కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిట్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ‌సెప్టెంబర్‌ ‌నెలలో రూపొందించిన నివేదికలో ఆంధప్రదేశ్‌ ‌తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు తేటతెల్లంకావడంతో ఈ అంశంపై దేశ వ్యాప్తంగానే కాదు, గ్రామీణ రచ్చబండ వరకు తీవ్ర చర్చ జరుగుతోంది. రెవెన్యూలోటు 662.8 శాతం, ద్రవ్యలోటు 104 శాతానికి పెరగడం, ఆరు నెలల్లో సుమారు రూ.40 వేల కోట్లు అప్పులుచేయడం, మొత్తం రూ.6 లక్షల కోట్లకు చేరడం, వీటి వడ్డీనే ఏడాదికి రూ.42 వేల కోట్లు చెల్లించాల్సి ఉండటం, ఉద్యోగు లకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ల చెల్లింపు జాప్యం, సంక్షేమ పథకా అమల్లో జాప్యం, లబ్ధిదారుల కుదింపు ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరూ చర్చించడానికి ప్రభావితం చేస్తున్న అంశాలు.

ఆదాయ వనరులను సమకూర్చుకోక, ఆదాయాన్ని ఆర్జించే ప్రాజెక్టులను చేపట్టక, పారిశ్రామికవృద్ధి కోసం మౌలిక వసతులకు మూలధన వ్యయం చేయకుండా, ఆదాయానికి మించి అప్పులుచేసి సంక్షేమ పథకాలకై నగదును పంపిణీ చేయడం వల్లే ఈ దుర్భర పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా అప్పుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. అదనపు రుణాలు పొందేందుకు అర్హత కోసం రాష్ట్రం ఇచ్చిన నివేదికలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో తేలిపోయాయి. ఆర్థిక వనరులు లేకపోవడం, అభివృద్ధి పనులకు చెల్లింపు సామర్థ్యం లేకపోవడం, మూల ధనం లక్ష్యాలు చేరుకోవడంలో వెనకబడటం వంటి కారణాలతో ఏపీ రుణ పరిమితి సాధించే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అదే సమయంలో నిబంధనలు పాటించిన ఇతర రాష్ట్రాలకు రుణాలు లభించాయి. ఇదంతా వైసీపీ ప్రభుత్వ స్వయంకృతమే. అభివృద్ధి మాటను మరచిపోయి, వ్యక్తిగత ప్రతిష్ట పెంచు కోవడానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఓట్ల కొనుగోలుకే నవరత్నాలు వంటి ఉచిత నగదు పంపిణీ పథకాలు అమలు చేస్తున్నట్లు అన్నివర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి నగదు పంపిణీనే లక్ష్యంగా చేసుకోవడంతో రెండున్నరేళ్ల కాలంలోనే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనేది అందరూ అంటున్న మాట.

ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో జీతాలు, పింఛన్లు, వడ్డీలు మొత్తం కలిపి 35 శాతం తప్పనిసరిగా ఖర్చుచేయాలి. మిగతా 65 శాతంపైనే నియంత్రణతో ప్రభుత్వం ఖర్చుచేయాలి. ఈ 65 శాతంలో సంక్షేమం, మూలధన వ్యయం చేయాలి. ఈ ఖర్చును ప్రభుత్వం స్వీయ నియంత్రణ చేయకపోవడం వల్లే కోలుకోలేని విధంగా నష్టపోతోంది. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ఆదాయంలో అత్యధిక భాగాన్ని వినియోగిస్తోంది. అంతేకాదు ఇవి చాలక అప్పులు కూడా తెచ్చిపంచుతోంది. రెండేళ్లలో ఇప్పటికి రూ.1.40 లక్షల కోట్లు ఉచిత నగదు బదిలీ పథకాలకు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. అప్పులు ఎంత వేగంగా చేస్తున్నారంటే 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తంగా రుణ పరిమితి రూ. 37,029.79 కోట్లు కాగా ఇప్పటికే రూ. 39,914.18 కోట్లు తీసేసుకున్నారు.

కోల్పోయిన రుణ అర్హత

ఆస్తుల సృష్టి లేకపోవడం, మూలధనవ్యయ లక్ష్యాల్లో వెనుకబడిన కారణంగా కేంద్రం నుంచి వచ్చే అదనపు రుణ పరిమితికి రాష్ట్రం అర్హత కోల్పోయింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.30,571.58 కోట్ల విలువైన మూలధన పనులు చేపట్టాలి. ఇప్పటికే ఆరు నెలలు గడిచాయి. కాని ఈ ఆరు నెలల్లో రూ.6,491 కోట్లు మాత్రమే మూలధన వ్యయం చేసినట్లు రాష్ట్రం పేర్కొంది. అంటే మొత్తం వ్యయం లక్ష్యంలో ఇది 22 శాతం మాత్రమే. మిగతా ఆరునెలల్లో మిగిలిన 78 శాతం పనులు చేపట్టడం అనేది శక్తికి మించిన పనిగా మారింది. దీంతో అదనపు రుణానికి అనుమతి లభించలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.29,300.42 కోట్లు మూలధనవ్యయం చేపట్టాల్సి ఉండగా రూ.18,385.49 కోట్లు మాత్రమే అభివృద్ధి పనులకు రాష్ట్రం ఖర్చుచేసింది.

ఒక్క ఇటుకను పేర్చలేదు!

రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని ఎవరిని అడిగినా చెబుతారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు పారిశ్రామిక వాడలకు ఏ మాత్రం చర్యలు చేపట్ట లేదు. ఏడేళ్ల క్రితం ఓడరేవుల నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇస్తే ఇటీవల శంకుస్థాపన చేశారు. కాకినాడ వద్ద నిర్మించనున్న పెట్రోలియం కాంప్లెక్సు నిర్మాణానికి వయబులిటీ గ్యాప్‌ ‌ఫండింగ్‌ ‌కింద ఏడాదికి రూ.900 కోట్లు ఇవ్వాలని కేంద్రం కోరినా రాష్ట్రం చేతులెత్తేసింది. రాష్ట్రంలో ధ్వంసమైన రోడ్లను సైతం పునర్నిర్మించలేదు. 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తా మని చెప్పి సేకరించిన భూముల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగినట్లు ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంది. నీరు నిలిచిపోయేవి, ఊరికి దూరంగా నిర్జన ప్రదేశాల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో లబ్ధిదారులే ఇళ్లు కట్టుకోవాలని నిబంధనలు విధించడంతో ఎవరూ ముందుకు రాలేదు. తక్కువ స్థలం, మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానంలో దాఖలైన కేసులో ఈ అంశం విచారణలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో చేపట్టినవే. ‘నరేగా’ పనులకు ఇచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుందని ఆరోపణలు వస్తున్నాయి. నాడు-నేడు కార్యక్రమాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదలచేస్తోంది. అది కూడా కేంద్ర ప్రభుత్వ సర్వశిక్షా అభియాన్‌ ‌నిధులే.

విచ్చలవిడి పంపిణీ వల్లే

రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం విచ్చలవిడిగా చేస్తున్న నగదు బదిలీల వల్లే రాష్ట్రంపై భారం పడుతోందని కూడా కేంద్రం స్పష్టంచేసింది. ఆస్తులతో సంపద సృష్టికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించక పోవడమే దీనికి కారణం. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో అమలుచేసే సంక్షేమ పథకాలన్నీ ప్రజలను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా కనిపించడం లేదు. ఇచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోలేక పోతున్నామని పలువురు పథకాల లబ్ధిదారులే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది రూ. 1,27,105.81 కోట్లు అప్పులు చేస్తే 1,05,102.22 కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేశామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఓ సందర్భంలో వివరించారు. వీటిలో 50 శాతం వినియోగ వస్తువులే కొనేస్తున్నారు. మొబైల్‌ ‌ఫోన్లు, వస్త్రాలు, బంగారం వంటివి సమకూర్చుకుంటున్నారు. ఇవన్నీ జీవనో పాధిని పెంచేవి కాదు, 50 శాతం మాత్రమే అసలైన అవసరాలకు వినియోగించుకుంటున్నారు.

పేదలకు మేలు జరిగిందా?

ప్రభుత్వం అనుసరించిన పలు విధానాలు ప్రజలకు మేలు చేయడం అటుంచి వారికి అన్ని విధాలుగా అన్యాయం చేశాయి. ఇసుక విధానం తీసుకుంటే.. ఇప్పటికి మూడు విధానాలు మార్చారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల పాటు ఇసుక లభ్యం కాలేదు. నిర్మాణరంగానికి అవసరమైన ముడి పదార్థం ఇసుకే. అది లేకపోవడంతో నిర్మాణాలు జరగలేదు. నిర్మాణరంగంలోని 10 రకాల ముడి పదార్థాల కొనుగోళ్లు జరగనందున వ్యాపారాలు జరగక నష్టపోయారు. కార్మికులైతే ఉపాధి కోల్పోయారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల భవన నిర్మాణ కుటుంబాలు వీధినపడ్డాయి. పనులు లేక ఎంతో మంది ఆకలితో అలమటించి మరణించారు. తర్వాత ఇసుకను విడుదల చేసినా వరదలతో రెండు నెలల పాటు ఇసుక లభ్యం కాలేదు. ఆన్‌లైన్‌ ‌విధానం అమలుచేసినా అందుబాటులోకి రాలేదు. మూడు రెట్ల అధిక ధరలతో నల్లబజారులో మాత్రమే లభిస్తోంది. ఇదే పమయంలో ఆదాయం కోసం నాసిరకం మద్యం కంపెనీలను ప్రోత్సహించి మద్యం ధరలను మూడు, నాలుగు రెట్లకు పెంచి అమ్మడంతో మద్యానికి బానిసలైన పేదల జేబులు లూటీ అయ్యాయి. అమ్మఒడి పేరుతో ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి మద్యం దుకాణాలకే చేరాయి.

పెరిగిన రెవెన్యూ లోటు

రాష్ట్ర విభజనకు ముందు పాలించిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాల కారణంగా విభజన సమయంలోనే రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో తిరిగి రెవెన్యూ లోటులో పెరుగుదల చోటు చేసుకుంది. 2021-22 సంవత్సరంలోనే రెవెన్యూ లోటు రూ. 5000.08 కోట్లుగా అంచనా వేశారు. అది ఆరు నెలలోనే 33 వేల 140 కోట్లకు చేరింది. అంటే 662.8 శాతం పెరుగుదల కనిపించింది. వైకాపా ప్రభుత్వం రూ.1,04,723.91 కోట్లు ఖర్చుచేసింది. అందులో రూ.50,419.15 కోట్లు సంక్షేమ పథకాలకు కేటాయించగా మిగిలిన మొత్తంలో సబ్సిడీలు, రుణాలపై వడ్డీలు, జీతాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.6 క్షల కోట్లకు చేరింది. రాష్ట్రం విడిపోయినప్పుడు రూ.86 వేల కోట్ల అప్పులు సంక్రమిస్తే, తెదేపా ప్రభుత్వం తన సంక్షేమ పథకాలు, దుబారా ఖర్చులు, అనాలోచిన నిర్ణయాలతో అయిదేళ్లలో రూ.1.53 లక్షల కోట్లు అప్పుచేసింది. వైకాపా తన నవరత్నాల కోసం ఈ రెండున్నరేళ్లలో రూ.1.45 లక్షల కోట్లు అప్పుచేసింది. రికార్డుల్లో చూపని అప్పులు మరో రెడు లక్షల కోట్ల వరకు ఉండవచ్చు. మొత్తం కలిపి రూ.6 లక్షల కోట్లు అప్పుల భారం రాష్ట్రంపై పడింది. ఈ ఆరు లక్షల కోట్లకు 7 శాతం చొప్పున ఏడాదికి రూ.42 వేల కోట్లు వడ్డీగా చెల్లించాలి.

ఇదిలా ఉండగా.. ఏపీ డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 15,474 కోట్లు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన 9,783 కోట్ల రూపాయలు కలిపి రూ. 25,257 కోట్లు 14 రోజుల్లో చెల్లించాలని ఆంధప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఏపీఇఆర్‌సీ) ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ కార్యదర్శులకు లేఖరాసింది. బకాయిలు చెల్లించడానికి ఇదే చివరి అవకాశమని, గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వశాఖల కార్యాలయాలు, స్థానిక సంస్థలకు విద్యుత్‌ ‌సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. తక్షణం రూ. 2వేల కోట్లు చెల్లించకపోతే ఆంధప్రదేశ్‌ని డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని కేంద్రం పరిధిలోని పవర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ (‌పిఎఫ్‌సి) హెచ్చరించింది. డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌కు సంబం ధించి ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన పనులకు గాను కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగా చెల్లించక పోవడాన్ని వరల్డ్ ‌బ్యాంక్‌ ‌ప్రశ్నించినట్లు, గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వనందున తదుపరి వాయిదా నిధులు ఇవ్వబోమని ఎఐఐబి తేల్చి చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏపీ ఆరోగ్య శాఖకు ఏ కంపెనీ కూడా వైద్య పరికరాలు సరఫరా చేయవద్దని వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ యూనియన్‌ ‌రెడ్‌ ‌నోటీస్‌ ‌జారీ చేసింది. ప్రభుత్వం వైద్య పరికరాల సరఫరా పంపిణీదారులకు ఇప్పటికే మూడేళ్లుగా వేల కోట్లు బకాయి పడింది. ఇవన్నీ ఏపీ ఆర్థిక పరిస్థితికి నిదర్శనాలు.

పీఆర్సీ గండం

మరోవైపు.. ఎన్నికలముందు జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికలకు ముందు పీఆర్సీ ఇస్తామని ప్రకటించారు. దానిని రెండున్నరే

ళ్లయినా అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే పీఆర్సీ ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని, ప్రభుత్వం మాట తప్పడం వల్ల తాము ఉద్యమబాట పడు తున్నట్లు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram