రాష్ట్రంలో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. వ్యవసాయం తర్వాత పలు వృత్తుల్లో ఉపాధి లభిస్తుంది. అయితే కరోనా కారణంగా నిర్మాణరంగం స్తంభించిపోవడంతో యువత ఖాళీగా ఉంటున్నారు. ఈ రంగంలో శిక్షణ ఇచ్చే పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు స్థాపన లక్ష్యాలను నెరవేర్చలేకపోతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఏర్పాటుచేసిన ఈ ఐటీఐలు అప్పటి అవసరాల నిమిత్తం ఏర్పాటయ్యాయి. కానీ మారుతున్న పరిస్థితులను బట్టి కొత్త కోర్సులను తీసుకురాలేదు. పాత కోర్సులను కొనసాగించడం, శిక్షణ తీసుకున్నవారికి ఉపాధి లభించకపోవడంతో వీటిని ఆదరిచండం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక ఐటీఐని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధి అందించని కోర్సులు, బోధనలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వీటిని విద్యార్థులు ఆదరించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీఐలలో సంగం సీట్లు కూడా నిండటం లేదు. ఉన్న సమస్యలు సరిచేసుకోకుండా కొత్తవాటిని ఏర్పాటుచేయడం అనవసర ఖర్చు, వృథా శ్రమగా మిగిలిపోనుంది.

సమాజం మనుగడ వృత్తులపై ఆధారపడి ఉండేది. ఒక్కో కులం ఒక్కో వృత్తిని చేపట్టి ఆ పని ద్వారా వచ్చే ఆదాయంతో బతికేవారు. పారిశ్రామిక విప్లవం వచ్చాక వృత్తుల్లో ఉపయోగించే పనిముట్లలో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి సాయంతో మరింత వేగంగా పనులు చేయవచ్చు. స్వాతంత్య్రం లభించాక అప్పటి ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చాయి. ఫలితంగా పలురకాల పరిశ్రమలు ఏర్పడ్డాయి. వీటిలో కిందిస్థాయిలో నైపుణ్యం గల శ్రామికులను రూపొందించేందుకు పారిశ్రామిక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1960 నుంచి నిర్మాణరంగం వృద్ధి చెందింది. దాంతోపాటే సాంకేతిక, నైపుణ్య విద్యకు ప్రాధాన్యం లభించింది. ఈ క్రమంలో ఐటీఐలు ఉపాధి కల్పించే కేంద్రాలుగా పనిచేశాయి. పదో తరగతి తర్వాత శిక్షణ ఇచ్చే ఐటీఐల్లో చదివిన వారికి ఉద్యోగాలు వెంటనే లభించేవి. మా వాడు ఐటీఐలో చదువుతున్నాడనే భరోసాను తల్లిదండ్రులు వ్యక్తంచేసేవారు. ఇంటర్‌ ‌కంటే ఐటీఐకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. సీట్లు దొరికేవి కావు. ప్రైవేటు ఐటీఐలు భారీగా ఏర్పడ్డాయి. తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇంజనీరింగ్‌ ‌కళాశాలలు భారీగా ఏర్పడటం, కొత్తకోర్సులు రావడంతో విద్యార్థులు ఐటీఐని వదిలేశారు. ఇంజనీరింగ్‌ ‌పట్ల ఆసక్తి చూపించారు. ఫలితంగా ఇంటర్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఇంజనీరింగ్‌ ‌సీట్లకు ఎంసెట్‌ ‌పోటీ పరీక్ష పెట్టడంతో పలు ప్రైవేటు కళాశాలలు ఏర్పడ్డాయి. ఈ పరిణామాం ఐటీఐలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. పదో తరగతిలో బొటాబొటి మార్కులతో పాసైన వారు తప్ప ఐటీఐలను ఎవరూ ఎంచుకోవడం లేదు.

ఇదీ పరిస్థితి

రాష్ట్రంలో 80 ప్రభుత్వ ఐటీఐలు, 430 ప్రయివేటు ఐటీఐలు ఉన్నాయి. వీటిలో ఏడాదికి సుమారు 52 వేల మంది శిక్షణ పూర్తి చేసుకుంటు న్నారు. సుమారు 30 రకాల కోర్సులున్నాయి. వీటిలో పాతకాలపు కోర్సులే అధికం. పురాతన శిక్షణా పద్ధతులు, కాలం చెల్లిన యంత్రపరికాలతోనే బోధన జరుగుతోంది. ప్రభుత్వ ఐటీఐలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మొత్తం టీచింగ్‌, ‌నాన్‌ ‌టీచింగ్‌ ‌కలిపి 2,782 పోస్టులకు గాను 1,579 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1,070 టీచింగ్‌ ‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌‌స్ట్రక్టర్‌ల పోస్టులు 60 శాతం ఖాళీ ఉంటే శిక్షణ ఎలా సాధ్యమవుతుంది? కొన్ని చోట్ల భవనాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరికొన్ని చోట్ల కరెంటు బిల్లులూ కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక 50 శాతం ప్రైవేటు ఐటీఐలలో బోధనే జరుగదు. సర్టిఫికెట్ల కోసమే వీటిలో చేరుతున్నారు. రోజువారీ తరగతులకు రారు. పరీక్షలు రాయడానికి మాత్రమే విద్యార్ధులు వెళ్తారు. కానీ పాసైపోతారు. ఐటీఐలు ఆయా వృత్తుల్లో ప్రత్యక్ష శిక్షణ ఇవ్వాలి. కాని ఇప్పుడీ అంశంలోనే ఐటీఐలు వెనుకబడ్డాయి. ఉన్న వాటిలో 30 శాతం తప్ప మిగిలిన సంస్థల్లో ప్రత్యక్ష అనుభవం ఉండదు. చాలా సంస్థలు నూతన సాంకేతిక విధానాలు అమలు చేయడం లేదు. ఆయా ట్రేడుల్లో వచ్చిన నూతన యంత్రపరికరాల గురించి కూడా వీరికి పరిచయం ఉండటం లేదు. ప్రభుత్వ ఐటీఐలలో ప్రాక్టికల్స్ ‌కోసం యంత్రపరికరాల కొనుగోళ్లకు వరల్డ్ ‌బ్యాంకు నుంచి నిధులు తెచ్చినా వాటిని వినియోగించలేదు. శిక్షణా కాలంలో ప్రాక్టికల్స్ ‌ఖర్చు నిమిత్తం ఒక్కో విద్యార్థికి రూ.400 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. కాని ఇప్పటికీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని విద్యార్థులంటున్నారు. ఐటీఐ శిక్షణ పూర్తయిన తర్వాత అప్రెంటిస్‌షిప్‌ ‌కోసం పంపాలి. కానీ ప్రస్తుతం అదీ సరిగా జరగడం లేదంటున్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా నిర్మాణరంగంలో వచ్చిన పెనుమార్పుల ప్రభావం వృత్తి విద్యలపై పడింది. పరిశ్రమలు ఉత్పత్తిని వదిలేసి యంత్ర పరికరాలను దిగుమతి చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటు తగ్గింది. ఇది సాంకేతిక విద్యపై ప్రభావాన్ని చూపింది.

ఇంటర్‌లో వృత్తివిద్యలేల?

ఇంటర్‌లో వృత్తివిద్యలు ప్రవేశపెట్టారు. వీటిలోను పలురకాల కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. పారిశ్రామిక వాతావరణం లేకపోవడంతో వాటికి ఆదరణ లేదు. అయిదారు కోర్సులకు మాత్రమే ఆదరణ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్‌పై చూపించిన ఆసక్తిని ఐటీఐలపై చూపించాలి. వృత్తి విద్యను ఐటీఐలకే పరిమితం చేయాలి.

నిర్మాణరంగానికి మోదీ ఊతం

మోదీ ప్రభుత్వం దేశంలో నిర్మాణరంగానికి ప్రాధాన్యం ఇవ్వాని నిర్ణయించింది. రూ.100 లక్షల కోట్లతో రహదార్లు, పైవంతెనలు, బ్రిడ్జిలు, రైల్వేలు, పారిశ్రామిక కారిడార్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, పెట్రోలియం కాంప్లెక్సులు ఇలా నిర్మాణరంగాన్ని బలోపేతం చేస్తున్నారు. దీంతో ఈ రంగంలో నైపుణ్యం ఉన్న కార్మికుల అవసరం ఏర్పడ నుంది. అందువల్ల నిర్మాణరంగానికి అవసరమైన కోర్సులను పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ప్రవేశపెట్టాలి. అవసరమైన పాత కోర్సులకు నూతన యంత్ర పరికాలను అందించి వాటిలో నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం భారీగా నిధులు వినియోగిం చాలి. ఐటీఐలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలి.

పాఠశాలల్లో రాజకీయాలు

పాఠశాలల కమిటీ చైర్మన్‌ ఎన్నికలు కొన్ని జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలను తలపించాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఓటింగ్‌లో పాల్గొనేలా రాజకీయ రహితంగా ఈ ఎన్నికలు జరగాలి. కాని వీటిని కూడా పదవులుగా వైకాపా, తెలుగుదేశం పార్టీలు భావించాయి. ఈ రెండు పార్టీల నాయకులు తమ వర్గాలకే పదవులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ వివాదాలు శృతిమించుతు న్నాయి. రాళ్లదాడులు కూడా చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల ఎన్నికలు వాయిదాపడ్డాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు బోధనం, హాజరు తదితర వాటికి సంబంధించి విద్యా కమిటీలను ఏర్పాటు చేసుకుంటారు. కాని ప్రాంతీయ పార్టీల చర్యలతో ఇప్పుడా లక్ష్యం దెబ్బతింది. పాఠశాలలను కూడా ఆదాయవనరుగా ఈ పార్టీలు భావిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం గుడ్డిప ప్రాథమికోన్నత పాఠశాలలో చైర్మన్‌ ‌పదవికి వేలం నిర్వహించగా వైసీపీ నేత రూ.1.65 లక్షలకు దక్కించుకున్నారు. కోటవురట్ల మండలం పందూరు యూపీ పాఠశాలలో కూడా చైర్మన్‌ ‌పదవికి వేలం నిర్వహించారు.

దోచుకునేందుకేనా?

దోచుకోవడానికి కాదేదీ అనర్హం అన్న రీతిలో నాయకుల చూపు విద్యాలయాలపై పడింది. ప్రభుత్వ విద్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పనలో విద్యాకమిటీల అనుమతి కూడా తప్పనిసరి. ‘మన బడి’, ‘నాడు నేడు’ పథకాల్లో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో విద్యా కమిటీలకు కాసుల వర్షాన్ని కురిపిస్తోందని తల్లిదండ్రులే ఆరోపిస్తున్నారు. తాము ఎంపిక చేసిన కమిటీ తమ పిల్లల విద్యాభివృద్దికై కృషి చేయకుండా వచ్చిన నిధులు మింగేయడానికి ప్రయత్నించడంతో వీరు ఆవేదన చెందుతున్నారు. పాఠశాలలో చేయని పనులు చేసినట్లుగా, తక్కువ పనులకు ఎక్కువ బిల్లులు పెట్టడం ఇలా అనేక రకాలుగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తు న్నారు. ఈ పదవులు కూడా ఆదాయం అందించేవిగా చూడటంతో అభ్యర్థులు వీటిని కూడా సాధారణ ఎన్నికల్లా భావించి రణరంగం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన మాదిరి విపక్షాలను ఎలా భయబ్రాంతులకు గురి చేశారో విద్యా కమిటీ ఎన్నికల్లోను అదే విధంగా దౌర్జన్యాలకు దిగడం సిగ్గుచేటు.

కొత్త సంస్కృతి

నేటి బాలలే రేపటి పౌరులని చెప్పుకుంటున్న తరుణంలో ఇలాంటి సంఘటన ద్వారా మనం విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నామో ఒక్కసారి ఆలోచిం చాలి. విద్యాలయాల్లో రాజకీయాలు అడుగుపెట్టడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే పాఠశాలల్లో కల్మషం లేని పసిమొగ్గలుంటారు. తల్లిదండ్రులు అక్కడ రాజకీయాలు కోరుకోరు. విద్యార్థులకు భవిష్యత్తును, అభివృద్ధిని కాంక్షించే విద్యావంతులైన తల్లిదండ్రులే విద్యాకమిటీలో సభ్యులు, చైర్మన్‌గా ఉండాలి. నాడు-నేడు కార్యక్రమంలో రంగులు వేసే పని పక్కనపెట్టి నిర్మాణాలు చేయాలి. రాజకీయాలను పసి హృదయాల మీద రుద్దవద్దు. బడుల్లో రాజకీయాలు ప్రవేశించడం, చిన్నారుల మనుసుల్లో విషబీజాలు నాటడం సమాజానికి చాలా ప్రమాదకరం.

ఏకగ్రీవాలపై చర్చ జరగాలి!

ఎంపీపీ, డ్‌పీ స్థానాలకు జరిగిన ఏకగ్రీవాలపై చర్చ జరగాలి. ప్రభుత్వ పాలనకు అనుకూలంగా ఏకగ్రీవాలు జరిగినట్లు ప్రభుత్వం పేర్కొనడం పచ్చి అబద్ధం. విపక్షాలను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, హెచ్చరికలు, బెదిరింపులు, దాడులు, పోలీసులు, కేసులు ఇలా ఎన్ని దౌర్జన్యాలు చేయాలో అన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరగాలి. ఈ ఏడాది ఏప్రిల్‌ 8‌న జడ్‌పీ, ఎంపీపీ ప్రాదేశిక స్థానాలకు పోలింగ్‌ ‌నిర్వహించగా కోర్టు వ్యాజ్యాల కారణంగా ఓట్ల లెక్కింపు జరపలేదు. ఇటీవల వచ్చిన ఫలితాల్లో వైకాపా 85 శాతం స్ధానాలు కైవసం చేసుకుంది. అయితే ఈ ఫలితాలు చూసి బలుపనుకుంటే పొరపాటే. అప్పటి బలుపు ఇప్పుడు తగ్గిపోయింది. నవరత్నాల పథకాలతో జనాలు ఓటువేసినా, ఈ అయిదు నెలల్లో కనిపించిన ప్రజావ్యతిరేకతతో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో జరిగినన్ని ఏకగ్రీవాలను ఎన్నడూ చూడలేదు. జడ్‌పీటీసీ 126, ఎంపీటీసీ 2,371 ఏకగ్రీవం కావడం పెద్ద చర్చకు దారితీసింది. అన్నేసి స్థానాల్లో వేరెవ్వరూ నామినేషన్‌ ‌వేసేందుకు ముందుకు రాలేదంటే ఒత్తిళ్లు, ప్రలోభాలు, దాడులు, భయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులచే విపక్షాల అభ్యర్థులను నామినేషన్‌లు వేయనీయకుండా అడ్డుకుందని ఆరోపణలు వచ్చాయి. కొన్ని చోట్ల వైకాపా చేసిన దాష్టీకాలు, దౌర్జన్యాలపై అన్ని పార్టీలు అసహ్యించుకున్నాయి. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాల బదలాయిం పులో చిత్తశుద్ధి చూపించడం లేదనేది పంచాయతీ లపై చూపిస్తున్న తీరుకు అద్దం పడుతోంది. స్థానిక సంస్థలు ప్రభుత్వ, రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకోవడం అనేది ఇక మనకు కని పించదని తేలిపోయింది. రిజర్వేషన్ల ద్వారా పదవుల్లో కొచ్చిన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ మహిళలకు తమ పని తాము చేసుకునే వాతావరణం లేదు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram