పాడేరు గంజాయి.. ఈ పేరుతో ఒక రకం గంజాయి పండిస్తున్నారు. విశాఖపట్నానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ప్రాంతానికి, అంటే పాడేరుకు ఇంకొక ఘనత కూడా దక్కుతోంది- భారత గంజాయి రాజధాని. ఇవన్నీ ఒక ప్రముఖ పత్రిక వెలువరించిన వివరాలే. గంజాయి, భంగు, నల్లమందు; కృత్రిమంగా తయారుచేసే మత్తు మందులు.. ఏదైనా కావచ్చు. కొందరు బలహీన మనస్కులను మత్తులో ముంచితేల్చడంతోనే వాటి పని పూర్తి కావడం లేదు. వ్యసనపరులను బానిసలను చేసుకోవడంతోనే వాటి పరిధి ఆగడం లేదు. కొందరు అమాయక గిరిజనుల చేతికి, కొన్ని అసాంఘిక శక్తుల జేబులలోకి కొన్ని లక్షల రూపాయలు చేర్చడంతోనే ఆ మత్తు ముడిసరుకు పని ముగియడం లేదు. మత్తు పదార్థాల వ్యవహారం వెనుక అంతర్జాతీయ నేర సామ్రాజ్యాల ప్రమేయం ఉంటుంది. దేశాల మధ్య పరోక్షయుద్ధం జాడలూ దాచేస్తే దాగని సత్యం. వాటి వెనుక మాఫియా అమానుషత్వం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచాన్ని రక్తసిక్తం చేస్తున్న ముస్లిం మతోన్మాదుల ఆదాయ వనరుగా మారుతోంది. మతోన్మాదుల చేతికి ఆయుధం ఇస్తున్నది. ఆఖరికి సమాజాన్ని మారుస్తామంటూ తుపాకీ ఎత్తిన మావోయిస్టుల హస్తమూ అందులో కనిపించడం ఓ చేదు వాస్తవం.

పాడేరు పరిసరాలలో, అది కూడా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న ఎనిమిది మండలాలలో జరుగుతున్న గంజాయి సాగు ప్రభుత్వాలకు సవాలు విసిరే స్థాయికి చేరుకుంది. ఈ ఎనిమిది మండలాలలోనే పదివేల ఎకరాలలో గంజాయి సాగు సాగిపోతోంది. అంటే దాదాపు వేయి గిరిజన గ్రామాలలో ఈ పంట కనిపిస్తున్నది. ప్రభుత్వాధికారుల అంచనా ప్రకారం ఒక ఎకరం గంజాయి సాగుతో వచ్చే ఆదాయం రూ. 200 కోట్లు. ఇవన్నీ చెప్పి, ఇదంతా ప్రభుత్వం అలసత్వమని ఒక్కమాటలో తేల్చడం ఇక్కడ ఉద్దేశం కాదు. పూర్తిగా ప్రభుత్వ అలసత్వం లేదనీ కాదు. ఇటీవల కొద్దికాలం నుంచి ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ రాష్ట్రాలు రెండూ మత్తు ముడిసరుకు కలకలానికి కేంద్రాలయ్యాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తించాయి.

2021 అక్టోబర్‌ 15-17 ‌మధ్య ఆంధ్ర-ఒడిశా సరిహద్దులలో నల్లగొండ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్‌ ‌గంజా’ కొన్ని సంచలనాలకు కారణమైంది. ఈ పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. ఈ అంశం మొదట ఆంధప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధానికి దారి తీసింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా నిప్పు రాజేసింది. అక్రమరవాణా దారులు, సాగు చేస్తున్నవారు, అందుకు ప్రోత్సహిస్తున్నవారు మీరంటే మీరు అంటూ అధికార ప్రతిపక్షాలు నిందారోపణలు చేసుకున్నాయి. ఒక దేశాన్ని అతలాకుతలం చేయడానికీ, రెండు రాష్ట్రాల మధ్య రగడకీ కూడా ఇవి కారణం కాగలవు.

పది పన్నెండు అడుగుల ఈ మొక్క మొత్తం భూగోళాన్ని మత్తు వాయువుతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొండకోనలకూ, అడవులకూ పరిమితమైన ఈ మొక్క ఇప్పుడు నగరాలలోని రూఫ్‌ ‌గార్డెన్‌లలోకి కూడా చొరబడింది. నిజానికి కొవిడ్‌ ‌గంజాయి సాగు వంటి వ్యవహారాలకు మరింత ఆస్కారం కల్పించింది. విస్తరణకు తోడ్పడింది. తెలుగు ప్రాంతాల మత్తుమందుల రగడ కలవరపెట్టే విధంగానే ఉంది.

 గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల డ్రగ్స్ (‌హెరాయిన్‌) ‌పట్టుకున్నారు. అవి విజయవాడ చిరునామాతో వెళ్లింది. ఇలాంటి ఎగుమతులు విదేశాలకూ జరుగు తున్నాయి. ప.గో. నరసాపురం నుంచి ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలు ఎగుమతి అయినట్టు వార్తలు వచ్చాయి (ఈ రెండింటికి ఆంధప్రదేశ్‌తో సంబంధం లేదని పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌గౌతమ్‌ ‌సవాంగ్‌ ‌తరువాత చెప్పారు). ఆఖరికి మత్తుమందుల రవాణాకు చాలాచోట్ల కొరియర్‌ ‌వ్యవస్థను కూడా ఉపయోగించుకుంటున్నారన్న వార్తలు వెలువడినాయి. ఆంధప్రదేశ్‌లో గంజాయి పంట ఒక పరిశ్రమగా మారిపోతోంది. విశాఖ మన్యం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో సుమారు 10 వేల ఎకరాల్లో గంజాయిని పండిస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులే చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అంచనా ప్రకారం 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. నవంబర్‌, 2018‌లో హైదరాబద్‌ ‌శివార్లలో మత్తుమందులు తరలిస్తున్న వాహనం పట్టుబడినప్పుడే పోలీసులు పాడేరు ప్రాంతంలో 8000 నుంచి 10,000 ఎకరాలలో గంజాయి సాగు ఉందని ప్రకటించారు. ఆ ప్రాంతంలోనే గూడెంకొత్త వీధి, చింతపల్లి, ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ, గంగరాజు మాడుగుల మండలాలలో యథేచ్ఛగా ఆ సాగు జరుగుతోందని కూడా నాడే పోలీసులు వెల్లడించారు. ఇదంతా సీలేరు ఒడ్డు వ్యవహారం.ఆ పదివేల ఎకరాల సాగు నేడు విస్తరించి ఉంటుందని చెప్పడానికి సందేహించ నక్కరలేదు. ఇవన్నీ ఇప్పటికీ అంతో ఇంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే. పోలీసుల ఉనికి తక్కువగా ఉండే ప్రదేశాలే.

మూడేళ్ల క్రితం పోలీసులు చెప్పిన 10,000 ఎకరాల గంజాయి సాగు పాత సమాచారమని కొన్ని తాజా అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. అవి దిగ్భ్రాంతి కలిగించేవిగా కూడా ఉన్నాయి. పాడేరు పరిసరాలలో 10,000 ఎకరాలలో కాదు, 15,000 ఎకరాలలో సాగు జరుగుతున్నదని సమాచారం. కాబట్టి అక్కడ నెలకొంటున్నది గంజాయి సామ్రాజ్యమే. చిన్న అడ్డా కాదు. ఏటా రూ. 8,000 కోట్ల విలువైన గంజాయిని అంతర్జాతీయ మార్కెట్‌కి ఎగుమతి చేస్తున్నారన్న అంచనాలూ ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళకు చెందిన ముఠాలు ఎగుమతిలో కీలకంగా ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గాలలోనే ఇది సాగుతోంది. దూరప్రాంతాల నేరగాళ్లు కూడా ఇక్కడ దృష్టి పెట్టడానికి కారణం, ఇక్కడ దొరికే శీలావతి రకం గంజాయి. మరొక విషయం- వందలూ వేల కిలోల మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయని వార్తలు వస్తున్నా, అందులో నిజం ఉన్నా, నిజానికి ఎక్సైజ్‌ ‌వారికి పట్టుబడు తున్నది- ఎగుమతి అవుతున్న దానిలో రెండు లేదా మూడు శాతమేనన్న అభిప్రాయం ఉంది.

ఒడిశాలో దొరుకుతున్న మత్తుమందుల పరిమాణం కలవరపెట్టేదే. 2020-2021 సంవత్స రంలో పది జిల్లాలలోని 23,538 ఎకరాలలో గంజాయి సాగును ఎక్సైజ్‌ ‌పోలీసులు ధ్వంసం చేశారు. 2020 సంవత్సరంలో స్వాధీనం చేసుకున్న మొత్తం గంజాయి 8,53,554 కిలోలు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. బలిమేరు నది ఒడ్డునే ఇక్కడ విస్తృతంగా గంజాయి సాగు అవుతోంది. గడచిన ఏడేళ్లుగా యథేచ్ఛగా సాగిపోతోంది. అదెలా అంటే, ఈ ఏడేళ్ల కాలంలో ఏనాడు ఎక్సైజ్‌ ‌పోలీసులు ఆ ప్రాంతం మీద దాడి చేయలేదు. ఎవరైనా గంజాయి సాగు చేస్తూ, లేదా ఎగుమతి చేస్తూ పట్టుబడితే నార్కోటిక్‌ ‌డ్రగ్స్ అం‌డ్‌ ‌సైకోథెరపిక్‌ ‌సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డిపిఎస్‌) ‌చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష అనుభవించాలి. జరిమానా కూడా ఉంటుంది. అయినా ఈ సాగు చేయడానికి చాలామంది భయపడడం లేదు. నిజానికి జైలుకు పోవడానికే సిద్ధపడుతున్నారని భావించవచ్చు.

 కొందరు చెబుతున్న వివరాల ప్రకారం పాడేరు-ఆంధ్ర-ఒడిశా సరిహద్దులలో ఎకరా గంజాయి పంటకు రూ.2 లక్షలు వస్తుందని అంటున్నారు. ఇంకొందరు చెబుతున్న సమాచారం ప్రకారం ఎకరాకు 5 లక్షలు ఖర్చుచేస్తే రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందట. సాధారణ పరిస్థితుల్లో ఎకరాకు 250 కిలోలు, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు వెయ్యి కిలోల పొడి గంజాయి దిగుబడి వస్తుందని అంటున్నారు. ఇదంతా గిరిజనులతోనే సాధ్యం కాదు. అందుకే ఈ ప్రాంతంలో 90 శాతం వరకు ఉండే గిరిజనులకు డబ్బు ఎరచూపి కొందరు ఇక్కడ గంజాయిని పండిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా రవాణా అవుతోంది. ఉత్తరప్రదేశ్‌, ‌తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో గంజాయిని పట్టుకుంటే ఇది ఆంధ్ర నుంచే వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణలో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వచ్చిందని నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌ ‌ప్రకటించారు. ఈ ఆరోపణను ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణ ఉంది. అంతేకాకుండా ఆంధప్రదేశ్‌ అధికార పార్టీకి చెందిన ప్రముఖులు నల్లగొండ పోలీసులనే తప్పుపట్టారు. వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పరస్పర విమర్శల వెల్లువలో గంజాయి, మాదకద్రవ్యాల రవాణా అంశం పక్కదారి పట్టింది. అప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, రాష్ట్రాలకు మధ్య తలెత్తిన నీటి వివాదం మత్తుమందుల చర్చకు నీళ్లొదిలేలా చేసింది. ఈ విషయాన్ని మీడియా కూడా పట్టించుకో లేదు. గంజాయి, మాదకద్రవ్యాల విషయంలో పెద్ద రాద్ధాంతమే జరిగి దేశమంతా ప్రచారమయ్యాక ఒత్తిడి పెరిగి విశాఖమన్యంలో గంజాయి సాగు మీద పోలీసులు దండెత్తారు.

 పాడేరు ప్రాంతంలో గంజాయి సాగు విస్తరణ, పద్ధతులతో పాటు, ఎగుమతి చేస్తున్న వాళ్ల వ్యూహాలు కూడా మారిపోయాయి. పోలీసులు డ్రోన్లు ఉపయో గించి సాగు ప్రాంతాలను కనుగొంటున్నారు. నేరగాళ్లకి తమ అక్రమ వ్యాపారాలకీ, వ్యవహారాలకీ సాంకేతిక పరిజ్ఞానం విశేషంగా ఉపయోగపడు తోంది. వాళ్లకీ వాట్సాప్‌ ‌గ్రూపులు ఏర్పడినాయి. ఫోన్లు ట్యాప్‌ ‌చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ దారి పట్టారు. ఇక రవాణాలో చూపించే తెలివితేటలు అమోఘం. ఈ సాగును అరికట్టడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా తక్కువేమీ కాదు. సెప్టెంబర్‌లో పంట వేస్తే, జనవరికి, అంటే ఐదు మాసాలలో దిగుబడి అందుతుంది. ఈ కాలంలోనే ఎక్సైజ్‌ ‌పోలీసులు కూడా దాడులు చేస్తారు. గడచిన సెప్టెంబర్‌-‌జనవరి మధ్య దాదాపు 250 గ్రామాలలో గంజాయి సాగు పొలాల మీద దాడులు జరిపారు. 2017 సెప్టెంబర్‌ ‌మధ్య నుంచి 2018 జనవరి మాసాంతం వరకు మూడు వేల ఎకరాలలో పెరుగుతున్న కోటీ డెబ్బయ్‌ ‌లక్షల గంజాయి మొక్కలను ధ్వంసం చేశారని వార్తలు వెలువడినాయి. ఇక్కడ రాజహంస, కాలాపత్రి, శీలావతి అనే రకాల గంజాయి సాగవుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇందులో శీలావతికి అపారమైన గిరాకీ ఉంటుంది. దీనికి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్‌, ‌ఢిల్లీ, హరియాణాలలోను గిరాకీ ఉంది. ఇంత విస్తృతమైన మార్కెట్‌కు పాడేరు ప్రాంతం వనరుగా మారడం తీవ్రమైన విషయం.

ఒక్క పాడేరు, ఒరిస్సా-ఆంధప్రదేశ్‌ ‌సరిహద్దుల నుంచే ఇంత స్థాయిలో ఈ ఎగుమతులు జరుగు తున్నా, ఆ నేర సామ్రాజ్యంలో ఇది చిన్న పార్శ్వమే. దేశంలోకి ఇంకా నేపాల్‌-ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌, ‌ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌, ‌గోవా ప్రాంతాల నుంచి మత్తుమందులు రవాణా అవుతున్నాయి. గంజాయితో పాటు హషీష్‌, ‌చరస్‌ ‌కూడా ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నాయి. మార్ఫిన్‌, ‌హెరాయిన్‌, ‌కొకైన్‌, ‌నల్లమందుల అక్రమ రవాణా కూడా యంత్రాంగాన్ని తల పట్టుకునేటట్టు చేస్తోంది.

ఇంతకీ భారతదేశంలో గంజాయి ఎక్కడెక్కడ సాగు అవుతోంది? దీనికి సమాధానం అన్వేషించడం కంటే, అది ఎక్కడ సాగు కావడం లేదో చెప్పుకోవడం సులభం. అసోం, బిహార్‌, ‌తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌జమ్ముకశ్మీర్‌, ‌పంజాబ్‌, ‌రాజస్తాన్‌, ‌కేరళ, హిమాచల్‌, ‌మణిపూర్‌, ‌త్రిపురలలో కూడా ఇది సాగు అవుతోంది. ఇంకా మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ‌కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌, అం‌డమాన్‌లలోను సాగవుతోంది. ఇక్కడే ఇంకొక్క తమాషా గురించి ప్రస్తావించుకోవచ్చు. పాడేరు ప్రాంతాన్ని గంజాయి రాజధానిగా స్మగ్లర్లు గౌరవించుకుంటున్నారు. అక్కడి శీలావతి అనే రకానికి బోలెడు గిరాకీ అని చెబుతున్నారు. దీనికి పోటీ వచ్చేదే ‘ఇదుక్కి బంగారం’. అంటే మరేదో కాదు, గంజాయే. దీనికే ‘కేరళ బంగారం’ అన్న మరొక బిరుదు కూడా కట్టబెట్టారు. ఈ రకం గంజాయికి కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా గిరాకీ ఉందట. ఇది 80 శాతం భారతీయ గంజాయి, 20 శాతం విదేశీ జాతి గంజాయి కలయిక. అంటే సంకరజాతి గంజాయి. ఆ ఇరవై శాతం ఆమ్‌స్టర్‌ ‌డామ్‌కు చెందినదని చెబుతారు.

గంజాయి అక్రమ రవాణాదారుల నుంచి మావోయిస్టులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆంధప్రదేశ్‌ ‌పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌గౌతమ్‌ ‌సవాంగ్‌ ‌చెప్పారు. మావోయిస్టు బెడదను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహం గురించి చర్చించడానికి ఏర్పాటయిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం తరువాత సవాంగ్‌ ఈ ‌సంగతి చెప్పారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల సమస్య కూడా కాబట్టి ఒడిశా కూడా ఇందులో పాల్గొన్నది. కర్ణాటక, తెలంగాణ, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రాలకు చెందిన కొందరు ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న గంజాయి సాగుకు పెట్టుబడులు పెడుతున్నారని పోలీసులకు సమాచారం ఉందని కూడా రాజమండ్రిలో మాట్లాడుతూ సవాంగ్‌ ‌చెప్పారు. గంజాయి సాగు, మావోయిస్టుల జోక్యం గురించిన ఆరోపణలు ఇప్పటివి కావు. 2018లో విశాఖజిల్లా అరకు ప్రాంతంలో ఇద్దరు తెలుగుదేశం నాయకులను మావోయిస్టులు కాల్చి చంపడం వెనుక ఉన్నది కూడా గంజాయికి సంబంధించిన వ్యవహారమే నని, దీనిని బట్టే ఆ సాగుకు, మావోయిస్టులకు మధ్య దృఢ బంధం ఉన్న సంగతి సుస్పష్టమని ఆనాడే బయటపడింది. గంజాయి సాగును మావోయిస్టులు రక్షిస్తారు. అందుకు ప్రతిఫలంగా ‘అన్నల’ బాధ్యతను గిరిజనులు స్వీకరిస్తారు. 2018 ప్రాంతంలో గంజాయి సాగు, ఎగుమతి కూడా ఎక్కువే. నెలలో 20 నుంచి 25 గంజాయి అక్రమరవాణా కేసులు నమోదయ్యేవి. ప్రతి నెల పట్టుబడుతున్న గంజాయి పరిమాణం పెరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో 2010లో నక్సల్స్ ‌ప్రాబల్యం బలహీనపడిన తరువాత కొందరు గోండు యువకులు ఆ పని ఆరంభించారు.

పోలీసులు చెప్పడం మాత్రమే కాదు. మావోయిస్టులు, గంజాయి సాగుతో వారి సంబంధం గురించి మీడియాలోనూ కథనాలు వచ్చాయి. చిత్రంగా ఆంధ్ర- ఒడిశా సరిహద్దు పేరు వింటే మావోయిస్టుల అడ్డాగా చెప్పుకునేవారు. ఇప్పుడు మావోయిస్టులతో పాటు గంజాయి సాగు పేరు చెప్పినా ఆ ప్రాంతమే గుర్తుకు వస్తున్నది.కేవలం ఇక్కడి నుంచే నెలకు రూ. 10 కోట్ల విలువైన గంజాయి ఎగుమతి అవుతుందని చెబుతారు. గంజాయి అక్రమరవాణా దారుల నుంచి మావోయిస్టులు డబ్బులు గుంజుతూ ఇదంతా పోరాటమంటే ఎలా అని ప్రశ్నిస్తూ ఆ ప్రాంతంలో పోలీసులు పోస్టర్లు కూడా వేశారు. అయితే ఇదంతా మావోయిస్టుల మీద బురద చల్లడమే నని ప్రజాసంఘాలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల నుంచి ఖమ్మం, వరంగల్‌, ‌నల్లగొండల మీదుగా హైదరాబాద్‌కు మత్తుమందులు రవాణా అవుతున్నాయి. ఈ సెప్టెంబర్‌ 1 ‌నుంచి నవంబర్‌ ‌మధ్య వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల ద్వారా 35,000 కేజీల గంజాయి లేదా మారుజునాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 110 అక్రమరవాణా దారులను పట్టుకున్నారు. తెలంగాణలోని నల్లగొండలోని కొన్ని ప్రాంతాలలో పత్తి, చెరకు పంటల మధ్య గంజాయి పండిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. వీటి కోసం డ్రోన్లతో తనిఖీలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాలలో ఆ సాగు నిజమని తేలింది. 168 కిలోల పొడి గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. కరీంనగర్‌ ‌జిల్లాకు కూడా ఈ బెడద ఉంది. 2021 ఫిబ్రవరిలో ఈ జిల్లాలో 261 గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అయితే 13,881 కిలోల గంజాయి దొరికింది. దీని విలువ రూ.26 కోట్లు పైనే. వరంగల్‌ ‌జిల్లాలో దాదాపు రూ.90 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఈ గణాంకాలకు అంతే లేదు.

 మత్తుమందులు తెచ్చే సంపాదన అవి ఇచ్చే మత్తును మించిపోయిందని చెప్పాలి. ఈ మత్తు సాధారణ ప్రజలకు కూడా తాకడమే అత్యంత బాధాకరం. ఒక జాతీయ సమస్యకు ప్రాంతీయ రాజకీయ నీలినీడలు పడడమూ అవాంఛనీయం. మొత్తంగా ఒక ఒక దేశాన్ని, కొన్ని తరాలను, వ్యవస్థ భవిష్యత్తును అవలీలగా చిదిమేసే మత్తుమందుల దగ్గర రాజకీయాలు చొరబడడం ప్రమాదం. ఇది సమాజంలో వస్తున్న అతి పెద్ద నైతిక పతనం. ఉగ్ర వాదులకూ, మతోన్మాదులకు ఆర్థిక వనరుగా మారిపోయిన మత్తుమందుల ఉత్పత్తి, రవాణాల మీద ప్రపంచం మొత్తం కఠినంగా వ్యవహరించాలి.

——————————————————————————-

ఉగ్రవాదానికి ఊపిరి

మత్తుమందుల సరఫరా, అందుకు సహకరించడం కోట్ల డాలర్ల వ్యవహారం. వ్యవస్థీకృత నేరాలలో దీనికి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. ఇందులో ఎక్కువ భాగం ఉగ్రవాద సంస్థలకే చేరుతోంది. ఇది రహస్యం కూడా కాదు. పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ‌కొన్ని ఆఫ్రికా దేశాలు ఇందుకు పేర్గాంచాయి. కాలం గడుస్తున్న కొద్దీ మత్తుమందుల అక్రమ రవాణా మీద వచ్చిన ఆదాయం మీదే ఉగ్రవాద సంస్థలు పనిచేసే స్థితికి వచ్చాయి. ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదులకీ, కొన్ని ఇతర ఉగ్రవాద సంస్థలకి నిధులు మత్తు మందుల అక్రమ రవాణా నుంచే లభిస్తున్నాయి. ఈ దారుణ వాస్తవాన్ని చెప్పే ఎన్నో నివేదికలు ఉన్నాయి.

కశ్మీర్‌లో పాకిస్తాన్‌ ‌చేస్తున్న వికృత క్రీడ దారుణమైనది. నిజానికి బయటకు రావలసిన ఇంకొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఉగ్రవాదులకు తర్ఫీదు ఇచ్చి పంపించడమే కాదు, మానసికంగా దెబ్బ తీయడానికి ఈ-జిహాద్‌ను ప్రయోగించడమే కాదు, మత్తుమందులను కూడా ఉపయోగిస్తున్నది. కశ్మీర్‌తో పాటు పంజాబ్‌ ‌యువతను కూడా నిర్వీర్యులను చేయడానికి మత్తుమందుల వినియోగాన్ని ప్రోత్సహించే వ్యూహం అనుసరిస్తున్నది. ఇటీవల సైన్యం, నిఘా సంస్థలు చేసిన తనిఖీలలో ఉగ్రవాదుల దగ్గర ఆయుధాలతో పాటు మత్తుమందులు కూడా పట్టుబడుతున్నాయి. ఈ మత్తుమందులలో అఫ్ఘానిస్తాన్‌లో తయారైన రకాలు ఎక్కువ. అఫ్ఘాన్‌ ‌నుంచి పాక్‌కీ, అక్కడ నుంచి కశ్మీర్‌, ‌పంజాబ్‌లకు వాటిని సరఫరా చేస్తున్నారు. అఫ్ఘానిస్తాన్‌ ‌దక్షిణ, నైరుతి ప్రాంతాలలో పండే పాపీ పంట (నల్లమందు ముడిసరుకు) తాలిబన్‌కు ఊపిరి. తాలిబన్‌ ‌తిరుగుబాటుకు రూపురేఖలు ఇస్తున్నదే నల్లమందు వ్యాపారులన్న సంగతి కూడా బయటపడింది. తాలిబన్‌ ‌తిరుగుబాటు స్వరూపాన్నే వాళ్లు మార్చేశారు. మూడు దశాబ్దాల పాటు అఫ్ఘాన్‌ను, అక్కడి రాజకీయాలను వీళ్లే అవినీతి మయం చేశారు. గ్రామ స్థాయి నుంచి మత్తుమందులు సేకరించడం, విక్రయించడం, ఎగుమతి చేయడం అంతా తాలిబన్‌ ‌కమాండర్ల చేతులలో ఉండేది. ఇంకా గట్టిగా చెప్పాలంటే 2001లో అమెరికా సేనల ప్రవేశం నుంచి వాటి వ్యూహాలను నిర్వీర్యం చేయడంలో నల్లమందు పెద్ద పాత్రనే నిర్వహించింది.

 కశ్మీర్‌ ఉ‌గ్రవాదులకూ, పంజాబ్‌లోని మత్తుమందుల సరఫరాదారులకు మధ్య గట్టి బంధమే ఉన్న సంగతి కూడా బయటపడింది. దక్షిణ కశ్మీర్‌ ‌ప్రాంత రైతులను గంజాయి పండించవలసిందిగా ఉగ్రవాద మూకలు బలవంతపెడుతున్న సంగతి కూడా తెలిసింది. ఐక్య రాజ్యసమితి మత్తుమందుల నిరోధక కార్యక్రమం (యూఎన్‌డీసీపీ) ఇచ్చిన నివేదిక ప్రకారం కశ్మీర్‌ ‌లోయలో మత్తుమందులను తీసుకునేవాళ్లు దాదాపు 70,000 మంది. ఇందులో 31 శాతం మహిళలు. ఇందులో అధికులు 17-35 మధ్య వయసువారే.

 మత్తుమందులు, మతోన్మాదులు, మాఫియాల అపవిత్ర బంధంతో పలు ఆసియా దేశాల రాజకీయ, ఆర్థిక, సైనిక, భద్రత, సామాజిక పరిస్థితి కుదేలవుతున్నదని రుజువు చేసే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఇస్లామిక్‌ ‌మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఉజ్బెకిస్తాన్‌ ఇం‌దుకు ఉదాహరణ. అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి మధ్య ఆసియాకు మత్తుమందుల రవాణాలో ఆధిపత్యం ఈ సంస్థదే అని నివేదికలు చెబుతున్నాయి. సాయుధ తిరుగుబాట్లకూ, మత్తుమందుల అక్రమ రవాణాకు మధ్య ఉన్న బంధం గురించి కూడా ఆ సంస్థ కార్యకలాపాల ద్వారా తెలుస్తుందని ఆ నివేదికలు చెబుతున్నాయి. ఐఎస్‌ఐఎస్‌ ‌సభ్యులు కొకైన్‌ ఉత్పత్తిదారులకు రక్షణ కల్పించి లబ్ధి పొందుతారు. వీళ్లే గంజాయి అక్రమ రవాణాకు సహకరించి సిరియా, టర్కీల మీదుగా యూరప్‌కు మత్తుమందులు చేరుస్తారు. ఇంత పెద్ద రక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ మత్తుమందుల రవాణా యథేచ్ఛగా సాగడానికి ఉగ్రవాద ముఠాల అండ ఉండడమే కారణమని కూడా తేలింది. మరీ ముఖ్యంగా బలహీనమైన వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆ బెడదను ఎదుర్కొనలేకపోవడానికి కారణం కూడా ఉగ్రవాద మద్దతేనని చెప్పాలి.

———————————————————————————————

పూదోటల మాటున…

తెలుగు రాష్ట్రాల గంజాయి సాగుదారులు కూడా చాలా తెలివి మీరారు. పూలతోటలు, మొక్కజొన్న పంటలలో కూడా గంజాయి సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో పూలతోటలో గంజాయి సాగు చేస్తున్న ప్రబుద్ధుడిని ఎక్సైజ్‌ ‌పోలీసులు పట్టుకున్నారు. ఇవి ఆరడుగుల పొడవున ఉన్నాయట. పది దొరికాయి. ఇతడి మీద ఎర్రచందనం అక్రమ రవాణా కేసు కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. కాబట్టి ఎర్రచందనం దొంగలకి కూడా గంజాయి సాగులో ప్రమేయం ఉందని అనుకోవచ్చు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ధన్‌సింగ్‌ ‌తండాకు చెందిన వ్యక్తి కంది, మొక్కజొన్న పంటల పేరుతో గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. అతడి పొలంలో 267 మొక్కలు కనుగొన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో డాబా మీదే గంజాయి సాగు చేసిన కేసులు నమోదైనాయి.

About Author

By editor

Twitter
Instagram