ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కరోనా మొత్తం ప్రపంచానికి పాఠం చెప్పింది. ఆరోగ్యమే మహాభాగ్యం… అన్నది జగమెరిగిన నానుడి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆరోగ్యం, పరిశుభ్రతల గురించి ముందు నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఇప్పుడు తాజాగా తీసుకువచ్చిన ‘ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌డిజిటల్‌ ‌మిషన్‌’ (ఏబీడీఎం) అందులో భాగమే.

ఇప్పుడున్న పరిస్థితులలో అనారోగ్యం పాలైన వ్యక్తి కోలుకోవాలంటే లక్షల రూపాయల వ్యయం అవుతుంది. ఇంత చేసినా ఒక్కోసారి మనిషి ప్రాణానికి పూచీ ఉండదు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రజారోగ్యం ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌గా నిలిచింది.భారత్‌ ‌వంటి జనసాంద్రత అధికంగా ఉన్న దేశంలో ఆరోగ్యం కీలక అంశమే. అందరికీ ఆరోగ్యం అంటూ ఆ సమస్య పరిష్కారం కోసం పాలకులు ప్రయత్నించకపోలేదు. కానీ పూర్తిస్థాయిలో ఫలితాలు రాలేదు. ఒక్కో రాష్ట్రం ఒక్కో పథకాన్ని రూపొందించి అమలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఆరోగ్య శ్రీ’ పథకం అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పక్రియలో భాగస్వామి అవుతోంది. ఆరోగ్య రంగం ఉమ్మడి జాబితాలోని అంశం. అందువల్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా వివిధ పథకాలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ పథకాలు ప్రజల ఆరోగ్యానికి పూర్తిగా భరోసా ఇవ్వలేక పోతున్నాయి. ఏటా ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ సామాన్యుడికి మెరుగైన వైద్యం అందని మావిగానే మిగిలిపోతోంది. గతంలో కంటే ఇప్పుడు ప్రజల్లో ఆరోగ్యంపై ఆలోచన, అవగాహన పెరిగింది. ముఖ్యంగా 2019లో కొవిడ్‌ ‌రాకతో ప్రతి ఒక్కరిలో గణనీయ మార్పు కనపడు తోంది. జీవితం చాలా చిన్నదనీ, ఉన్నంత కాలం మంచి ఆరోగ్యంతో ఉండాలనీ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆ దిశగా తమ జీవితాల్లో అనూహ్యమైన మార్పులకు అలవాటుపడుతున్నారు.

నరేంద్రమోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమొక్రటిక్‌ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా ఇస్తోంది. ఈ విషయంలో మాటలకే పరిమతం కాకుండా నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే మోదీ సర్కారు ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పథకంతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. సామాన్య ప్రజలకు మరింత మెరుగైన, ఆధునిక వైద్య సేవలు అందించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌డిజిటల్‌ ‌మిషన్‌’ ‌కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆరోగ్య రంగంలో ఈ పథకం విప్లవాత్మకమైన మార్పులకు వేదిక కానుంది. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికీ డిజిటల్‌ ఆరోగ్య గుర్తింపు కార్డును అందజేస్తారు. దీనివల్ల పౌరులు తమ ఆరోగ్య కార్డులను భౌతిక రూపంలో భద్రపరచుకోనక్కర్లేదు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కార్డులో భద్రంగా, సురక్షితంగా ఉంటాయి. ప్రజల ఆరోగ్య పరిస్థితిలో మార్పులను ఎప్పటికప్పుడు వీటిల్లో పొందు పరుస్తారు. తదనుగుణంగా ప్రతిసారి పరీక్షల అవసరం లేకుండానే రోగి పరిస్థితిని బట్టి వైద్య సేవలు అందజేస్తారు. దేశంలోని మారుమూల ప్రాంతంలో నివసించే ప్రతి పౌరుడి ఆరోగ్యానికి ప్రభుత్వం ఈ పథకం ద్వారా భరోసా ఇస్తుంది. దేశ ఆరోగ్యరంగ ముఖచిత్రాన్ని మార్చే ఈ పథకాన్ని ‘ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌డిజిటల్‌ ‌మిషన్‌’ (ఏబీడీఎం) వ్యవహరిస్తారు. గత ఏడాది ఆగస్టు 15న దీనిని పైలట్‌ ‌ప్రాజెక్టుగా ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. దీనిని దేశవ్యాప్తంగా సెప్టెంబరు 27 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌డిజిటల్‌ ‌మిషన్‌… ‌దేశ వ్యాప్తంగా ఆసుపత్రులను, వైద్య ఆరోగ్య సదుపాయాలను అనుసంధానం చేస్తుంది. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ ఆరోగ్య గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. ఇందులో ప్రతి ఒక్కరి పూర్తి, సమగ్ర ఆరోగ్య వివరాలు, సంపూర్ణ సమాచారం నిక్షిప్తం అయి ఉంటుంది. దీని ద్వారా వైద్యుడు రోగికి సంబంధించిన పాత చరిత్ర పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాక ప్రతిసారి రోగ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది. ఆర్థికంగా వ్యయ భారం కూడా తప్పుతుంది. వైద్యుడికి పని తేలిక అవుతుంది. రోగికి ఎటువంటి ఉపశమనం అవసరమో వైద్యుడు సులభంగా నిర్ణయించ గలుగుతాడు. కేవలం వైద్యుడు, నర్సులు, పారామెడికల్‌ ‌సిబ్బందే కాకుండా ల్యాబులు, మందుల దుకాణాలు, ఆరోగ్య కేంద్రాల వివరాలు కూడా ఈ కార్డులో ఎప్పటికప్పుడు నమోదవుతాయి. ఇది ఆషామాషీ, పైకి చెప్పినంత, అనుకున్నంత తేలికైన విషయం కాదు. డిజిటల్‌ ‌సాంకేతికతను భారత్‌ ఇప్పటికే చాలా మెరుగ్గా వినియోగించుకుంటోంది. ఇది ప్రపంచంలోని పెద్ద దేశాలకే సాధ్యపడలేదు. కానీ భారత్‌ ఈ ‌విషయంలో ముందుంది. కరోనా వ్యాప్తిని ఆరోగ్య సేతు యాప్‌ ‌సమర్థంగా నిరో ధించింది. కొవిడ్‌ ‌యాప్‌ ‌సాయంతో దేశవ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మంది ప్రజలకు టీకాలు వేయడం సాధ్యమైంది.

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనతో దేశంలో దాదాపు రెండుకోట్ల మంది ప్రజలు వైద్య సేవలు పొందారని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది తనకు వ్యక్తిగతంగా చాలా సంతోషం కలిగించిందని ఆయన అన్నారు. దేశంలో 130 కోట్ల ఆధార్‌ ‌కార్డు, 118 కోట్ల మొబైల్‌, 43 ‌కోట్ల జనధన్‌ ‌బ్యాంకు వినియోగదారులు ఉన్నారని ప్రధాని సోదాహరణంగా వివరించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంతటి కీలకమైన అనుసంధాన వ్యవస్థ లేదని తాను గర్వంగా చెప్పగలనని మోదీ తెలిపారు. సాంకేతిక రంగంలో అగ్రగామి దేశాలకే ఇది సాధ్యపడలేదన్నారు. ఆరోగ్య, పర్యాటక రంగాలకు మధ్య అవినాభావ సంబంధం ఉందని, రెండింటినీ వేర్వేరుగా చూడలేమని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మెరుగైన వైద్య సౌకర్యాలు, మౌలిక వసతులు గల దేశాలను మాత్రమే సందర్శించాలని ప్రజలు అనుకుంటారని అందువల్ల ఈ రెండు విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. ఏ సమస్య ఎదురైనా సురక్షితంగా ఉంటామన్న భావనే ఇందుకు కారణమన్నారు. కరోనా మహమ్మారి చేదు అనుభవాల నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన, ఆలోచన పెరిగిందని, ఇది ఆహ్వానించదగ్గ అంశమని ప్రధాని వివరించారు. డిజిటల్‌ ‌చెల్లింపుల్లో యూపీఐ విధానం ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందో డిజిటల్‌ ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌కార్డు కూడా ఆరోగ్య రంగంలో అంతే గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని, తద్వారా ప్రజల ఆరోగ్యానికి పూర్తిగా భరోసా కల్పిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

 ప్రధాని మోదీ ప్రకటించిన ఈ ఆరోగ్య పథకం దేశ వైద్య ఆరోగ్య సేవల రంగంలో కీలక మైలు రాయిగా పేర్కొనవచ్చు. వాస్తవానికి గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడే జాతీయ డిజిటల్‌ ‌హెల్త్ ‌మిషన్‌ ‌పథకాన్ని ప్రధాని ప్రకటించారు. ఇప్పటివరకు ప్రయోగాత్మక ప్రాతిపదికన అమలు చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య సేవల విషయంలో ఎదురయ్యే సమస్యలను తొలగించడంలో ఈ పథకం కీలకపాత్ర పోషిస్తుంది. సాంకేతిక పరిజానం ప్రాతిపదిక యావత్‌ ఆరోగ్య రంగం వ్యవస్థను డిజిటలీకరించాలని 2017 నాటి జాతీయ స్వాస్థ విధానం నిర్దేశించింది. ఆధార్‌ ‌కార్డు, మొబైల్‌ ‌నంబరుతో అనుసంధానించే గుర్తింపు కార్డు కీలకపాత్ర పోషిస్తుంది. ఈ గుర్తింపు కార్డులో రోగికి సంబంధించిన సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. అయితే అదే సమయంలో రోగికి సంబంధించిన ఈ సమాచారం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. లేనట్లయితే సరికొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అనేక అనర్థాలు ఎదురవుతాయి. అంతిమంగా చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. సమాచార, సాంకేతిక పరిజ్ఞానంలో వేగంగా వస్తున్న మార్పుల కారణంగా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 ఆరోగ్యం ప్రాథమిక హక్కన్న రాజ్యాంగ స్ఫూర్తికి ఇప్పటివరకు పాలకులు ఎవరూ గొడుగు పట్టలేదన్నది చేదునిజం. ఇది చెప్పడానికి కఠినంగా ఉన్నప్పటికీ వాస్తవం. వైద్య చికిత్సల వ్యయం అందరికీ అందుబాటులో ఉండాలని గతంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. అయితే ఆచరణలో దానికి మన్నన కొరవడింది. రోగానికి గురైన వ్యక్తి ఆర్థికంగా నలిగిపోతున్నాడు. వేలల్లో కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయలు వ్యయం చేసినప్పటికీ కోలుకోవడం అసాధ్యమవుతోంది. తలతాకట్టు పెట్టి అప్పోసొప్పో చేసి డబ్బులు సమకూర్చుకున్నప్పటికీ చివరికి రోగి ప్రాణాలకు భరోసా కొరవడుతోంది. దీంతో పరిస్థితి దయనీయంగా మారుతోంది. కుటుంబపెద్ద కన్నుమూస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతుంది. రోడ్డున పడుతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఆరోగ్య కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడం ఒక్కటే మార్గం.

 ప్రధాని ప్రారంభించిన జాతీయ డిజిటల్‌ ‌హెల్త్ ‌మిషన్‌ ‌పథకం నిస్సందేహంగా మంచి కార్యక్రమం. ప్రశంసించదగ్గది. ఈ పథకం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలైతే అద్భుత ఫలితాలు సమకూరు తాయి. కానీ ఆచరణలో ఎదురైన ఇబ్బందులను అధిగమించిన నాడే ఇది సాధ్యమవుతుంది. అంతర్జాల సదుపాయాలు, రహదారులు లేని గ్రామాలు ఇప్పటికీ భారతావనిలో ఎన్నో ఉన్నాయి. అంతర్జాల సౌకర్యాలకు సంబంధించి పల్లె, పట్టణాల మధ్య ఎంతో అంతరం ఉంది. బ్రాడ్‌ ‌బ్యాండ్‌ ‌వేగంలో నేటికీ మందగమనం కొనసాగుతోంది. ఈ ఇబ్బందులను అధిగమిస్తే జాతీయ డిజిటల్‌ ‌హెల్త్ ‌మిషన్‌ ‌సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించ డంలో విజయవంతం కాగలదు. ఈ పథకాన్ని సమర్థంగా పట్టాల• ఎక్కించేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకోవాలి. ఉన్నతస్థాయిలో అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయం, అవగాహనతో పని చేసినప్పుడు సామాన్య పౌరుడికి సేవలు అందగలవు. నిధుల కొరత, సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన వంటి విషయాల్లో ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలి. అప్పుడే పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా లభిస్తుంది. గత ఏడేళ్లుగా నరేంద్రమోదీ నాయకత్వం లోని నేషనల్‌ ‌డెమొక్రటిక్‌ అలయన్స్ ‌ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలుచేసి ప్రజల మన్ననలు పొందింది. కరోనా వంటి మహమ్మారిని మట్టి కరిపించడంలో పైచేయి సాధించింది. ఈ విషయంలో భారత్‌ ‌తీసుకున్న చర్యలను అంతర్జాతీయ సమాజం అభినందించింది. పేద దేశాలకు కరోనా టీకాల ఎగుమతి ద్వారా ఐక్యరాజ్య సమితి మన్ననలు పొందింది. తాజాగా చేపట్టిన జాతీయ డిజిటల్‌ ‌హెల్త్ ‌మిషన్‌ ‌కార్యక్రమం కూడా ప్రజల మన్ననలు పొందగలదనడంలో ఎటువంటి సందేహం లేదు.

———————

హెల్త్ ఐడీ కార్డ్‌తోనే అంతా!

సెప్టెంబర్‌ 27‌న ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌డిజిటల్‌ ‌మిషన్‌ (ఏబీడీఎం) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం గురించి ప్రధాని ఈ ఆగస్ట్ 15‌న ఎర్రకోట మీద చేసిన ప్రసంగంలోనే ప్రస్తావించారు. ఇప్పుడు లాంఛ నంగా ఆరంభించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి అయిన ప్రతి భారతీయ పౌరుడి ఆరోగ్య వివరాలు ఇందులో నమోదవుతాయి. ఈ సమా చారంలో రోగుల సేవలలో, వైద్యుల విధానాలలో, ఆరోగ్య వ్యవస్థ మౌలిక వసతుల కల్పనలో విప్లవాత్మక మార్పు తథ్యమని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏబీడీఎంలో భాగస్వాములం కావాలనుకునేవారు మొదట హెల్త్ ఐడీ కార్డును తీసుకోవాలి. దీనితో మాత్రమే సురక్షితమైన, సమర్ధమైన ఆరోగ్య వివరాలు నమోదవుతాయి. ఇందుకు 14 అంకెల ఆ హెల్త్ ఐడీ తీసుకోవడం తొలి అడుగు. ఈ హెల్త్ ఐడీ ఎవరైనా తీసుకో వచ్చునని నేషనల్‌ ‌హెల్త్ అథారిటీ వెబ్‌సైట్‌ ‌వెల్లడించింది. హెల్త్ ఐడీ తీసుకోవడానికి యూఆర్‌ఎల్‌ : https://healthid.ndhm.gov.in./ క్లిక్‌ ‌చేయవలసి ఉంటుంది. తరువాత జనరేట్‌ ‌హెల్త్ ఐడీ ఆప్షన్‌ ‌మీద క్లిక్‌ ‌చేయాలి. తరువాత 14 అంకెల ఆధార్‌ ‌నెంబర్‌ అం‌దించాలి. ఆ తరువాత ఆరు అంకెల ఓటీపీ నెంబర్‌ను రిజస్టర్డ్ ‌మొబైల్‌ ‌నెంబర్‌కు పంపించాలి. అప్పుడు మొబైల్‌ ‌నెంబర్‌ ‌నమోదు చేయాలి.ఆపై ఆధార్‌లో ఇంకొన్ని వివరాలు అడుగుతుంది. అప్పుడు వ్యక్తిగత ఆరోగ్య వివరాలు నమోదు చేయాలి. ఆపై నిర్ధారణ పేజ్‌ను చూసుకోవాలి. https://healthid.ndhm.gov.in./FAQ/ ఈ యూఆర్‌ఎల్‌ ‌ద్వారా కూడా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram