– డా।। చింతకింది శ్రీనివాసరావు

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


‘‘ఏం. నా పాప మహాదేవి కాకూడదా! ప్రభువుకి మటుకు పెళ్లాం ఉండదా! ఆ రాజే నా అల్లుడవుతాడు చూస్కో! నేను ఏలినవారి మామ అయితీరుతాను కాస్కో!’’ గట్టి మాటలేవో సంకల్పం చెప్పుకున్నట్టుగా విస్పష్టంగా పలికాడు. ప్రతిస్పందించ లేదు రేక.

‘‘సరేలే. పోయినూరు బాలగానీ పుట్టినింటి బాలగాదు ఆడపిల్ల. నీకిదంతా ఎప్పటికి అర్థ మయ్యేను? వచ్చి కూడు కుడవుమీ. బోరవిరుపుడు తగ్గించుమీ!’’ నాన్నా కూతుళ్లిద్దరికీ వర్తించే వచనంగా అనేసి చోడి అంబలి మూకుళ్లను వాళ్ల ముందుం చింది. గంజిలో నంచుకునేందుకు మండికూర చట్టి తెచ్చి వాళ్ల ముందు ఆనించింది. భార్య పలుకులకు గచ్చురుమన్నట్టయ్యాడు కోలడు.

‘ఎప్పటికయినా గంగు అత్తారింటికి పోవలసిందే కదూ!’ ఈ భావన రాగానే అతని మనసు ఆ క్షణాన మథనపడింది. తండ్రి బాధను తేలగొట్టడాని కన్నట్టుగా,

‘‘ఊరి చుట్టూ మండికూర దొరుకుతుందని రోజూ అమ్మ అదే వండుతుందేం?’’ అంబలి మింగుతూ కిచకిచమంది గంగు.

‘‘ష్‌.. ‌గట్టిగా మాట్లాడకు. ఆ మహాతల్లి వింటే మళ్లీ నిన్నే మండిచెట్లకు తోలి ఆకులు వొలిపిస్తుంది. అప్పుడు నీ పని ఆలపాటలు పాడటం.. అడవి రొడ్డలు ఏరడం.. అన్నట్టుగా అయిపోతుంది.’’ భార్యకు వినిపించేలా కావాలనే కులుకుతూ కొరివిలా అన్నాడు. వినిపించుకున్న రేక భర్త భావించినట్టుగానే,

‘‘అవును మరి! మనం గ్రామ తలారులం కాదు. జమీందారులం కదా! రోజూ గురగేదె మాంసమే తింటాం! సిగ్గులేకపోతే సరి. నోరు మూసుకుని భోంచేయండి!’’ ఘొల్లుమంది.

‘‘నోరుమూసుకుంటే ఎలా భోంచేయగలం?’’ అమ్మమాటకు అంటింపుగా గంగ గొంతు పెట్టడంతో కోలడు మహదానంద భరితుడయ్యాడు. అంతలోనే రేక అందుకుంది. అప్పటివరకూ లబలబమన్న తీరున కాకుండా,

‘‘నవ్వుతాలు సరేగానీ, ఇటింవేళ సిమ్మాలగద్దె దగ్గర ఏం పాటలు పాడారే!’’ కూతురిపై అనురాగం అల్లుకుపోగా స్థిమితంగా అడిగింది. తల్లి ఎప్పుడయితే పదాల గురించి ఎత్తిందో మైమరచినట్టుగా అయింది గంగు. కోలడూ నిమ్మళంగా కూర్చుని మాట్లాడం మొదలెట్టాడు.

‘‘ఏం పాటలా! నందిపదం, ఇటింపాట, పంచపాండవుల పాట. ఒకటేంటి అన్నీ పాడేశారు ఆడంగులు. ఎవరు ఏం పాడిన మన గంగు గళం ముందు దిగదుడుపే అయ్యారనుకో.’’ అన్నాడు గర్వంగా.

‘‘అది సరేనయ్యా. నా బిడ్డ బ్రహ్మాండంగా పాడుతుంది. అందరికీ తెలిసిందే. అదలా ఉంచు. దేశిరాజుల పాటలు పాడలేదా ఎవ్వరూను. ఇటింపండగతో కలిపే కదా వాళ్లపండగా చేస్తాం.’’ ప్రశ్నించింది రేకమ్మ. గంగు ఎందుకనే ఈ వ్యవహారం తనకు అర్థంకానట్టుగా మొహం పెట్టింది. కోలన్న మాత్రం,

‘‘దేశిరాజుల పాటలెలా పాడతారే? ఈ వేళ సాయంత్రం లెంకలు కథాగానం చేస్తారు కదా! అదో పెద్ద ఉత్సవం కదా! అలాంటప్పుడు ఉదయం పూట ప్రభువుల పదాలు పాడకూడదన్న కట్టు లేదేంటి?’’ చీకాగ్గా అన్నాడు. అప్పటికిగానీ రేకకు విషయం బోధపడలేదు.

‘‘అవును కదూ! ఈ రోజు దేశిరాజుల కథ చెబుతారు పాటపూజారులు. మనం వినాలి. ఆలకిస్తే పుణ్యం పురుషార్థం కూడాను.’’ శాంతంగా అంది. వెనువెంటనే గంగు కలుగజేసుకుని,

‘‘అమ్మా! చాలా పదాలు నాకొచ్చును గానీ దేశిరాజుల పాటలు రావే. ఆ గతి, ఆ శ్రుతి వేరుట కదా. నేర్చుకోవాలని ఉంది సుమా. నేనూ ఈ రోజు కథాగానానికి వస్తానే.’’ బతిమాలుతున్నట్టుగా తల్లిని అనుమతి అడిగింది.

‘‘కథాగానం అయ్యేసరికి తెల్లారిపోతుంది. చిన్నపిల్లవి. రాత్రంతా నిద్ర కాయగలనంటే రా. నువ్వొస్తే నాకేం బరువు. రావాలనుంటే మటుకు సందెవాలే సేవడివేళకే ఏదో ఒకటి తిని బయలుదే రాలి. ఇంటికి వచ్చేసరికి గాంధారీవేళ దాటిపోతుంది మరి.’’ రేక సులువుగానే అంగీకారం తెలిపింది. మోదం పొందింది గంగు.

మాటల్లో మాటగా,

‘‘కాకపోతే, మనం కోలగాళ్లం. కింది కులాల వాళ్లం. కాబట్టి, గానానికి కాస్త దూరంగా పులి బరుకుడు మాను పక్కనున్న రాళ్లమీద చతికిలబడాలి. లెంకల్ని వినాలి.’’ దేశిరాజుల గాధలు ఆకర్ణించేందుకు నిబంధలేవో ఉన్నట్టుగా చెప్పేశాడు కోల.

‘‘నా పక్కన నువ్వుంటావు కదా నాన్నా. రాయిమీదేంటి. ఎక్కడయినా కూర్చుని కథ వినగలను. ఆ పాటలు నేనూ నేర్వాలి కదా.’’ ధీమాగా చెప్పిన బిడ్డ నుదుటిమీద ప్రేమగా ముద్దుపెట్టారు తల్లిదండ్రులు.

—  —  — 

సేవడివేళ దాటింది. సూర్యుడు అస్తాద్రికి చేరిపోయాడు. చీకట్లు చిన్నగా ముసరుకోవడంతో మండివలసలో మెల్లమెల్లగా దీపాలు వెలుగు తున్నాయి. ఇటింమాసం కావడంవల్ల మన్యానికి పచ్చదనం పూర్తిగా దూరం కాలేదు. కోరుకున్న వారికి కోడిగుడ్డంత మావిళ్లు దొరుకుతున్నాయి. చెరుక్కున్నవారికి తొలిపంటల చివరి దినుసులుగా చేటడేసి కొర్రలు అందుతూనే ఉన్నాయి. చలి కొద్దికొద్దిగా విడిపోయి రానున్న బైశాగి ఎండపొడల ముందు అప్పుడే ఓటమి ఒప్పేసుకుంటోంది.

ఊరిమయాన బూసిచెట్లు ఆకుకో రంగుగా పూసి వెన్నెల వేళ కొత్త కాంతులీనుతున్నాయి. పల్లె వెలుపలి చిట్టీతలు, బిల్లుడు, ఏపె, అందుగ, దేవదారు, జాన, చిటిముటి, పరిమి, తునికి, వెలగ, చింత, జీలుగు, కలేక్కాయి, ఇండిగ, మామిడి సహా ఎన్నో రకాల చెట్ల మీదుగా వచ్చిపడుతున్న పవనమాలికలు పసరువాసనల్ని పోలుస్తున్నాయి. ఉసిరి, వేప, ముషిణి, రేల, తడ, వెదురు, వెంపలి, చెంగలి, చిట్టిజాన, కరివేప పత్రాలహరితం కొండగాలుల్ని సుగంధ భరితం చేస్తున్నాయి.

