క్

By editor

Twitter
Instagram