– సుజాత గోపగోని

రాష్ట్రంలో ఎవరూ ఊహించని పరిణామం ఆవిష్కృతమయింది. కేసీఆర్‌ ‌ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం సాధ్యం కాదనుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక కూడా ఏదో నిగూఢం దాగి ఉందన్న విషయం పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు.

ఇప్పటిదాకా సోషల్‌ ‌మీడియాలో ఓ వాదన విపరీతంగా వైరల్‌ అవుతూనే ఉంది. వాస్తవం కూడా అదే కావడంతో జనం, ముఖ్యంగా నెటిజన్లు ఆ పరిణామాలను ప్రశ్నిస్తూ ప్రతీ పండుగ సమయంలోనూ, ప్రతీ పర్వదినం వేళల్లోనూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, ఈసారి దసరా పర్వదినం వేళ మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఆ శాపనార్ధాలు, తిట్లు, విమర్శల నుంచి విముక్తి పొందిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు, ముస్లింలు మక్కా వెళ్లేందుకు రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వం హిందూ దేశంలో, హిందువుల రాష్ట్రంలో మాత్రం హిందువుల పండుగల సమయంలో తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సర్వీసు ఛార్జీల పేరిట బస్సు ఛార్జీలను అమాంతం పెంచేస్తున్నది. ప్రత్యేక బస్సులతో పాటు సాధారణ బస్సుల్లోనూ పండుగ సమయంలో దాదాపు 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నిర్ణయంపై ప్రతిసారీ విమర్శల వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంగా ఉన్నప్పటినుంచే అదనపు ఛార్జీల పేరిట బాదుడు కొనసాగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వ రంగ ఆర్టీసీ బస్సుల్లోనే అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే.. ఇక, ప్రైవేటు వాళ్లు ఊరుకుంటారా? ప్రతిసారీ అదే జరుగుతోంది. ఆర్టీసీ ఛార్జీలు 50 శాతం పెంచితే; పండుగ సమయంలో రద్దీ కారణంగా ప్రైవేటు బస్సు సర్వీసులు, ట్రావెల్స్ 50 ‌నుంచి 200 శాతం దాకా డిమాండ్‌ను బట్టి వసూలు చేసిన సందర్భాలున్నాయి.

తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ. ఊళ్లో, అయినవాళ్ల మధ్య పండుగ జరుపుకోవాలని అందరూ భావిస్తారు. పిల్లలకు కూడా సెలవులు ఉండటంతో ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళతారు. అయితే ప్రతీసారి పండుగల వేళ ప్రభుత్వం ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎన్ని నిరసనలు చేపట్టినా సర్కారు వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించకపోవడంతో కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా సరే కిక్కురుమనకుండా అదనపు ఛార్జీలు చెల్లించి ఊళ్లకు వెళ్లడం తప్పనిసరిగా మారుతోంది. ఇది నిరుపేదలు, సామాన్యులు, మధ్య తరగతి వర్గాలకు మోయలేని భారంగా మారుతోంది.

పెంచి, తగ్గించారు

ఈ క్రమంలోనే ఈ యేడాది కూడా దసరా సెలవుల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు 50 శాతం పెంచుతా మని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. తర్వాత ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకుంది. అదనపు ఛార్జీల నిర్ణయాన్ని విరమించుకుంది. సాధారణంగా ఎప్పుడూ వసూలు చేసే ఛార్జీలే ఈ దసరా సీజన్‌లో వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రజలందరిలోనూ సంతోషానికి కారణమయింది. ఇన్నాళ్లకు హిందువులకు కూడా పండుగల సంబరాన్ని దక్కించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, పండుగ వచ్చిందన్న సంతోషం కంటే ఊళ్లకు వెళ్లేందుకు బస్సులే దిక్కయిన వాళ్లకు అదనపు ఛార్జీలు చెల్లించడం తడిసి మోపెడు కావడంతో ప్రతియేటా జనం బెంబేలెత్తిపోతున్నారు.

ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడా తెలంగాణ ఆర్టీసీ దసరా పర్వదినం సందర్భంగా ప్రయాణికుల కోసం 4వేల 35 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వీటిలో సాధారణ ఛార్జీ కంటే 50శాతం అదనంగా వసూలు చేస్తామని ప్రకటిం చింది. అయితే, కరోనా సమయంలో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయి నష్టపోయిన ప్రజలకు పండుగ ఆనందాన్నయినా లేకుండా చేసే ఈ అదనపు భారం వేయడం సరికాదన్న విమర్శలు వచ్చాయి. ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం మేరకు దసరా ప్రత్యేక బస్సులకు 50శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అయితే, ఉన్నట్టుండి దసరా ప్రయాణికు లకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌శుభవార్త చెప్పారు. పెంచిన అదనపు ఛార్జీలను ఎత్తివేస్తున్నామని, గతంలో ఉన్న సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు వెంటనే ఆదేశాలు కూడా జారీచేశారు.

అంతేకాదు, ఇప్పటి వరకు తీసుకున్న రిజర్వేషన్ల టికెట్లకు సంబంధించిన అదనపు ఛార్జీలను ప్రయాణికులకు వెనక్కి ఇచ్చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా సంస్థ పని చేస్తుందని తీపి కబురు అందించారు. అంతేకాదు, ఇక ముందు రాష్ట్రంలో అదనపు ఛార్జీలు ఉండవని కూడా తేల్చి చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. ప్రయాణికులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయని సజ్జనార్‌ ఆకాంక్షించారు. అందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. దసరా రద్దీ మొదలైన తర్వాత మొదటి ఐదు రోజుల్లోనే 1కోటి 30లక్షల మంది ప్రయాణికులను టీఎస్‌ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందని వెల్లడించారు.

ఎవరూ ఊహించని ఈ కీలక నిర్ణయంతో జనం సంబరపడిపోతున్నా.. కానీ, అప్పటికే ఊళ్లకు వెళ్లాల్సిన వాళ్లు సగం మంది వెళ్లిపోయారు. అయినా సరే.. ఇదయినా ఆహ్వానించదగ్గ పరిణామమే అంటూ జనం నిట్టూరుస్తున్నారు. అయితే, ఇప్పటికే ప్రయాణించిన వాళ్లకు అదనపు ఛార్జీలను తిరిగి చెల్లించాలని ఆర్టీసీ ఎండీ జారీచేసిన ఆదేశాలు ఎంతవరకు అమలవుతాయన్న ప్రశ్న ఉదయిస్తోంది. పండుగకు ఊరెళ్లేందుకు ఎక్కువమంది స్పెషల్‌ ‌బస్సుల టిక్కెట్లు రిజర్వేషన్‌ ‌కౌంటర్‌లోనే డబ్బులు చెల్లించి తీసుకున్నారు. వాళ్ల వివరాలు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది దగ్గర ఉండే అవకాశమే లేదు. ఒకవేళ రిజర్వేషన్‌ ‌టిక్కెట్లు తీసుకొస్తే అదనపు డబ్బులు తిరిగిస్తామని చెప్పినా చాలామంది ప్రయాణం పూర్తవగానే టిక్కెట్లను పడేస్తారు. అలాంటివాళ్లకు డబ్బులు ఎలా తిరిగిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

సర్వం హుజురాబాద్‌ ‌మయం

అయితే, ఈ సంచలన నిర్ణయం వెనుక కూడా ఎవరికీ తెలియని నిగూఢం దాగి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. త్వరలో హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో తన సర్వశక్తులూ ఒడ్డుతోంది. హామీల వర్షాలు కురిపిస్తోంది. కానీ, ఆ హామీలు, వరాలు వికటిస్తున్న సంకేతాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దళిత బంధు పథకం మీద ఇతర అన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే కేసీఆర్‌ ‌తన రాజకీయ చాణక్యాన్ని ప్రయోగించారని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించే పక్రియ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలపైనా ప్రభావం చూపిస్తుంది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం.. ప్రభుత్వానికే వ్యతిరేకంగా మారుతుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు.

పైగా ఇదే సమయంలో మరో నిర్ణయం కూడా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలు తమ సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకునే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ ‌గతవారం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 నుంచి 1500 ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. అయితే, సొంత స్థలాల్లో ఇళ్లు కట్టిస్తామన్న హామీ ఎప్పటిదో అని.. ఏడేళ్లుగా పట్టించుకోకుండా.. హుజురాబాద్‌ ఉపఎన్నిక సమయంలో జీవో విడుదల చేశారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అంటే, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ హుజురాబాద్‌ ఉపఎన్నికపై ప్రభావం చూపించేలా ఉంటోందని, కేసీఆర్‌ ‌పక్కా వ్యూహాలతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

– సుజాత గోపగోని, 6302164068

About Author

By editor

Twitter
Instagram