రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కి భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయమన్న సంకేతాలు మరోసారి వెలువడ్డాయి. జనం ఆదరణ, ప్రధానంగా గ్రామీణుల స్పందన, యువత పెట్టుకున్న భరోసా.. బీజేపీ ప్రజాసంగ్రామ పాదయాత్ర ఎన్నికల శంఖారావ బహిరంగ సభలో స్పష్టంగా కనిపించాయి. దిక్కులు పిక్కటిల్లేలా వినిపించిన నినాదాలు బీజేపీకి అధికార పీఠం దగ్గరవుతుందన్న విశ్లేషణలకు దారితీశాయి.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మొదటిదశ ముగిసింది. ముందుగా ప్రకటించినట్లు మహాత్మాగాంధీ జయంతి (అక్టోబర్‌ 2) ‌రోజు యాత్ర ముగించారు. అయితే, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, ప్రజల సంక్షేమం కోసం.. తన పోరాటం సాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా సంజయ్‌ ‌ప్రకటించారు. తొలుత ప్రతిపాదించిన ప్రకారం హుజురాబాద్‌లో యాత్ర ముగింపు సందర్భంగా ఎన్నికల శంఖారావ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. కానీ, ఎన్నికల నోటిఫికేషన్‌ ‌జారీ కావడం, ఆంక్షలు అమల్లోకి రావడంతో హుజురాబాద్‌కు సమీపంలోని హుస్నాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించారు. సభకు జనం భారీగా తరలివచ్చారు. హుస్నాబాద్‌ ‌పట్టణమంతా కాషాయమయంగా మారింది. లక్ష మందికిపైగానే జనం పాల్గొన్నారు.

ఈ సభలో బండి సంజయ్‌ ఉపన్యాసం ఆసక్తి కరంగా సాగింది. బీజేపీ కార్యకర్తలు, సాధారణ ప్రజల్లోనూ ఆలోచన రేకెత్తించింది. టీఆర్‌ఎస్‌ ‌సర్కారు తీరుపై ప్రశ్నలు ఎక్కుపెట్టేలా చేసింది.

ఓ వైపు భావోద్వేగం రగులుస్తూనే.. మరోవైపు, టీఆర్‌ఎస్‌, ‌కేసీఆర్‌ ‌టార్గెట్‌గా నిప్పులు చెరిగారు, సంజయ్‌. ‌హుజురాబాద్‌ ఉపఎన్నిక ఫలితాల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ‘ట్రిపుల్‌ ఆర్‌’‌లు ప్రజాగళం వినిపిస్తారని, టీఆర్‌ఎస్‌ ‌సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తారని అభివర్ణించారు. ఇప్పటికే బీజేపీ తరఫున అసెంబ్లీలో రాజాసింగ్‌, ‌రఘునందన్‌రావు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ‌గెలిస్తే.. ముగ్గురూ కలిసి ట్రిపుల్‌ ఆర్‌లు అవుతారు. రాజాసింగ్‌, ‌రఘునందన్‌రావు, రాజేందర్‌ ‌పేర్లు ఆర్‌తో మొదలవుతుండటంతో బండి సంజయ్‌ ఇలా అభివర్ణించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలు ఈటలతో లబ్ధి పొంది చివరకు ఆయన్ను వదిలించుకున్నారని విమర్శించారు.

బీజేపీకి స్వాగత సభ, టీఆర్‌ఎస్‌కు వీడ్కోలు సభ

గడీల పాలనను భారతీయ జనతా పార్టీ అంతం చేస్తుందని బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. కేవలం హుజురాబాద్‌ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్‌.. ఈటల రాజేందర్‌ ‌గెలిస్తే పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. హుస్నాబాద్‌ ‌సభ బీజేపీకి స్వాగత సభ, టీఆర్‌ఎస్‌కు వీడ్కోలు సభ అని అభివర్ణించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాజేందర్‌ ‌గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. హుజురాబాద్‌ ఎన్నికతోనే రాష్ట్రంలో మార్పు మొదలవబోతోందని వ్యాఖ్యానించారు.

తాలిబన్‌ ‌రాజ్యం కావాలా? సంక్షేమ రాజ్యం కావాలా?

కేసీఆర్‌ ‌సర్కార్‌పై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు బండి సంజయ్‌. ఎంఐఎం ‌తాలిబన్‌ ‌రాజ్యం తెస్తానంటే.. టీఆర్‌ఎస్‌ ‌రజాకార్ల రాజ్యం తెస్తానంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను చెరబట్టి రాక్షసంగా వ్యవహరించిన తాలిబన్‌, ‌రజాకార్ల రాజ్యం కావాలా? ప్రజల సంక్షేమం కోసం రామరాజ్యం కావాలా? అని ప్రశ్నించారు. హిందూ ధర్మం కోసం పోరాడకుంటే మనల్ని బొందుగాళ్లను చేస్తారని.. అందుకే హిందూధర్మం కోసం బరాబర్‌ ‌పోరాడతామని ఆయన స్పష్టంచేశారు. అంతేకాదు, కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం సమయానికి జీతాలు చెల్లించలేని పరిస్థితిపై ఆయన ప్రశ్నలు ఎక్కుపెట్టారు. మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రం, ధనిక రాష్ట్రమని చెప్పే తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యావాలంటీర్లు, స్టాఫ్‌ ‌నర్సులను ఎందుకు తొలగించారని విమర్శించారు. ధరణి పేదల పాలిట దయ్యంలా మారిందని ధ్వజమెత్తారు. పాస్‌ ‌పుస్తకాలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

2023లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని సంజయ్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యంపై తొలి సంతకం పెడతామని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా సరే తాను దగ్గరుండి విద్య, వైద్యంపై సంతకం చేయిస్తానని హామీ ఇచ్చారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అందరికీ వైద్యం అందిస్తామని.. విద్యావకాశాలను మెరుగుపరుస్తామని ఆయన అన్నారు. స్కూళ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. లక్షల కోట్లతో ప్రాజెక్టులు ఎవరికోసం కడుతున్నారని ప్రశ్నించారు. తాను పాదయాత్రలో ఎవర్ని అడిగినా ఒక్క చుక్కనీరు కూడా రాలేదని చెబుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలయ్యే ప్రతి పథకానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయన్నారు. అంతేకాదు, ఈ ప్రభుత్వం అన్ని కులవృత్తులను దెబ్బతీసిందని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌కు దిమ్మదిరుగుతోంది : రాజేందర్‌

‌మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ.. తెరాస విషపూరిత ప్రచారాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ‌కుతంత్రాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. హుజురాబాద్‌లో అంబేద్కర్‌ ‌రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్‌ ‌రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని విమర్శించారు. ఐదు నెలలుగా హుజురాబాద్‌లో మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారన్న రాజేందర్‌.. ‌ప్రగతి భవన్‌లో కూర్చుని కేసీఆర్‌ ఆదేశాలు ఇస్తుంటే.. కొంతమంది అమలు చేస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్‌లో కేసీఆర్‌ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోందని.. అక్టోబర్‌ 30‌న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌ ‌ప్రజానీకం అంతా తనను గెలిపించాలని కోరుకుంటున్నారని, 75% బీజేపీకి, టీఆర్‌ఎస్‌కి 25% మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెప్తుంటే.. కేసీఆర్‌కి దిమ్మ తిరుగుతోందన్నారు. ఎన్ని దొంగ లెటర్స్ ‌సృష్టించినా.. అది వాళ్లకే తిప్పి కొడుతుందని, తనలాంటి బక్క పలుచని ఉద్యమకారుడిని కొట్టాలని చూస్తే.. అయ్యే పనేనా? అనిప్రశ్నించారు.

ఉద్యోగాలు ఇంకెప్పుడిస్తారు?: స్మృతి

ఈ బహిరంగ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ ‌వైఖరిని దునుమాడారు. కారు స్టీరింగ్‌ ఎంఐఎం ‌పార్టీ చేతిలో ఉందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌.. ‌ప్రజా రంజక పాలన ఎలా సాగిస్తుందని సందేహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు పెన్షన్‌ ఇస్తానన్న కేసీఆర్‌ ఆ ‌హామీని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇంకెప్పుడిస్తారని నిలదీశారు. బహిరంగ సభకు స్మృతి ఇరానీ హాజరవడం కార్యకర్తల్లో జోష్‌ ‌నింపింది. తెలంగాణపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్న సంకేతాలకు నిదర్శనమయింది.

తొలివిడత యాత్ర సాగిందిలా..

ఆగస్ట్ 28‌న చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ పాదయాత్రను ప్రారంభించారు. తొలివిడతలో 438 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేశారు. 36 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. 8 జిల్లాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్‌ ‌నియోజకవర్గాల పరిధిలో యాత్ర కొనసాగింది. 35 సభలు నిర్వహించారు. పాదయాత్ర పొడవునా రైతులు, నిరుద్యోగులు, మహిళలు సహా వివిధ వర్గాల నుంచి సుమారు 11 వేలకి పైగా వినతి పత్రాలు ఆయన స్వీకరించారు. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు.

ఈ యాత్రలో లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నారు, సంజయ్‌. ‌జనం బాధలు విన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అవగతం చేసుకున్నారు.

రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలతోనూ మాట్లాడారు. అందరికీ బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. ప్రతిచోటా ఘనస్వాగతం లభించింది. బోనాలు, మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. యాత్రలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్ర మంత్రులు, పలువురు జాతీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

– సుజాత గోపగోని, సీనియర్‌ ‌జర్నలిస్ట్ 6302164068

About Author

By editor

Twitter
Instagram