– దాట్ల దేవదానం రాజు

కథలు చెప్పే బామ్మలేరీ? అనుభవాలు పలవరిస్తూ నీతులు బోధించే తాతయ్యలేరీ? సాంప్రదాయ విలువల బతుకులేవీ? చెబితే సావధానంగా వినే మనుషులేరీ? భద్ర జీవితాల జాడలేవీ?

పగిలిపోతున్నాయి.

పిగిలిపోతున్నాయి.

చిట్లిపోతున్నాయి.

బీటలు తీస్తున్నాయి.

చీలిపోతున్నాయి..

 * * *

శాంత నవ్వుతోంది, మెరుస్తున్న కళ్లతో. నవ్వు పులుముకుని ముఖం ఇంత చేసుకుని నిర్మలంగా, ప్రశాంతంగా. దగ్గరగా వెళ్లాడు విశ్వనాథం. ఎప్పటిలాగే కదలలేదు. మెదలలేదు. కంటి రెప్ప మూయలేదు. సూటిగా చూస్తోంది. జీవం తొణికిసలాడే ఆ ఫొటో ఎన్నో జ్ఞాపకాల్ని విసురుతోంది. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మాట్లాడాలి, బదులివ్వని మనిషితో. ఏ ఇబ్బంది కలిగినా అజ్ఞాతంగా ఉండి వింటుందనే భ్రమ. వాడిన పూలదండ…తీసేశాడు. శుభ్రంగా తుడిచాడు. ప్రేమాను బంధపు జ్ఞాపకాలు మనసులో మెదిలాయి.

‘శాంతా… నువ్వెప్పుడూ అంతే. సడీ చప్పుడూ ఉండదు. ప్రేమను చేతల్లో చూపెడతావు. కోప్పడినపుడు మాత్రం కళ్లు ఎరుపెక్కుతాయి. పేరుకు తగ్గట్టు మెతక మనిషి అని అందరూ అనుకుంటారు. కానీ కావు. చెప్పొద్దూ.. మొండి ఘటానివి. నీ ఉగ్రరూపం నాకు ఎరుకే. నాకే పరిమితం. అరుస్తావు.. గోలపెడతావు.. నాలుగు గోడల మధ్య. చిన్న మాట కూడా పడవు. పుట్టింటి నుండి ఆస్తులు బాగా పట్టుకొచ్చావు కదా అందుకు..’’ చిన్నగా గొణుక్కుంటూ మరింత దగ్గరగా వెళ్లాడు విశ్వనాథం.

ఈసారి బిగ్గరగానే అంటున్నాడు – ‘‘ఇలాగే అయితే మనం వెయ్యిసార్లు మాట్లాడుకోవడం మానేయాలి. లక్షసార్లు తిట్టుకోవాలి. కొట్టుకోవాలి. తన్నుకోవాలి. శాంతా.. ఇప్పటి తరం మనలా లేదు. చిన్న విషయానికే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. గోటితో పోయే దానికి గొడ్డలికి పని చెబుతున్నారు. అడ్డంగా నరికేసుకుని కూలిపోతున్నారు. మన ఆదిత్యకు జరింగిందదే..’’ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తూలి పడబోయాడు. గోడకు చేయి ఆన్చి నిలదొక్కుకున్నాడు. పెరిగిన గెడ్డాన్ని నిమురుకున్నాడు. శాంత ముఖంలో అదే నవ్వు. అదే చూపు.

ఆదిత్య తెలివైనవాడు. తరగతి గదిలో ఎప్పుడూ ప్రథముడే. సూక్ష్మగ్రాహి. పుస్తకాలు తప్ప మరో లోకం తెలియదు వాడికి. శుభకార్యాల్లో కూడా బడి మానమంటే ఏడ్చేవాడు. చుట్టుపక్కల వాళ్లు ఫలానా వాడిని చూసి నేర్చుకోమని వీడినే చూపించేవారు.

