కశ్మీర్‌ ‌యాత్ర ‘జ్ఞాపకాలకు కంకుమపూల పరిమళం’

భారతీయ సనాతన ధర్మంలో ‘రుషుల’ స్థానం మహోన్నతమైనది. భారత వర్షంలోని అలనాటి కశ్యప రుషి పేరుతో పిలిచే కశ్యపరాజ్యం (నేటి కశ్మీరం) ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ప్రకృతి అందాలకు పేర్గాంచిన కశ్మీర్‌లో శివుడిని ఎంతగా ఆరాధిస్తారో ఈ ప్రాంతంలోని శివాలయాలు దర్శిస్తే మనకు తెలుస్తుంది.

ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. అయితే అఫ్ఘానిస్తాన్‌ ‌పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు చోటుచేసు కుంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా అవేవీ పర్యాటకులను నిలువరించడం లేదు.

హైదరాబాద్‌ ‌నుండి ఢిల్లీ మార్గంగా శ్రీనగర్‌ ‌విమానాశ్రయం చేరుకున్నాం. ఆ రోజు శ్రీనగర్‌లోని అందాల దాల్‌ ‌సరస్సులోని ‘హౌస్‌బోట్‌’‌లో బస చేశాం. కశ్మీరానికి అందాల్ని గూర్చే సరస్సు ఇది. చుట్టూ ఎన్నో పర్వతాలు, సరస్సు మధ్యలో ఫ్లోటింగ్‌ ‌మార్కెట్లు, స్థానిక దుకాణాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఆ రోజు సాయంత్రం పడవ (వీటిని ‘శికారా’ అని అంటారు)లో దాదాపు రెండు గంటలపాటు జరిపిన విహారం మా హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. మరుపురాని యాత్రగా మిగిలింది. శికారా నుండి ఎత్తైన కొండపై ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన మందిరం నగరానికి సరికొత్త అందాల్ని కలిగించింది. ఈ కొండపై నుండే శ్రీనగర్‌ అం‌దాల్ని తిలకించాం.

తక్త్-ఏ-‌సులేమాన్‌ ‌కొండమీద వెయ్యి అడుగుల ఎత్తుపై ఆదిశంకరాచార్యులు 10 శతాబ్దాలకు ముందే శివ మందిరం నిర్మించారు. దర్శించదగ్గ స్థలాల్లో ఇదీ ఒకటి. వీటి తర్వాత చెప్పుకోదగ్గది- తులిప్‌ ‌గార్డెన్‌. ‌దగ్గర్లో అందమైన మొగల్‌ ‌గార్డెన్స్ ‌కూడా చూశాం. దీన్ని సిరాజ్‌ ‌బాగ్‌ అం‌టారు. ఈ తోటలో 3,50,000 తులిప్‌ ‌పుష్పాలు విరబూస్తాయి. 50 రకాల తులిప్‌ ‌పుష్పజాతులు నెదర్లాండ్స్ ‌నుండి తెప్పించారు. కానీ ఇవి అన్ని కాలాల్లో పూయవు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్‌ ‌వరకే విరబూస్తాయి.

శ్రీనగర్‌ ‌నుండి 29 కి.మీ. దూరంలో ఉన్న అవంతీపుర కూడా చూడదగ్గది. 9వ శతాబ్దంలో అవంతివర్మ అనే రాజు శివ, విష్ణు మందిరాలు నిర్మించాడు. కాని ఇప్పుడివి శిథిలావస్థలో ఉన్నాయి. మనం జరుపుకునే చైత్ర నవరాత్రి ఉత్సవాలను కశ్మీర్‌లో ‘నవ దేహ్‌’‌గా జరుపుకుంటారు. కశ్మీరాన్ని పాలించిన చక్రవర్తి లలితాదిత్యుని జ్ఞాపకంలో చివరిరోజు శౌర్యదివస్‌గా ఇటీవల ఇక్కడి హిందువులు జరుపుకున్నారు కూడా.

అవంతీపుర మార్గంగా పహల్‌ ‌గామ్‌ ‌చేరు కున్నాం. అందమైన ‘లిడ్డార్‌’ ‌నది పక్కన హీవన్‌ ‌హోటల్లో మా బస. ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధిగాంచిన పహల్‌ ‌గామ్‌ ‌హోటల్‌ ‌రూమ్‌ ‌నుండి లిడ్డార్‌ ‌నది దృశ్యం మరుపురాని అనుభూతి. ఆ రోజు అక్కడే గడిపి, మరునాడు దగ్గర్లోని చందన్‌వాడీకి వెళ్లాం. మార్గమంతా లోయలు, మంచు పర్వతాలు కన్నులవిందుగా అనిపిస్తుంది. చందన్‌వాడీ లోయ ప్రాంతం ఎంతో సుందరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా ‘అమరనాథ’ యాత్ర ప్రారంభించవచ్చు. (అయితే నేను ‘సోన్‌మార్గ్’ ‌నుండి అమరనాథ దర్శనానికి వెళ్లాను. అమర్‌నాథ్‌కు ఇవి రెండు మార్గాలు.) ఆరోజు సాయంత్రం పహల్‌ ‌గామ్‌లోని శివమందిరాన్ని దర్శించుకున్నాం. సాయం వేళ శివదర్శనం, తర్వాత మార్కెట్‌లో స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేశాం.

కశ్మీర్‌లో కుంకుమ పువ్వు, ఎండుఫలాలు (డ్రై ఫ్రూట్స్), ‌హ్యాండీ క్రాఫ్టస్ ‌కొనదగినవి.

రెండు రోజులు పహల్‌గామ్‌లో గడిపి మరునాడు గుల్‌మార్గ్‌కు బయలుదేరాం. మధ్యలో లిడ్డార్‌ ‌నదిలో రాప్టింగ్‌ ‌చేశాం. మధ్యాహ్నం వరకు గుల్‌మార్గ్ ‌చేరుకున్నాం.

గౌరీ మార్గ్

శ్రీ‌నగర్‌ ‌నుండి 47 కిలో మీటర్ల దూరంలో గుల్‌ ‌మార్గ్ అనే ప్రదేశముంది. దీనికి యూసుఫ్‌ ‌షా అనే రాజు 15వ శతాబ్దంలో ‘గౌరీ మార్గ్’‌గా పేరు పెట్టాడు. తర్వాత మొగలులు దీన్ని గుల్‌ ‌మార్గ్‌గా మార్చారు. విశాలమైన పచ్చిక బయళ్లలో, మంచుతో నిండిన కొండలతో, ప్రపంచంలోనే ఎత్తైన గోల్ఫ్ ‌కోర్సుతో అతి రమణీయంగా ఉంటుంది. 1911లో బ్రిటిష్‌వారు ఈ గోల్ఫ్ ‌కోర్సును నిర్మించారు. గుర్రపుస్వారీకి, స్కీయింగ్‌, ‌ట్రెక్కింగ్‌కి అనుకూలమైన ప్రదేశం గుల్‌ ‌మార్గ్. ‌గొండోలా కేబుల్‌ ‌కార్‌ ‌ద్వారా పర్వత శిఖరాన్ని చేరుకున్నాం. గుల్‌ ‌మార్గ్ ‌పర్వత శిఖరాలపై నుండి పాకిస్తాన్‌ ‌భూభాగం కన్పిస్తుంది (ఒకప్పటి భరతవర్షం లోనిది). గుల్‌ ‌మార్గ్‌లో ఆ సాయంత్రం శివాలయంలో పూజ; హారతివేళ గంటసేపు గడిపాం. సూర్యాస్తమయం తదుపరి ఇక్కడి పూజా కార్యక్రమాలు కశ్మీర హైందవ శైవ సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి.

సోన్‌ ‌మార్గ్

శ్రీ‌నగర్‌ ‌నుండి 84 కిలో మీటర్ల దూరంలో సోన్‌ ‌మార్గ్ అనే ప్రదేశముంది. ఇది సముద్రమట్టానికి 2730 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుండి సింధునది ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం అందమైన జలపాతాలతో, అపైన్‌ ‌పుష్పాలతో, కోనిఫర్‌ ‌వృక్షాలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. సోన్‌ ‌మార్గ్ ‌నుండి 3 కిలో మీటర్ల దూరంలో థాజీ హౌస్‌ ‌గ్లేసియర్‌ ఉం‌ది. గుర్రపుస్వారీ ద్వారా గ్లేసియర్‌ ‌వరకు చేరుకోవచ్చు.

సోన్‌ ‌మార్గ్‌కి కొద్దిదూరంలోని బైథాల్‌ అనే చోటు నుండి హెలికాఫ్టర్‌ ‌ద్వారా ఏడు నిమిషాల్లో పంచతరణికి చేరుకోవచ్చు. అక్కడి నుండి మూడు మైళ్ల దూరంలో అమరనాథ గుహ ఉంది. ఏడు నిమిషాల ఈ గగనయానంలో హిమాలయాలను వీక్షించవచ్చు. అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.

చందన్‌వాడీ (పహల్‌ ‌గామ్‌ ‌సమీపంలో), సోన్‌ ‌మార్గ్ (‌బైథాల్‌) ‌నుండి నడక ద్వారా, గుర్రాల ద్వారా ‘అమరనాథ’ యాత్ర సాగుతుంది. హెలికాఫ్టర్‌ ‌మాత్రం బైథాల్‌ ‌నుంచే ఉంటుంది. ఎన్ని ఇక్కట్లు ఉన్నా హిమసానువుల మధ్య ఉండే ఈ అమరనాథ గుహలోని స్వయంసిద్ధంగా ఏర్పడే శివలింగం దర్శనం ద్వారా మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను పొందుతాం. ఈ మార్గమంతా ప్రకృతి రమణీయతను వీక్షిస్తూ పరవశులమవుతాం. అమరనాథ శివదర్శనం జీవితంలో మరుపురాని మధురఘట్టం.

మరునాడు జమ్ము సమీపంలో కట్రా అనే ప్రదేశంలో బస చేసి గగనమార్గంగా ‘వైష్ణోదేవి’ ఆలయానికి చేరుకున్నాం. శ్రీనగర్‌ ‌నుండి కట్రాకి రోడ్డు మార్గం కూడా ఉంది. అక్కడి నుండి వైష్ణోదేవి ఆలయం 14 కిలోమీటర్లు. ప్రకృతి అందాలకు ఎంతగానో పేర్గాంచిన కశ్మీర్‌ను ప్రతిఒక్కరూ సందర్శించాలి!

– మత్స్యరాజు హరగోపాల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram