ఇరుగు పొరుగు దేశాలన్నీ ఒక్కసారిగా తలెత్తి చూశాయి. ఆ చూపుల్లో సంభ్రమం ఉంది. ఇప్పటివరకూ లోలోపల ఉన్న సందేహానికి సరైన సమాధానమూ లభించినట్లు అయింది. ఆనందించిన పాలక పక్షాలూ ఇంకెన్నో! అందరినీ తన వైపునకే తిప్పుకొన్న ఆ దేశం ఇండోనేషియా, అక్కడి మహిళా నాయికామణి సుక్మావతి. ఇండో, ఇండియా, హిందూ పదాల మాదిరే ఆమె పేరూ మనకు సుపరిచితం అనిపిస్తున్నదా? అవునవును. హిందుత్వ పరిమళాలు గుబాళించే ముస్లిం ప్రజాధిక్య ద్వీప ప్రాంతం అది. దశాబ్దాల తరబడి పాలనా పగ్గాలు చేపట్టిన అనుభవమున్న పప్రథమ దేశాధ్యక్షుడు సుకర్ణో కుమార్తె తాను. ప్రపంచానికే తలమానికమైన హిందూ మతంలోకి మారిన ఆ నాయకాగ్రణి ప్రత్యేకతలు మరెన్నో కనిపి స్తాయి. సరిగ్గా 70 ఏళ్ల వయసులో, అందులోనూ పుట్టినరోజు వేళన, అదే మహోత్సవ వేదిక సాక్ష్యంగా సుక్మావతి నెలకొల్పిన సృజనాత్మక చరితగానే మనమంతా పరిగణించి తీరాలి. ఏ జాతి రాణించాలన్నా రాజకీయ స్వతంత్రత, ఆర్ధిక సమానత నెలకొనాలి. స్వార్ధ రహిత ప్రభుత, ద్వేషానికి తావులేనంత జాతీయత వెల్లివిరియాలి. వీటన్నిటి నేపథ్యంలో ఆ దేశ నాయకురాలు సమైక్యతకు స్వాగతమిచ్చేలా శాంతి పావురాన్ని ఎగురవేశారు. కారుచీకట్లు తొలగిపోయేలా ఎన్నటికీ ఆరని జ్యోతిని వెలిగించారు. ‘స్వజాతి ధర్మం సంరక్షించు- విజయం నీదే విశ్వసించు’ అన్నట్లు హిందు జనజీవన విలక్షణతను తన చేతలతో, తనదైన రీతులతో ధగధగలాడించారు. పూర్వాపరాలను కూలంకషంగా తెలుసుకుందాం..


ఇండోనేషియా. ఈ పేరు వినగానే, ద్వీపాల సముదాయం గుర్తుకొస్తుంది. ఇది ఆసియా, ఆస్ట్రేలియా మధ్య విస్తరించిన ద్వీప దేశం. మధుర, సుమత్రా వంటి ప్రధాన దీవుల పేర్లు వింటే హిందుత్వం తలపుకొస్తుంది. ప్రజల్లో అత్యధికులు ముస్లిములైనా, దేశ రాజ్యాంగం మాత్రం మత స్వతంత్రతను గుర్తించడం విశేషమే. లక్షలాది హిందువుల్లో ఎక్కువ మంది నివసించేది ఎక్కడో తెలుసా? బలి ద్వీప ప్రాంతంలో. మొత్తంమీద బౌద్ధుల సంఖ్య కూడా గణనీయమే. నిజానికి భారత్‌, ‌చైనా దేశాల (అది బౌద్ధ ప్రధానమని మనకు తెలిసిందే) నడుమ సాంస్కృతిక సంబంధాల వారధిగా వెలిగింది ఈ ద్వీప రాజ్యమే. చీనా నుంచి తరలివచ్చే యాత్రికులు ఇవే ప్రాంతాల్లో బస చేసి, ప్రముఖంగా సంస్కృతాన్ని అభ్యసించి, అటు తర్వాతే మన దేశానికి చేరుకునేవారని ప్రతీతి. అదే ఇండోనేషియాలోని పానతరనం అనే పేరున్న పట్టణ ఆలయ గోడలమీద రామాయణ, భారత కథారూప శిల్పాలుండటం మరెంతో ప్రత్యేకత. మన మాదిరే 1950 ప్రాంతాల్లోనే రాజ్యాంగ విధాన ఆమోద పక్రియ జరిగిపోయింది. అప్పట్లో తొలి అధ్యక్షుడు అహమ్మద్‌ ‌సుకర్నో (సుకర్ణ అని కూడా భావించవచ్చు). అటు తర్వాత రాజకీయ పరిణా మాల్లో ఆయన పాలనాధికారం నామమాత్రమే అయింది. కాలక్రమంలో ఇంకెన్నో మార్పుచేర్పులు. మరో మాట. ఇందులోని విశ్వవిద్యాలయాల్లో కొన్నింటి పేర్లయితే, హిందు సంబంధంగానే వెలుగులీనుతుంటాయి (శ్రీవిజయ, దీపనగర, అందాలస, పంచచారణ, చంద్రవాసి, పంచశీల… ఇలా). ఇక్కడి పురాతన చారిత్రక నిర్మాణాల్లో అనేకం హిందూ, బౌద్ధ మతాల సంబంధితాలు. జావాలో ఉన్న దైవమందిరాల్లో ఒకటి చండి సింహగిరి, మరొకటి చండీ జాగో. ఇక బలి ద్వీపమంటారా? ప్రాచీన సంస్కృతి, కళారూపాలకు నెలవు. గజ మద పేరుగల ఉన్నత విద్యామందిరాన్నీ ఇక్కడే చూడవచ్చు. ఆ గజమద ఎవరంటే, ఒక మహా అమాత్యుడు. చూశారా- మన ప్రభావం ఆ దేశంలో ఎంత ప్రబలంగా విస్తరిస్తూ వస్తోందో! ఇంకొక విలక్షణత ఏమిటంటే- జావనీ, బాలీనీ పేరిట అక్కడ ప్రఖ్యాతమైన నృత్యాలు ప్రత్యేకించి హిందూ కళల ప్రభావితాలే.

ప్రభావం వివిధ విధాలు

అంతటి ఇస్లాం ప్రధాన దేశంలో ఓ సుప్రసిద్ధ మహిళ హిందూ మతాన్ని మనసారా స్వీకరించి చరిత్రకెక్కారు. ఆమే దయా సుక్మావతి. మరెవరో కాదు, సాక్షాత్తు దేశ వ్యవస్థాపక నేత సుకర్ణో తనయ. తన దేశంలోని బాలి ప్రాంతంలో ఈ మధ్య భారీ వేడుక వేదికపైన స్వీకార కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అదే రోజున తనకు 70వ జన్మదినోత్సవం. సంరంభ నామకరణ సైతం ‘సుధీ వదని’ రూపేణా గుబాళిం చింది. జనమెరిగిన రాజకీయ మహిళా నేత సుక్మావతి. ఏ పని చేపట్టినా విభిన్నత తనదైన రీతి. ఆ సంబరం ఏర్పాటైన ప్రదేశం బాలే అగుంగ్‌ ‌సింగరాజా జిల్లా. క్రతువు స్థలం సుకర్ణో నామధేయం కలిగిన ధార్మిక కేంద్రం. మత మార్పిడిలకు కారణాలు అన్వేషిస్తే, అవి అనేకం. ముందుగా చెప్పుకోవాల్సింది దివంగత అమ్మమ్మ గురించే! హిందూమత సంప్రదాయాలు, విధివిధానాలను ఉదాహరణ సహితంగా తొలినుంచీ నూరిపోస్తుండేది. సూత్రాలు, వాటి విలువల ఘనతను సవివరంగా చాటిచెబుతూ ఉండేది. ఫలితంగా దశాబ్దాలుగా భక్తిశ్రద్ధలు పెంచుకున్నారామె. ఇదివరకే దాదాపు ముఖ్య ఆలయాలన్నింటినీ సందర్శించి, ముందుగానే ఇతిహాసాల సమగ్ర అధ్యయనం పూర్తిచేశారు. పద్ధతులు, ఆచారాల మీద ఎంతైనా అవగాహన ఉంది. పుట్టిన గడ్డమీద పాలక అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు వహించిన పెద్ద సోదరి మెగా (మేఘ)వతి నుంచి వివరాలన్నీ సమీకరించి, విషయ విశ్లేషణ సామర్ధ్యంలో తనను మించిన మేటి లేరని అనిపించు కున్నారు. సమస్త ఆగ్నేయాసియాలోనూ ముస్లిం ఆధిక్య ప్రాంతాన ఉంటున్నా, సుక్మావతి అంతరంగమంతా హిందుత్వమే. చూపులన్నీ అదే తత్వచింతన వైపు. పర్యవసానం ఆ ధర్మాచరణ. మతం మారారన్నది సహజంగానే ఇంటా బయటా సంచలనాత్మకత సంతరించుకుంది. ఇంకొన్ని దేశాలకైతే అత్యంత కీలక చర్యగా కనిపించి, చర్చోపచర్చలకు దారితీసింది. మరీ ముఖ్యంగా 70 సంవత్సరాల ముదిమి (శారీరకంగా) లో కృత నిశ్చయం ఎందరికో స్ఫూర్తీవంతమన్నది నిర్వివాదం. ‘మతస్వేచ్ఛకే నా జీవితంలో మొదటి స్థానం. అందునా హిందూమతానికి మారడం సదా ఆనందప్రదం’ అంటున్నప్పుడు కళ్లలో ఆశాదీపాలు వెలిగాయి, పెదవులపైన నవ్వుల పువ్వులు విరబూశాయి. అంతసేపూ తాను సుక్మావతి కాదు, సర్వదా సదాచరణవాది.

నేతృత్వానికి ఉదాహరణం

మతం అనేది సకల జన హితకరం. శాస్త్ర సమ్మతి, అభిప్రాయం, ఆశయం, సంకల్పం, తలపు, తాత్పర్యం, పూజనీయం అనే అర్థాలూ ఉన్నాయి. అన్నింటికంటే మించి-అంగీకారం, అనుమతి, అభి మతం, ఇష్టం, ఒప్పుదల కీలకం. ఇవన్నీ సుక్మావతి తాజా నిర్ణయంలో చక్కగా కలగలిసి కనిపిస్తాయి. పురాణాలూ, ఇతిహాసాలూ ప్రబోధించేవాటిని ఎప్పుడూ నామకరణ రూపంలో తలచుకునే ప్రదేశం కదా ఆమెది. తరతరాల తీరుతెన్నుల ప్రభావం ఆమెను స్వభావసిద్ధంగానే హిందూమత ఆచరణ దిశగా మళ్లించింది. ప్రాంతీయత రీత్యా నిదర్శనం చెప్పాల్సివస్తే, అక్కడి సాధికార విమానయాన సంస్థను ‘గరుడ’ (విష్ణు భగవానుడి వాహనం)గా పిలుచు కుంటారు మరి. అక్కడ నోట్లకట్టల మీద గణనాథుడి చిత్రం ముద్రితమై కనిపిస్తుంటుంది. అటువంటి వాతావరణం ఈ నిశ్చయానికి కారణమైందంటే, అందులో ఆశ్చర్యమేముంది? ధార్మికత విస్తార దశలో, అదీ ఏడుపదుల వయసులో, పుట్టినరోజు సందర్భాన నూతన మతానుసరణ అన్నివిధాలా విశేషం, విశిష్టం. జాతీయవాద భావన ఎన్నడూ గొప్పదే, సమాచరణ అంతకంటే మిన్న. మాతృభూమి, సంస్కృతీ, ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించడం గురించి గతంలోనూ తన అభిప్రాయాలను ప్రస్ఫు టంగా వ్యక్తపరిచారామె. ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. భావ వ్యక్తీకరణను ఎవరైనా సవ్యంగా గమనించకున్నా, అపోహలతో ఏవైనా ఆరోపణలకు దిగినా, వివరణ ఇవ్వడానికీ సంకోచించలేదు. ప్రగాఢ నమ్మకం, ప్రస్ఫుట అభివ్యక్తి ఆమెను హిందూమత అనుసరణీయగా తీర్చిదిద్దాయి. దీనిలో భాగంగానే మునుపు పలు ఉత్సవాలకు హాజరయ్యారు. కోవిదులైన పెద్దవారితో దశలవారీ మంతనాలు సాగించారు. మార్పుదల వేళ, భారతదేశం నుంచి ముందుగానే తెప్పించి ఉంచిన పవిత్ర నదీజలాలతో సంప్రోక్షణ ఆచరించారు. వేదపండితుల మంత్రపూర్వక ఆహ్వానాల మధ్యన మాతృ మతమైన సనాతన ధర్మంలోకి ప్రవేశించారు. సనాతనమంటే, లోపలి ఆలోచనా తత్వాన్ని ఎంతగానో ఉత్తేజపరచడం. ధర్మం అనేది హిందూ మతంలోని నిర్వహణ సంబంధ సూత్రీకరణం. ఇది విశ్వాసాలను పెంచి పోషిస్తుంది. నియమాలు, నిబంధనలతో జీవన మార్గాన్ని సులభతరం చేస్తుంది. హిందూ ధర్మం అనేసరికి ప్రతివారికీ మతపరమైన విధులు, బాధ్యతలు ఉండటంగా అర్థంచేసుకోవాలి. సామాజిక క్రమం, సవ్యమైన ప్రవర్తన వీటిలో అంతర్భాగాలు. ఈ అన్నీ మహోన్నత స్థితికి దారితీస్తాయన్నది ఆమె అభిభాషణ.

నవ జనజీవన సూత్రీకరణ

ధర్మం ప్రథమ, ప్రధాన లక్షణం-ఎవరి సంకల్పా లను వారు మరెవ్వరికీ కష్టనష్టాలు కలిగించకుండా సంపూర్ణం చేసుకోవడం. అందుకే అదొక ఉత్తమ గుణంగా లోక మన్నన పొందుతోంది. శాంతతత్వం, దయా ప్రవృత్తి, అహింసాత్మక నడవడి, సత్య సంధత, ఉపకార బుద్ధి కలిగి ఉండటం వంటివి ధర్మభాగాలు. అన్నింటికీ వేదాలే ప్రమాణాలు. ఎప్పుడైనా సందేహం తలెత్తినప్పుడు, ఉదాత్త స్వభావులు సమాధానాలు తెలుసుకొని ఒక నిర్ణయమంటూ తీసుకుంటారు. సుక్మావతి చేసిందీ అదే. మతం మారాలన్న యోచన క్రమానుగతంగా ఆచరణకు వచ్చేలోగా, వేదవిదులతో సంభాషణలు ముగించారు. హిందూ తత్వశాస్త్రంలోని మార్గదర్శకాలు, నియమాలను ఆకళింపు చేసుకోవడంలో సోదరీమణుల సహాయ సహకారాలు తీసుకున్నారు. సామాజిక సామరస్యం, ప్రజా న్యాయ సాధన… ఈ రెండూ పాలనకు ప్రాణసమానాలు. ఆయా ధర్మసూత్రాల అవగాహన ఆ నాయకురాలిలోని సేవానురక్తికి వెన్నుదన్ను అయింది. ఆచార సంప్రదాయాలు, చట్ట నిబంధనలు, న్యాయ మార్గాలు, నైతిక విలువల పరిరక్షణలో పాలకుల పాత్ర తేటతెల్లమయ్యేలా చేసింది. ‘మేలైన జీవన విధానం అందరికీ ఉపకరించేదే. ఇప్పుడు నేను ఈ నిశ్చయానికి రావడం వెనక సంవత్సరాల ఆలోచనా తరంగాలు దాగి ఉన్నాయి. ఇదంతా ఇప్పటికిప్పుడు నిర్ణయించుకోవడం కాదని నాకే కాదు, దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. నింపాదిగా యోచిస్తే, మెదడుకు పదునుపెడితే, హిందూ జీవన వాహిని ఎందుకు అంత పవిత్రత సంతరించుకుందన్నది ఎవరికి వారికే సునాయాసంగా అవగతమవుతుంది. నా ఈ సంకల్ప సూత్రం ద్వారా ప్రజలకు ఒక్కటే గట్టిగా చెప్పదలచుకున్నాను. ఎవ్వరూ మన మూలాలు మరువవద్దు. చరిత్ర, నాగరికత, సంస్కృతి- ఇవే జాతి అభివృద్ధి, సంక్షేమాలను దృఢపరుస్తాయి. వీటిని విస్మరించి ఎవ్వరూ ఏమీ సాధించేదంటూ ఉండదు. జాతి పూర్వాపరాలు మనకు మనమే తెలుసుకుందాం. ఇంకెవరో వచ్చి మరేదో చెప్పాల్సిన పని కానీ, వినాల్సిన అవసరం కానీ మనకైతే లేవు. మన ధర్మాన్ని మనం త్రికరణశుద్ధిగా ఆచరిద్దాం. అంతే’. ఇవి చాలవా జనంలో మేధోమథనానికి? ఇండోనేషియా చారిత్రక, సాంస్కృతిక తాజా పరిణామాలు నూతన ఆశలు రేకెత్తిస్తున్నాయి. తరతరాల ఘనతను ప్రపంచంలోని ఇతర దేశాలకు, ప్రభుత్వాలకు ఎంత గానో తిరిగి గుర్తుకుతెస్తున్నాయి. ఆ దేశంలో సంభవించింది మత మార్పిడి అనడం కాదు; అదొక గణనీయ ఘనమైన శుభకర పరిణామం, హిందుత్వ అగ్రగామిత్వాన్ని వేనోళ్ల చాటిచెప్పే మరో చరిత్రాత్మక నవ సందర్భం.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram