– డా. రామహరిత

ఆఫ్ఘానిస్తాన్‌ పాలనా పగ్గాలను తాలిబన్‌ ఆగస్టు 15న కైవసం చేసుకున్నారు.  ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌తో పటిష్టంగా వ్యవహరించడానికి భారత్‌ రంగంలోకి దిగింది. యూఎన్‌ఎస్‌సీ ప్రెసిడెన్సీ హోదాలో ‘యూఎన్‌ఎస్‌సీ తీర్మానం 2593’ను భారత్‌ తీసుకువచ్చింది. ఆగస్టు 30న ఆ తీర్మానం ఆమోదం పొందింది. ఇతర దేశాలను బెదిరించడానికి, దాడులు చేయడానికి లేదా టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించడం, వారికి శిక్షణఇవ్వడం వంటి కార్యకలాపాలకు ఆఫ్ఘానిస్తాన్‌ భూభాగాన్ని వినియోగించరాదని యూఎన్‌ఎస్‌సీ తీర్మానం డిమాండ్‌ చేసింది.

దేశాన్ని వీడాలని ఆకాంక్షించే ఆఫ్ఘాన్‌ పౌరులు, విదేశీయుల సురక్షిత నిష్క్రమణ, యూఎన్‌ ఏజెన్సీలకు దేశంలోనికి ప్రవేశం, ఆఫ్ఘాన్‌కి సాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల బలోపేతం, మహిళలు, మైనార్టీలు, పిల్లల హక్కుల పరిరక్షణతో పాటుగా ఒక సమ్మిళిత, సంప్రదింపుల నుంచి ఉద్భవించిన రాజకీయ స్థిరత్వానికి సదరు తీర్మానం పిలుపు నిచ్చింది. ఇతర తీర్మానాలకు భిన్నంగా యూఎన్‌ఎస్‌సీ తీర్మానం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితిపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించడంలో అనిర్వచనీయమైన నాయకత్వ పటిమతో భారత్‌ ముఖ్య భూమికను పోషించింది. ఆఫ్ఘాన్‌లో ఆపద్ధర్మ ఇన్‌చార్జ్‌గా తాలిబన్‌ను గుర్తించిన తొలి తీర్మానం ఇదే కావడం విశేషం. తద్వారా ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ హయంలోని వాస్తవికతకు తాను గమనించాననే సంకేతాన్ని భారత్‌ ఇచ్చింది. అలాగని తాలిబన్‌తో వాణిజ్య కార్యకలాపాలకు లేదా తాలిబన్‌ను గుర్తించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని కాదు. అదే సమయంలో ఆ దేశంలో కార్యకలాపాల్లో తన ప్రమేయాన్ని ఇది అనివార్యం చేసింది. కొత్త విధానానికి మద్దతు పలుకుతున్నట్టుగా భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ నేతృత్వంలో ఒక ప్రతినిధుల బృందం దోహాలో తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి షేర్‌ మహమ్మద్‌ స్టానెక్‌జాయితో చర్చలు జరిపింది. భారతీయుల సురక్షిత, సకాల స్వదేశాగమనం కోసం విజ్ఞప్తి చేసింది.

ప్రతిపాదిత ఢల్లీి సెక్యురిటీ డైలాగ్‌కు కొద్దివారాల ముందు, మాస్కో ఫార్మాట్‌ సమావేశం జరుగుతున్న వేళ అక్టోబర్‌ 21న జేపీ సింగ్‌ నేతృత్వంలోని భారతీయ ప్రతినిధుల బృందం తాలిబన్‌ ప్రతి నిధులను కలిసింది. ఆఫ్ఘాన్‌కు మానవీయ సాయం అందించడంలో తన సంసిద్ధతను వ్యక్తంచేసింది. జీ20 శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగించిన సందర్భంగా ఆఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితి నానాటికి క్షీణిస్తున్న వైనం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆఫ్ఘాన్‌కు ఎలాంటి ఆంక్షలులేని తక్షణ మానవీయ సహాయం అందాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. భారత్‌ ఆది నుంచి ఆఫ్ఘాన్‌ ప్రజలకు అండగా ఉంటున్నది. అక్కడి ప్రజల ఆకాంక్షలకనుగణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను భారత్‌ నిర్వహించింది. ఆహార సంక్షోభం పెరిగి పోతున్న నేపథ్యంలో 50,000 మెట్రిక్‌ టన్నుల గోధుమలను పంపించాలనే ఆలోచనలో భారత్‌ ఉంది. కానీ అటునుండి స్పందన లేదు.

మరోవైపు తాలిబన్‌ చేతుల్లోకి ఆఫ్ఘానిస్తాన్‌ వెళ్లిపోవడాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న పాకిస్తాన్‌ తన చెప్పుచేతల్లో నడిచే ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటుచేసి మరింత పట్టు సాధించింది. గడచిన మూడు మాసాలుగా ఆఫ్ఘానిస్తాన్‌ తీవ్రమైన మానవీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆకలి, కరవు కాటకాలు వేలాది కుటుంబాలను వేధిస్తున్నాయి. పాలన స్తంభించిపోయింది. ఆ దేశం నుంచి పెద్ద ఎత్తున వలసలు, భద్రతకు ముప్పు వాటిల్లే పరిణామాలు పొరుగు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అనిశ్చితి చేతులుదాటిపోతున్న తరుణంలో ఆఫ్ఘానిస్తాన్‌ అభివృద్ధిలో భాగస్వామిగా, ఆ దేశం నుంచి ఎదురవుతున్న భద్రతాపరమైన సవాళ్లను పరిగణనలోకి తీసుకోవడంలో ఒక బాధ్యతాయుతమైన పాత్రను భారత్‌ పోషించింది. ప్రాంతీయ దేశాలతో చర్చకు పిలుపునిచ్చింది.

ఆఫ్ఘానిస్తాన్‌లో భద్రత, సుస్థిరత విషయంలో కీలక పాత్ర పోషించే రష్యా, ఇరాన్‌, తజికిస్తాన్‌, తుర్కుమెనిస్తాన్‌, కజికిస్తాన్‌, కైర్జిజస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌లకు చెందిన ఎన్‌ఎస్‌ఏలతో భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌ నవంబర్‌ 10న ఢల్లీి సెక్యురిటీ డైలాగ్‌ను నిర్వహించారు. ‘విధ్వంసకారుడు శాంతిదూత కాలేరు’ అన్న నానుడిని నిజం చేస్తున్నట్టుగా పాకిస్తాన్‌ ఎన్‌ఎస్‌ఏ యూసుఫ్‌ మొయిద్‌ భారత్‌ ఆహ్వానాన్ని తోసిపుచ్చారు. చైనా కూడా అదే బాట పట్టింది. ముందుగా నిర్ణయించిన అంశాలను సాకుగా చూపి సమావేశానికి డుమ్మా కొట్టింది. అయితే ఢల్లీి డైలాగ్‌ జరిగిన మరునాడు పాకిస్తాన్‌ నిర్వహించిన ట్రియోకా ప్లస్‌ సమావేశానికి చైనా ప్రత్యేక రాయబారి హాజరుకావడం గమనార్హం.

ఢల్లీి డైలాగ్‌పై నిపుణుల అభిప్రాయాలను చైనాకు చెందిన ది గ్లోబల్‌ టైమ్స్‌ ప్రచురించింది. పాకిస్తాన్‌కు పిడుగుపాటు అన్నట్టుగా ప్రాంతీయ వ్యవహారాల్లో తన ప్రభావ ప్రదర్శనకు ఈ సమావేశాన్ని వినియో గించుకోవాలని భారత్‌ ఆశించిందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. చైనా, పాకిస్తాన్‌ దేశాల గైర్హాజరుతో భారత్‌ ఆతిథ్యంలో జరిగిన సమావేశం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు అని అభిప్రాయపడిరది. భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను అణచివేయడానికి ‘ఐరన్‌ బ్రదర్స్‌’ కట్టుబడి ఉన్నారనే విషయాన్ని సైతం స్పష్టంచేసింది. ఆఫ్ఘానిస్తాన్‌పై భారత్‌తో చర్చకు పాకిస్తాన్‌ ఎప్పుడూ వెనకాడుతూనే ఉంటుంది. చర్చకు వచ్చిన పక్షంలో ఆఫ్ఘాన్‌పై తన ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందో అనే బెంగ పాకిస్తాన్‌ది. ఆఫ్ఘాన్‌లో భారత్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచం ముందు చిన్నబుచ్చడానికి పాకిస్తాన్‌ నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలకు గైర్హాజరైన పాకిస్తాన్‌ నిర్ణయాన్ని భారత్‌ తప్పు పట్టింది. ఇదే అభిప్రాయాన్ని యూఎస్‌ కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ సైతం వ్యక్తంచేసింది. తాలిబన్‌కు మద్దతు ఇవ్వడంతో పాటుగా అచిరకాలంగా ఆ దేశ వ్యవహారాల్లో ఒక విధ్వంసకరమైన పాత్రను పాకిస్తాన్‌ పలు సందర్భాల్లో పోషించిందని పేర్కొంది. దశాబ్దాలుగా దక్షిణా సియాలో ఆర్థికపరమైన ఐక్యతకు ఒక అడ్డుకట్టగా పాకిస్తాన్‌ నిలిచింది. ప్రస్తుతం ఆఫ్ఘాన్‌లో ప్రాంతీయ సహకారం విషయంలోనూ పాకిస్తాన్‌ అదే తీరుగా వ్యవహరిస్తోంది. ఆఫ్ఘానిస్తాన్‌ ద్వారా మధ్య ఆసియాపై వ్యూహాత్మక పట్టును పాకిస్తాన్‌ ఆశిస్తున్నది. అదేసమయంలో ఓబీవోఆర్‌ సజావుగా సాగాలని చైనా కోరుకుంటున్నది. చైనా, పాకిస్తాన్‌ల భౌగోళిక, రాజకీయ ఆకాంక్షలకు ఆఫ్ఘాన్‌ కీలకంగా నిలిచింది. అక్కడ తాలిబన్‌ పగ్గాలు చేపట్టడం ఇరు దేశాల ఆకాంక్షలను నెరవేర్చుకోడానికి అందివచ్చిన అవకాశంగా మారింది. అంతర్జాతీయ ఏకాభి ప్రాయాన్ని తోసిరాజని తాలిబన్‌కు పాకిస్తాన్‌, చైనా మద్దతు ఇస్తున్నాయి. రష్యా ఇటు ఢల్లీి డైలాగ్‌లో అటు ట్రియోకా ప్లస్‌ సదస్సులో పాలుపంచుకుని మధ్యే మార్గాన్ని అనుసరిస్తోంది. అదే సమయంలో రష్యా వైఖరిని ఆ దేశ ప్రతినిధులు తమ ప్రకటనలతో ప్రతిబింబించారు. తాలిబన్‌తో చర్చలు జరుపుతూనే అక్కడి ప్రభుత్వాన్ని గుర్తించాలనే వైఖరికి ఆ దేశ రాయబారి జమీర్‌ కబులోవ్‌ మద్దతు తెలిపారు. రష్యా పాలుపంచుకోవడంతో ఢల్లీి డైలాగ్‌కు మరింత బలం చేకూరింది. ఆఫ్ఘానిస్తాన్‌ భద్రతపై చర్చకు భారత్‌ ఆతిథ్యమివ్వాలనే ఆలోచనను ప్రతిపాదించింది రష్యా అని ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌ తెలిపారు. భద్రతకు సంబంధించి ఆఫ్ఘానిస్తాన్‌ నుంచి వచ్చే ముప్పుల గురించి ఇరాన్‌, రష్యాతో పాటుగా మధ్య ఆసియా దేశాలకు బాగా తెలుసు. గతంలో తాలిబన్‌ ఆఫ్ఘాన్‌ను ఏలిన రోజుల్లో చోటుచేసుకున్న దుష్పరిణా మాలను ఆయా దేశాలు మరచిపోలేదు. సరిహద్దుల వెంబడి చోటుచేసుకున్న హింస ఇప్పటికీ ఆయా దేశాలను అశాంతికి గురిచేస్తున్నది.

ఈ క్రమంలో భారత్‌ నాయకత్వాన్ని సంబంధిత దేశాలు గుర్తించాయి. ఏడుదేశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఏలు ఢల్లీి డైలాగ్‌కు హాజరుకావడం దీనికి నిదర్శనం. ఆఫ్ఘానిస్తాన్‌లో సుస్థిరతే లక్ష్యంగా ఒక స్పష్టమైన ప్రణాళికను భారత్‌ రూపొందించింది. శాంతియుతమైన, సురక్షితమైన, సుస్థిరమైన ఆఫ్ఘానిస్తాన్‌ ఏర్పాటు దిశగా అన్ని దేశాలు మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో ఆఫ్ఘాన్‌లో సార్వభౌమత్వం, ఏకత, భౌగోళిక ఐక్యత, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యనివారణకు సంఫీుభావం తెలిపాయి. ఈ నిర్ణయం ఆఫ్ఘాన్‌ను రక్షా కవచంగా భావించే పాకిస్తాన్‌కి గొడ్డలిపెట్టు. తమ భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా అక్కడి పరిస్థితులను వాడుకోవాలనుకుంటున్న ‘ఐరన్‌ బ్రదర్స్‌’ వ్యూహానికి ఇది పూర్తిగా వ్యతిరేకమైనది. టెర్రరిజం ఆర్థిక మూలాలు సహా టెర్రరిజానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయాలనే దృఢసంకల్పాన్ని ప్రాంతీయ దేశాలు తీసుకున్నాయి. ‘మంచి’, ‘చెడు’ టెర్రరిజం సిద్ధాంతం సాకుగా టెర్రరిస్టు ఏజెన్సీలకు ఊపిరిపోసే దుశ్చర్యలకు చైనా, పాకిస్తాన్‌లు పాల్పడుతున్నాయి. ప్రపంచమంతటా విస్తరిస్తున్న టెర్రరిజాన్ని సమూలంగా నిర్మూలించే దిశగా ఒక అంతర్జాతీయ చర్యకు ఏడుదేశాల సంయుక్త ప్రకటన పిలుపునిచ్చింది.

తాజాగా వెలువడిన యూఎన్‌ గణాంకాల ప్రకారం ప్రపంచంలో 85శాతం మాదకద్రవ్యాలు ఆఫ్ఘానిస్తాన్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. అదే ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. జిహాదీ ఉద్యమాన్ని కొనసాగించే క్రమంలో మాదకద్రవ్యాల వాణిజ్యం ద్వారా వచ్చే నిధులకోసం తాలిబన్‌ తపించి పోతున్నారు. తాలిబన్‌ ప్రాబల్యంతో మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరింత పెరిగిపోయింది. నార్కో టెర్రరిజం బాధితుల్లో ఢల్లీి డైలాగ్‌లో పాలుపంచుకున్న దేశాలు కూడా ఉన్నాయి. వేర్పాటువాదం, సీమాంతర తీవ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా బెడదపై పోరాటానికి ఒక సమష్టి సహకారానికి ఢల్లీి డైలాగ్‌ పిలుపునిచ్చింది. పాలన, మానవీయ సాయంలో అందరి భాగస్వామ్యంతోనే సుస్థిరమైన ఆఫ్ఘానిస్తాన్‌ సాధ్యమనే నిర్ణయాన్ని ఈ సమావేశం ప్రకటించింది. ఒక బహిర్గతమైన, సమ్మిళిత ప్రభుత్వ ఆవశ్యకత, మహిళలు, పిల్లలు, మైనార్టీల హక్కుల పరిరక్షణ లాంటి విషయాల్లో ఢల్లీి డైలాగ్‌ తన వైఖరిని సరైన పంథాలో స్పష్టంచేసింది. ఆఫ్ఘాన్‌లో అన్నివర్గాల ప్రజలకు అవసరమైన సాయం అందించడంలో ఒక కీలకమైన భూమికను కొనసాగించాలని ఈ సమావేశం యూఎన్‌ఓ ఏజెన్సీలకు పిలుపునిచ్చింది.

పాలకులకు అతీతంగా ఆఫ్ఘాన్‌ పౌరులను ఆదుకోవడంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటున్నది. చైనా, పాకిస్తాన్‌ల అసహజమైన బంధం ఒక ప్రాంతీయ సహకార ప్రణాళికను పట్టాలు తప్పించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆఫ్ఘాన్‌ పట్ల తనకు గల నిబద్ధతను భారత్‌ నిలబెట్టుకుంటూ వస్తున్నది. ఆఫ్ఘానిస్తాన్‌లో శాంతి, సుస్థిరతల పునరుద్ధరణలో తనకు గల చట్టబద్ధమైన ఆసక్తులను నొక్కి చెప్పింది. ఆఫ్ఘాన్‌ కోసం ఒక ఆచరణాత్మక వైఖరిని భారత్‌ ఆపాదించుకుంది.

అస్థిరమైన ఆఫ్ఘానిస్తాన్‌ ఒక విపత్తుగా రూపు దాల్చుతున్నది. తాలిబన్‌ 2.0ను ఒక సమ్మిళితమైన, బహిరంగ చేతనశక్తిగా ప్రపంచానికి చాటిచెప్పడానికి ఇటీవల కాలంలో మృదువైన స్వభావాన్ని ప్రదర్శి స్తున్నారు తాలిబన్‌.  కానీ అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, మైనార్టీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు వారి సహజసిద్ధమైన స్వభావాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఢల్లీి సెక్యూరిటీ డైలాగ్‌ తక్షణ ఫలితాలను అందించలేకపోవచ్చు. కానీ ఆఫ్ఘాన్‌ విషయంలో భారత్‌కు గల అచంచలమైన కట్టుబాటును చెప్పకనే చెప్పింది.

అను: మహేష్‌ ధూళిపాళ్ల

By editor

Twitter
Instagram