ఒకపక్క రాష్ట్రంలో వరదలు సంభవించి రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు; కోస్తాలోని నెల్లూరు జిల్లాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే వైకాపా, తెలుగుదేశం రెండూ ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలని బురద జల్లుకుంటున్నాయి. తమ అనుకూల, వ్యతిరేక నేతల ప్రచారంతో అటు అధికారపక్షం.. ఇటు ప్రతిపక్షం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్‌ ‌మీడియాలో ఈ పార్టీలు చేస్తున్న అల్లరి, హెచ్చరికలు, సవాళ్లతో ఆంధప్రదేశ్‌లో ఉద్రిక్తత వాతావరణం అలముకుంది. కానీ ఐదు జిల్లాల ప్రజలకు వచ్చిన ముప్పును మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.

పెన్నా, పాపగ్ని, పింఛ, మాండవ్య, బహుదా, చెయ్యేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనికితోడు వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మరణాలు సంభవించాయి. వరద తమ సర్వస్వాన్ని లాక్కెళ్లిపోవడంతో వీరు బికారులైపోయారు. ఆహారం లేదు. నీరు లేదు. కరెంట్‌ ‌లేదు. చెప్పుకుందామంటే ఒక్క ప్రభుత్వ అధికారీ రావడం లేదు. ఇంత దుర్భరమైన పరిస్థితి వరద బాధిత ప్రాంతాల్లో ఉంది. వరదలు ఆగిపోయినప్పటికీ అది సృష్టించిన విలయం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో కొన్నివేల మంది ప్రజలు వరద ముంపు భయంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. వారంతా రోడ్ల మీద కాలం గడుపుతున్నారు. తిరుపతి పట్టణంలో వరదనీరు నిలబడిపోయింది. మంచినీటికి కటకటలాడు తున్నారు. రెండు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా పూర్తి స్థాయి కరెంటు సరఫరా చేయలేదు. రాయలచెరువు కట్ట ఏ క్షణమైనా తెగిపోతుందని అధికారులు చాటింపు వేయడంతో ప్రజలు ఆందోళనతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. కాని వారిని తరలించేందుకు ఎలాంటి సహాయ, పునరావాస కార్యక్రమాలూ పెద్దగా చేపట్టలేదు. ముఖ్యమంత్రి అక్కడ పర్యటించి సమీక్ష చేసి ఉంటే అధికారులు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండేవారు. కానీ సీఎం జగన్‌ ‌హెలికాప్టర్‌లో వరద ప్రాంతాలను చూసి నేరుగా తాడేపల్లికి వెళ్లిపోయారు.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం కూడా ప్రజలకు కలగడం లేదు. స్వచ్ఛంద సంస్థలు సొంత ఖర్చుతో అన్నదానం చేయిస్తున్నారు. రోడ్లన్నీ కోతకు గురై కొట్టుకుపోయాయి. ధ్వంసమైన రోడ్లు, కూలిన కరెంట్‌ ‌స్తంభాలను నిలబెట్టి కరెంటు సరఫరా ఎప్పటికి పునరుద్ధరిస్తారో అర్థం కాని పరిస్థితి. నెల్లూరులోనూ ఇదే పరిస్థితి. నెల్లూరు నగరం సగం నీట మునిగింది. వందల మంది పేదలు తిండి, నీళ్లు కూడా లేక తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలో ఇంత బీభత్సం జరిగితే మంత్రివర్గం మాత్రం రాజకీయాల మీదే దృష్టిపెట్టింది. చంద్ర బాబును విమర్శించడం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు వివేకానందరెడ్డి హత్య అంశంపై జగన్‌ ‌కుటుంబంపై ఆరోపణలు చేయడం, వైకాపా ఎమ్మెల్యేలు చంద్రబాబు భార్య భువనేశ్వరిదేవి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అవమానించడం, దానికి తెదేపా నేతలు ప్రతి విమర్శలు చేయడం, చంద్రబాబు బాధపడటం వంటివి ప్రజలకు తెలిసిందే. ఇప్పుడు వీటిపైనే అందరి దృష్టి మళ్లీ రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీశాయి. కాని అతిపెద్ద ప్రమాదంలో ఉన్న అయిదు జిల్లాల్లోని వరద బాధితులకు చేయాల్సిన సహాయ, పునరావాస చర్యల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించా ల్సిన అసెంబ్లీ రాజకీయ పోరాటాలకు వేదికైంది. ఇలాంటి రాజకీయాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ఆదుకునే దిక్కు కూడా కనిపించడం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. ఎప్పటిలానే అధికారపార్టీ అక్రమాలు, రిగ్గింగ్‌ ‌చేసి ఎన్నికల్లో గెలిచినట్లు ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో జరిగిన ఓట్ల కొనుగోళ్లు, దొంగ ఓట్లు వేయించేటప్పుడు తీసిన వీడియోలు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. తిరుపతి, బద్వేలు ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసినట్లు ఈ ఎన్నికల్లో కూడా ప్రభుత్వం గెలుపు కోసం అధికార దుర్విని యోగానికి పాల్పడిందని అందరూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరోజు శాసనసభ సమావేశాలు జరుపుతామని ప్రభుత్వం పేర్కొంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన శాసనసభ సమావేశాల తీరునుబట్టి మరల గొడవలు జరుగుతాయని అందరూ ఊహించారు. అదే జరిగింది. ముఖ్యమైన అంశాలపై చర్చలు జరపడానికి ఒక్కరోజు సరిపోదని విపక్షాలు ప్రశ్నించాయి. ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు మొహం చూడాలని ఉందని ముఖ్యమంత్రి బీఏసీ సమావేశంలో వెక్కిరిస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. చంద్రబాబు మొదటిరోజు సభకు హాజరుకాలేదు. ప్రతిపక్షం డిమాండ్‌ ‌మేరకు ఒకరోజు నిర్వహించాలనుకున్న అసెంబ్లీ సమావేశాన్ని వారం వరకూ పొడిగించారు. తర్వాత తెలుగుదేశం, వైకాపా ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ వ్యక్తిగత విషయాలను తవ్వుకున్నారు. సభలో లేని, రాజకీయాలకు సంబంధం లేని మహిళా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వైకాపా ఎమ్మెల్యేలు విమర్శించారని తెలుగుదేశం ఆరోపించింది. చంద్రబాబు తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి విలపించారు. అంతేకాదు, తను ఈ సభను బహిష్కరిస్తున్నానని, తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ప్రతిజ్ఞచేశారు. కోపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మీడియా సమావేశాల్లో వైకాపాను దుమ్మెత్తిపోశారు. వైపాకా కూడా తక్కువేమీ తినలేదు. వారు కూడా ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడారు. వీరి తిట్లపురాణం మీడియాలో సోషల్‌ ‌మీడియా లోనూ ఘాటుగా సాగుతోంది. చర్చలలో, ప్రసారాలలో ఒకరిపై ఒకరు విశృంఖల కథనాలు, తిట్లతో కాలక్షేపం చేస్తుంటే ప్రజలు అసహ్యించు కుంటున్నారు. వైసీపీ, తెదేపా తమ రాజకీయ స్వార్థం కోసం తప్ప ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.

అసెంబ్లీని ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా కాకుండా తమ అహంకారం, అధికార మదం, ఆరోపణలు, సవాళ్లు, హెచ్చరికలు, తిట్లు తిట్టుకునే వేదికగా మార్చేశారు. గంటలకు గంటలు, రోజుల తరబడి అవహేళన, ప్రతిసవాళ్లతో అసెంబ్లీ హోరెత్తిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వైకాపాపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు అవహేళనతో ప్రవర్తించారు. ఇప్పుడు వైకాపా నాయకులు అంతకుమించి చేస్తున్నారు. ఇవే కాకుండా అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యక్తిగత ఆరోపణలు సభా బహిష్కారానికి దారితీస్తు న్నాయి. గతంలో ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్‌, ‌తమిళనాడులో జయలలిత అధికారపక్షంతో గొడవపడి అధికారం వచ్చాకే సభలోకి వస్తామని ప్రతిజ్ఞలు చేశారు. జగన్‌ ‌ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా సభను బహిష్కరించారు. చివరి ఏడాది వైకాపా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరు కాలేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు చంద్రబాబు కూడా సభను బహిష్కరిస్తూ ముఖ్య మంత్రిగానే అడుగుపెడతానని ప్రకటించారు. తాము కూడా అసెంబ్లీకి వెళ్లమని తెదేపా ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పార్టీలు ఈ విధంగా రాజకీయ వైరాలతో సభను బహిష్కరించడం, జరిగినప్పుడు కూడా సమస్యలపై చర్చ గాక వ్యర్థ వివాదాలతో కాలం వృథా కావడం బాధాకరం, ఇది ప్రజలకు తీవ్రనష్టం.

పార్టీలు రాజకీయాల అర్థం మార్చివేశాయి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ సమాజంలో ప్రజల కోసం పని చేయడం పాలక, ప్రతిపక్షాల బాధ్యత. అసెంబ్లీని బహిష్కరించడం వల్ల సమస్యలపై అర్ధవంతమైన చర్చ జరిగే అవకాశం ఉండదు. పాలకపక్షాన్ని సరైన దారిలో పెట్టి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉండదు. తమ గురించి ఆలోచించి, మంచిచేస్తారనే ఉద్దేశంతోనే ప్రజలు నాయకులను నమ్మి ఓట్లువేసి గెలిపించి ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి పంపుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీని బహిష్కరించడం వల్ల ప్రజలు వారికి అప్పగించిన బాధ్యతను ఎలా నెరవేరుస్తారు? తప్పుగా ఎవరు మాట్లాడినా వారిపై చర్య తీసుకోవాలి. కోర్టులు ఉన్నాయి. అంతే తప్ప సభ నుంచి వెళ్లిపోవడం సరైన ప్రతిస్పందన కాదని ప్రజలు అంటున్నారు. రెండున్నరేళ్లు మిగిలిన శాసనసభా కాలాన్ని వినియోగించుకుంటేనే ప్రజల సమస్యలపై పోరాడే అవకాశం ఉంటుంది.

మహిళలను కించపరచడం తగదు!

ఇంత ఉద్రిక్తతలకూ కేంద్ర బిందువు రాజకీయాలకు సంబంధం లేని మహిళ వ్యక్తిత్వం హరించేలా అసెంబ్లీలో దూషించడం. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి గాని వ్యక్తిగత విమర్శలు తగదు. సమస్యలపై చర్చించే ప్రజా వేదికగా ఉండాల్సిన శాసనసభ… కక్షపూరిత సంభాషణలకు, దుర్భాషణలకు వేదిక కావడం అత్యంత విషాదకరం. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఆడపడుచులపై వ్యక్తిగత దూషణలకు దిగడం అరాచక పాలనకు నాంది పలుకుతుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి విమర్శించారు. ఈ చర్యను భాజపా రాష్ట్ర శాఖ కూడా ఖండించింది. సభలో లేని వ్యక్తులనుద్దేశించి మాట్లాడడం సభా మర్యాద కాదు అనేది స్పీకర్‌కు తెలియని విషయమేమీ కాదు. సభలో లేని మహిళను అన్యోపదేశంగానైనా బిడ్డల పుట్టుకను వివాదాస్పదం చేయడం, నిందారోపణలు చేయడం లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. అత్యున్నత శాసనసభలో ఈ రకమైన లైంగిక సంభాషణలను నిరోధించాల్సిన బాధ్యత, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌దే. ప్రజలకు బాధ్యత వహిస్తామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, చట్టాలను గౌరవిస్తామని ప్రకటించి, ప్రమాణం చేసి, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రతిపక్షాలను మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకుని దూషించడం శాసనసభకు, శాసనసభా నాయకుడికీ గౌరవప్రదం కాదు. కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు అత్యంత ఆక్షేపణీయంగా ఉంది. ఆఫ్‌ ‌ది రికార్డు మాట్లాడినా చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, విలేకరులు అందరూ జరిగిందేమిటో, మాట్లాడిందే మిటో విన్నారు. దీనిపై స్పీకర్‌ ‌విచారించి, అసభ్య సంభాషణలు చేసిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలి. మహిళలను గౌరవించడం మాత్రమే కాదు… మహిళల కోసం చేసిన చట్టాలను రక్షించాల్సిన బాధ్యత కూడా శాసనసభ స్పీకర్‌కు ఉంది. అసెంబ్లీలో ఏమి మాట్లాడినా చెల్లుబాటవుతుందనే ధోరణికి అడ్డుకట్ట వేయాలి. అధికారం, సభలో మంద బలం ఎప్పుడూ శాశ్వతం కాదని, కేవలం మన హుందాతనం, ప్రవర్తన మాత్రమే శాశ్వతమని గ్రహించాలి. మహిళలను ఉద్దేశించి చేసే సైగలు సైతం లైంగిక వేధింపుల కిందకే వస్తాయని ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ ‌నిర్వచిస్తోంది. అభ్యంతరకర పదాలను ఉపయో గించారన్న వార్తలు అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చాయి. ఆ పదాలు మహిళల లైంగికతను కించపరుస్తూ పదజాలం వాడినప్పుడు కచ్చితంగా వారిపై కేసు నమోదు చేయాలి. స్పీకర్‌ ‌విజ్ఞతతో ఆలోచించి చట్టపరమైన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే చేసిన లైంగిక దూషణలు యూట్యూబ్‌లో ప్రసారమవుతున్నాయి. శాసన సభ్యుల నైతిక ప్రవర్తన పైన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది. మహిళలకు సాధికారత కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, నీచ పదజాలాన్ని వాడే తమ ఎమ్మెల్యేలను సమర్థించుకోవడం ముఖ్యమంత్రికి సరికాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించి, తప్పును బహిరంగంగా ఒప్పుకోవాలి. ఆడపడుచులను గౌరవించడం అనేది మన సంస్కృతి. అటువంటి సంస్కృతిని రాబోయే తరాలకు అందించాలి. ఈ అరాచక సంస్కృతిని ఆపేయాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి. రాబోయే తరాలకు బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండాలి.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram