ఇది భారతీయ సమాజం మేధోపరమైన యుద్ధానికి సన్నద్ధమయిన కాలమని, మహానుభావులైన వారి ప్రేరణాత్మక చరిత్రలను మరుగు పరచి  దురాక్రమణదారుల చరిత్రలను మనపై రుద్దిన కుహనా చరిత్రకారులనే మనం ఇంకా భరిస్తున్నామని నవంబర్‌ 21‌న కేశవ మెమోరియల్‌ ‌విద్యా సంస్థ ప్రాంగణంలోని పటేల్‌ ‌హాలులో జరిగిన గోల్కొండ సాహితీ మహోత్సవం ముగింపు సభలో వక్తలు అన్నారు. ఆక్రమణదారులను తరిమికొట్టడమే కాదు, మనదైన ధర్మాన్నీ, వాఙ్మయాన్నీ మనం కాపాడుకుంటూనే ఉన్నామని గుర్తుచేశారు. ముఖ్య అతిథిగా జస్టిస్‌ ఎల్‌. ‌నర్సింహారెడ్డి, విశిష్ట అతిథిగా టి. హనుమాన్‌ ‌చౌదరి. ముఖ్యవక్తగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ ‌సునీల్‌ అం‌బేకర్‌, ‌డా. సి.సంజీవ్‌ ‌కుమార్‌ ‌శర్మ, డాక్టర్‌ ‌కిషన్‌రావు, సంస్కార భారతి అధ్యక్షులు కె.కె.వి. శర్మ, సమాచార భారతి అధ్యక్షులు డా।। గోపాల్‌ ‌రెడ్డి, అచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి వేదికనలంకరించారు. వల్లీశ్వర్‌ ‌స్వాగతం పలికారు.

మేధావుల మధ్య అంతర్యుద్ధం: టీహెచ్‌ ‌చౌదరి

మేధావుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోందని డాక్టర్‌ ‌టి. హనుమాన్‌ ‌చౌదరి అన్నారు. స్వావలంబన ఎడల విశ్వాసం, వసుదైక కుటుంబకం, ఏకం సత్‌ ‌విప్రా బహుదా వదంతి వంటి ఆశయాలకు బద్ధులైన భారతీయులు మేధోపరమైన యుద్ధాలకు సన్నద్ధమవుతున్న కాలంలో మనం ఉన్నామని  వ్యాఖ్యానించారు.సాహిత్యంతో పాటు మనవైన నృత్యం, సంగీతం, నాటకం వంటి కళా సంపదతో ఆ మేధో యుద్ధాన్ని సాగించాలని అన్నారు. గోల్కొండ సాహితీ మహోత్సవ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవతలి పక్షంలో  =చీ× (రెసిడెంట్స్ ఆఫ్‌ ‌నాన్‌ ఇం‌డియన్స్), ‌కమ్యూనిస్టులు, కుహానా మేధావులు ఉన్నారని ఆయన చెప్పారు. వీళ్లంతా 1838 నాటి మెకాలే  తలవుల లోనే ఉన్నారనీ, ఆంగ్లేయులుగానే కొనసాగుతున్నారనీ, కానీ వేదభాషతో మాత్రమే భారతీయత ఆవిర్భవిస్తుందని స్పష్టం చేశారు.ఇందుకు మనందరికీ ఆత్మవిశ్వాసం కావాలి. కొన్ని సందర్భాలలో అహింసా పథం పనికిరాదంటూ భగవద్గీత చెప్పిన విషయాన్ని విస్మరించలేమని గుర్తు చేశారు. కులాలను, ప్రాంతాలను విడదీసి అత్యంత ప్రమాదకర రీతిలో అంతర్యుద్ధానికి పురికొల్పుతున్న వారిని ఎదిరించాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు. అలాంటి మేధోపరమైన యుద్ధానికి సంసిద్ధం కావడానికి గోల్కొండ సాహితీ మహోత్సవం వంటి కార్యక్రమాలు దోహదపడతాయని డాక్టర్‌ ‌చౌదరి అన్నారు.

కుహనా చరిత్రకారులని సహిస్తున్నాం: జస్టిస్‌ ‌నరసింహారెడ్డి

మహావీరులు, ధార్మికులు అయినా మన పూర్వికుల వాస్తవ చరిత్రలను మరుగున పెట్టి, విధ్వంసకారుల చరిత్రలను దేశంలో ఎక్కువగా ప్రచారం చేశారని జస్టిస్‌ ఎల్‌. ‌నరసింహారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్‌ ‌నర్సింహారెడ్డి, చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ట్టుగా కేవలం తేదీలు, యుద్ధాలు, రాజులు, వాళ్ల వంశాల పేర్లు కాదనీ చరిత్ర అంటే సత్యాలని వ్యాఖ్యా నించారు. నేతాజీ, స్వామి వివేకానంద, సర్దార్‌ ‌పటేల్‌ ‌వంటి మహానుభావుల పేర్లను కావాలని విస్మరించిన కుహనా చరిత్రకారులను మనం నేటికీ సహిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన ధర్మం, సంస్కృతి, మనదైన జీవిత విధానం, అది ఇచ్చే సంతోషం, ఆహారపు అలవాట్లు  ఎంత ఉన్నతమైనవో   కొవిడ్‌ ‌మహమ్మారి వేళ రుజువైందని ఆయన అన్నారు. మన జాతిని నిజానికి అవే రక్షిస్తున్నాయని చెప్పారు.

 ‘స్వ’లో స్వభాష ఒకటి: సునీల్‌ అం‌బేకర్‌

ఎన్నో ఆక్రమణలు, సుదీర్ఘ  విదేశీ పాలన తర్వాత కూడా తెలుగు సాహిత్యంతో పాటు, మన అన్ని భాషాసాహిత్యాలు నిలిచి ఉన్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ ‌సునీల్‌ అం‌బేకర్‌ అన్నారు. మన స్వాతంత్య్ర పోరాట తాత్త్వికతలోని ‘స్వ’లో స్వభాష ఒకటని ఆయన అన్నారు. విదేశీ దురాక్రమణదారులను తరమడమే కాదు, మన ధర్మాన్ని తరం తరువాత తరం  నిలబెట్టుకుంటూ వస్తున్నామని, భాష కూడా తరం నుంచి తరానికి అందుతుందని చెప్పారు స్వభాషా ప్రయోగం ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఇంకా ఆయన,  ఆంగ్లేయులను దేశం నుంచి తరమడానికి మాత్రమే మనం వారితో సంఘర్షించలేదు. ఆ సంఘర్షణ వెనుక స్వధర్మాన్ని, సంస్కృతిని కాపాడాలన్న  ఆరాటమూ ఉంది. స్వధర్మం ఒక్కరోజులో ఎవరో లిఖిస్తే, ఎవరో నిర్మిస్తే వచ్చినది కాదు. తరతరాల  వారి సాధనలో పరిశుద్ధమైనది. మన రుషుల సాధనలో, సాహితీ వేత్తల కృషితో ఇంతవరకు అందుతూనే ఉంది. ఆర్ష వాఙ్మయంగా చెప్పుకునే వేదాలు ఎంతో మథనం తరువాత మనకు ప్రసాదంగా లభించాయి.

ఎలా జీవించాలి! ఎక్కడ వినమ్రంగా ఉండాలి! ఎక్కడ ధైర్యసాహసాలు ప్రదర్శించాలి! వంటి అంశాలను మన సాహిత్యం చెబుతుంది. తులసీదాస్‌ ‌మొఘలుల కాలంలో రాసిన రామాయణంలో రాముడు ధనుర్ధారి, మహావీరుడు. వీర సావర్కర్‌ ‌రాసిన 1857 సంగ్రామ చరిత్ర యువకుల పరాక్రమం, వీరత్వం అక్షరబద్ధం చేసింది. మనకు  సాహిత్యం నుంచి దిశానిర్దేశం రావాలి. స్వాభి మానం, ప్రేరణ ఇచ్చే సాహిత్యం మనకు ఎప్పుడూ అందుతూనే ఉంది.  నందుల పరిపాలన సక్రమంగా లేకపోతే, ప్రజలు సంఘర్షణతో కొత్త రాజును ఎంచుకున్న దేశం మనది. ఇది రాజుతోనే నాశనమయ్యే దేశం కాదు.

సాహిత్యంతో సమాజానికి పరిశుద్ధత వస్తుంది. నిజానికి సాహిత్యం పుస్తకాలలోనే కాదు, మన ప్రతీ కణంలో రగులుతూనే ఉంటుంది. మళ్లీ పుడుతూనే ఉంటుంది. ఉదాహరణ తక్షశిల విశ్వవిద్యాలయ గ్రంథాలయం. ఎన్నో వేల విలువైన గ్రంథాలు ఉన్న దానిని విదేశీయులు తగుల బెట్టినా  మన సాహిత్య ధార ఆగిపోలేదు. నిత్యజీవనంలో అదీ భాగమే. భారతం ఇతిహాసం. రామాయణం జీవన విధానం. మన జీవన సౌందర్యం ఆయుర్వేదం. ఇదంతా భారతీయ సాహిత్యమే. కాళిదాసు కావ్యాలలో రుతువులు, పువ్వులు, వనాల సౌందర్యాన్ని ఎంతో అద్భుతంగా వివరించాడు. మనదైన సౌందర్య దృష్టికి అదొక గీటురాయి. మనకు స్వాధీనత లేదా స్వాతంత్య్రం వచ్చిన మాట నిజమే. కాని స్వాభిమానం రావాల్సి ఉంది. ప్రపంచానికి స్వాభిమానుల్ని అందించే దేశం భారత్‌ ‌మాత్రమే. ఈ దేశాన్ని ఏ విధంగా మార్చుకోవాలో రాజ్యాంగ నిర్మాతలు రాముని చిత్రంతో (మన పురాణ పురుషుల బొమ్మలు రాజ్యాంగ అసలు ప్రతిలో ఉంటాయి)  మనకు సూచించారు. దాని కోసం మన భావితరం, యువతరం కృషి చేయాలి. ఈ దేశంలో సాహిత్యానికి కొరత లేదు. కావలసినదల్లా చదివే అభిరుచి. అధ్యయనం అవసరాన్ని గుర్తించడం. మన విశ్వవిద్యాలయాలలోని గ్రంథాలయాలలో ఎన్నో పుస్తకాలున్నాయి. అంతా వాటిని తెరచి చూడాలి. ఇప్పుడు మనదైన చింతన పట్ల మార్పు వస్తున్నది, దానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి.వేగం తేవాలి. సాహిత్య ప్రవాహం రావాలి, అందులో చెత్త సాహిత్యం, కుహనా చరిత్ర కొట్టుకుపోవాలి. యువకుల ఆలోచనలలో విప్లవం ఉంది. తప్పుడు చరిత్రను మార్చాలని ప్రయత్నిస్తున్నారు. వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ అంబేకర్‌ ‌దిశానిర్దేశం చేశారు.

సంస్కృతితో ఐక్యత: సంజీవకుమార్‌ ‌శర్మ

పాలకులు లేకున్నా ధర్మాన్ని యథావిధిగా ఆచారించాలి. అదే స్వధర్మమని అని సంజీవ్‌కుమార్‌ ‌శర్మ (మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, మోతీహార్‌, ‌బిహార్‌) అన్నారు. మన దగ్గర ఉన్న మంచిని అందరికి పంచాలి. వసుధైక కుటుంబకమ్‌ అనే మన భావన కరోనా సమయంలో ప్రపంచానికి భారత్‌ ‌ద్వారా అనుభవానికి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. సాంస్కృతిక ఐకమత్యం మన దేశాన్ని ఏకంచేస్తుందని అన్నారు. ధర్మం పరిస్థితిని బట్టి మారుతుంది. మాయలతో మాయా రూపకంగానే వ్యవహరించాలని చెప్పారు.

By editor

Twitter
Instagram