‘‘మీ అబ్బాయి గొప్ప ఉద్యోగస్తుడవుతాడు’’ ఉపాధ్యాయులు ముక్తకంఠంతో చెబుతుంటే మురిసిపోయేవాడు విశ్వనాథం. గర్వంగా తల ఎగరేసేవాడు.

ఆదిత్య ఎడమ పాదం కొంచెం నొక్కుకు పోయుంటుంది. అటు పక్కకు వంగి నడుస్తాడు. పుట్టినపుడు పోలియో అని భయపడ్డారు. కాని కాదు. అలాగే పదేళ్ల వయసులో సైకిలు మీంచి పడ్డాడు. సీటు ముందరి ఊచ మీద కూర్చున్నాడు. చేతిలో అప్పటి దాకా ఆడుకున్న కందిపుల్ల ఉంది. అది అనుకోకుండా చక్రంలోకి పోయింది. సైకిలు అమాంతం కిందపడిపోయింది. కుడిచేయి విరిగింది. అంతేకాదు మోచేయి గూడు తప్పింది. అప్పట్నుంచీ చేయి భుజాన్ని తాకదు. చేయి వంకరగా కనిపిస్తుంది. ఇప్పటికీ పొడుగు చేతుల చొక్కాలే వాడతాడు ఆదిత్య, వంకర చేయి గురించి ప్రశ్నలడుగుతారని.

అమెరికాలో ఆదిత్యకు మంచి ఉద్యోగం వచ్చింది.

ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఆదిత్యకు పెళ్లి చేయాలి. తన కాలు, చేయి గురించి కచ్చితంగా చెప్పమన్నాడు. ఏదీ దాయొద్దు అన్నాడు. ఏ సంబంధం వచ్చినా ముందుగా చెప్పేవారు. ఆదిత్య అందగాడే, మంచి జీతగాడే అయినా చాలా సంబంధాలు వెనక్కి పోయాయి.

రజని అమ్మానాన్నలకు ఒక్కత్తే కూతురు. ఇంజనీరింగ్‌ ‌చదివింది. గారాబంగా పెరిగింది. ఇరు కుటుంబాలకు చుట్టం అయిన ఒకాయన మధ్యవర్తిగా ఉన్నాడు. పెళ్లిచూపులు ఏర్పాటుచేశారు. మాట్లాడుకున్నారు. రజని ఇష్టపడింది. వైకల్యం పట్టించుకోలేదు. ఆదిత్య రెండేళ్ల తర్వాత ఇండియా వచ్చేయాలని రజని తల్లిదండ్రులు కోరారు. ఒప్పుకున్నాడు. ఎప్పట్నుంచో విశ్వనాథం కోరిక కూడా అదే. పెళ్లైంది. రెండేళ్లు గడిచాయి.

ఆదిత్య పెద్దలకు ఇచ్చిన మాట ప్రకారం ఇండియా వెళ్లిపోదామన్నాడు. రజని అంగీకరించలేదు. ఇండియా వెళ్లే ఆలోచన ఎప్పటికీ చేయొద్దంది. తండ్రి, అత్తమామలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నాడు ఆదిత్య. నెమ్మదిగా రజని మనసు మార్చవచ్చనుకున్నాడు. తన ప్రయత్నాలు ప్రారంభించాడు.

రజని పోరాడింది. ఆదిత్య వినలేదు. కంపెనీ వారి ఇండియా బ్రాంచికి వెళ్లే అవకాశం అనుకోకుండా వచ్చింది. సిద్ధపడ్డాడు. రజని రోషం తారస్థాయికి చేరింది. మాట్లాడటం మానేసింది. ఇండియా వచ్చినా ముభావంగా ఉండిపోయింది. పుట్టింటికి వెళ్లి ఇక తిరిగి రావడానికి మొండికేసింది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. పైగా విడాకులు కావాలంది. పెద్దలు రంగంలోకి దిగారు. నచ్చచెప్పడానికి శత విధాల ప్రయత్నించారు. ప్రాధేయపడ్డారు. ఆదిత్య వచ్చి ఎంతగానో బతి మాలాడు. వినలేదు. అంతే బంధం తెగిపోయింది.

విశ్వనాథం బాధపడ్డాడు. ఏమిటీ వైపరీత్యం? కాల మహిమ.. యుగధర్మం.. సరిపెట్టుకోలేక పోయాడు. ఏం చేస్తాడు? గోడ మీది శాంతకు చెప్పుకుని ఉపశమనం పొందాడు. తన కన్నీళ్లను ఆమె చెంపకు అద్దాడు.

 * * *

పొద్దున్నే నారాయణ వచ్చాడు. విశ్వనాథంకు మంచి స్నేహితుడు. ఆందోళనగా కనిపించాడు. మనిషి నీరసంగా కళ్లు లోతుకు పోయినట్టుగా ఉన్నాడు. రాగానే కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. విశ్వనాథం కంగారుపడ్డాడు. మంచినీళ్లు అందించాడు. కాసింత స్థిమితపడ్డాక అతని కళ్లలోకి సూటిగా చూశాడు.

నారాయణ కుర్చీ వెనక్కి వాలాడు. నిట్టూర్చాడు. ‘తనే చెబుతాడులే’ అని ఎదురు చూస్తున్నాడు విశ్వనాథం. టేబులు మీది పేపరు తీసి అతని చేతిలో పెట్టాడు.

‘‘ఈ కుర్రకారు గురించి ఏమనుకోవాలో తెలీడం లేదురా.. పెద్దరికాన్ని గౌరవించరు. పెద్దల మాట వినరు. తమకు తోచిందే చేస్తారు. మా జీవితం మా ఇష్టం అంటారు..’’ నారాయణ చెప్పడం ఆపాడు. చిరాగ్గా, అసహనంగా ఉన్నాడు. సర్వం కోల్పోయిన వాడిలా ఉన్నాడు.

‘‘ఏమైంది? ఏమిటి నీ సమస్య? ఏం చెప్ప బోతున్నావు?’’ అడిగాడు విశ్వనాథం.

‘‘అంతా అయిపోయింది. చిన్న ప్రపంచాలు క్షణంలో కూలిపోతున్నాయి. అన్నీ ఇగో సమస్యలే. చెప్పేవాడు లోకువ. మా అబ్బాయి నీకు తెలుసు కదా. పెద్ద కలివిడిగా ఉండడు. చిన్నప్పట్నుంచీ అంతే. తన పనేదో తనది అన్నట్టుంటాడు. ఊళ్లు తిరగాలనీ.. దేశాలు చుట్టుముట్టి రావాలనీ.. షాపింగులకు ఎగబడాలనీ.. అనవసర వస్తువులు కొనాలనీ అనుకోడు. శని, ఆదివారాలు కూడా ఇళ్లు కదలడానికి ఇష్టపడడు. కుటుంబంతో గడపాలనుకుంటాడు. అదే ముప్పు వచ్చింది ఇపుడు’’

ఉన్నట్టుండి నారాయణ పేపరు చేతిలోకి తీసుకున్నాడు. కళ్లజోడు సర్దుకుని తీక్షణంగా చూస్తూ చదివాడు. ఉస్సూరని నిట్టూర్చాడు. జేబులోంచి పెన్ను తీసి ఒక వార్త చుట్టూ గుండ్రంగా గీశాడు.

‘‘నీ దాకా వచ్చుండదు. మావాడి కాపురం మూన్నాళ్ల ముచ్చటైందిరా. పెళ్లై ఆరు నెలలయ్యిం దేమో అంతే.. మా కోడలు స్మిత తెలుసు కదా.. అందరూ తెగ పొగిడారు. అందానికి అందం… అణకువకు అణకువ అని. అసలు రూపం వేరే. ఆరునూరైనా అనుకున్నది జరిగిపోవాలి. కుదురుగా ఇంట్లో కూచోవడం ఇష్టం ఉండదు. ఊళ్లు తిరగాలి. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలి. షాపులు చుట్టేయాలి. అవసరంతో నిమిత్తం లేదు. కొనేయాలి. మా వాడు దీనికి పూర్తి విరుద్ధం. కోడలికి అసంతృప్తి. ఇంతే.. ఇంతకన్నా ఏమీలేదు.. లేదంటే లేదు గానీ మరొకటి కూడా ఉంది’’ ఆగి పెదాలు చప్పరిస్తూ కూర్చున్నాడు.

‘‘ఏమిటో…చెప్పు’’

‘‘మా వాడికి అమ్మంటే ప్రేమ. అమ్మ మాట జవదాటడు. ప్రతీది అమ్మకు చెబుతాడు. అమ్మంటే వల్లమాలిన ప్రేమ. ఎలాంటి పరిస్థితుల్లోనూ అమ్మను తక్కువ చేయడు. ఊరు దాటి బయటకు వెళ్లాల్సి వస్తే అమ్మకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు. అమ్మ ఆశిస్సులు తీసుకుంటే గానీ ఊరి పొలిమేరలు దాటడు. ‘ఈరోజుల్లో ఇదెక్కడి పద్ధతి?’ అని చెప్పి మార్చడానికి ప్రయత్నించింది స్మిత. పెళ్లాయ్యాక పెళ్లామే లోకమవ్వాలి. అమ్మను మరచిపోవాలి. అమ్మకు దూరం అవ్వాలి. స్మిత ఉద్దేశం అది. అంతే… ఇక మరేం లేదు.. అయిపోయింది. స్మిత పుట్టింటికెళ్లిపోయింది. కన్నవాళ్లు బాగా ఉన్నవాళ్లు. అస్తమానం వాళ్ల గొప్పలే చెబుతుండేది’’ నారాయణ చెప్పడం ఆపాడు. విశ్వనాథం కేసి చూశాడు.

‘‘అలాగైతే పెద్దలు కలసి మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయిలే. నీవేం గాబరా పడకు. కుర్రకారు ఆవేశాలు అలాగే ఉంటాయి. మనం కొంచెం ఓర్పు వహించాలి’’ విశ్వనాథం అన్నాడు.

‘‘ఆ ముచ్చట్లూ అయ్యాయి.. ఆ తంతూ ముగిసింది. ఇక లాభం లేదు’’ అంటూ లేచాడు. విశ్వనాథం కేసి చూడకుండానే గేటు వైపుకు అడుగులేశాడు.

రెండడుగులు వెనక్కి వేసి తల వెనక్కి తిప్పి నారాయణ అన్నాడు – ‘‘యుద్ధం తోనో చర్చలతోనో దేశాల మధ్య సమస్యల్ని కూడా పరిష్కరించుకోవచ్చు. అంతకు మించిన అంతర్జాతీయ సమస్య ఇది. ఎవరూ ఏమీ చేయగలిగింది లేదు. ఈ తరం అలాంటిది.’’

‘రోలు మద్దెలతో చెప్పుకున్నట్టుంది’’ అనుకున్నాడు విశ్వనాథం. పేపరు అందుకున్నాడు. ఇందాక నారాయణ గుండ్రంగా చుట్టిన వార్త ఏమిటా అని చదివాడు. పెళ్లైన ఆరు మాసాలకే విడిపోతున్న సెలబ్రిటీ జంట వార్త అది.

 * * *

మర్నాడు తనతో చదువుకున్న శివగణేష్‌ ‌వచ్చాడు.

వచ్చీ రాగానే- ‘‘నీతోనే అంటున్నాను.. మనసులో ఉంచుకో. అసలు సంగతి ఏమిటంటే…’’ ఏదో చెప్పబోయాడు. ఇంతలో ఎవరో గేటు తీసుకుని లోపలికి రావడం చూసి ఆగిపోయాడు.

వచ్చినవాడు సత్తిబాబు. వెయ్యిళ్ల పూజారి. పనీ పాటూ లేకుండా ఇళ్లిల్లూ తిరుగుతుంటాడు. కబుర్లు చెబుతూ పావుగంట సేపు ఉండిపోయాడు సత్తిబాబు. వాడు వెళ్లాక తప్ప శివగణేష్‌ ‌నోరు విప్పలేదు.

చీకటి ముసురుకుంటోంది. విశ్వనాథం లేచెళ్లి లైట్లు వేశాడు.

‘‘మా మురళి గురించి చెబుదామని వచ్చాను, విశ్వం. చదువుకున్నాడు. ఉద్యోగమే చేయాలా… మనకున్నది చాలదా? అని ఎప్పుడూ అనుకోలేదు. చెన్నైలో ఉద్యోగం వచ్చింది. పంపించాను. ఆర్థికంగా కొన్ని తరాలకు సరిపడా సంపాదించాను. మంచి సంబంధం చూసి అట్టహాసంగా పెళ్లి చేశాను. నాకున్నది ఒక్కడే కొడుకు. సంవత్సరం గడిచింది. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఉన్నట్టుండి ఒకరోజు నపుంసకుడి ముద్ర వేసి కోడలు పుట్టింటికెళ్లి పోయింది. ఇక తిరిగి రాలేదు. ఈ మధ్య విడాకులు వచ్చేశాయి కూడా’’

శివగణేష్‌ ‌కుర్చీలో నిస్సత్తువగా కూర్చున్నాడు. రోడ్డు మీద వెళుతున్న వాహనాల్ని చూస్తూ ఉండి పోయాడు.

‘‘ఇపుడు కొత్త సమస్య దాపురించింది’’

‘‘ఏమిటది?’’ అని అడక్కుండా ఉండలేక పోయాడు విశ్వనాథం.

‘‘వీడి కోసం ప్రేమించిన పిల్ల అలాగే ఉండి పోయిందట. మన కులం కాదు. మన మతం కాదు. మన భాష కాదు. ఇప్పుడు మా వాడు ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఈ కాలం కుర్రాళ్ల మనసు పసిగట్టలేం’’ అని లేచి వడివడిగా అడుగు లేశాడు.

‘ఇంతకీ శివగణేష్‌ ఏం ‌చెప్పాలనుకుంటున్నాడు?’ అని శాంత ఫొటో కేసి చూశాడు విశ్వనాథం. ఆమె యథా ప్రకారం నవ్వుతూనే ఉంది.

 * * *

విశ్వనాథం బంధువుల ఇంట్లో జరిగిన మరో సంఘటన.

ఆవేళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం. పురోహితుడు వచ్చే వేళయింది. కోడలు ఇంకా లేవలేదు.

అత్తగారు నెమ్మదిగా తలుపు కొట్టింది. కళ్లు నులుముకుంటూ చిరాగ్గా ముఖం పెట్టింది. అత్తగారు వ్రతం గురించి జ్ఞాపకంచేసి త్వరగా సిద్ధం కమ్మని చెప్పింది.

కోడలు వెంటనే తన తల్లికి ఫోను చేసేసింది. పూర్వం అత్తింటి గుట్టు పుట్టింటికి చేర్చేవారు కాదు. ఇప్పుడు ఇంట్లో జరిగే ప్రతి విషయం తల్లులకు చేరవేయాల్సిందే.

‘‘వీళ్ల చాదస్తాలతో చచ్చిపోతున్నాను, మమ్మీ. హాయిగా పడుకోనివ్వడం లేదు’’ ఫిర్యాదు చేసింది.

తల్లికి కోపం వచ్చేసింది. వెంటనే వచ్చేయమని తల్లి ఆదేశించింది. అంతే.. బట్టలు సర్దుకుని ఎవరెంత చెప్పినా వినకుండా వెళ్లిపోయింది. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భంగం కలిగిందని ఆ కోడలు భావన. మరి తిరిగి రాలేదు. దానికి మరికొన్ని అల్ప విషయాలు తోడై ఉంటాయి.. ఇంకేం ఉంది? పెళ్లి పెటాకులు. ఎవరైనా ‘ఔరా!’ అనుకోవాల్సిందే. కట్టుకున్న తర్వాత సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం లేదా? తాత్కాలిక ఆవేశాలు తగునా?

 * * *

విశ్వనాథంకు తెలిసిన వాళ్లింట్లో జరిగింది మరీ ఘోరం. మొండితనం, ఆత్మగౌరవం ఒకటేనా?

నీరజ బహు సున్నిత మనస్తత్వం కలది. అత్తారబత్తంగా పెంచారు. పెళ్లైంది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. రవీంద్ర చదువుకున్నవాడే. వారిద్దరి మధ్యా ఒకే ఒక సంఘటన జరిగింది. ఒక సందర్భంలో రవీంద్రలో ఆవేశం పెల్లుబుకింది. అసంకల్పితంగా చిన్న చెంపదెబ్బ వేశాడు. తర్వాత తప్పు తెలుసు కున్నాడు. బతిమాలాడు. క్షమించమన్నాడు. కాళ్లు పట్టుకున్నాడు. మరెప్పుడూ ఇలా జరగదని ప్రాధేయ పడ్డాడు.

‘‘కని పెంచిన వాళ్లే ఒంటిమీద చేయి చేసుకోలేదు’’ అంటూ కొంపలంటుకున్నట్టు పెద్ద పెట్టున ఏడ్చింది. ఊరుకోపెట్టడం ఎవరి తరమూ కాలేదు. పుట్టింటికి పయనమైంది. ఇంకొన్ని మనోదౌర్భల్య శక్తులు పనిచేశాయి. ఇక వెనక్కి రాలేదు.. కాపురం విధ్వంసం.

 * * *

ఇదీ విశ్వనాథం బంధువుల ఇంట్లో జరిగిందే. దీప పెళ్లికి ముందే చెప్పింది, తనకు అత్యంత అసహ్యమైన విషయం ఏమిటో. రఘు బుద్ధిగా తల ఊపాడు. అంతా సజావుగా సాగుతోంది. కానీ ఒకరోజు రఘు మిత్రుల బలవంతం మీద రెండు గుక్కలు తాగాడు. అంతే. అది కాస్తా జీవన సమస్య అయిపోయింది. రభస చేసింది. ఇంకెప్పుడూ చేయనని ఒట్టేసి చెప్పినా దీప వినలేదు. ఊరుకోలేదు. ‘‘చెప్పినా సరే…అంతేనా…మాట వినక్కర్లేదా?..’’ అనుకుంది. ఇక ఎవరి మాటలూ వినలేదు. మంతనాలు పనిచేయలేదు. దారం తెగింది. ఇక అతుక్కోదు.

ఇవన్నీ వాస్తవాలే. ఆమె ఎవరైతేనేం? ఏ ముచ్చటా లేదు. ఏ సౌందర్యమూ లేదు. పంతాలు పట్టింపులు తప్ప. విడ్డూరం అనిపించిన ప్రతి సంఘటన శాంతకు చెబుతూనే ఉన్నాడు.

‘‘శాంతా…ఒడుదుడుకులొస్తాయి. కొద్దిపాటి నొప్పులు తగులుతాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా గుబురుగా పెరిగే మొక్కలుండవూ. నిలబడగలగాలి. సర్దుబాటు చేసుకోవాలి. స్థిరంగా ఉండాలి. ఇలాగే అయితే మనమెన్ని సార్లు విడిపోవాలి, శాంతా.. నువ్వూ నేనూ కనీసం వందసార్లయినా విడాకులు తీసుకోవాలి..అంతే కదా..’’ గద్గదంగా పైకి అనేశాడు విశ్వనాథం. శాంత వింటున్నట్లే ఉంది.

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram