– డా।। చింతకింది శ్రీనివాసరావు

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


ఇంతగా దోచుకుంటున్న వడ్డాదిరాజు, పోనీ ప్రేమగా అయినా ఉంటున్నాడా అంటే, అదేంలేదు. బంధుత్వాలయినా బంగారంలా నెరపుతున్నాడా అంటే అదీ లేదు. గిరిప్రజలు అనాగరికులన్నట్టుగా చూస్తున్నాడు. వాళ్ల అస్తిత్వానికే ఎసరు పెడుతున్నాడు. వడ్డాది గెద్దలు నందవనాల మీద వాలవచ్చునని అంటున్నాడు. నందపురం కాకులయినా వడ్డాదిని కానకూడదని హుకుం జారీచేస్తున్నాడు. ఇది పాపమని చెబుతున్న ప్రణవశర్మను ఖాతరు చెయ్యడం లేదు. ఇది అన్యాయమంటున్న రాచగన్నియనూ పట్టించు కోవడం లేదు. ఆ అంచున దేవేంద్రాలు, ఈ వంకన రాచగన్నియ ఏం చేయగలరు, వెంకటేశుడు, దేవేంద్రుడు దయచేయగా వరుస పిల్లలను కంటూ రావడంతప్ప!

తొలినాళ్లలో బింకంగా ఉండే ఇద్దరు మహా రాణులూ అనంతరకాలంలో ప్రసవవేదనకు చిక్కి అణగిపోయారు. సంసారయాత్రలో పడి అలసి పోయారు. సంవత్సరానికి ఒక్కరుగా నందరాచ లోగిలిలో ఏడుగురు యువరాజులు జన్మించారు. వడ్డాది రాజకుటుంబంలో సప్తమాతృకల వంటి ఏడుగురు యువరాణులు ప్రభవించారు. యువరాజుల కంటే యువరాణులు పిన్నలు.

పెద్దదేశిరాజు, నీలగంగడు, ప్రతాపదేవుడు, నందివీరుడు, ప్రమథనాథుడు, కుమారబొజ్జడు, కొత్తలింగడు నందమందిరంలో పెరుగుతున్నారు. మోదమ్మ, వనదుర్గ, కనకదుర్గ, భోగికొండ, విద్యలమ్మ, కూనలమ్మ, మువ్వలమ్మ వడ్డాదిరాజ్యంలో ఎదుగుతున్నారు. నంద యువరాజులను పేరుపేరునా సంబోధించకుండా అందరినీ కలిపి దేశిరాజులని ముద్దుగా అక్కడి ప్రజలు పిలుచుకోవడం మొదలెట్టారు. వడ్డ్దాది యువరాణులనూ అసలు పేర్లతో కాకుండా మొగుమొత్తంగా దుర్గాండ్లు అంటూ జనం పిలుపుచేయడం ఆరంభించారు. మెల్లమెల్లగా నందరాజ పుత్రులు, వడ్డాది రాచకన్నెలు పెరిగిపెద్ద వారవుతున్నారు. యుక్తవయసుకు వడివడిగా చేరుకుంటున్నారు. జ్ఞానవంతువుతున్నారు. తమ తల్లుల ద్వారా ఇరు సామ్రాజ్యాల సంగతీ తెలుసు కుంటున్నారు. నిజానిజాలను ఆకళింపు చేసుకుంటు న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకనాడు నందపురం నుంచి యువరాజులు ఏడుగురూ కదల వలసిన స్థితి ఏర్పడింది.

– – – – – – – — –

నందచరిత్రలో ఆ రోజుకు ఒకానొక ప్రత్యేకత ఒనగూడింది. ఇప్పటి యువరాజు, కాబోయే ప్రభువు ప్దెదేశిరాజు తొట్టతొలిసారిగా పురాన్ని విడిచి వనానికి వెళుతున్న వేళ అది. రాచకుటుంబపు సంప్రదాయాల ప్రకారం తూర్పు కనుమల్లోని దోరశి ప్రాంతాన వేంచేసిన విష్ణుభైరవస్వామిని యుక్త ప్రాయంలో యువరాజు దర్శించవలసి ఉంటుంది. ఇరవైమూడేళ్ల వయసున స్వామి దేవాలయానికి వెళ్లి వచ్చాకనే రాజ్య పట్టాభిషేకానికి అతనికి అనుజ్ఞ లభిస్తుంది. ఇది రాజుల కట్టు. ఇది గద్దె నిబంధన. ఇందువల్లనే ఆ రోజు ప్దెదేశిరాజు అతని ఆరుగురు తమ్ములూ దోరశి బయలు వెళ్లడానికి సమయాత్తమవు తున్నారు.

నిర్ణయించిన ముహూర్తం వేళకే ఉదయకాలాన మందిరంలోని పూజగదిలో ఏడుగురు నందరాజ్యపు మగపిల్లల చేతా హారతులిప్పించారు పూజారులు. వాళ్లకు ప్రత్యేకమైన ఆయుధాలను ఆ రోజే అప్ప గించారు. కొత్తబట్టలు కట్టి, నుదుట బొట్టుపెట్టి, మెడలో గంధపుమాలలు చుట్టి, శిరసున పాగాలు పెట్టి, చేతుల్లో బాణాలు పట్టి యువరాజులందరూ పాండవమధ్యముడే సప్తఅవతారాలు ఎత్తి వచ్చి నట్టుగా కనిపించారు. మాకలిశక్తి, వెంకటేశుడు, దేవేంద్రాలు వెంటరాగా పిల్లలందరినీ రాచభవనం బయట సిద్ధంగా ఉన్న రథాల వద్దకు తీసుకు వచ్చారు. వెంకటేశుడికి ఇదంతా ఒక కేళి. ఒక ఆనందం. ఒక సంబరం. మాకలిశక్తికి మటుకు ఇదంతా ఒక బాధ్యత. ఒక బరువు. యువరాజులం దరూ సవ్యంగా ఇంటికి తిరిగి వచ్చేవరకూ ఆమెకు వత్తిడే. దేవేంద్రాలు మటుకు ఎందుకనో ఆ వేళ నీరుగారిపోయినట్టుగానే కనిపిస్తోంది. ఎంత ఆపుకుందామన్నా ఆమెకు ఏడుపు తన్నుకొస్తూనే ఉంది. వెంకటేశప్రభువుకు అదేం పట్టలేదు. కన్నకడుపు కాబట్టి ఆ మాత్రం ఉద్వేగం దేవమ్మకు తప్పదన్నట్టుగా భావించింది మాకలి.

రాచ భవనం ముందర వరుసగా నిలిపిన ఏడు రథాల్లో ఏడుగురు పూజారులు ప్రవేశించారు. ఆనక ఒక్కొక్క యువరాజూ తల్లిదండ్రుల పాదాలకూ, మాకలి పాదయుగళానికీ మొక్కులు చెల్లించి తమ తమ రథాల్లో పెద్దలు దారిచూపగా ఎక్కి కూర్చు న్నారు. పిల్లలు తేరుల్లో తరలి వెళ్లే సమయాన దేవమ్మ మరింతగా జావగారినట్టు అయింది. వెక్కివెక్కి రోదించడం మొదలుపెట్టింది. విస్మయం పాలయింది మాకలి. ప్రేమగా దేవమ్మను అక్కునచేర్చుకుంది.

‘‘సాయంత్రానికల్లా నీ దగ్గరే ఉంటారు కదూ నీ పిల్లలు.’’ అంటూనే రథాలను కదిలించమన్నట్టుగా పరివారం వైపు కళ్లు తిప్పింది.

ఆ తరుణంలో పెద్దదేశిరాజు రథం మీద నుంచే తల్లికి మాతృవందనం చేశాడు. దేవమ్మ కళ్లు తుడుచుకుంటూనే ప్రతిగా చేతులు గాల్లో కదలిస్తూ వీడ్కోలు పలికింది. రథాలను నిమ్మళంగా సారథులు తోలడం మొదలైంది. ఒక్కో బిడ్డ అధిరోహించిన రథాన్నీ చిన్నగా తాకుతూ ప్రయాణం సుఖమయం కావాలని తల ఎత్తి దీవెనలు పలికింది దేవమ్మ. రథాలు కనుమరుగయ్యాయి. నందసైన్యమంతా అక్కడే ఉండిపోయింది. యువరాజులతో పాటు పూజారులే తప్ప మరో మనిషి దేవాలయం తొలి తొక్కింపునకు వెళ్లకూడదనేది నియమం.

మున్నెన్నడూ లేనివిధంగా బిడ్డలు కోవెలకు వెళ్లే వేళ దేవమ్మ అంతగా బాధాతప్త అయింది ఎందుకో మాకలిశక్తికి ఆ వేళ అసలేమీ బోధపడలేదు.

అయినవారికి ఎదురవ్వబోయే కీడయినా, మేలయినా ఆప్తులకు సూచనప్రాయంగా అప్పుడప్పుడు తెలిసి వస్తుంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి భోగట్టా ఏమైనా దేవేంద్రాలికి అంది ఉంటుందా! లేకపోతే కొడుకుల విషయంలో ఎప్పుడూ లేనిది ఆమె ఎందుకలా విలపిస్తుంది? మరెందుకలా దీనదుఃఖిత అవుతుంది? బహుశా ఈ రోజే కొడుకులతో తనకు రుణం తీరిపోతుందని ఆ తల్లికి తెలిసిందేమో? ఏమో..!

———-

కొన్ని ఘటనలు కాకతాళీయంగా జరుగు తుంటాయి. వాటికి కార్యాకార•ణ సంబంధాలు వెతికినా కనిపించబోవని అనిపిస్తుంటుంది. నంద రాజ్య భవనం నుంచి ఏడుగురు యువరాజులూ విష్ణుభైరవ ఆలయానికి బయలుదేరిన సమయంలోనే వడ్డాది నుంచి యువరాణీ మోదమ్మ, ఆమె ఆరుగురు చెల్లెళ్లూ అదే మందిరానికి పయనమయ్యారు.

యువరాణీగా ప్రకటించబోయే కన్యను దేవాలయం మెట్లు పట్టించి తీసుకువచ్చే ఆచారం వడ్డాది రాచకుటుంబంలోనూ అమల్లో ఉంది. అయితే నందరాజ్యం మాదిరిగా విష్ణుభైరవస్వామి కోవెలకే పిల్ల వెళ్లాలన్న కట్టుబడి లేదు. సింహాసనం నిర్ణయించిన ఏ దేవళానికయినా తరలిపోవచ్చు. కాకపోతే విధి విచిత్రమైంది. దేవేంద్రుడూ దోరశి కనుమల్లోని విష్ణు సన్నిధినే కుమార్తె మొదటి దర్శనం కోసం నిర్ణయంచాడు. ఏడుగురు కుమార్తెలకూ అర్చకస్వాములను అండగా నిలిపి రథాల మీద అదేరోజు అదే ముహూర్తానికి బయలుదేరదీశాడు. ఈ దుర్గాండ్లకు తోడుగా మరెవ్వరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎందుకనో ఆ ముహూర్త సమయం రాచగన్నియకు నచ్చలేదు. ఇరవై మూడోయేడు వచ్చాక యువరాణీకి ఆలయ దర్శనం తప్పకపోయినా, నిన్నగాక మొన్ననే ఆ ప్రాయానికి చేరిన పిల్లను అప్పుడే పంపడం ఎంతమాత్రమూ ఇచ్ఛగించలేదు. అయినా దేవేంద్రుడు పట్టించుకోలేదు. ఆమెను అతగాడు ఎప్పుడు పట్టించుకున్నాడు గనక ఇప్పుడు గణించడానికి!

కాగా, దేవేంద్రుడు ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలచినట్టుగా అయింది. వడ్డాది రాజు ఒనానొక ఆలోచన చేస్తే పరమాత్ముడు మరొక యోచన చేసినట్టుగా అంతా అయిపోయింది.

—————-

ఆ విధంగా అటు దేశిరాజులు ఇటు దుర్గాండ్లు ఒకేసారి బయలుదేరారు. ఆ అంచన, ఈ పట్టెన సమాన దూరం కావడంతో పధ్నాలుగు రథాలూ దోరశిలో చక్కగా కలుసుకున్నాయి. ఎగువ యువ రాజులు, దిగువ యువరాణులు ఒక్కుమ్మడిగా దేవళానికి వేంచేశారు. కలిసికట్టుగా ఆలయం మెట్లు తొక్కారు. పూజారులు, అర్చకస్వాములూ వారి వెంట నడుస్తూ మంత్రోచ్చారణకు దిగడంతో రాచబిడ్డల అడుగులకో అర్థం ఏర్పడినట్టయింది.

నందపుత్రులు, వడ్డాది పుత్రికలు కలిసే పూజాదికాలు నిర్వహించడంతో ఆ రోజు విష్ణుభైరవ స్వామి ఆలయం కళ కట్టినట్టుగా అయింది. అనుకోని విధంగా కలిసిన ఇరురాజ్యాల వారసులచేతా విష్ణువుకు పూజలు చేయించడం తమ పూర్వజన్మ సుకృతమని అర్చకులు, పూజారులూ భావించారు.

నిజానికి రాచబిడ్డలందరూ సమైక్యంగా పూజాది కాలు నిర్వహించినట్టుగా పైపైకి కనిపించినా లోలోన మాత్రం వారి మనసుల్లో దేవుడిపైన భక్తి అంతంత మాత్రంగానే ఉన్నట్టుగా పరిస్థితి తయారైంది. మునుపెన్నడూ అంతటి అందమైన రాచకుమారులను చూడలేదన్నట్టుగా వడ్డాది యువరాణులు నందరాజుల వైపు గుడ్లప్పగించి చూస్తూ చకితలై ఉండిపోయారు. అలాంటి అందాల గొందుల్ని అంతకు ముందర తామెన్నడూ దర్శించలేదని తలపోసిన నంద యువరాజులందరూ వడ్డాది భామల మీదనే దృష్టి నిలిపి ఉండిపోయారు.

అప్పుడిక అర్చకస్వాములు ఆ తరపు చేరి వడ్డాది పిల్లలను పరిచయం చేశారు. బంధుత్వాలు తెలిపారు. ప్రవరలు పలికారు. ఈ వైపునున్న పూజారులు మాటలు కలిపి యువరాజుల వివరాలు ఎరింగిం చారు. గోత్రాలు పలికారు. జంటలు జంటలుగా చేరిన అందాల రాణీరాజులకు ముసిముసినవ్వులతోనే తీర్థప్రసాదాలను అందజేశారు. రెండుకళ్లు చాలవన్నట్టుగా వాళ్లను గుడ్లప్పగించి మరీ చూశారు.

జన్యుప్రభావమా.. యవ్వన గరిమా.. వయసు పొంకమా.. సొగసు బింకమా.. చూపు బలమా.. రూపు కలిమా.. అందం బంధమా.. చందం గంధమా.. ఎదల ఎగపోతలా.. ఎడదల గసలా.. ఏదైతేనేం సరిగ్గా దేశిరాజుల కళ్లల్లో దుర్గాండ్లు నిలిచిపోయారు. వడ్డాదికన్నెల నేత్రాల్లో నంద కుమారులు మిగిలిపోయారు.

ఆ పక్షాన కూడింది ఏడుగురు కుర్రాళ్లు. ఈ బరిన కులికింది ఏడుగురు కుర్రగత్తెలు. పైగా మేనత్త మేనమామ పిల్లలు. వరసయినవారు. సొగసయిన వారు. నదరయినవారు. నాడెమయినవారు. ముందు పుట్టింది పోతుజట్టు. వెనక జన్మించింది పెంటిగుత్తు. మగపిల్లలు మామ కొడుకులు. ఆడపిల్లలు అత్తకూతుళ్లు. ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగానే వీళ్లను చూసినవారికి అనిపించింది. కత్తుకలవడానికి ఏ అడ్డూ లేకపోయింది. అడ్డుపడటానికి ఎవరికీ హక్కు లేనట్టుగానూ అయిపోయింది.

‘‘ఆలయం వెనుక పూల తోటలున్నాయి కాసేపు తిరిగివస్తారా.’’ ఎవరో అర్చకస్వామి రాచపిల్లలను ఉద్దేశించి మురిసిపోతూ అనేశాడు.

‘‘అంతకన్నానా. అందరినీ కలిసే వెళ్లమనండి!’’ మరెవరో పూజారి ముచ్చటగా వాక్రుచ్చాడు.

ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నట్టుగా సుకుమారపు జోడీలన్నీ తటాలున పూలతోటల్లోకి తరలిపోయాయి. అలా వెళుతూవెళుతూనే ఒకరి మనసులో మాటలు మరొకరికి చెప్పుకున్నాయి. ఒకరి హృదయాలను మరొకరికి తెలియజేసుకున్నాయి. ఒకరి అంగీకారాలను మరొకరితో పంచుకున్నాయి. ఆకాశమే హద్దుగా ఆటలాడుకున్నాయి. పాటలు పాడు కున్నాయి.

పెదదేశిరాజు, మోదమ్మ.. నీలగంగడు, వనదుర్గ.. ప్రతాపదేవుడు, కనకదుర్గ.. నందివీరుడు, భోగికొండ.. ప్రమథనాథుడు, విద్యలమ్మ.. కుమార బొజ్జడు, కూనలమ్మ.. కొత్తలింగడు, మువ్వలమ్మ.. జంటకట్టాలని కోనసాక్షిగా నిర్ణయించుకున్నారు. వివాహం చేసుకోవాలని కొండల రుజువుతో సంకల్పం చెప్పుకున్నారు. ఇరువైపుల పెద్దలూ ముందు కాదని చెప్పినా రక్తబాంధవ్యాల వల్ల తర్వాతకాలంలో ఒప్పుదల అవుతారని గాఢంగా విశ్వసించారు. అదే తడవుగా పూలతోటలను వదిలిపెట్టేశారు. అటునుంచి అటే గిరులను ఎక్కిదిగుతూ కల్యాణపులోవకు వెళ్లి పోయారు. అక్కడ ఒకళ్ల మెడలో ఒకళ్లు పూల మాలలు వేసుకున్నారు. ఒకళ్ల హృదయాలను మరొకళ్లకి దత్తం చేసుకున్నారు. ఒకరికొకరు స్వాధీనమై పోయారు. ఒకరిలో మరొకరు ఐక్యమై పోయారు. ప్రపంచంలోని సంతోషమంతా తమదే అన్నట్టుగా విహరించారు. జగతిలో ఉన్న ఆనందమంతా తమదే అన్నట్టుగా వీరవిహారం చేశారు.

మూడుదినాలయ్యాక ఈ పెళ్లిళ్ల వ్యవహారం ఇరురాజ్యాల ప్రభువులకూ తెలిసిపోయింది. దేవేంద్రుడు ఆవేశపూరితుడయ్యాడు. కొండవాళ్లను అల్లుళ్లుగా చేసుకోవడమేమిటని కరకరలాడిపోయాడు. అవమానపడిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. రచ్చరచ్చగా పెట్రేగిపోయాడు.

————————

సరిగ్గా ఇక్కడే కథ ఆగింది…

సరిగ్గా ఇక్కడే కథ నిలిచింది…

కథ ఆగిందంటే పూర్తిగా ఆగిపోయిందని కాదు…

కథ నిలిచిందంటే పూర్తిగా నిలిచిపోయిందనీ కాదు…

ఈ గాథను సవివరంగా చెప్పుకొస్తున్న లెంకలు కొద్దిపాటి విరామం తీసుకున్నారు…

కిడగనూరు దేశంలో ప్రస్తుతం ఈ కథాగానం చేస్తున్న వీరు విశ్రాంతి కోసం కొంతసేపు తమ గళాలను మూతబెట్టుకున్నారు…

మండివలస గ్రామంలోని జాకరమ్మ మెట్ట మీద దేశిరాజుల కథ వినిపిస్తున్న లెంకలు స్వరశుద్ధికోసం అల్లపురసాన్ని ఆశ్రయించారు…

అంచేతనే కొద్దిసమయం పాటు కథను ఆపుజేశారు… కథా వివరణకు తీరుపాటు ఇచ్చారు…

వాద్యసహకారం చేస్తున్న గురువులు, వంతపాడే పాట పూజారాలు సైతం లెంకలతోపాటు గద్దెవేదిక దిగారు. గ్రామపెద్దలు ఏర్పాటుచేసిన వేడివేడి అల్లపునీటిని ఊదుకుంటూ తాగుతున్నారు. అప్పటికి దాదాపు ఏడెనిమిది గంటల నుంచీ వారు గళప్రస్తారం సాగిస్తూనే ఉన్నారు. కాబట్టే కొద్దిపాటి వెసులుబాటు వాళ్లకి కావలసివచ్చింది.

‘‘కథ దగ్గరకొచ్చింది. మరో గంటలో అయి పోతుంది.’’ నిర్వాహకులకు చెబుతున్నాడో పాటపూజారి.

‘‘కానివ్వండి. కానివ్వండి.’’ ప్రేమగా బదులి స్తోంది నిర్వాహక బృందం.

ఇంతలోనే దివిటీలకు మరికాస్త పనసబంక పట్టించి వెలుగు మంటలను ఎవరో పెంపుచేశారు. అప్పటివరకూ తలమునకలై కథను ఆలకిస్తున్న మండివలస గ్రామ ప్రజానీకమంతా ఎప్పుడెప్పుడు మళ్లీ లెంకలు గొంతెత్తి పలుకుతారోననే ఉత్కంఠతో కాలం గడుపుతున్నారు. గంటలతరబడి కథసాగు తున్నా మండివలస వాసులెవ్వరూ కదలలేదు. ఆ నిశి వేళ మీదపడుతున్న మంచుకు భయపడలేదు. నిద్ర తమకు అవసరమే లేనట్టుగా అయ్యారు.

‘దేశిరాజుల కథలోనే ఆ శక్తి ఉంది. అది మొదలైతే చివరివరకూ వినేలా చేస్తుంది. అదే మహిమ.’ మనసులోనే అనుకుంటూ వేదికవైపుగా చూస్తూ కూర్చుండిపోయారు. అయితే, కొంతమంది పిల్లలు మాత్రం అప్పటికే గాంధారీవేళ దాటిపోవడం, తెల్లవారుఝాము కావడంతో కునుకు తూగివచ్చి తల్లులకు ఆనుకుపోయారు. నిద్రాదేవికి లొంగి పోయారు.

అందరికంటే వెనగ్గా, వేదికకు దూరంగా, అంటరానివారిగా కూర్చున్న కోలన్న కుటుంబమూ కథ వినేందుకు నిరీక్షిస్తూ కొండరాళ్ల మీదనే దేవుళ్లాడుతోంది.

ఇలాంటప్పుడే తల్లిపక్కకు చేరుతూ గంగు కళ్లు నులుముకుంది. ఆనక మెల్లగా గొంతు విప్పి,

‘‘అమ్మా! నిద్రకాయలేకపోతున్నానే.’’ అంది. అమ్మ ఒడికి చేరాలన్నట్టుగా తల్లి దగ్గరసా జరిగింది. వెంటనే రేక అందుకుంది.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram