అగ్రరాజ్యం అమెరికా రెండు దశాబ్దాలు సాగించిన ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం చివరకు ఇలా ముగిసింది. ఇరవై ఏళ్ల క్రితం, 2001లో ఏ రోజున అయితే అమెరికా అత్యంత భయంకర ఉగ్రదాడికి గురైందో, 20 ఏళ్ల తర్వాత అదే సెప్టెంబర్‌ 9‌న అఫ్ఘానిస్తాన్‌ను అదే ఉగ్రవాదుల చేతుల్లో పెట్టి వెనుతిరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ‌ప్రకటించిన సైనిక ఉప సంహరణ ప్రణాళికకు కట్టుబడి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ ‌గత ఏప్రిల్‌లో జంట గుమ్మటాలు (ట్విన్‌ ‌టవర్స్) ‌కుప్పకూలి 20 ఏళ్లు పూర్తయ్యే సెప్టెంబర్‌ 9 ‌నాటికి అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. అమెరికా చేసిన ఈ ప్రకటన ప్రపంచానికి రుచించలేదు. అసహ్యించుకుంది.

2001 సెప్టెంబర్‌ 9 ఉ‌గ్రదాడి అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్‌ ఉ‌గ్రవాదంపై ప్రపంచ యుద్ధాన్ని ప్రకటించారు. అఫ్ఘానిస్తాన్‌పై దాడి చేశారు. అలా బుష్‌ ‌ప్రకటించిన ఉగ్రవాద వ్యతిరేక ప్రపంచ యుద్ధం రెండు దశాబ్దాల తర్వాత ఎక్కడ మొదలైందో అక్కడికే చేరింది. అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడి జరిగిననాడే అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ ‌ప్రభుత్వం తిరిగి ఆ దేశ అధికార పగ్గాలను చేపట్టింది. ఆ విధంగా కలీఫట్‌ ‌పునరాగమనానికి మార్గం సుగమం చేసిన అమెరికా తాలిబన్‌తో సాగించిన అనైతిక బేరసారాలు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద మూకలలో మరింత ధైర్యాన్ని నింపాయి. అంతేకాదు, అఫ్ఘానిస్తాన్‌ ‌స్వదేశీ సంస్కృతీ, నాగరికతల వినాశనానికి అమెరికా బాటలు వేసింది.

అఫ్ఘానిస్తాన్‌లో ఇస్లాం మతోన్మాదుల అరాచక పాలనలో సాగే హింసోన్మాదానికి భయపడి అక్కడి హిందువులు, సిక్కులలో మెజారిటీ ప్రజలు మనదేశానికి వలస వచ్చారు. ఇలా తమ పూర్వికుల ఇళ్లూ వాకిళ్లూ వదిలి వలస రావడం వారి సామూహిక మస్తిష్కం మీద చెరగని ముద్రగా, మాయని గాయంగా మిగిలింది.

అఫ్ఘాన్‌ ‌సారథ్యంలో, అఫ్ఘాన్‌ ‌నియంత్రణలో, అఫ్ఘాన్‌ ‌యాజమాన్యంలో అంటూ మొదలైన శాంతి పక్రియ చివరకు అమెరికా అడ్డగోలు నిష్క్రమణతో తాలిబన్‌ ‌సారథ్యంలో, తాలిబన్‌ ‌నియంతృత్వ ప్రభుత్వ ఏర్పాటుకు దారి తీసింది. అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన 9/11 ఉగ్రదాడికి పాల్పడిన అల్‌ ‌కాయిదాకు ఆశ్రయం ఇచ్చిన తాలిబన్‌కు తలొగ్గి పలాయనం చిత్తగించడంతో అమెరికా గొప్పగా చెప్పుకున్న ‘నిరంతర యుద్ధం’లో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

