సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ పుష్య  బహుళ చతుర్దశి – 31 జనవరి 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


దేశంలో మైనారిటీల బుజ్జగింపు ధోరణి ఎటు పోతోంది? నిస్సందే హంగా సరికొత్త సామాజిక విపత్తు వైపే. కచ్చితంగా స్వాతంత్య్రోద్యమం ఇస్తున్న స్ఫూర్తిని ధ్వంసం చేసే దిశగానే పోతోంది. ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ ఏం ‌మాట్లాడుతున్నారు? పంజాబ్‌ ‌ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధూ గురించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్‌ ‌లోక్‌ ‌కాంగ్రెస్‌ అధినేత కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ ఏం ‌చెప్పారు? కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే మీడియాలో కనిపించిన ఆ రెండు వార్తలు దేశాన్ని విస్తుపోయేటట్టు చేసేవే.

 సిద్ధూకి పాకిస్తాన్‌ అం‌టే వల్లమాలిన భక్తి. అఖిలేశ్‌ది పాకిస్తాన్‌ ‌మీద భక్తిప్రపత్తుల ప్రకటనతో ముస్లిం ఓట్లు నొల్లుకోవాలన్న దుర్నీతి. నిన్నటికి నిన్న గాంధీ, నెహ్రూ మాదిరిగానే జిన్నా కూడా భారత స్వాతంత్య్రం కోసం పోరాడారని అఖిలేశ్‌ ‌కొత్త చరిత్ర పాఠం ఒకటి దేశం నెత్తిన రుద్దే యత్నం చేశారు. ఇదెంత నిజమో పదో తరగతి విద్యార్థి కూడా చెప్పగలడు. మనకు నిజమైన శత్రువు చైనాయేనట. పాకిస్తాన్‌ ‌కేవలం రాజకీయ శత్రువట. ఇదీ అఖిలేశ్‌ ‌యాదవ్‌ ఉవాచ. చైనా పెట్టుబడుల మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం చాలా వింతగా ఉంది. ఈ ప్రశ్నకు జవాబు ఇస్తూ, కావాలని ఆయన పాకిస్తాన్‌ ‌ప్రస్తావన తీసుకువచ్చినట్టు కనిపిస్తుంది. మనం మన వాస్తవ శత్రువు (చైనా)తో వ్యాపార లావాదేవీలు నడుపుతున్నామట. మనకు పాక్‌ ‌కేవలం రాజకీయ శత్రువేనేనని అధిక ప్రసంగం చేశారు. ఇది అంతరాత్మ నుంచి వచ్చిన మాటేనా?

 భారత్‌ ‌మీద వేయేళ్ల జిహాద్‌ ‌ప్రకటించిన నేతలు ఏలిన దేశం గురించి అఖిలేశ్‌కు ఉన్న అభిప్రాయం, అవగాహన ఇవా? భారత్‌తో మూడుసార్లు పూర్తిస్థాయి యుద్ధానికి దిగిన ‘పొరుగు’ గురించి అఖిలేశ్‌కు ఉన్న జ్ఞానం ఇంతేనా? ఇప్పటికీ పరోక్షయుద్ధం కొనసాగిస్తూనే ఉన్న మతోన్మాద పొరుగు గురించి అఖిలేశ్‌కు ఉన్న అంచనా ఈపాటిదేనా? పదవీ దాహం, ముస్లిం ఓట్ల మీద మమత ఆయన చేత ఇంతటి వినాశకర భావాలను వెదల్లేటట్టు చేస్తున్నాయి. పాకిస్తాన్‌ ‌మీద ప్రేమ ఒలకపోయడం ద్వారా ముస్లిం ఓట్లు గంపగుత్తగా తెచ్చుకోవచ్చునని ఆయన అనుకోవచ్చు. కానీ ఆ ప్రయత్నంలో భారతీయ ముస్లింల శరీరాలు ఇక్కడే ఉన్నా, వారి మనసు మాత్రం పాకిస్తాన్‌కే అంకితమై ఉంటుందన్న సంకేతం తన మాటలలో ధ్వనించే ప్రమాదం ఉందన్న ఇంగితజ్ఞానం ఆయనలో లోపించింది. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో పట్టించుకునే విజ్ఞత ఆయనలో లుప్తమైపోయింది. ఇప్పటికే గూండాలకీ, మాఫియాలకీ నిస్సిగ్గుగా టిక్కెట్లు పందేరం చేసి తన అసలు రూపాన్ని ప్రదర్శించుకున్న అఖిలేశ్‌, ‌యాకూబ్‌ ‌మెమెన్‌, ‌కసబ్‌ ‌వంటి వాళ్లు బతికి ఉంటే వాళ్లకీ ఇచ్చి ఉండేవారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ ‌పాత్రా వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టవలసిన పనిలేదు. పాకిస్తాన్‌ను రాజకీయ శత్రువుగా గౌరవిస్తున్న అఖిలేశ్‌, ‌తనకు ఆగర్భ శత్రువులు రామభక్తులేనని చెప్పక చెప్పారు.

ఇక పంజాబ్‌ ‌పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధూను మంత్రిని చేయమని పాకిస్తాన్‌ ‌నుంచి తనకు సందేశాలు అందేవంటూ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ ఇప్పుడు వెల్లడించారు. ఆ సందేశాలూ, సిఫారసులూ చేసినవారు ఎవరో చెప్పలేదు కానీ, ఈ ఆరోపణ మాత్రం తీవ్రమైనదే. ఈ విషయం మీద స్పందించడానికి సిద్ధూ నిరాకరించడం కొసమెరుపు. సిద్ధూ తమ (పాకిస్తాన్‌) ‌ప్రధానికి సన్నిహితుడు కాబట్టి తిరిగి పదవిలోకి తీసుకోవాలని వచ్చిన ఒక సందేశ సారాంశం. పైగా సిద్ధూకి పదవి ఇస్తే ఇమ్రాన్‌ ‌ముఖంలో ఆనందం కనిపిస్తుంది కాబట్టి ఆ పని చేయాలని కూడా సందేశం వచ్చిందట. సిద్ధూ ఒట్టి అసమర్థుడు కాబట్టే తాను పదవిలో నుంచి తీసేశాననీ, 70 రోజులలో ఒక్క ఫైలు కూడా చూడలేదనీ అమరీందర్‌ అన్నారు. జరిగిందేదో జరిగింది, మళ్లీ పదవి ఇవ్వండి, అప్పుడు పనిచేయకపోతే ఇక అడగబోం అని రాయబారాలు కూడా వచ్చాయని అమరీందర్‌ ‌చెప్పారు. ఇలాంటి వాళ్ల మీద (సిద్ధూ వంటి వాళ్ల మీద) చర్యలు తీసుకోమని కోరినా పార్టీ స్పందించక పోవడమే చిత్రమని అమరీందర్‌ ఈ ‌కథకి ఓ మలుపు కూడా తిప్పారు. ఇలాంటి వాటిలో కాంగ్రెస్‌ ‌చిత్తశుద్ధి ఏపాటిదో దేశానికి తెలుసు. రాహుల్‌, ‌వాద్రాలే స్వయంగా సిద్ధూకు ఏరికోరి పీపీసీ అధ్యక్ష పదవిని అప్పగించారు. మూడు నాలుగు సీట్లే ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అమాంతం అధికారంలోకి వచ్చేయాలన్న అత్యాశతో తౌకీర్‌ అనే స్థానిక ముస్లిం నేత మద్దతును స్వీకరించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతోంది. తమ (ముస్లిం) యువత ఆగ్రహిస్తే హిందువులు దాగడానికి ఈ దేశంలో చోటు ఉండదని ఈ మధ్యనే హెచ్చరించిన నోటి దురుసు మనిషి తౌకీర్‌. ‌నిరంతరం హిందువులను, హిందూ సంస్థలను లక్ష్యంగా చేసుకునే కుళ్లు రాజకీయం దేశానికి మంచిదేనా?

హిందూఫోబియా గురించి ఈ మధ్యనే భారత్‌ ఐక్య రాజ్యసమితిలో విన్నవించుకోవలసి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న హిందూ వ్యతిరేకత భారతదేశంలోనే ఉన్న ఇలాంటి కొందరు నాయకుల పుణ్యమే. ప్రతి ఎన్నికలకి వికృతత్వాన్ని పెంచుకుంటున్న బుజ్జగింపు ధోరణి ఫలితమే. ఇవే ప్రపంచ వ్యాప్తంగా భారతీయత మీద, భారతీయుల మీద నీలినీడలు అలుముకునేటట్టు చేస్తున్నాయి. అబద్ధాలు, చారిత్రకత లేని అంశాలతో ఒక సమాజం మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నాన్ని నిరోధించడానికి గట్టిగానే యత్నించాలి. సిద్ధూకు పదవి ఇస్తే ఇమ్రాన్‌కి సంతోషం. ఈయన సమస్యాత్మక సరిహద్దు పంజాబ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. అఖిలేశ్‌ ‌దృష్టిలో పాకిస్తాన్‌ ‌రాజకీయ శత్రువు. ఈయన దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్‌ ‌సీఎం కావాలని అనుకుంటున్నారు. ఎంత ప్రమాదం?

About Author

By editor

Twitter
Instagram