– జంధ్యాల శరత్‌బాబు

మన జాతి హిమాలయం, మనల్ని జయించలేరెవ్వరూ. మనదైన ఈ జాతీయత మహాసముద్రం, ఎదిరించి నిలవలేరెవ్వరూ. ఉన్నత భావం, ప్రజ్వలన జీవం, చైతన్యం రూపం, స్వాతంత్య్రం ప్రాణం. ఇది భారతీయ నరనారీ భావాంకిత ప్రగతి స్ఫూర్తి; భవ్యదీక్ష, భాగ్యరక్ష మన ఈ జాతికి. త్రివర్ణ పతాక శోభిల్లుతుంటుంది. నాలుగు సింహాల ముద్రాంకిత ధగ ధగ శాశ్వతమై వెలుగొందుతుంది. ఆ నాలుగూ నలుదిక్కుల నుంచీ ఎదురయ్యే అవరోధాలను కలిసికట్టుగా తొలగిస్తాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ. వీటి పరిరక్షణే కీలక లక్ష్యంగా దేశీయ బలగాలు సదా ముందుకే సాగుతుంటాయి. ఆ శక్తి సంపన్నతల సేన ప్రధాన అధిపతి రావత్‌. ఆయనకు సర్వదా వెన్నుదన్నుగా నిలిచిన సహ ధర్మచారిణి మధూలిక. త్రి దళాలకూ మార్గదర్శకత్వం ఆయనదైతే, అంతటి జాగృత జ్యోతిని విస్తృతపరచే గృహ సంబంధ మూలకేంద్రం ఆమెది. ఇద్దరూ జాతిసంపదలు, సమస్త దేశమూ గర్వపడేంత కారణ జన్ములు. మరి ఆ దంపతులే ఘోరాతిఘోర ప్రమాదంలో నిండు ప్రాణాలు కోల్పోతే.. గుండె పగలని భారతీయుడు ఉంటాడా? చిట్టచివరివరకూ పతినే అంటిపెట్టుకొని ఉన్న ఆ వీరసతి దుర్మరణానికి మూగగా రోధించని హృదయం ఒక్కటంటే ఒక్కటైనా ఉంటుందా? ధీర సైనికుల భార్యల, సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా మధూలిక ఎన్నెన్ని సేవలందించారో తలచి తలచి వగచి వగచి, భావోద్వేగ తీవ్రత ఒక్కుమ్మడిగా కమ్ముకున్నవేళ, రెండు చేతులూ జోడిరచి బాష్పాంజలి ఘటించినవారు కోటాను కోట్లు!

మధూలిక అనే నాలుగు అక్షరాలూ నాలుగు సింహ ప్రతీకలకూ సరి సమానాలు. సత్యనిష్టకు తాను పెట్టింది పేరు. సొంత ఊరు మధ్యప్రదేశ్‌కి చెందిన షా డోల్‌ ప్రాంతం. ఉన్నత విద్యాభ్యాసమంతా గ్వాలియర్‌లో గడిచిపోయింది. తనది సింథియా వనితల విద్యాలయం. అక్కడ చదువుకునే రోజుల్లో అపార ప్రతిభాపాటవాలు కనబరచేవారు. సహవిద్యార్థినిలు ఎప్పుడైనా, ఎక్కడైనా అబద్ధమాడినట్లు తేలితే, తీవ్ర స్వరంతో మందలించేవారు. ‘మరోసారి ఇలా చేశావంటే జన్మలో నీ మొహం చూడను’ అంటూ కుండబద్దలు కొట్టేవారు. ‘ఏనాటికైనా సత్యమే జయిస్తుంది’ అని నోటు పుస్తకాల తొలి పేజీల్లోనే పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకునేవారు. తాను గ్రాడ్యుయేషన్‌ పట్టా తీసుకుంది మనస్తత్వ శాస్త్రంలో. అదీ దేశ రాజధాని నగరం ఢల్లీిలోని విశ్వవిద్యాలయం నుంచి. మనోధర్మశాస్త్రంగా విఫులీకరిస్తూ, సమాలోచన వేదికలపైన నిలిచి వాగ్ధాటి గుప్పించే వారు. ధర్మచింతనతోనే వ్యక్తికైనా, జాతికైనా పురోగమనం సాధ్యమవుతుందని పరిపూర్తిగా విశ్వసించిన ఆదర్శ మహిళామణి. రావత్‌తో పరిణయం 1986లో. అంటే మూడున్నర దశాబ్దాల నాటి మాట. సహజసిద్ధంగా భార్య అత్యంత శాంత స్వభావి. భర్తది ధర్మాగ్రహాన్ని ప్రకటించే ప్రవృత్తి. ఈ రెండు లక్షణాలనూ ఒకటిగా చేసిందేమిటో తెలుసా? ఉభయుల్లోనూ నరనరాన దాగిన దేశాభిమానం. జాతీయ అనురక్తికి మూలం తండ్రి నుంచే కలిగిందంటారు మధూలిక. మృగీంద్రసింగ్‌ మొదటి నుంచీ అపార ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. రాజకీయ నాయకత్వ రంగంలోనూ ముందు వరసన ఉండేవారు. పుట్టి నింట తండ్రి, మెట్టినింట భర్త నేతృత్వ పరిణతిని తానూ సొంతం చేసుకున్నారామె. ‘ప్రచారాలకు దూరంగా ఉంటూ మీరు చేస్తున్న సామాజిక సేవ నిరుపమానం’ అని ఒక పత్రికా విలేకరి వ్యాఖ్యానించినప్పుడు ఏమని బదులిచ్చారో తెలుసా? ‘సేవ, సహాయం.. ఏ పేరుతో పిలుస్తారో నాకైతే తెలియదు. అవసరానికి ఆదుకోవడంలో మానసిక ప్రశాంతతని పొందుతాను నేను. ఎవరి జీవితంలోనైనా ముఖ్యమైనవి చదువు, ఉపాధి, వైద్యం. ఇవే కదా! వీటిని ఎంతో కొంత సాటివారికి కల్పించా లన్నదే నా తపన. సైన్యం అనగానే ప్రతిఒక్కరిలోనూ గౌరవం వెల్లివిరుస్తుంది. దేశ రక్షణకు ప్రాణాలనే అర్పించేందుకు సిద్ధమైనవారిని సమాజం అపు రూపంగా చూసుకుంటుంది. అందుకే సైనిక కుటుంబాలన్నీ నా ప్రాణ సమానం. వీర జవాను భార్యకు ఎంత పెద్ద పురస్కారమిచ్చినా చాలదు. ఆ గౌరవాదరాలతోనే సంక్షేమ సంఘ బాధ్యురాలిగా నా వంతు ప్రయత్నాలు నేను చేస్తున్నాను. వారికి అండదండగా నిలుస్తున్నాను.’ ఈ సమాధానం చాలదా మధూలిక మూర్తిమత్వానికి.

మరో కోణంలో ఆమె`శాంతి సమన్విత. సైనిక కుటుంబాలు అన్నివేళలా సుఖశాంతులతో ఉండాలని మనసా వాచా కర్మణా కోరుకునే అనురాగమూర్తి. మధూలిక అధినేతృత్వంలోనిది దేశంలోనే అతి పెద్దదైన స్వచ్ఛంద సేవాసంస్థ. క్షేమం, అభివృద్ధి నినాదాలుగా`విధానాలుగా ఏళ్ల పర్యంతం నిరంతర సేవా సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్న సమున్నత వ్యవస్థ. యుద్ధరంగమంటే సామాన్యమా? గగనాంగణ గర్జనం. ధరాతలిపైన సంభ్రమ విభ్రమం. సాగర మార్గంతో విజృంభణం. శతఘ్నుల పరంపరతో మహా ఘోషణం. అంతటి కదన సీమలో ధీరోచితంగా పోరాడి మాతృభూమిని పరిరక్షించుకునే సైనిక వీరుడికి ఎవరు ఎంత ఇచ్చినా, సమస్తాన్నీ కుప్పపోసినా రుణం తీరదు. పోరుభూమిలో ప్రాణత్యాగంచేసి అమరుడైతే.. ఆ కుటుంబాన్ని ఆదుకునే దెవరన్న ఒక్క ప్రశ్నే ఆమెని సేవారంగాన అజేయంగా నిలిపింది. అమరుడి భార్య మనోగతానికి అక్షర రూపమిస్తే`(అతడిని ఉద్దేశించి) ‘నరుడ వీవు నీ నారిని, వరుడవీవు వధువు నేను/ప్రాణ విభుడే సర్వముగా భావించిన పడతిని/పతి సేవయె భాగ్య ముగ బతికిన ఇల్లాలిని/నా జీవన యానానికి నాథ నీవె దిక్సూచివి/కాలచక్ర గమనములో స్థితిగతి మారె/వేవేగము సాగిపోతివి, వినువీధులకెగసితివి’ అంటూ హృదయ విదారక ` రీతిలో మిగిలిన ఆ ఆర్తురాలిని, కుటుంబీకులందరినీ అక్కున చేర్చుకుని ధైర్యవచనాలు పలికారామె. పెళ్లి నాటి మధుర జ్ఞాపకాలు అటు తర్వాత ఎంత కాలమైనా వెన్నంటి ఉంటాయి అమర వీరుడి సతీమణికి. వాటితోనే బతుకుబండి నడుపుతూ బిడ్డలను పోషించుకోవాల్సిన బాధ్యతలు ఆమెవి. సరిగ్గా అదే సమయంలో ఆసరాగా ఉండి, అన్నీ తానై, తోడూ నీడై నిలవడమే మధూలిక జీవిత లక్ష్యం.

ప్రేమాదరాల చిరునామా

పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబీకుల దరిచేరి, పలకరించి, ఓదార్పునిచ్చి, ధైర్యం కలిగించడమే ఆ వనితారత్నం సేవాగుణ సంపన్నత. మాటలతో సరిపెట్టుకోక చేతనైనంత సాయం అందించి, వారి యోగక్షేమాలు చూసుకోవడంలోనే తనకు కొండంత సంతృప్తి. అమరవీర సైనిక కుటుంబాల్లోని మహిళలు, పిల్లలు, వృద్ధులంటే అపార ప్రేమాభిమానాలు. బాలబాలికల చదువులకు ఆర్థికంగా ఊతమివ్వడం, మహిళల నిపుణతను వెలికితీసేలా ఉపాధి పనులు కల్పించడం, వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు శిబిరాలు నిర్వహించడం, ఇలా అనేకానేక సహా యాలు. ఆయా కుటుంబాల్ లో దివ్యాంగ బాలలుంటే, వారి మేలు కోసమూ బహుళ ప్రయోజక పనులు చేపట్టేవారు. వ్యాధి బాధితులున్నప్పుడు, వైద్య సహాయ శిబిరాల నిర్వహణను ముమ్మరం చేసేవారు. ఒక వ్యక్తికో, కుటుంబానికో పరిమితమైన కార్యక్రమాలు కానే కావవి. వందలాది జీవితాల్లో వెలుగుపూలు పూయించేవే అవన్నీ. అలా అని ఆమె చేయూత అంతటితోనే పరిమితం కాలేదు సరికదా, ఇతరత్రా సాధారణ జన జీవనాల బాగుదలకూ విస్తరించింది. సేనా బలగాలకు రావత్‌, వారి కుటుంబాలకు మధూ లిక ఎంతగానో ప్రీతి పాత్రులయ్యారు. ప్రత్యేకించి క్యాన్సర్‌ వంటి తీవ్ర వ్యాధుల కోరల నుంచి బాధితులు బయటపడేలా ప్రత్యేక వైద్య ప్రణాళికలు అమలు జరిపారు. జాతి సేవకు మారుపేరుగా వెలిగిన ఆ దంపతులకు ఇద్దరు ముద్దుల పిల్లలు. పెద్దమ్మాయి ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. రెండో పాప అమ్మా నాన్నతోనే నివసిస్తోంది. చిన్నది, చింతలు లేనిది, పరులకు ఉపకారం చేయడం తప్ప మరేదీ తెలియని నిస్వార్థ సేవాభరిత ఆదర్శమయ కుటుంబం అది.

అంతా సవ్యంగా ఉంటుండగా, కర్కశ విధికి కన్ను కుట్టింది. పర్యటనలో భాగంగా మొత్తం 14 మంది రక్షణ అధికార బృందంతో హెలికాప్టర్‌ ప్రయాణం చేస్తున్న జంటను ప్రమాద రూపంలో కబళించడం యావత్‌ జాతినీ తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేసింది. తిరిగిరాని దూరాలకు తరలివెళ్లిన రావత్‌ జంట అస్థికలను హరిద్వార్‌ వద్ద గంగా నదిలో కలుపుతుంటేÑ తనయ లిద్దరి (తరిణి, కృతిక) కళ్లనీళ్లు ధారాపాతంగా వర్షించాయి. ఆ బిడ్డలిద్దరూ ఏం చేశారని మృత్యువుకు ఇంత కర్కశత్వం? వారికి ఎందుకింతటి జీవితాంత క్షోభ? అమరవీర భార్యల పాలిటి మాతృమూర్తి, సేవాస్ఫూర్తి మధూలిక. ఆమెను దుర్విధి తరలించుకుపోయి, లక్షలాది హృదయాలను వ్యధాభరితం చేసింది. భౌతికంగా ఆ మహనీయ దూరమైనాÑ అన్ని సైనిక విభాగాల, కుటుంబాల గుండెల్లో కొలువైన సేవా దేవత. అంతటి సమున్నత స్త్రీమూర్తికి జయంతే తప్పÑ వర్ధంతి అనేదే ఉండనుగాక ఉండదు. చిరస్మరణీయ అనే పదం ఆమెకు అక్షరాలా వర్తిస్తుంది. స్త్రీజాతికి మణిదీపిక మధూలిక. ఆ దంపతుల ఘన చరితను ఏ నాటికీ మరువలేదు జాతిజనత.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram