సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ ఫాల్గుణ మహుళ తదియ

21 మార్చ్చి 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఎన్నికలతో నూతన లోక్‌సభ ఆవిర్భవిస్తుంది. కొత్త శాసనసభలు కొలువవుతాయి. కేంద్రంలో, రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలను ప్రతిష్టిస్తాయి. ఇది ఎన్నికల గురుతర బాధ్యత. ఏ రాజకీయ పక్షానికి ఎన్ని సీట్లు వచ్చాయి, ఓట్ల శాతమెంత? ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం ఏ రాజకీయ పక్షానికి విజయం అందించింది? ఏ పక్షాన్ని మట్టి కరిపించింది? ఏ వర్గం ఆగ్రహానికి ఏ ప్రభుత్వం బలైంది? ఏ ఉద్యమం ఏ రాజకీయ పక్షాన్ని శంకరగిరిమన్యాలు పట్టించింది? ఇవన్నీ ఎన్నికల విశ్లేషకుల పని. కానీ ఎక్కువమంది విశ్లేషక వీరులు దాస్తున్న వాస్తవం ఉంది. అది- ఇటీవల కాలంలో వెలువడిన దాదాపు అన్ని ఎన్నికల ఫలితాలలో బయటపడిన మరొక గుణాత్మకమైన కోణం కూడా. అదే- దేశం కోసం, ధర్మం కోసం పడుతున్న సానుకూల ఓటు. భారతీయతకు బలం చేకూరుస్తున్న ఓటు. జాతీయతను నమ్మే ప్రభుత్వాలకు శక్తిసామర్థ్యాలను ప్రసాదిస్తున్న ఓటు. ఈ కోణం ఇక మన ఎన్నికల వ్యవస్థలో, ఫలితాల విశ్లేషణలో విస్మరించడం సాధ్యంకానిదని నిన్నగాక మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలతో పరిపూర్ణంగా రుజువైంది.

దేశంలో మైనారిటీ ఓటు బ్యాంకు ఒక వాస్తవం. తమ ఓట్లతో అధికారం లోకి వచ్చి తమను విస్మరిస్తున్నారని మైనారిటీలు చిరకాలంగా బ్లాక్‌మెయిల్‌ ‌చేస్తున్న మాటా అంతే నిజం. ఈ ఆరోపణలో వాస్తవమెంతో చెప్పడం కష్టం కాదు కానీ, నిజానికి ఆ ఆరోపణ చేయవలసింది ఈ దేశ మెజారిటీలు. చీలిపోయిన ఓట్ల ఫలితమా అంటూ గడచిన యాభయ్‌ అరవై ఏళ్లుగా మెజారిటీ ప్రజల మనోభావాలు ఛిద్రమవుతున్నాయి. వారి ధార్మిక సంస్థల విచ్ఛిన్నం, సాంస్కృతిక దాడి దానికి కొనసాగింపు. ఇక ఐక్యమవుతున్న మైనారిటీ ఓటు! నానాటికీ మతోన్మాదాన్ని ప్రదర్శిస్తోంది. దేశాన్ని మరోసారి చీల్చాలనే దాకా వెళ్లిపోతోంది. ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తించడంలో ఘోర జాప్యం జరిగినా ఇప్పుడు ఈ ఓటు రాజకీయ విష వలయాన్ని ఛేదించి ఇక్కడ పుట్టినవారంతా భారతీయులే, ఆరాధనా పద్ధతులతో నిమిత్తం లేకుండా భారతదేశాన్ని తల్లిగా భావించే వారంతా అన్నదమ్ములే, అక్కాచెల్లెళ్లేనన్న భావనకు ఓటు మరలుతోంది. ‘హిందువుల పార్టీ’ ముస్లింలకు, కేథలిక్‌ ‌క్రైస్తవులకు నమ్మదగిన రాజకీయశక్తిగా క్రమంగా ఆవిర్భవిస్తున్నది.

ఓటు గొప్ప హక్కే కాదు, పెద్ద శక్తి కూడా. పదవిలో ఉండగా, ఎన్నికల ప్రచారంలో ఉండగా హిందూ జాడ పడకుండా జాగ్రత్తపడినవారే ఇప్పుడు ఎన్నికల ముందైనా గుళ్లూగోపురాల చుట్టూ తిరుగుతున్నారు. పాలాభిషేకాలు చేస్తూ ఫొటోలకు పోజులిస్తున్నారు. కుంకుమతో, విభూతితో నుదురంతా కప్పుతున్నారు. యజ్ఞోపవీత ధారణనూ ప్రదర్శనకు పెడుతున్నారు. కులగోత్రాలతో సంకల్పాలు చెబుతున్నారు. కానీ, నిన్నటి పరిస్థితి ఏమిటి? చరిత్రాత్మక సోమనాథ్‌ ‌దేవాలయంలో ప్రతిష్టకు వెళ్లడానికి వీల్లేదని ప్రథమ పౌరుడికి ప్రథమ ప్రధాని అక్షరాలా అడ్డుపడిన క్షణాన్ని ఈ దేశం చూడలేదా?  ఇవాళ, ఊర్ద్వపుండ్రాలతో అయోధ్యలో భవ్య మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నాయకుడు ప్రజలకు ఆరాధనీయుడు. నుదుట విభూతిరేఖలతో కాశీ విశ్వనాథుడికి పూజలు చేసిన నేత ప్రజా హృదయాలను గెలుస్తున్న సమ్రాట్‌. ‌గంగకు హారతి పట్టిన చేయి, దేశానికి అభయహస్తమైంది. శంకర భగవత్పాదుల మహా ప్రతిమ ఎదుట సాష్టాంగ నమస్కారం చేసిన నాయకుడు జాతికి మాననీయుడు. అందుకే తాజా ఫలితాల వెనుక నిశ్శబ్ద విప్లవం ఉందని చెప్పాలి.

ఇలాంటి గుణాత్మకమైన పరివర్తన ఎలాంటి నేపథ్యంలో వచ్చిందో కూడా గమనించాలి. శాంతియుతంగా ఉద్యమిస్తున్న రామభక్తులను అయోధ్యలోనే తుపాకులతో కాల్చేసిన కాలమిది. కరసేవ కోసం అయోధ్య వస్తున్న రామభక్త బృందాన్ని రైలుబోగీలో సజీవ దహనం చేసి, తిరిగి రామభక్తులనే తప్పు పట్టిన సమయమిది. అత్యధిక ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా హిందూధర్మాన్ని చులకన చేసే రాజకీయ పక్షాలు అధికార పీఠాలు ఎక్కుతున్న రోజులివి. హిందూ దేవస్థానాల మాన్యాలను ఎడారి మతాలకు కట్టబెడుతున్న చెడ్డకాలమిది. అయినా మత సహనం లేనిది హిందువులకేనంటూ అపనింద.   హిందూధర్మాన్ని కూకటివేళ్లతో పెళ్లగిస్తామని అంతర్జాతీయ వేదికల మీద పెడబొబ్బలు వినిపిస్తున్న దుష్టకాలమిది. కొన్ని విశ్వ విద్యాలయాలలో దేశ విచ్ఛిన్నమే, హిందూ విధ్వంసమే పాఠ్య ప్రణాళిక.

ఒక్క ఓటు కోసం, దానితో వచ్చే ఐదేళ్ల పదవి కోసం, కుటుంబం కోసం ఈ దేశం వేల సంవత్సరాలుగా ఆరాధించే ధర్మాన్ని పణంగా పెడతామంటే ఒప్పుకునే హిందువులు ఇప్పుడు లేరని అర్ధం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి వ్యవస్థను మార్చుకోవడానికి ఓటునే నమ్ముతూ, ఆ ఆయుధానికి కొత్త వ్యూహాన్ని నేర్పుతున్నారు వారు. సమీప గతాన్ని పునరావృతం చేయడమే ధ్యేయంగా మైనారిటీలు ఏకమవుతుంటే తాము ప్రేక్షక పాత్రకు పరిమితం కాలేమని బలమైన సందేశం పంపుతున్నారు. ఈ నిశ్శబ్ద విప్లవంలో వినిపించేది అదే. తమ ఓటుతో నాయకుడే కాదు, హిందూత్వ కూడా గెలవాలన్న దృష్టికి వచ్చారు. కుహనా సెక్యులరిజానికీ, దొంగ రైతులను ఉసిగొలిపే పార్టీలకీ ఓటు వేసి భారతీయ సమాజానికి ఇంకా ఇంకా చేటు చేయలేమని ప్రకటిస్తు న్నారు. ఇదొక సాంస్కృతిక చైతన్యం. ఒక్క మైనారిటీ కూడా ప్రాణాలు కోల్పో లేదు. అయినా హిందూత్వ గెలిచింది. మైనారిటీలకు చెందిన ఒక్క ప్రార్థనా మందిరం కూలలేదు. అయినా హిందూధ్వజం ఎగిరింది. మైనారిటీల శవాల మీద, వారి ప్రార్థనామందిరాల శిథిలాల మీద హిందూ పతాకం ఎగురవేయడం ఇక్కడ ఎవరి అభిమతమూ కాదన్నది కూడా ఈ ఎన్నికల ఫలితాలలో ప్రతిఫలిం చింది. ఆ హిందూధ్వజం రేపూ ఎగరాలి. నిన్న ఎన్నికలలో ఓడినా, తెల్లారే సరికే పాకిస్తాన్‌కు జిందాబాద్‌లు సలాములు సమర్పించే విద్రోహశక్తులు నిండిన పార్టీని మట్టికరిపించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోయేవాళ్లం కదా!

About Author

By editor

Twitter
Instagram