అమెరికా సాగించిన ఉగ్రవాద వ్యతిరేక ప్రపంచ పోరాటం చాంతాడంత రాగం తీసే ఇంకేదో పాట పడినట్లు అమెరికా ఆత్మరక్షణకు మినహా మరెందుకు పనికిరాలేదు. ఇంత చేసి చివరకు తమ దేశం మీద మరో ఉగ్రదాడి జరగకుండా రక్షణ పొందడం మినహా ఈ యుద్ధంలో అగ్రరాజ్యం సాధించింది శూన్యం. వాస్తవంలో ఈ యుద్ధంలో అమెరికా ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఓటమిని మించిన అవమానాన్ని, అపఖ్యాతిని మూటకట్టుకుంది. అందుకు ఒకటి, రెండు కాదు. కర్ణుడి చావుకు ఉన్నని కారణాలున్నాయి. ప్రాధాన్యాంశాల విషయంలో వేసిన తప్పటడుగులు, అపరిపక్వ, అన్యామైన తీర్పులు, అనవసర ఔదార్యం, తప్పిదాలు.. అన్ని కలసి అమెరికాను మరింత సంక్షోభంలోకి నెట్టివేశాయి.

ఏకధ్రువ ప్రపంచంలో, అగ్రరాజ్యంగా వెలిగిపోతున్న రోజుల్లో అమెరికా అఫ్ఘానిస్తాన్‌పై దాడిచేసింది. ఆ తర్వాత ఇరాక్‌ ‌వైపు దృష్టి మరల్చింది. చివరకు రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలింది. అమెరికా 9/11 ఉగ్రదాడిని నాగరికత, అనాగరిక శక్తుల యుద్ధంగా వర్ణించి నాటో సభ్యదేశాలు స్థానిక ఉత్తర కూటమి, ఇతర శక్తులతో కలిసి 2001 అక్టోబర్‌ 7‌న ‘ఆపరేషన్‌ ఎం‌డ్యురింగ్‌ ‌ఫ్రీడం’ పేరిట పప్రథమ సైనికదాడిని ప్రారంభిం చింది. కేవలం 3000 మంది సైనికులతో 100 రోజుల్లోనే అమెరికా అల్‌ ‌కాయిదా నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను చెదరకొట్టింది. ఉగ్రవాదులకు అంతర్జాతీయ ఆర్థిక సహకారం అంద కుండా వనరులను కట్టడి చేసింది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. తాలిబన్‌ను గద్దె దింపింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. మిత్రదేశాల సేనలు, తాలిబన్‌ ‌మధ్య సాగిన భీకర పోరులో ఎంతోమంది ఉగ్రవాదులు చనిపోయారు. అయితే, అదే సమయంలో ఉగ్రవాదులు స్వర్గధామంగా మలచుకున్న పాకిస్తాన్‌ను అమెరికా ఉపేక్షించింది. తండోపతండాలుగా ఉగ్రవాదులు పాక్‌లో తిష్టవేసినా పట్టించుకోలేదు. ప్రధాన సూత్రధారి ఒసామా బిన్‌లాడెన్‌ ‌కూడా పాక్‌లోనే తలదాచుకున్నాడు. అయినా, పాక్‌ ‌చెప్పిన అసత్య మాటలను నమ్మి మోసపోయింది. ప్రపంచాన్ని మోసం చేసింది.

తాలిబన్‌ ‌ప్రభుత్వం కూలిన అనంతరం అమెరికా అఫ్ఘాన్‌లోని అన్ని వర్గాలను కలుపుకుంటూ 2001 డిసెంబర్‌ 5‌న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు 2002 మార్చిలో అల్‌ ‌కాయిదాకు వ్యతిరేకంగా సంకీర్ణసేనలు ‘ఆపరేషన్‌ అనకొండ’ పేరిట దాడులను ముమ్మరం చేశాయి. అమెరికా 2009 వరకు అఫ్ఘానిస్తాన్‌ ‌పునర్‌ ‌నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందించింది. అయితే, అగ్రరాజ్యం దృష్టి ఇరాక్‌వైపు మళ్లడంతో ఆపరేషన్‌ అనకొండ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. 2002లో హమీద్‌ ‌కర్జాయ్‌ ‌సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత మేజర్‌ ‌డొనాల్డ్ ‌రమ్స్‌ఫెల్డ్ 2003 ‌మే 1 నాటికి ప్రధాన యుద్ధానికి ముగింపు ప్రకటించారు.

ఉగ్రవాద వ్యవస్థను ధ్వంసంచేసిన వెంటనే అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి అమెరికా వైదొలిగి ఉంటే అదో విధంగా ఉండేది. అయితే బలహీన ప్రభుత్వాలు, ప్రభుత్వం అజమాయిషీ లేని దేశాలు ఉగ్రవాద వ్యాప్తికి ఊపిరి పోస్తాయనే సాకు చూపి అమెరికా ఆ దేశ పునర్‌ ‌నిర్మాణానికి చర్యలు చేపట్టింది. తదనంతరం నాటో అఫ్ఘానిస్తాన్‌లో అంతర జాతీయ భద్రతా దళాలు (ఐఎస్‌ఏఎఫ్‌) ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే, నాటోయేతర మిత్రదేశం పాకిస్తాన్‌, ఇటు తాలిబన్‌, అటు హక్కానీ ఉగ్రవాదులకు అమెరికా ఆశ్రయం కల్పించడంతో పాటుగా ఆర్థిక సహాయాన్ని అందించడం కొనసాగించింది. ఆ విధంగా పాక్‌ ‌గడ్డమీద మళ్లీ చేతులు కలిపి ఒకటైన ఉగ్రమూకలు అఫ్ఘానిస్తాన్‌ ‌ప్రభుత్వానికి, సంకీర్ణ దళాలకు మధ్య చిచ్చుపెట్టే విధంగా 2008లో పౌరులపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డాయి.

ఇందుకు ప్రతిగా అధ్యక్షుడు ఒబామా 2009లో అఫ్ఘాన్‌కు మరిన్ని దళాలను పంపారు. ప్రాంతీయ పునర్నిర్మాణ బృందాలను ఏర్పాటుచేసి దేశనిర్మాణ చర్యలను వేగవంతం చేశారు. అలాగే, అఫ్ఘానిస్తాన్‌లో విజయాన్ని సుస్థిర పాకిస్తాన్‌తో ముడివేసి కొత్త విధానాన్ని ప్రకటించారు. మరిన్ని నిధులను పంపారు. పాక్‌ ఆడుతున్న ద్వంద్వ నీతిని ప్రపంచం అంతా గుర్తించింది కానీ, అమెరికా మాత్రం కళ్లు తెరవలేదు. ఇస్లామాబాద్‌పై మరింతగా ఆధారపడింది. అమెరికా చేసిన తప్పిదం ఏమిటో 2011లో పాకిస్తాన్‌ ‌సైనిక స్థావరానికి కూతవేటు దూరంలో అబ్బోటాబాద్‌లో ఒసామా బిన్‌ ‌లాడెన్‌ ‌హతం కావడంతో బయటపడింది. 2011 నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకుంటుందని అంటూనే.. అఫ్ఘాన్‌ ‌మిషన్‌ ‌పదవ వార్షికోత్సవం నాటికి సేనల సంఖ్య శిఖరాగ్రానికి చేరింది. సేనల ఉపసంహరణ విషయంలో అమెరికా ఎప్పటికప్పుడు వెనకడుగు వస్తూనే వచ్చింది. ఇదే అదనుగా ఉగ్రవాద మూకలు శక్తిని కూడదీసుకుని దాడులకు తెగబడ్డాయి.

2013లో అమెరికా ప్రత్యక్ష సైనిక పోరాట చర్యలకు స్వస్తి పలికింది. భద్రతా చర్యల బాధ్యతలను అఫ్ఘానిస్తాన్‌ ‌సేనలకు అప్పగించింది. ఆ సమయానికి పాకిస్తాన్‌ ‌పారిపోయిన ఉగ్రసంస్థలు గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్నాయి. ఒక అంచనా ప్రకారం ఆ విధంగా దొంగచాటుగా చొరబడిన ఉగ్రవాదులు మెల్లమెల్లగా 50శాతం వరకు అఫ్ఘాన్‌ ‌భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అలా అమెరికా పాకిస్తాన్‌ ‌నియంత్రణలో ఉన్న ఉగ్రవాదుల చేతిలో మెల్లమెల్లగా ఓడిపోయింది.

అఫ్ఘాన్‌ ‌యుద్ధనౌక మునిగిపోతున్న వైనాన్ని, అలాగే ఎంతకీ అంతం కాని యుద్ధంతో విసిగిపోయి, మరోవంక అమెరికా పౌరుల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి సంకీర్ణ సేన వ్యూహలు, ఎత్తుగడలు, అసమర్ధతను గుర్తించి అధ్యక్షుడు ట్రంప్‌ ‌సేనల ఉపసంహరణను వేగవంతం చేశారు. 9/11 దాడి తర్వాత ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం అందకుండా చేసేందుకు, తద్వారా ఉగ్రచర్యలను కట్టడి చేసేందుకు ఫైనాన్షియల్‌ ‌యాక్షన్‌ ‌టాస్క్ ‌ఫోర్సు (ఎఫ్‌ఏటీఎఫ్‌) ‌వంటి యంత్రాంగాన్ని తయారు చేసినా.. వరసగా వేసిన తప్పటడుగులు, ఉగ్రవాదాన్ని మంచీచెడుగా వర్గీకరించడం వంటి అనాలోచిత చర్యల వలన అమెరికా గొప్పగా ప్రకటించిన ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం అక్కరకు రాకుండా పోయింది. ఉగ్రవాదం విషయంలో అమెరికా అనుసరించిన ద్వంద్వ వైఖరి నిజంగా ఆక్షేపణీయం. అత్యంత ప్రమాదకరమైన జిహాదీ సిద్ధాంతం నుంచి పుట్టిన ఉగ్రవాదం గురించి అమెరికాకు సరైన అవగాహన లేదు. వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకునేందుకు లిబియ, సిరియాలో అక్కడి ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఉగ్రవాదులకు అమెరికా ఆయుధాలు అందించింది. అగ్రరాజ్యం ఇలాంటి తప్పుడు పనులు, లోపభూయిష్ట విధానాల వలన ఇరాక్‌, ‌లిబియ, సిరియా, అఫ్ఘానిస్తాన్‌లో ఉగ్రవాదం పెచ్చరిల్లింది. ఆ దేశాల ప్రజలు దేశం వదిలి పారిపోయారు. ఫలితంగా శరణార్ధుల సంఖ్య రెండవ ప్రపంచ యుద్ధ శరణార్ధుల సంఖ్యను దాటిపోయింది. ఇలాంటి చర్యలతో అమెరికా ఒక ఉగ్రవాద సంస్థ మీదకు మరో ఉగ్రవాద సంస్థను ఉసిగొలిపే, సాయమందించే పక్రియను ముందుకు తీసుకుపోయింది.

ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగా కాకుండా, ఎంపిక చేసిన సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా చూడడం ఆశ్చర్యం గొలుపుతుంది. 2017లో అఫ్ఘాన్‌ ‌విధానాన్ని సవరించే సమయంలో అమెరికా ఆ దేశంలో పట్టు పెంచుకుంటున్న ఐఎస్‌ – ‌కే గ్రూప్‌ ‌రహస్య స్థావరాలపై అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడులు చేసింది. ఓ వంక అదే అఫ్ఘాన్‌లో తాలిబన్‌తో శాంతి చర్చలు జరుపుతూ అదే తరహ ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఐఎస్‌- ‌కే మీద దాడులు చేయడం ఏమిటో, ఈ ద్వంద్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కని వ్యవహారంగానే మిగిలిపోయింది. చివరకు అఫ్ఘాన్‌ ‌ఖాళీచేసి వెళుతున్న సమయంలో కాబూల్‌ ‌విమానాశ్రయంపై ఐఎస్‌ – ‌కే దాడులు చేసిన సమయంలో అమెరికా సేనలు తాలిబన్‌ ‌సహకారం తీసుకునే ఆలోచన కూడా చేశాయి.

అమెరికా ఉగ్రవాద కొలమానాలు వేగంగా మారుతూ వచ్చాయి. 2001లో తాలిబన్‌, అల్‌ ‌కాయిదాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిపై అమెరికా ఒత్తిడి తెచ్చింది. అయితే ఒకటిన్నర దశాబ్దం తర్వాత మాటమార్చింది. అభూత కల్పనలతో శాంతిని వర్ణించి ఆంక్షలు ఎత్తివేయాలని కోరింది.

కాబూల్‌ ‌విమానాశ్రయం మీద ఐఎస్‌ – ‌కే దాడులపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ‌తాలిబన్‌ అకృత్యాలు అన్నింటినీ ఇంచుమించుగా తుడిచేశారు. ఐఎస్‌- ‌కే మీద మాత్రం విమర్శల వర్షం కురిపించారు. తాలిబన్‌ను క్షమించి, అక్కున చేర్చుకునేందుకు అమెరికా సంసిద్ధతను వ్యక్తపరించింది. ఉగ్రవాద సంస్థలను తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఆయుధాలుగా ఉపయోగించుకునే అమెరికా ఎత్తుగడలను ఉగ్రవాద సంస్థలు కూడా గుర్తించాయి. ఇవే ఆయుధాలను ఉపయోగించుకుని అమెరికాకు వ్యతిరేకంగా అవి బేరసారాలు సాగించే ప్రమాదం లేకపోలేదు. కొద్దిరోజుల క్రితం శ్వేత సౌధం ఒక ప్రకటనలో తాలిబన్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. అమెరికా ప్రజలు సురక్షితంగా తమ దేశానికి చేరేందుకు తాలిబన్‌ ‌సహకరించారని పేర్కొంది. 17 మంది ప్రకటిత ఉగ్రవాదులతో ఏర్పడిన తాలిబన్‌ ‌ప్రభుత్వం పట్ల అమెరికా తన దృక్పథం మార్చుకోవడం అత్యంత బాధాకరం, హేయణీయం.

అమెరికాపై 2001 తర్వాత మరో ఉగ్రదాడి జరగలేదన్న ఒకే ఒక్క విషయాన్ని పక్కనపెడితే 2000 మంది తమ సైనికులను ఉగ్రవాదులకు బలిచ్చి, ఉగ్రవాదంపై యుద్ధమంటూ 6.5 ట్రిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్లను ఖర్చుచేసి, ఇప్పుడు ఇలా అఫ్ఘాన్‌ ‌నుంచి పలాయనం చిత్తగించి పారిపోవడం అమెరికా చరిత్రను చీకటి యుగంలోకి నెట్టేసింది. అంతేకాదు, అఫ్ఘాన్‌ ‌నుంచి అమెరికా అనూహ్యంగా, అత్యంత అవమానకరంగా వెళ్లిపోవలసి రావడం ఉగ్రవాద వ్యతిరేక పోరులో ఎలా వ్యవహరించకూడదో చెప్పే పాఠంగా మిగిలిపోతుంది. ఏకంగా 20 ఏళ్లు ఉగ్రవాద వ్యతిరేక పోరులో చేతులు కాల్చుకుని కూడా ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోవడం అమెరికా ప్రతిష్టను పేక మేడలా కూల్చేసింది. నిజానికి జంట గుమ్మటాలు కూలినప్పుడు కంటే ఇప్పుడు శ్వేతసౌధం, అధ్యక్షుడు బైడెన్‌ ‌తాలిబన్‌ను పొగడ్తలతో ముంచెత్తినప్పుడే అమెరికా ప్రతిష్ట మరో వంద రెట్లు దిగజారింది.

–  డా. రామహరిత

అనువాదం: రాజనాల బాలకృష్ణ

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram