అఫ్ఘానిస్తాన్‌లో తుపాకీ మాటున తాలిబన్‌ అధికారం హస్తగతం చేసుకున్నప్పటి నుంచీ ప్రజలకు నిద్రాహారాలు కరువయ్యాయి. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని భయానక పరిస్థితి. ఎప్పుడు తాలిబన్‌ ‌చేతిలో హతమవుతామో కూడా ఊహకందని దారుణ వాతావరణం. ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఇతర దేశాలకు పారిపోయి తలదాచుకున్నవారు వందల, వేల సంఖ్యలో ఉంటారు. అమెరికన్‌ ‌సేనలకు సమాచారం అందించారనీ, సహకరించారనీ నెపం పెట్టి ఇల్లిల్లూ గాలిస్తూ తాలిబన్‌ ‌ముష్కర మూకలు ఇప్పటటికే అమాయకులనేకమందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాయి.

ఇక రచయితలు, పుస్తక విక్రేతలు, పాఠకులు, కళాకారులు, సినిమా నిర్మాతలు, దర్శకులు, సంగీతకారుల పరిస్థితి చెప్పడానికి మాటలు చాలవు. వారంతా చేష్టలుడిగి చిగురుటాకుల్లా వణికి పోతున్నారు. వీరందరినీ 1990ల నాటి చేదు జ్ఞాపకాలు వెన్నాడుతున్నాయి.ఆనాటి పరిస్థితి మనోఫలకంపై నిలవగా చాలామంది ముందే మేల్కొన్నారు. ఎక్కడ ఆశ్రయం దొరికితే, అజ్ఞాత వాసానికి ఎక్కడ వీలైతే అక్కడికి ఉరుకుతున్నారు. తాము ప్రాణప్రదంగా చూసుకున్న పుస్తకాలను తామే ధ్వంసం చేసుకుంటున్నారు.

అమెరికా నిష్క్రమణ ఖాయమైన తరువాత తాలిబన్‌ ‌దళాలు కాబూల్‌లో ప్రవేశించిన మూడో రోజు అది. ఆపై జరగబోయే విపరిణామాలను ఆ కళాకారుడు ముందే గ్రహించాడు. తను – రోజుల తరబడి ఎంతో శ్రమించి – నైపుణ్యాన్నంతా కలబోసి గీసిన 15 పెయింటింగులను ఇంటి వెనుక పెరడులో – పెద్ద గొయ్యి త్రవ్వి – భూస్థాపితం చేశాడు. ఈ పెయింటింగ్‌లన్నీ మహిళల ఇతివృత్తాలతో చిత్రించిన ఆధునిక కళారూపాలు.

మరో కళాకారుడు పిల్లి తన పిల్లలను మార్చినట్లు పట్టుమని పదిరోజులపాటు ఒకచోట ఉండకుండా సంచార జీవనం చేస్తున్నాడు. తను కళాకారుడినన్న విషయం ఇరుగుపొరుగు వారికి తెలుసు కనుక వారి ద్వారా తాలిబన్‌కు ఉప్పంది తన ప్రాణాలకు ముప్పు వస్తుందన్న భయంతో ఆ కళాకారుడు ఒక్కచోట స్థిరంగా ఉండలేక ఊళ్లు పట్టుకు తిరుగుతున్నాడు.

తాలిబన్‌ ‌భయంతో మరో చలనచిత్ర నిర్మాత  దేశం విడిచి పారిపోయాడు. 20కి పైగా చలన చిత్రాలతో కూడిన పెద్ద హార్డ్‌డిస్క్‌ను రహస్య ప్రదేశంలో దాచి-పరాయి దేశానికి విమానమెక్కాడు.

ఆగస్ట్‌లో తాలిబన్‌ అధికారంలోకి రావటానికి ముందు ప్రభుత్వ నిర్వహణలోని అఫ్గాన్‌ ‌ఫిల్మ్ ‌కంపెనీలో ఇరవై చిత్రాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వీటిలో కథాచిత్రాలూ, డాక్యూమెంటరీలూ ఉన్నాయి. రెండవ జాతీయ చలనచిత్రోత్సవం కోసం ఈ సినిమాలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. అక్కడి కళాకారులు వీటి నిర్మాణంలో నిన్నటిదాకా తలమునకలై ఉండేవారు. ఇప్పుడు వీటి నిర్మాణాన్ని అర్థంతరంగా అటకెక్కించారు. కళాకారులు, ఇతర సిబ్బంది ప్రతిరోజూ విధులకు హాజరవుతున్నారు. హాజరు పట్టీలో సంతకాలు చేసి ఖాళీగా కూర్చుని వెళుతున్నారు.

దేశాధ్యక్ష భవనంలో ఉన్న ఫిల్మ్ ఆర్కైవ్‌ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆ భవనం తాలిబన్‌ అధీనం లోకి రావడంతో అఫ్ఘాన్‌ ‌చరిత్రకు సంబంధించిన అమూల్యమైన సినిమా భాండాగారం ధ్వంసమై పోతుందన్న ఆవేదన  చాలామందిని వెన్నాడుతోంది.

పెళ్లి వేడుకల్లో సాధారణంగా విన్పించే సంగీతం ఇప్పుడు మూగబోయింది. అక్కడ ఏ గాయకుడి పాటా విన్పించడం లేదు. గాయకులు ప్రతి ఉదయం ఇళ్లల్లో సాగించే సంగీత సాధనను కూడా కట్టిపెట్టేశారు. తమ గొంతులు వినిపిస్తే ఎటు నుంచి ఏ తుపాకి తూటా దూసుకొస్తుందోనన్న బెంగతో వారంతా మౌనముద్రలో ఉన్నారు.

తాలిబన్‌ ‌కంట్లో పడితే వారి ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న భీతిలో ఒక పుస్తక విక్రేత చాలా పుస్తకాలను ర్యాకుల నుంచి తొలగించి దాచేశాడు. వీటిల్లో  స్థానిక భాషల్లోకి అనువదించిన బైబిల్‌ ‌ప్రతులు కూడా ఉన్నాయి. గతంలో ఖురాన్‌ ‌పుస్తకాలను ఉంచిన షెల్ఫ్ ‌పైభాగంలో వేరే పుస్తకాలు ఉంచినందుకు తాలిబన్‌ ‌దళాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ చేదు జ్ఞాపకం వెంటాడగా ముందే కళ్లు తెరచి తనకు ప్రమాదం తెచ్చిపెట్టే పుస్తకాలను కనపడకుండా చేశాడు.

ఇక పుస్తకప్రియులు వారి వారి అభిరుచి మేరకు సేకరించి చదువుకుని తమ గ్రంథాలయాలలో భద్ర పరచుకున్న పుస్తకాలను ఎవరికివారు స్వచ్ఛందంగా జల్లెడు పడుతున్నారు. తమ వ్యక్తిగత లైబ్రరీలో పాశ్చాత్య సాహిత్యం, మానవ హక్కులు, ప్రజాస్వామిక అంశాలపై రాసిన పుస్తకాలను వేరుచేసి ధ్వంసం చేస్తున్నారు.

ఇస్లామిక్‌ ‌చట్టాలకు లోబడి ఉండే కళారూపా లకూ, సినిమాలకూ, పుస్తకాలకూ అనుమతులు ఉంటాయని తాలిబన్‌ ‌ప్రతినిధి స్పష్టం చేశాడు. దీన్నిబట్టి 1990ల నాటి తాలిబన్‌ ‌చరిత్రే పునరావృత మయ్యే ముప్పు ఉంది. అప్పట్లో తాలిబన్‌ ‌మూకలు, టీవీ సెట్లను, డిష్‌యాంటెన్నలను, కెమెరాలను, వీడియో రికార్డర్‌లను  ధ్వంసం చేశారు. ఇంటర్నెట్‌ను కూడా నిషేధించారు.

అయితే ఇప్పుడు తాలిబన్‌ ‌తమ అవసరాల కోసం సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు – టీవీలకు ఇంటర్వ్యూలిస్తున్నారు. స్మార్ట్ ‌ఫోన్లు వాడుతూ వీడియోలు చూస్తున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు.

తాలిబన్‌ ‌ప్రభుత్వం ప్రస్తుతం అంతర్జాతీయంగా దౌత్యపరమైన గుర్తింపుకోసం పాకులాడుతున్నది. స్తంభించిన వందలకోట్ల నిధులను విడిపించుకోవడం, తిరిగి యథావిధిగా అంతర్జాతీయ సహాయం పొందడం వారి తక్షణ అవసరం. ఈ దృష్ట్యా కళారూపాల పట్ల, పుస్తకాల పట్ల పైకి ఒకింత సడలింపు ధోరణి ఉన్నట్లు కన్పిస్తున్నా అది ఎండమావేనన్నది విజ్ఞుల అభిప్రాయం.

అఫ్ఘాన్‌లో ఇప్పుడు రచయితలు, కళాకారుల ముందు మూడు తక్షణ కర్తవ్యాలు ఉన్నాయి. మొదటిది – దేశంలోనే కొనసాగుతూ తమను తాము రక్షించుకోవడం. రెండవది-ఏ మాత్రం వీలు చిక్కినా దేశం విడిచిపెట్టి పరాయిగడ్డపై తలదాచుకోవడం. మూడవది -స్వీయ సెన్సార్‌షిప్‌ ‌విధించుకోవడం.

మన దేశంలోని మేధావులు, ప్రజాస్వామిక శక్తులు భావప్రకటన స్వేచ్ఛ కోసం, మానవ హక్కుల కోసం నిర్విరామంగా పోరాడుతుంటాయి. వీరంతా అఫ్ఘాన్‌ ‌రచయితలు, కళాకారులు, సృజనశీలురకు సంఘీభావం తెలిపి బాసటగా  నిలబడాల్సిన తరుణమిది.

మతం కన్నా మానవత్వం ముఖ్యమన్న భావనను ఆచరణలోకి తెచ్చేందుకు గట్టిగా గొంతెత్తాలి. అఫ్ఘానిస్తాన్‌లో అంతర్గతంగా నెలకొని ఉన్న దారుణ పరిస్థితులు, అక్కడ కొనసాగుతున్న మారణకాండ బయట ప్రపంచానికి తెలియటం లేదు. ఇది ఆ దేశ అంతర్గత వ్యవహారమంటూ తప్పించుచుకోవడం మేధావి వర్గాలకు సమంజసం కాదు. అఫ్ఘాన్‌ ‌ప్రజల మానవ హక్కుల కోసం  భావప్రకటన స్వేచ్ఛ కోసం అన్ని దేశాలలోని ప్రగతి కాముకశక్తులు ఒత్తిడి తెచ్చి అక్కడ తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం పాదుగొనేలా తమ వంతు కృషిచేయాలి. ఇది కనీస ధర్మం. కానీ ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా భారతీయ మేధావులు అఫ్ఘాన్‌ ‌ప్రజల దుస్థితి గురించి ఎంతవరకు పట్టించుకున్నారు?

——————–

కళ మీద తుపాకీ గురి

తాలిబన్‌ ఆధిపత్యం వచ్చిన కొన్ని రోజులకే జరిగిన ఘాతుకం-నజర్‌ ‌మహ్మద్‌ ‌హత్య. కళారంగంలో ఖాషా జ్వన్‌ అని పేరు. ఇతడు అఫ్ఘానిస్తాన్‌లోనే ప్రఖ్యాత హాస్యనటుడు. కాందహార్‌ ‌ప్రాంతానికి చెందినవాడు. జూలై నెల ఆఖరులో ఒక రాత్రి ఇతడి ఇంటి మీద తాలిబన్‌ ‌దాడి చేసి, బయటకు తీసుకొచ్చి కాల్చి చంపారు. ఎవరో గుర్తు తెలియని సాయుధులు ఈ పని చేశారని స్థానిక మీడియా రాసినప్పటికీ ఈ హత్య తాలిబన్‌దేనని ప్రపంచం నమ్ముతోంది. ఇతడు ఒకప్పుడు కాందహార్‌ ‌ప్రాంత పోలీసు శాఖలోనే పనిచేశారు. ఖాషాను జీపులో ఎక్కించుకుని వెళుతూ, ఆయన చెంపలు పగలకొడుతున్న దృశ్యాలు కూడా ప్రపంచం చూసింది. అతడిని తీసుకువచ్చిన ఇద్దరు తాలిబన్‌ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్‌ ‌స్వయంగా చెప్పారు. మొదట ఈ హత్యతో తమకు సంబంధం లేదని తాలిబన్‌ ‌చెప్పారు.

 ఇస్లామ్‌ ‌ఛాందసులు సంగీతాన్ని సహించరు. ఆ సంప్రదాయం ప్రకారం ఆ కళకు స్థానం లేదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ ‌రాజ్యం మొదలైన తరువాత అక్కడి అఫ్ఘానిస్తాన్‌ ‌నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మ్యూజిక్‌ ‌సంస్థకు చెందిన 101 మంది మరుక్షణమే దేశం విడిచిపెట్టారు. ఒక ఫ్రెంచ్‌ ‌పత్రిక ఈ విషయం వెల్లడించింది. తాలిబన్‌ ‌ప్రవేశంతోనే కళాకారుల మీద, మేధావుల మీద, నటీనటుల మీద తుపాకీ గురి పెట్టిన సంగతి తెలిసిందే కదా! ఈ విషయం ఆ సంస్థ వ్యవస్థాపకుడు అహ్మద్‌ ‌సర్‌మాస్త్ ‌చెప్పారు. అఫ్ఘానిస్తాన్‌లో ఆ సంగీత విద్యా సంస్థకు ఎంతో ఖ్యాతి ఉంది. ఈ దేశం నుంచి బయలుదేరి వారంతా మొదట దోహా చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వ సాయంతో పోర్చుగల్‌ ‌చేరుకోవాలని వారి ఆశ. ప్రాణభయంతో ఆ సంస్థను, దేశాన్ని వీడి వచ్చిన ఆ 101 మందిలో సగం బాలికలు, మహిళలే. ఈ సంగతి వింటే చివరి గ్రేట్‌ ‌మొగల్‌ ఔరంగజేబ్‌ ‌కూడా తన రాజ్యంలో సంగీతాన్ని బహిష్కరించిన విషయం గుర్తుకు వస్తుంది.

By editor

Twitter
Instagram