లఖింపూర్‌ ‌ఖేరిలో ఏం జరిగింది? కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆందోళనాకారుల మీదకు కారును తోలడం, వారు ఆగ్రహించి హింసాకాండకు పాల్పడడం.. రైతులు, భాజపా కార్యకర్తలు, ఓ డ్రైవర్‌, ఓ ‌జర్నలిస్ట్ ‌సహా 8 మంది మరణించడం ఇప్పటి వరకూ తెలిసిన వాస్తవాలు. ఘటనా స్థలంలో తాను లేనని మంత్రి కుమారుడు ఆశిష్‌ ‌మిశ్రా చెబుతున్నా చివరకు అరెస్టయి జ్యుడీషియల్‌ ‌కస్టడీకి వెళ్లకతప్పలేదు. ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం సకాలంలో స్పందించి బాధితుల కుటుంబాలకు పరిహారం, సాయం అందించింది. కాంగ్రెస్‌, ‌ప్రతిపక్షాలు, కొన్ని రైతు సంఘాలు జరిగిన ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునే యత్నాలు చేయడం చూస్తుంటే పెద్ద కుట్రలే జరుగుతున్నాయని స్పష్టమైపోతోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. కొత్త చట్టాలు రైతులకు ఎలాంటి మేలు చేస్తాయన్న విషయంలో ఎవరి వాదనలు వారికి ఉండవచ్చు. కేంద్రం ఈ విషయం మీద రైతు సంఘాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినా ఆందోళనాకారుల మొండిపట్టు వైఖరి కారణంగా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇక్కడ అసలు సమస్య రైతులకు సంబంధించినదిగా బయటి ప్రపంచానికి కనిపిస్తోంది. కానీ ఆందోళనల సరళిని చూస్తుంటే రైతుల ముసుగులో బయటి శక్తులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టమైపోయింది.

ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోట మీద దాడి, వీధుల్లో విధ్వంసకాండను గమనిస్తే రైతు ఆందోళనల ముసుగులో విచ్ఛిన్నకర శక్తులు రంగంలోకి దిగాయని అర్థమైపోయింది. ఖలిస్తాన్‌ ‌జెండాలు బహిరంగంగా ప్రదర్శించారు. దేశ రాజధాని వెలుపల నెలల తరబడి ప్రధాన రహదార్ల దిగ్బంధనం కొనసాగు తోంది. అక్కడ ఏర్పాటైన శిబిరాల్లో అత్యాచారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఏ రైతు కూడా వ్యవసాయ పనులు మానుకొని నెలల తరబడి ఆందోళన బాట పట్టే అవకాశం లేదు.

హర్యానా, పంజాబ్‌ ‌రాష్ట్రాల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఇప్పటికే హింసాత్మకంగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ‌ఖట్టర్‌, ‌మంత్రుల ఇళ్ల దిగ్బంధనాలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తుంటే రెచ్చగొడుతున్నారు. ఎక్కడైనా స్వల్ప లాఠీచార్జీ జరిగినా దాన్ని భూతద్దంతో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ ‌ప్రభుత్వం ఎంతో సంయమనంతో వ్యవహరిస్తోంది. అయినప్పటికీ అక్టోబర్‌ 3‌న లఖింపూర్‌ ‌ఖేరిలో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి.

పథకం ప్రకారం హింస

లఖింపూర్‌ ‌ఖేరిలోని కేంద్రమంత్రి అజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రా స్వగ్రామం టికునియాలో తలపెట్టిన ఓ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ ‌డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్‌మౌర్య వస్తున్నారని తెలిసి ఆందోళనాకారులు నిరసన కార్యక్రమం తలపెట్టారు. కేశవ్‌మౌర్య హెలికాఫ్టర్‌లో వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లారు. కానీ అంతలో ఆయన రోడ్‌ ‌మార్గంలో వస్తున్నారని తెలిసి రైతులు హెలిపాడ్‌ ‌వద్ద తమ నిరసనను విరమించుకొని అక్కడి నుంచి వెళుతుండగా అజయ్‌ ‌మిశ్రా వాహన శ్రేణిలోని ఓ కారు కొందరిని బలంగా ఢీ కొడుతూ దూసుకుపోయింది. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనాకారులు దాడులకు దిగారు. వాహనాలను తగులబెట్టడంతో పాటు బీజేపీకి చెందిన వారిని కర్రలతో తీవ్రంగా కొట్టారు. కారు ఢీ కొడుతూ వెళ్లడంతో పాటు అక్కడ జరిగిన విధ్వంసాల వీడియోలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.

అల్లరి మూకలు ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపుతూ కేంద్ర మంత్రి అజయ్‌ ‌మిశ్రా తనను దాడి చేయమని పంపారని చెప్పమని బలవంతం చేయడం స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే దెబ్బలు తింటున్న వ్యక్తి అజయ్‌ ‌మిశ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెబుతున్నాడు. తర్వాత ఏమి జరిగిందనేది వీడియోలో కనిపించలేదు. ఆందోళనాకారుల మీదకు కారు నడిపింది అజయ్‌ ‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ ‌మిశ్రా అని ఆరోపణలు వచ్చాయి. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఘటనా స్థలంలోనే తాను లేనని ఆంటున్నారు ఆశిష్‌. ఈలోగా కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్‌ ‌నాయకులు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక వాద్రాలతో పాటు విపక్షాలు, రైతు సంఘాల నుంచి ఒత్తిడి పెరిగింది.

లఖింపూర్‌ ‌ఖేరి హింసాత్మక ఘటనలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఉత్తరప్రదేశ్‌ ‌పోలీసులు అశిష్‌ ‌మిశ్రాతో పాటు 13 మందిపై కేసులు నమోదు చేసి వారు తమ ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. చివరకు ఆశిష్‌ ‌మిశ్రా పోలీసుల ముందుకు రావడంతో విచారించారు. న్యాయస్థానం ముందు హాజరు పరచగా ఆశిష్‌కు జ్యుడీషియల్‌ ‌కస్టడీ విధించారు.

లఖింపూర్‌ ‌ఖేరిలో జరిగిన ఘటనలు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టేందుకు అనుకోని వరాలుగా భావించాయి ప్రతిపక్షాలు. టికునియా వెళ్లి ఆందోళనలు జరిపేందుకు సిద్ధమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం రైతు నాయకులను తప్ప బీజేపీ సహా, ప్రతిపక్ష నేతలు ఎవ్వరినీ అక్కడకు రాకుండా 144 సెక్షన్‌ ‌విధించింది. కట్టుదిట్టమైన చర్యలతో ఆ ఘటనలకు రాజకీయ రంగు పులిమే అవకాశం లేకుండా చేసింది. ప్రియాంకగాంధీ, అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌జయంత్‌ ‌చౌదరి తదితర నాయకులను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశంతో రాష్ట్ర శాంతి భద్రతల ఏడీజీ ప్రశాంత్‌కుమార్‌ ‌నేరుగా రైతు నాయకులతో సంప్రదింపులు జరిపి మృతుల కుటుంబాలకు భారీ నష్టపరిహారంతో పాటు, రిటైర్డ్ ‌హైకోర్టు న్యాయమూర్తితో న్యాయవిచారణకు ఒప్పుకున్నారు. హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చింది. క్షతగాత్రులకు సైతం రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇస్తుందని తెలిపింది.

రైతుల ఫిర్యాదు మేరకు మంత్రి అజయ్‌ ‌మిశ్రా కుమారుడితో సహా, వారు ఆరోపణలు చేసిన వారిపై ఆదివారం రాత్రే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయడం, స్థానికంగా ఆవేశంగా ఉన్న రైతులతో కాకుండా సీనియర్‌ ‌రైతు నాయకులతో నేరుగా చర్చలు జరపడంతో పరిస్థితులను సద్దుమణిగేటట్లు చేయగలిగారు. రైతు నాయకులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పుడు, ఎటువంటి సమస్య ఏర్పడలేదు. పైగా, వారికి ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంది. వారితో చర్చించి, వారి డిమాండ్లు అంగీకరించామని తెలిపారు ప్రశాంత్‌ ‌కుమార్‌. ‌ప్రతిపక్ష నాయకులను అక్కడకు రానిచ్చి ఉంటే వారు రైతులను రెచ్చగొట్టి సమస్యను మరింత తీవ్రం చేసే ప్రయత్నం చేసేవారు. రాకేశ్‌ ‌తికాయత్‌తో సహా రైతు నాయకులు ఎవ్వరిని అక్కడకు రావడాన్ని అడ్డుకోకుండా, వారిని చర్చలకు సిద్ధమయ్యే విధంగా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

రైతులు నిరసనను విరమించుకొని, మృతదేహాలకు పరీక్షలు జరపడానికి అంగీకరించడంతో రాజకీయ లబ్ధి పొందాలని చూసిన ప్రతిపక్షాలకు ఆశాభంగం కలిగింది. వారిని ఎక్కడికక్కడ ఆపివేయడంతో సత్వరం పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం సాధ్యమైంది. తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సందర్భంలో యోగి ఆదిత్యనాథ్‌ ‌ప్రభుత్వం వేగంగా స్పందించి, 24 గంటల లోపే పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం ప్రశంసలు అందుకుంది.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే..

మరికొన్ని నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడం కోసమే ఈ హింసాకాండను సృష్టించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో రిపబ్లిక్‌ ‌డే నాడు ఎర్రకోట వద్ద రైతుల ముసుగులో హింసను రెచ్చగొట్టిన తరహాలోనే ఇక్కడ కూడా హింసాకాండకు దిగాలని కొన్ని వర్గాలు ప్రయత్నించినట్లు స్పష్టం అవుతోంది. రైతుల ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు, ఉగ్రవాదుల మద్దతుదారులు అక్కడకు చేరుకొని ఉద్రిక్త పరిస్థితులు సృష్టించినట్లు ఇప్పుడు ఆధారాలు లభిస్తున్నాయి. రైతు మరణాలను రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలు మిగతా నలుగురి మృతికి ఎవరు బాధ్యులో పెదవి విప్పక పోవడం, కనీసం సానుభూతి కూడా చూపకపోవడం గమనార్హం.

కేంద్ర మంత్రి అజయ్‌ ‌మిశ్రాదిగా భావిస్తున్న పాత వీడియో ఒకటి సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి నాకు రెండు నిమిషాలు చాలు’ అని రైతులను ఉద్దేశించి అంటున్నట్టుగా ఉంది. ‘నాతో తలపడండి. కేవలం 2 నిమిషాల్లో మిమ్మల్ని దారికి తెస్తా. నేను మంత్రినో, ఎంపీనో, ఎమ్మెల్యేనో మాత్రమే కాదు. అంతకు ముందు నుంచి ప్రజలకు నేనెవరో తెలుసు. సవాళ్ల నుంచి నేను పారిపోను’ అని అందులో ఉంది. ఈ వీడియోను ఓ వాట్సప్‌ ‌గ్రూప్‌ ‌నుంచి 2,500 మందికి పైగా పంపినట్లు తేలింది. దానికి అడ్మిన్‌గా ఉన్న వ్యక్తికి ఖలిస్తాన్‌ ఉద్యమంతో సంబంధాలున్నాయని భావిస్తున్నారు. వాస్తవానికి తాను రైతులను ఉద్దేశించి అనలేదని, మొత్తం వీడియో వింటే తెలుస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ప్రతిచర్య అంటున్న తికాయత్‌

‌లఖింపూర్‌ ‌ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలో రైతులు బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటం చర్యకు ప్రతిచర్య మాత్రమేనని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నాయకుడు రాకేష్‌ ‌తికాయత్‌. ఈ ‌దాడికి పాల్పడిన రైతులను తాము నిందితులుగా భావించటం లేదని అన్నారు. వాహనంతో నలుగురు రైతుల ప్రాణాలు తీశారని.. తర్వాత జరిగిన ఘర్షణలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలను చంపడం నేరంగా పరిగణించనని తికాయత్‌ ‌తెలిపారు. నిరసన తెలుపుతున్న రైతులపై వాహనాన్ని ఎక్కించి నందుకుగానే వారు ఈ విధంగా స్పందించినట్లుగా ఆయన వెల్లడించారు.

ఈ వివాదం మొత్తంలో కేంద్ర సహాయమంత్రి అజయ్‌ ‌మిశ్రాను విలన్‌గా చూపించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాలని, కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. కానీ అజయ్‌ ‌మిశ్రా గురుంచి తెలిసినవారు దీన్ని కచ్చితంగా విశ్వసించరు. నేరమయ రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. అజయ్‌ ‌మిశ్రా కుమారుడు తన స్వగ్రామంలో రైతులపైకి కారు పోనిచ్చి, చంపారనే ఆరోపణలు విశ్వసనీయంగా లేవంటున్నారు. అజయ్‌ ‌మిశ్రా ఒకసారి ఎమ్యెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా పేరొందారు. పార్లమెంటరీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనే కొద్దిమందిలో అజేయ మిశ్రా ఒకరు. ఇంతవరకు ఆ రాష్ట్రం నుండి -‘సంసద్‌ ‌రత్నా’ పురస్కారం పార్లమెంట్‌ ‌నుండి పొందిన ఏకైక నేత ఆయనే కావడం గమనార్హం.

‘స్టే’ ఉన్నా..

ఉద్యమాలు చేసుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కానీ రైతుల ముసుగులో సంఘ విద్రోహక శక్తులు విధ్వంసాలకు పాల్పడుతున్నాయన్నది వాస్తవం కాదా? రెచ్చగొట్టడాలు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నది ఎవరు?

కొత్త సాగుచట్టాలను రద్దుచేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరుగుతున్నప్పుడు న్యాయస్థానం తీర్పు వచ్చేవరకూ ఎవరైనా సంయమనంతో ఉండాల్సిందే. ఇప్పటికే న్యాయస్థానం సాగుచట్టాలపై స్టే విధించింది. కానీ ఇవేవీ పట్టనట్లు ఆందోళనల పేరుతో రహదారులను దిగ్బంధనం చేస్తూ సాధారణ ప్రజానీకం రాకపోకలకు ఆటంకాలు కల్పించడం ఎందుకు? ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా వారిని ఇప్పటికే మందలించింది.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏ ప్రభుత్వం అయినా రైతులకు నష్టం జరగాలని కోరుకోదు. రైతులు తమకు నచ్చిన చోట పంట అమ్ముకోవచ్చు. తమకు ఎలా లాభదాయకంగా ఉంటే ఆ విధంగా అమ్ముకునే స్వేచ్ఛ కొత్త చట్టాల ద్వారా వచ్చింది. గతంలో పరిమిత మార్కెట్లలో, అక్కడ ఇచ్చే ధరకు మాత్రమే అమ్ముకోవడంతో రైతులు నష్టపోయేవారు. దళారులు కారుఛౌకగా కొని లాభపడేవారు. ఈ అవకాశం పోయిందనే దుగ్ధతో రైతుల ముసుగులో ఆందోళనలు చేస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యం.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram