సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ పుష్య పౌర్ణమి – 17 జనవరి 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‘జనవరి 9- మాజీ ముస్లింల దినంగా ప్రకటిస్తున్నాం!’ అంటూ కేరళ నుంచి వచ్చిన ఒక వార్త ఒకింత సంచలనమే కలిగించి ఉంటుంది. దాదాపు ఒకటిన్నర దశాబ్దం నుంచి ప్రపంచంలో ప్రవేశించిన ఆ భావన ఇప్పుడు కేరళలో బలపడుతోంది. ఆ భావన ఏమి•ంటే- మాజీ ముస్లింలు, వాళ్ల సంఘాలు, హక్కుల పరిరక్షణ. మొన్న డిసెంబర్‌లో పదిమంది కార్యనిర్వాహక సభ్యులతో కూడిన పాలక మండలిని కూడా కేరళ మాజీ ముస్లిం సంఘం నియమించుకుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఒకరు తాము ఆచరిస్తున్న మతాన్ని విడిచి పెట్టడానికీ, అదే విధంగా వేరొక మతం స్వీకరించడానికి స్వేచ్ఛ కల్పిస్తున్నది. కానీ వాస్తవంలో ఆ రెండు హక్కుల ఆచరణ సులభం కాదన్నది నిజం. మతం వీడినవారికి రక్షణ కల్పించే చట్టం ఉండాలని కోరుతూ తాము కోర్టును ఆశ్రయించనున్నట్టు కేరళ మాజీ ముస్లిం సంఘ స్థాపకులలో ఒకరు లియాఖత్‌ అలీ చెప్పారు. కాబట్టి ఇలాంటి భావన, ఆచరణ వెలుగు చూడడం అంత సులభం కాదన్నది నిజం.

మాజీ ముస్లింల సంఘం మొదటిసారి భారతదేశంలో ఏర్పడింది. ఇంతకీ మాజీ ముస్లింలు అంటే ఎవరు? ముస్లింగా పెరిగినా, ఇస్లాంలోకి మారినా కూడా, తరువాత ఆ మతాన్ని వీడి వచ్చినవారినే మాజీ ముస్లింలు (ఎక్స్ ‌ముస్లింలు) అంటున్నారు. ఇస్లాంను (నిజానికి ఏ మతమైనా) త్యజించాలన్న నిర్ణయం పూర్తిగా వారి వారి వ్యక్తిగతం. ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నవారు, అంటే మాజీ ముస్లింల సంఖ్య పెరగడమే ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. వీరి ప్రయత్నాలను సామాజికోద్యమంగా పరిగణిస్తున్నారు. అదే సమయంలో మాజీ ముస్లింలకు సవాళ్లు కూడా అధికమవుతున్నాయి. మతాచరణను వీడిన ఫలితంగా ఎదురవుతున్న సామాజిక పీడన, దాడుల నుంచి రక్షణకు ఇప్పుడు వీళ్లు సంఘాలు ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. కేరళలో మాజీ ముస్లింల సంఘం అలా ఏర్పడినదే. 2007లో సెంట్రల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఎక్స్ ‌ముస్లిమ్స్ అన్న సంస్థ జర్మనీలో ఆవిర్భవించడంతో ఈ సామాజికోద్యమం ఆరంభమైంది. దైవ దూషణ ఆరోపణతో మరణదండన పడిన తరువాత ఇరాన్‌ ‌నుంచి తప్పించుకు వచ్చిన మినా అహాదీ అనే మహిళ దీనికి జర్మనీలో శ్రీకారం చుట్టారు. కెనడా, అమెరికా, ఫ్రాన్స్, ‌మొరాకో, స్కాట్లాండ్‌, ‌టర్కీ, నార్వే, శ్రీలంక, జోర్డాన్‌, ఇరాన్‌ ‌వంటి దేశాలలో 2007 నుంచి మాజీ ముస్లిం సంఘాలు కనిపిస్తున్నాయి. 2019లో అలాంటి భావన భారత్‌ (‌కేరళ) చేరింది.

హిందూ జీవన విధానంలోనో, క్రైస్తవంలోనో మతారాధనను విడిచి పెట్టినంత సులభంగా ఇస్లాంలో జరగదు. మాజీ ముస్లింలు ఏర్పాటు చేసుకుంటున్న సంఘాలే, వాటి అవసరమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సైమన్‌ ‌కూటీ, ఖలీల్‌ ‌బిలిసి, తీము పౌహా, అతీఫె అఘాయి, మారియా వ్లెక్‌ ‌చేసిన అధ్యయనాలు, అందించిన రచనలు మాజీ ముస్లిం అన్న భావన పూర్వపరాలను వెల్లడిస్తున్నాయి. మతం ఏదైనా దానికి దూరంగా ఉండాలన్న ఆలోచనకు మూలం- దాని పట్ల సందేహమే అంటారు సైమన్‌ ‌కూటీ. మేధోపరమైన, సామాజికమైన కారణాలు కూడా కొందరిని మాజీ ముస్లింలను చేస్తున్నాయని ఖలీల్‌ ‌బిలిసి అంటున్నారు. ఆ కారణాలు ఎలాంటివి? ఇస్లాం మహిళకు ఇచ్చే స్థానం, మానవ హక్కుల గురించి షరియా చెప్పే పరస్పర విరుద్ధాంశాలు, సమస్యాత్మకంగా ఉండే పవిత్ర గ్రంథం తత్త్వం, ఆ గ్రంథ చారిత్రకత, అసలు ప్రవక్త మహమ్మద్‌ ‌వ్యక్తిత్వం మీద అపనమ్మకం, సైన్స్ ‌పట్ల ఇస్లాం వైఖరి, అరబ్‌ ‌కేంద్రంగా మతం ఉండడం, ముస్లిమేతరుల పట్ల ముస్లింల ధోరణి, ముస్లింలోని వెనుకబాటుతనం వంటి చాలా కారణాలే ఉన్నాయి. ఈ భావనకు రుజువుగా వారు చరిత్ర నుంచి కొన్ని ఉదాహరణలు చూపుతున్నారు. ముస్లింలలో అణచివేత సహజసిద్ధమని చెప్పడానికి 1971నాటి బంగ్లాదేశ్‌ ‌హత్యాకాండను చూపుతున్నారు. డబ్ల్యుటీవో మీద దాడి (9/11) కూడా ముస్లింలలో ఇలాంటి ఆలోచనలకు దారి తీసిందన్న వాదనలు కూడా ఉన్నాయి. తాజా ఉదాహరణ- భారత త్రివిధ దళాల సమన్వయ కర్త బిపిన్‌ ‌రావత్‌ ‌దుర్మరణం వార్త, దానికి కొందరు ముస్లింలు చూపిన స్పందన చూసి మలయాళీ సినీ దర్శకుడు ఒకరు తాను ఇకపై ముస్లింను కాదని ప్రకటించారు. అఫ్ఘానిస్తాన్‌ ‌పరిణామాల తరువాత కూడా ఎందరో అలాంటి నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వచ్చాయి.

ఇంతకీ మాజీ ముస్లింలు ఏం కోరుకుంటున్నారు? మొదట తమకు రక్షణ కావాలంటున్నారు. కేరళలోనే మాజీ ముస్లింలుగా చెప్పుకోవడానికి సిద్ధపడుతున్నవారు 300 మంది వరకు ఉన్నట్టు గుర్తించామని లియాఖత్‌ అలీ చెబుతున్నారు. ఇలాంటి వారు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంటారనీ, వారు బాహాటంగా చెప్పలేకపోతున్నారనీ ఆయన నమ్మకం. వీరందరికీ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి, తాము మాజీ ముస్లింలమని చెప్పుకునే స్వాతంత్య్రం సాధించడమే తమ కర్తవ్యమని కూడా ఆయన ప్రకటించారు. మాజీ ముస్లింల దినంగా జనవరి 9వ తేదీని ఎంచుకోవడానికి కారణం ఉంది. మలప్పురం కేంద్రంగా పనిచేస్తున్న హేతువాది ఈఏ జబ్బార్‌, ఇస్లాం మత బోధకుడు ఎంఎం అక్బర్‌కు మధ్య చరిత్రాత్మక చర్చ జరిగినది ఆ రోజునే. ఇస్లాంలో తాము విభేదించే అంశాలను బాహాటంగా వెల్లడించేందుకు ఆ చర్చ మార్గం ఏర్పరిచిందని లియాఖత్‌ ‌చెప్పారు. ఏమైనా మాజీ ముస్లింలు అన్న భావనను ఇటీవలి కాలపు సామాజికోద్యమంగానే చూడడం సబబు. విశ్వాసాలలో కాఠిన్యం సహించలేని, సిద్ధాంతాలలో పిడివాదాన్ని భరించలేని వారికి ఇంతకు మించి మార్గం లేదు కదా!

About Author

By editor

Twitter
Instagram