పల్లెవాసులంతా అప్పటికే ముద్దలు మింగి ఉన్నారు. ఇళ్లను ప్రకాశవంతం చేసేందుకు ఆముదపు గూటిదీపాలను ఎగసనదోశారు. దీంతో, ఇంటిలోపల పీనె అరుగుల మీద పితృదేవతలకు గుర్తుగా పెట్టిన ముంతలు, వాటి పక్కనే నిలబెట్టిన గూనకుదుర్లు, అంబలి పులియబెట్టే పిండి కుదుర్లు, వార్పు కుదుర్లు, వాటి దరిన కనిపించే పొయ్యికొయ్యలు తళతళ లాడుతున్నాయి. ఆవాసాల బయటా దివిటీలు వెలిగిఉన్నాయి. ఆవుపేడ కచికలో ఎర్రమన్ను కలిపి సాపుగా నిలబెట్టిన ఇంటిగోడలు మహాకుడ్యాలై మెరుస్తున్నాయి. గోడలకు పెట్టిన తెల్లపిండి చుక్కలు ఆకాశంలో నక్షత్రాల్లా మిలమిలమంటున్నాయి. గట్టి ద్వారాలకు అంతకు మించిన గట్టి చెక్కలతో తలుపులు చేర్చారు. బలమైన లోతాళాలు కుదిర్చారు. ఆ చీకటివేళ ఆ ఇళ్లన్నీ కలవారు దాగబెట్టిన భోషాణాల్లా కానవస్తున్నాయి.

దివ్వెల ప్రకాశనంతో కొంపల పక్కల కోళ్ల దొర్రెలు, చిక్కుడుపాదులు, గొర్రెలశాలలు స్ఫుటంగా అగుపిస్తున్నాయి. అడుసులు, ఆముదాలు, ఇంకా రకరకాల నూనెగింజలు వత్తుకునే బల్లలు దర్శన మిస్తున్నాయి. సమీపంలోని చింతచెట్ల పంగల్లో వంటలమ్మలు దాచుకున్న ఎండుపుల్లలూ స్పష్టంగానే కనబడుతున్నాయి. మంచుబిందువులు నిశ్శబ్దంగా జారిపోయేందుకు వీలుగా ఇళ్లకొప్పులను కోపిరి గడ్డి తిరగవేసి నేశారు. వాటిని చక్కగా ఏకాండీ కోత కోశారు. అందుకే పావంచాలన్నీ తీరుగా వెల్లివిరుస్తున్నాయి.

పండగ వాతావరణానికి అందగించే ఉడుపులే పల్లెవాసులంతా ధరించారు. అందరిదీ ఒకటే దారి, అందరిదీ ఒకటే ధ్యాస అన్నట్టున్నారు. చీకట్లవేళ పరిహాసాలాడుకుంటూ పాదాలకు పనిచెప్పారు. నడక దారినపడి మండివలస పొలిమేరల్లోని జాకరమ్మమెట్టవైపు కదులుతున్నారు. ఆడామగా తేడా లేకుండా అంటుకుని అంటుకుని నడిచిపోతున్నారు. చంకదిగని పాపలతో బాలింతలు, కడుపునపడ్డ శిశువులతో చూలింతలూ అందరూ కలిసే వెళుతున్నారు.

పర్వదినాల పేరు చెప్పి ఊరుఊరంతా పీకలదాకా మెక్కి ఉన్నారు. కొత్త అన్నం గువ్వకూర తిన్నవారొకరు. కొర్రజావ కోడితునకలు మింగినవారు వేరొకరు. అరికెబువ్వ చింతపులుసు కుత్తుకలవరకూ తొక్కినవారొకరు. రాగిరొట్టె కుందేటి కూర కుమ్మినవారొకరు. తినడానికి ముందు మడ్డికల్లు, జీలుగకల్లు తాగి త్రేన్చినవారే దాదాపుగా అందరూను. అంతటి మత్తులోనూ, అంతటి భుక్తాయాసంలోనూ వాళ్ల కాళ్లు తడబడ్డం లేదు. కళ్లు బైర్లు కమ్మడమూ లేదు. అందరినోటా ఒకటే మాట. అందరినోటా జాకరమ్మకు జేజేల ధ్వని. అందరిదీ ఒకటే భక్తి. అందరిదీ ఒకటే భయం. అందరిదీ ఒకటే కోరిక. అందరికీ దేశిరాజుల కథాగానం వినానేదే లక్ష్యం. అందరికీ ఆ గానాన తడవాలన్నదే ధ్యేయం. అందరికీ అలా తడిసి తడిసి పుణ్యం పొందాలనేదే ఈప్సితం. కాబట్టే ఊరు ఖాళీ అయిపోయి మెట్టవైపు బయల్వెడలిన దృశ్యం ఇప్పుడక్కడ ఆవిష్కృతమైంది.

పరాచికాలాడుతూ కొందరు, గుసగుసలుపోతూ మరికొందరు, హసిస్తూ ఇంకొందరూ ఇలా ఎవరెవరో చిత్తమైన ఏవేవో చిత్తవృత్తుల్లో వర్తనసాగిస్తూ పోతున్నారు. పల్లెనడుమ సిమ్మాలగద్దె, థింసా ఆటబయలు, గ్రామం అంచుల్లోని పశువులు కూడే మందలబయలు, కల్లుతాగే చేవడిబస దాటుకుంటూ వెళ్లారు. నందిపుట్ట దాటిపోయి, మగనాలిమెట్టలు మీరిపోయి, జాకరమ్మ ఎగువకే వెళ్ళిపోతున్నారు.

అందరికంటే వెనుకగా నడుస్తున్నారు కోలన్న, రేకమ్మ, గంగు. వారితో పాటు మిగిలిన గ్రామ సేవకులైన కోలగాళ్లూ సంతానంతో కదులుతున్నారు. వ్లీవ్వరూ మాట్లాడటం లేదు. మిగిలిన ఊరి జనంతో పోలిస్తే నోళ్లు కట్టుకుని నడుస్తున్నది వీళ్లేనని చెప్పవలసి ఉంటుంది. మాట్లాడలేక కాదు. మాట్లాడటం చేతకాక కాదు. పదిమందిలోనూ మాట్లాడకూడదన్న నిబంధన వారిని కట్టిపడేస్తోంది.

గ్రామ తలవరులు తలవరుల్లాగానే ఉండాలి. నోరు పెట్టకూడదు. బుర్రఎత్తకూడదు. పండగలప్పుడు, పర్వదినాలవేళా కొంతనయం. ఆటపాట సమయంలో మరికొంత మెరుగు. మిగిలినవేళల్లో కట్టుదాటకూడదు. దిగువజాతి వారమన్న తలంపుతోనే బతకాలి. బహుశా ఈ విషయాలన్నీ అస్థి పట్టిపోయినందువల్లనే కోలన్న కుటుంబమూ మిగిలిన బంధుమిత్రులూ ఆ సమయాన తోటి గ్రామస్తులకు చాలా ఎడంగానే కాళ్లు కదుపుతున్నారు. పల్లెలో ఎత్తున ఎగసి ఉన్న బగతలు, కొటియాలు, మూకదొరలు, మన్నెదొరలు, రెడ్డిదొరలు, కొండదొరల ఇళ్లను, ఆ కిందుగా నిర్మితమైన గదబ, ఓజు, ఘాసి, పైడి, డుంబ కొంపలను కళ్లతోనయినా చూడకుండా భూమిని పట్టిన నేత్రాలతో నేలబారుగానే నడుస్తున్నారు.

ఇదంతా తల్లితండ్రులకు లాగానే గంగుకీ ఏ మాత్రం కొత్తకాదు. అయినా ఏదో బాధ ఆమెను ఈ విషయంలో ఎప్పుడూ పీడిస్తూనే ఉంటుంది.

‘మనుషులందరూ జాకరమ్మ బిడ్డలమే అయినప్పుడు మన్యంలో ఈ జాతి భేదాలేంటి?’ అనే మీమాంస ఆమెను చిన్నవయస్సునుంచే పట్టి పీడించకనూ పోవడంలేదు. అర్థమైనట్టు కొంత, అర్థంకానట్టు కొంత మాదిరిగా జీవితాన్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది.

ఆ రోజు ఆ పిల్లకి మరో కొత్త అనుభవం ఏంటంటే కట్టుకున్న చీర. నిజానికి అది పూర్తి చీర కాదు. •ండవస్త్ర. మొన్ననే చిన్నబంద సంతలో అమ్మ కొనిపెట్టిన బట్ట. అడవిబిడ్డలు నేతవస్త్రం కట్టుకోవచ్చును. దానికేం అడ్డులేదు. కానీ, దాన్ని శరీరానికి తగినట్టుగా సూదీదారంతో ఎక్కడా ఒక్క కుట్టూ కుట్టుకోకూడదు. కుట్టుడుగుడ్డలకు మన్యంలో మైల. ఒకదానికొకటి జోడాచేసిన వస్త్రాలకు అంటు. అందుకే సంతల్లో కొన్న బట్టని ఒంటికి చుట్టుకుని, ముడిపెట్టుకుని, నిలుపుకోవడమే గిరిస్త్రీల కర్తవ్యం. ఈ పని గంగకు కొత్త.

రేవు తొక్కిననాటినుంచీ దానికి చీరముక్కలే కొనడం మొదలుపెట్టింది రేక. కొండవాగు పక్కన చాపపరిచి, లెంకభార్య స్వయంగా పూజలు చేసి, తొలిముట్టు మైల వదలగొట్టినప్పటి దరిమిలా గంగుకు కోకలే సంప్రాప్తమయ్యాయి. అయితే చీర కట్టుబడి పూర్తిగా చేతకాకపోవడం, భారీ శరీరం దక్కుతున్నవేళ ఒంటిపై ఎదిగిన ఒంపుల్ని దాచుకోలేకపోవడం వల్ల నానా అవస్థలూ పడుతోంది. కాబట్టే తల్లిదండ్రులంత తొందరగా గోర్జీదారుల్లో ఇప్పుడు నడవలేకపోతోంది. కొండదారుల గండ్లు దాటలేకపోతోంది. కాలువలు ఐక్యమయ్యే సంగువలు అధిగమించలేకుండా ఉంది.

‘‘త్వరగా నడువమ్మాయీ.’’ తల్లి గదమా యింపుతో బలాన్ని కూడదీసుకుని ఆయాసపడుతూ దారితీస్తోంది గంగు.

మొత్తానికి ఎలాగయితేనేం ఊరిజనమంతా మెట్టకు చేరారు. ముందుగా జాకరమ్మ రాళ్లగద్దెకు నమస్సులు చెల్లించారు. వెంటతెచ్చిన పసుపు కుంకాలను పూజార్లు మంత్రాలు వల్లిస్తుండగా అర్పణ చేశారు. కొండ అరటిపండ్లు, రామబాణప్పండ్లూ సమర్పించారు. గొబ్బిపూలు విరజిమ్మారు. ప్రసాదంగా రాళ్లగద్దె వద్ద కుప్పగా పడిన కుంకుమ తీసి నుదుట దిద్దుకున్నారు. గిరిగురువుల సూచనతో సమతలంగా, విశాలంగా ఉన్న మైదానం వంటి మెట్టవెన్నెముకవేనం మీద చల్లగా కూలబడ్డారు. దేశిరాజులకు జోరలు పలికారు. రాజమాత మాకలిశక్తికి జైకొట్టారు.

ఏడెనిమిదివందలమంది భక్తిశ్రద్ధలతో మెట్ట చేరేసరికి దేశిరాజుల కథాగానం చేసే లెంకల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. అమరులైన ఆ రాజులపట్ల ఇప్పటికీ జనం చూపుతున్న ప్రియత్వం తన్మయులను చేసింది. ప్రజల గద్దియభక్తి, ప్రభు అభిమానం ముగ్ధులను చేసింది. లెంకలు, గురువులు, పూజారులు, వెజ్జులు కలిసి మైదానపు మొగన జనం ముంగిట ఏర్పాటయిన గద్దె వేదిక ఎక్కారు.

ఆ గద్దె వేదిక కథాగానానికి వీలుగా సదుపాయాలు కల్పించుకుని ఉంది. గద్దె నలుదిక్కుల రాటలకూ నిలిచి వెలిగే దివిటీలను ఇబ్బడిముబ్బడిగా కట్టి ఉంచారు. పనసలు కోసి పైకితేలిన బంకను వేగిస కంపలకు మోపుగా పూసి నిప్పంటించిన ఈ దివిటీలు వెలుగులను విరజిమ్ముతున్నాయి. ఆ ప్రదేశమంతటినీ అగ్గిపూలతో విరబూయిస్తున్నాయి. వెడల్పాటి గద్దెమీద పదిమంది నృత్యం చేస్తూ తిరిగేటంత చోటుంది. నలుగురు గురువులు తూతుగొమ్ము, ఔజం, తుడుం, నాగస్వరం పట్టుకుని కథాగానానికి వాద్యసహకారం అందించే పనికి దిగారు. మరో పుంజీడుమంది పూజారులు గద్దె వెనుకవైపు కూర్చుని వంత పాడేందుకు సిద్ధపడ్డారు. ముగ్గురు లెంకలు కథాగానం చేసేందుకు ఉద్యుక్తులయ్యారు.

ఈ పుణ్యకార్యం ఎప్పుడు మొదలవుతుందోనని జనమంతా గద్దెదిక్కుకే కళ్లు విప్పార్చి, వీనులను ఆ వైపుగా పారించి ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. వీరందరికీ సుదూరంగా పులిబరుకుడుమాను దగ్గరసా తేలిన కొండరాళ్లమీదికి మెల్లగా శరీరాలను చేర్చింది కోలన్న కుటుంబం. పైజాతుల వారికి ఎప్పుడూ గౌరవం ఇవ్వాలన్న భావనతో, కిందిజాతికి చెందిన వారమన్నమాట ఎన్నడూ మరచిపోకూడదన్న యోచనతో, రాళ్లమీద వారసరిగా కూర్చుంది. నడిచిన అలుపు తీర్చుకుని ఒద్దికగా పరిసరాలను పరిశీలనగా చూస్తోంది.

గంగు ఉద్వేగమయితే చెప్పరానంత. దేశిరాజుల గురించి తెలుసుకోవాలన్న దాని కోరిక ఇప్పుడిలా ఈడేరుతోంది. రాజుల కథ వినాలన్న తాపత్రయం ఇన్నాళ్లకు వాస్తవరూపం దాలుస్తోంది. వెన్నెలవెలుగు ఒకవైపు, ఎక్కువగా చలి పుట్టించని గాలి మరోవైపు, బుగ్గిమంచు కాలం కరిగిపోవడంతో సమకాలపు ఛాయలు ఇంకోవైపు, గంగు సహా మెట్టమీది ప్రజాళిని సేదతీరుస్తున్నాయి.

‘‘అప్పుడెప్పుడో మన కోట్లబయలులో తిరిగే పులులు, కాళ్లలో గుచ్చుకున్న ముళ్లను ఈ రాళ్ల సమీపంలోని చెట్టుమానులను గీకిగీకి పైకి తీసుకునేవట. అందుకే మనం కూర్చున్న రాళ్లకు పులిబరుకుడుమాను రప్పలని పేరుట. మన కోట్ల ప్రాంతం గొప్పదట. జాన్లె కోట్ల.. నజాన్లె కట్రారు బంట.. అని పెద్దలంటారట. దీని అర్థం, ఎరిగిన వారికి కోట్ల.. తెలియనివారికి ముళ్లబాట.. అట.’’ తనకు తెలిసిన చరిత్రను ఎవ్వరూ అడక్కపోయినా పెద్ద మేధావిలా ఏకరవు పెట్టాడు కోలడు. ఇంకా అతగాడు ఏదో చెప్పాలనే అనుకున్నా దబ్బున రేకమ్మ రంగంలోకి దిగిపోయింది. నోటిమీద వేలేసుకుని కూర్చోమన్నట్టుగా వారించింది. ఆమె చేసిన సంజ్ఞకి కిక్కురుమనకుండా రాళ్లమీద కూర్చుండిపోయాడు కోలయ్య. ఇదిచూసిన గంగు ముసిముసిగా నవ్వుకుంది. ఇంతలోనే గద్దెపైకి చేరిన ప్రధాన లెంక గళం సవరించుకున్నాడు. పెద్ద గొంతు పెట్టాడు. అదెంత పెద్ద గొంతుక అంటే కోట్లబయలు ప్రాంతమంతా వినిపించేటంత పెద్దస్వరం.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram