ఎవరైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవా లంటారు. సమస్యలు ఉన్నప్పుడు పరిష్కార మార్గం వెతకాలంటారు. వ్యయప్రయాసలైనా సరే సకాలంలో సమస్యలకు చెక్‌ ‌పెట్టాలని, అవకాశం ఉన్న అన్ని మార్గాలను వినియో గించుకోవాలంటారు. అది వ్యక్తిగత అంశ మైనా, సామాజిక సంబంధిత అంశమైనా, ప్రభుత్వం నిర్వహించాల్సిన కర్తవ్యమైనా ఈ కోవలోకే వస్తుంది. కానీ, సమస్యను పరిష్క రించుకొనే అవకాశం వచ్చినా, పరిష్కరించా ల్సిన వాళ్లు అందుబాటులోకే వచ్చి సులువుగా వెసులుబాటు లభించినా నిమ్మకు నీరెత్తినట్టు, అసలు సమస్యలే లేనట్టు, జనం ఏమైపోతే మాకేంటి అనే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు తెలంగాణ సర్కారులో కనిపించింది. కొన్ని మొండి సమస్యలు వేధిస్తున్నా.. ఎన్నాళ్లుగానో అపరిష్కృత అంశాలు వెంటాడుతున్నా.. కొత్తగా మరికొన్ని ఇబ్బందులు ఎదురవు తున్నా.. ప్రభుత్వం మాత్రం వాటి పరిష్కారానికి చిత్తశుద్ధి చూపించడం లేదు. ప్రభుత్వం అనేకన్నా సర్కారును నడిపిస్తున్న కె. చంద్ర శేఖర్‌రావుకు అసలు సోయి లేనట్టు జనం చర్చించుకుంటున్నారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం, అవసరం వచ్చినప్పుడే ప్రజల ముందుకు రావడం అలవాటైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాత్మక వ్యూహాలు అనుసరించడం, ప్రజల గురించిన కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై శీతకన్ను వేస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఈ చర్చంతా ఎందుకు అంటారా? అవును. బలమైన కారణమే ఉంది. రాష్ట్రాల దగ్గరికే కేంద్రం వచ్చి సమస్యలను సావధానంగా వినే అవకాశం ఇచ్చింది. ఎజెండా మేరకు పలు అంశాలపై విఫులంగా చర్చించేందుకు సమయం కల్పించింది. ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపించింది. అదే సదరన్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌సమా వేశం. టెంపుల్‌ ‌టౌన్‌ ‌తిరుపతిలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ ‌గవర్నర్లకు సమాచారం ఇచ్చింది. కేంద్రం ఆహ్వానం మేరకు ఏపీ సీఎం జగన్‌ ‌మోహన్‌రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై, పాండిచ్చేరి లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, అం‌డమాన్‌ ‌నికోబార్‌ ‌లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌దేవేంద్రకుమార్‌ ‌జోషి తదితరులు హాజరయ్యారు. తమిళనాడులో ముంచెత్తిన వరదల కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ ‌హాజరు కాలేదు. కేరళ సీఎం పినరయి విజయన్‌ ‌కూడా రాలేదు. ఆ సమావేశానికి వెళ్లేందుకు కేసీఆర్‌ ఆసక్తి చూపించలేదు. అలా అని ఆయన అంతకన్నా ముఖ్యమైన పనిలోనో, అత్యవసర పనిలోనో లేరు. పైగా.. ఆ సమయంలో ఆయన తన ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. కానీ, తిరుపతికి వెళ్లలేదు. తనకు బదులు.. తెలంగాణ ప్రతినిధులుగా హోంమంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ ‌సోమేష్‌కుమార్‌ను పంపించారు.

 రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణ చట్టం -1956 ప్రకారం దేశంలో ఐదు జోనల్‌ ‌కౌన్సిళ్లు ఏర్పాట య్యాయి. దక్షిణాది రాష్ట్రాలతో ఏర్పడ్డ కౌన్సిల్‌ ఐదోది. రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం, కేంద్రం – రాష్ట్రాల మధ్య చక్కటి సంబంధాలను నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా జోనల్‌ ‌కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సౌత్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశం 1957 జులై 11న మద్రాసులో నిర్వహిం చారు. మొత్తంగా ఇప్పటి వరకూ 28 సార్లు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండళ్ల సమావేశాలు జరిగాయి. చివరగా 2018 సెప్టెంబరు 18న సౌత్‌ ‌జోనల్‌ ‌కమిటీ సమావేశం బెంగళూరులో జరిగింది. ఈ సమావేశాలకు కేంద్ర హోం శాఖ మంత్రి చైర్మన్‌గా, రొటేషన్‌ ‌పద్ధతిలో ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ ‌చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఆర్థిక, సామాజికపరమైన అంశాలు చర్చిస్తారు. ఈ అంశాల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తారు. రాష్ట్రాల మధ్య పెండింగ్‌ అం‌శాలు, సరిహద్దు వివాదాలు, మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం, అంతర్‌ ‌రాష్ట్ర రవాణా, రాష్ట్రాల పునర్‌ ‌విభజన చట్టంలో పెండింగ్‌ అం‌శాలు.. తదితర విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సమస్యలపై సమీక్షలు చేయడంతో పాటు, స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులను కేంద్రానికి నివేదించడంలో దక్షిణ భారత సదస్సు ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తోంది. సమస్యల నివేదనకు ఇంతకంటే మరో గొప్ప వేదిక దొరకదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తాయి.

ప్రస్తుతం తెలంగాణలో అనేక సమస్యలు తిష్ట వేశాయి. రాష్ట్ర విభజన కారణంగా ఆంధప్రదేశ్‌తో ఇంకా పలు అంశాలు కొలిక్కి రాలేదు. విభజన సమస్యలు కొన్ని అలాగే పేరుకుపోయాయి. వాటికి తోడు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా తయారయింది. తరచూ ఇరు రాష్ట్రాల మంత్రులు పరస్పర విమర్శలకు దిగడం, సవాళ్లు-ప్రతిసవాళ్లు చేసుకోవడం సర్వసాధారణమయింది. ఆ సవాళ్లు, విమర్శల పర్వం కూడా మితిమీరుతోంది. ఇటీవల రెండు రాష్ట్రాల మంత్రులు.. ముఖ్యమంత్రులను బిచ్చగాళ్లు అనే తీవ్ర పదజాలంతోనూ విమర్శించుకున్నారు. అంతేకాదు, కేంద్రంతోనూ సామరస్యంగా పరిష్కరించు కోవాల్సిన మరికొన్ని అంశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి మంత్రుల అపాయింట్‌మెంట్‌ ‌తీసుకొని సమయం వెచ్చించి మరీ వేడుకోవాల్సిన పరిస్థితులు కలుగుతున్నాయి. అయితే, ఇదంతా వ్యయ ప్రయాసలతో కూడుకున్న అంశం అవుతోంది. అదే సదరన్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌సమా వేశంలో అయితే కేంద్ర హోంమంత్రే స్వయంగా వచ్చి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కానీ ముఖ్యమైన ఈ సమావేశానికి కేసీఆర్‌ ‌హాజరు కాలేదు.

అంతకుముందు హుజురాబాద్‌ ఎన్నికల కారణంగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. హుజురాబాద్‌లో ఓటమి తర్వాత ఒక్కసారిగా సీఎం కేసీఆర్‌ ‌కేంద్రం పైన యుద్ధం ప్రకటించారు. వడ్లు కొనుగోలు అంశంలో కేంద్రాన్ని నిలదీసారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని టార్గెట్‌ ‌చేసారు. నిత్యం మీడియా సమావేశాలు ఉంటాయని స్పష్టంచేసారు. కానీ, తర్వాత చల్లారిపోయారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, గజేంద్ర షెకావత్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌లక్ష్యంగా విమర్శలు చేసినా ఆయన స్పందించలేదు. తనకు బదులుగా మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఇక, అధికార టీఆర్‌ఎస్‌ ‌కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా రైతు దీక్షలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అధికారంలో ఉన్న పార్టీ నిరసనలు చేయడమంటే.. ‘అత్తమీద కోపం దుత్తమీద’ తీసినట్టుందన్న చర్చ కూడా జరిగింది.

ఢిల్లీ వెళ్లి తెలంగాణ సమస్యల పైన అమిత్‌షాతో సుదీర్ఘంగా సమావేశమయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల సమస్యలపైన జరిగే ఈ సమావేశానికి హాజరు కాకపోవటంపై విస్తృతంగా చర్చ నడిచింది. హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాల తర్వాత అసహనంతో కేంద్రంపై తీవ్రస్థాయిలో అంతెత్తున ఎగిసిపడ్డ కేసీఆర్‌.. ఆ ‌వెంటనే అమిత్‌షాతో భేటీ కావడంపై వెనుకంజ వేశారు. అలాగే, ఏపీ సీఎం జగన్‌తో గతంలో మంచి స్నేహం కొనసాగించిన కేసీఆర్‌.. ఇటు హైదరాబాద్‌లో, అటు అమరావతిలో కూడా జగన్‌తో భేటీ అయిన కేసీఆర్‌.. ‌కొన్నాళ్లుగా జగన్‌పై గుర్రుగా ఉంటున్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు అంశంలో వివాదం రేగినప్పటినుంచీ ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోలేదు. పైగా.. తమ తమ మంత్రులతో తీవ్రస్థాయిలో విమర్శలు చేయిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య ఆసక్తికర మాటల యుద్ధం కొనసాగింది. ఈ సమయంలో అటు ఏపీ సర్కారుతోనూ ముఖాముఖి కూర్చోవడం కేసీఆర్‌కు ఇష్టం లేదని, అందుకే ముఖం చాటేశారన్న చర్చ సాగింది.

ఇక, ఈ సమావేశానికి కేసీఆర్‌ ‌హాజరు కాకపోవడం భదాద్రి కొత్తగూడెం వాసులను కలచివేసింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌ ‌హాజరైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఐదు ముంపులేని గ్రామాల సమస్య పరిష్కారం అవు తుందని భద్రాచలం ప్రాంత ప్రజలు ఎంతో ఆశపడ్డారు. కానీ సమావేశానికి సీఎం వెళ్లక పోవడంతో నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలం పట్టణంతో కలిసి ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తమపట్నం, గుండాల, పిచ్చుకలపాడు పంచాయతీలకు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావం లేనప్పటికీ.. ముంపు ప్రాంతాలతో కలిపి ఒక ఆర్డినెన్స్ ‌ద్వారా ఆంధ్రాలో కలిపారు. ఈ నిర్ణయంతో భద్రాచలం ప్రాంత ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్లడానికి సుమారు 10 కిలో మీటర్ల దూరం ఆంధ్రలోని ఎటపాక మండలం మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా రవాణా, పోలీస్‌, ఎక్సైజ్‌, ‌ఫారెస్ట్, ‌తదితర శాఖలకు సంబంధించి సమస్యలు రెండు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రభావంలేని ఈ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించగా.. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని, కేంద్రం, ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వాలతో చర్చించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారు. కానీ, అంతరాష్ట్ర సమస్యల పరిష్కార వేదికగా జరిగే సదరన్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశానికి కేసీఆర్‌ ‌డుమ్మా కొట్టడం ఆ ప్రాంతవాసులకు పిడుగుపాటు వార్త అయింది.

సదరన్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌మీటింగ్‌ ‌పూర్తిగా అధికారిక, రాష్ట్ర అంశాలపైన జరిగే సమావేశం కావటంతో రాజకీయాల ప్రస్తావన అవసరం ఉండదని నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ, కేసీఆర్‌ ‌మాత్రం తాను వెళ్లకుండా హోంమంత్రిని పంపించారు. ఎంతయినా ముఖ్యమంత్రి ఈ సమావేశానికి హాజరైతే లభించే ప్రాధాన్యం వేరు.

వాస్తవానికి ఈ సమావేశంలో.. గతంలో నివేదించిన అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పరిష్కారాలు సూచించిందనే అంశాలను ప్రధానంగా సమీక్షిస్తారు. తాజా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన బాధ్యతలను విస్మరించారని విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల సమస్య ఉందని, సీఎం చంద్రశేఖర్‌రావు చెప్పాల్సిన అంశాలని ఈ వేదిక ద్వారా కేంద్రానికి చెప్పాలనే ఇంగితజ్ఞానం కూడా లేదని ఆరోపణలు వచ్చాయి. సమస్యల పరిష్కారం కోసమే సమీక్షలు నిర్వహిస్తారని, ఇలాంటి కీలకమైన అవకాశం వినియోగించుకోకుండా ఏం సాధిస్తారని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశానికి ఆయన వెళ్లి ఉంటే వరి ధాన్యంపై ఇతర రాష్ట్రాలు ఏమంటున్నాయో తెలిసేదని, కానీ తప్పుడు పంట లెక్కలు, ప్రొక్యూర్మెంట్‌ అం‌శాలకు సంబంధించిన వాస్తవాలు బయటపడతాయనే చంద్రశేఖర్‌రావు వెళ్లలేదా? అని విపక్ష నేతలు ప్రశ్నించారు. నదీజలాల అంశంపైన కేంద్రం పెత్తనం చెలాయిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వం తమ వాదన వినిపించడానికి ఇది సరైన వేదిక అయ్యేదని, ఆ అవకాశాన్ని కేసీఆర్‌ ‌విస్మరించారని విశ్లేషణలు సాగాయి. ఇప్పటివరకు పునర్విభజనలోని అంశాలు రాష్ట్రానికి ఒక్కటీ అందలేదని, అంతేకాకుండా ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ అలసత్వమే కారణమని కేంద్రం స్పష్టం చేసిందని, దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన భాద్యత కేసీఆర్‌పై ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.

– సుజాత గోపగోని, 6302164068,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram