–  తురగా నాగభూషణం

మద్యం మత్తులో పేదలు రాలిపోతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం పేదలకు ఆర్థిక, ప్రాణ నష్టాలు కలిగిస్తోంది. ఇసుక పాలసీతో నిర్మాణరంగ కార్మికుల ఉపాధి కాజేసిన ప్రభుత్వం నాటుసారా తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిని చూసి వికృతంగా నవ్వుతూ పైశాచిక ఆనందం పొందుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో 18 మందికిపైగా నాటుసారా తాగి మరణించిన సంఘటన ఎవరి హృదయాలనైనా కలచివేస్తోంది. కానీ ప్రభుత్వం గుండె కరగడం లేదు. ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాము కూడా బాధితులం అయిపోతామేమో అని మందుబాబుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

నాటుసారా ఉత్పత్తి ఏజెన్సీ ప్రాంతంలో కుటీర పరిశ్రమలా సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడమే ఈ పరిస్థితికి కారణం. పెరిగిన మద్యం ధరలు భరించలేక చాలామంది నాటుసారా వైపు మరలడం పరోక్ష కారణంగా కనిపిస్తోంది. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం మాత్రం సరిగా స్పందిం చడం లేదు. పద్దెనిమిది మంది చనిపోయారు. వారెందుకు చనిపోయారో కూడా అందరికీ తెలుసు. కాని ప్రభుత్వానికే తెలియదు. అధికంగా మద్యం సేవించి మరణించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కొవిడ్‌ అనంతర లక్షణాలతో చనిపోయా రని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ హేళన చేయడాన్ని ప్రజలు అసహ్యించు కుంటున్నారు. ఈ సంఘటన వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మీడియాలో ప్రచారం జరగకుండా జాగ్రత్త వహిస్తోంది. ఇవి నాటుసారా కారణంగా సంభవించిన మరణాలుగా గుర్తించడానికి ముందుకు రావడం లేదు. వేరే కారణాలు చెబుతూ విషయాన్ని పక్కదారి పట్టిస్తోంది. ఈ ప్రభుత్వం మూడేళ్లలో ప్రజలకు చేసిన మేలేమీ లేకున్నా గంజాయి, నాసిరకం మద్యం, డ్రగ్స్, ‌నాటుసారాల యథేచ్ఛ విక్రయాలతో మత్తుకు బానిసలను చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

జనాలను చంపే పాలసీలు

వైకాపా ప్రభుత్వం రావడంతోనే నూతన మద్యం పాలసీని తెచ్చింది. ప్రభుత్వమే దుకాణాలు ప్రారంభించి మద్యం అమ్ముతుందని ప్రకటించి, ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించింది. గతంలో అమ్మే బ్రాండెడ్‌ ‌మద్యం సరఫరాను నిలిపివేసింది. ఊరూ పేరూ తెలియని బ్రాండ్లను దుకాణాల్లో అందుబాటులో ఉంచింది. గతంలో అమ్మిన ధరలకు రెండు రెట్లు అదనంగా పెంచి విక్రయించింది. మద్యం అలవాటున్న వారు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే మద్యాన్నే కొని సేవిస్తున్నారు. నాసిరకం కావడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. రెండేళ్లపాటు ఇదే ధరలతో అమ్మిన ప్రభుత్వం తెలంగాణ నుంచి వచ్చే అక్రమ సరఫరాను ఆపలేక కాస్త ధరలు తగ్గించింది. మద్యం సేవించే వారి నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో మరికొంత తగ్గించింది. అయినా వీటి ధరలు పాత ధరలతో పోలిస్తే 30 శాతం అదనంగా ఉన్నాయి.

ఏజెన్సీల్లో నాటు సారా ఉత్పత్తి

ఏజెన్సీ ప్రాంతాల్లో నాటుసారా ఉత్పత్తి యథేచ్ఛగా సాగుతోంది. నాటుసారా ఉత్పత్తి కొత్తది కాకపోయినా ప్రభుత్వం అమలుచేస్తున్న మద్యం పాలసీ అటువైపు మళ్లేలా చేసింది. ఏజెన్సీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాలు, టౌన్‌లలో అతి తక్కువ ధరకు లభించే నాటుసారా సేవించడం ఎక్కువైంది. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో మూడేళ్ల నుంచి నాటుసారా ఉత్పత్తి కుటీర పరిశ్రమలా సాగుతోంది. తయారీదారుల నుంచి విక్రయించేవారి వరకు; నియంత్రణలో భాగస్వాములైన ఎక్సైజ్‌ ‌శాఖ నుంచి పోలీసుల వరకు ‘మాకది-మీకిది’ అన్న రీతిలో వాటాలు కుదరడంతో నాటుసారా ఏరులై పారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ.100కు ఊరు పేరు లేని చెత్త మద్యం సేవించినా, రూ.20కి లభించే నాటుసారా ప్యాకెట్‌ ‌సేవించినా లభించే కిక్కు ఒకటే అనే అభిప్రాయంతో మందుబాబులు నాటుసారా వైపు మొగ్గు చూపారు. భారీగా లాభాలు ఉండటంతో వైకాపా నాయకులే నాటుసారా ఉత్పత్తిలో కూడా భాగస్వాములైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వానికి తెలిసినా తమ పార్టీ నాయకులకు లభించే ఆదాయానికి అడ్డుపడకుండా చూసుకుంటోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గ్రామస్థాయిలో సచివాలయ వ్యవస్థ ఉంది. ఇందులో మహిళా పోలీసులతో పాటు, 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ‌చొప్పున ఉన్నారు. గ్రామాల్లో నాటుసారా తయారీ అంతా దాదాపుగా బహిరంగం గానే సాగుతుంది. ఎవరు సారా తయారు చేస్తున్నారో ఇట్టే సమాచారం వచ్చే అవకాశం ఉంది. సచివాలయ, వాలంటరీ వ్యవస్థను ఉపయో గించుకుని నాటుసారా అమ్మకాలను అడ్డుకోవడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు.

మద్యం నిషేధం హామీ నీటి మూటేనా?

మద్య నిషేధంపై వైకాపా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగా కనిపిస్తున్నాయి. పేదల బతుకుల్ని మద్యం ఛిన్నాభిన్నం చేస్తుందని జగన్‌ ‌పదే పదే విమర్శించారు. అధికారంలోకి రాగానే మద్యాన్ని దశలవారీగా 2024 లోపు నిషేధిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. అధికారం చేపట్టాక ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దశలవారీ మద్య నిషేధాన్ని పక్కన పెట్టేశారు. వైకాపా ఇచ్చిన హామీ మేరకు మూడేళ్లలో 60 శాతం దుకాణాలు తొలగించాలి. కాని అలాంటిదేం జరగలేదు. ఇప్పుడు మిగిలిన రెండేళ్లలో దుకాణాలు మూసేస్తారని కూడా భావించలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాబోయే 25 ఏళ్లలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని హామీగా చూపి ప్రభుత్వం రుణం తీసుకుంది. అంటే మద్య నిషేధం అమలు రాబోయే 25 ఏళ్ల వరకు జరగదనే విషయం తెలిసిపోయింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌లో చూపించిన లెక్కలు మద్యంపై వచ్చే ఆదాయం మీద ప్రభుత్వం ఎంతగా ఆధారపడిందో తెలియజేస్తుంది. కనీసం రూ.20 వేల కోట్ల రాబడిని ఆశిస్తోంది.

25 వేల విక్రయాలకు వ్యూహాలు

రాబోయే ఆర్థిక సంవత్సరంలో (2022-23) రాష్ట్ర ఎక్సైజ్‌ ‌పద్దు కింద రూ. 16,500 కోట్ల మేర ఆదాయం ఉంటుందని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.14,500 కోట్లు రాబడి వస్తుందని.. సవరించిన అంచనాల్లో పేర్కొంది. దాంతో పోలిస్తే 2022-23లో రాష్ట్ర ఎక్సైజ్‌ ‌పద్దు ద్వారా అదనంగా రూ.2,500 కోట్ల మేర రాబడి లభిస్తుందని అంచనా. మరి ఆ మేరకు లక్ష్యానికి చేరుకోవాలంటే మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచాల్సిందేనని బడ్జెట్‌లో పరోక్షంగా ప్రభుత్వమే చెప్పింది. 2019-20లో రూ. 20,871 కోట్లు, 2020-21లో రూ. – 20,189 కోట్లు విలువైన మద్యం అమ్మిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22లో) ఇప్పటివరకూ రూ.22 వేల కోట్లకు పైగానే విక్రయాలు జరిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పద్దు కింద రూ.14,500 కోట్ల మేర రాబడి ఉంటుందని సవరించిన అంచనాల్లో పేర్కొంది. 2022-23లో రాష్ట్ర ఎక్సైజ్‌ ‌పద్దు కింద రూ.16,500 కోట్ల ఆదాయం ఆర్జించాలని భావిస్తున్న ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 28వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిపితేనే లక్ష్యాన్ని సాధించటం సాధ్యపడుతుంది. మద్యం విక్రయాల విలువలో స్టేట్‌ ఎక్సైజ్‌ ‌కాకుండా అదనంగా వ్యాట్‌, ‌స్పెషల్‌ ‌మార్టిన్‌, ఏపీఎస్‌బీసీఎల్‌ ‌కమిషన్‌, ఆర్‌ఈటీ, ఏఆర్‌ఈటీ వంటివన్నీ కలిసి ఉంటాయి. అంటే లక్ష్యాల్ని విధించి మరీ మద్యం అమ్మాలి.

మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వం సేకరించాలని చూస్తున్న ఆదాయమంతా పేదల నుంచి లాక్కునేదే. కూలీపనులు చేసి మద్యానికి బానిసలైన వారి అలవాటును అవకాశంగా తీసుకుని వారిని పిండేయాలని ఈ ప్రభుత్వం చూస్తోంది. వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే పనిచేసి, వచ్చే డబ్బులో 90 శాతం మద్యం కొనుగోళ్లకే వెచ్చించడంతో కూలీల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాయి. గత మూడేళ్లుగా సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం పేదల కడుపు కొడుతోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఓట్ల రాజకీయం కోసం కూలీల జేబులో డబ్బు తీసుకెళ్లి తెల్లరేషన్‌ ‌కార్డులున్న అనర్హులకు సైతం పంచేస్తూ, ప్రభుత్వం తీవ్రమైన తప్పులు చేస్తోంది. నాసిరకం మద్యం అమ్మకాలే పరోక్షంగా నాటుమద్యం తయారీకి కారణం. ఏ మద్యం తాగినా ప్రాణహాని ఉంది. ఇది తెలియని అభాగ్యులు అలవాటుకు బానిసలై మద్యం సేవించి మరణిస్తూ, కుటుంబాలను అనాథల్ని చేస్తున్నారు. ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా ప్రతిపక్షాలు ఆరోపించడం సబబేనని ప్రజలు అంటున్నారు. కనీసం వారికి నష్టపరిహారం అందించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మంత్రులు తేలికభావంతో, హేళనతో ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మద్యం అమ్మకాలు నిషేధించకుంటే ప్రజలే తగిన బుద్ధిచెప్పడం ఖాయం.

About Author

By editor

Twitter
Instagram