సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ భాద్రపద బహుళ త్రయోదశి – 04 అక్టోబర్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


డెబ్బయ్‌ ఐదేళ్ల స్వతంత్ర భారతదేశం దాదాపు యాభయ్‌ ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య వామపక్ష ఉగ్రవాదం. నక్సలిజం, మావోయిస్టు తిరుగుబాటుగా కూడా ఈ సమస్యకు పేర్లు. ఇంతటి సుదీర్ఘ సమస్య నేపథ్యానికి  పార్శ్వాలు కూడా ఎక్కువే. పేదరికంతో తలెత్తినవీ, సామాజికమైనవీ, వివక్ష నుంచి జనించినవీ, అసమానతలకు సంబంధించినవీ, ఆర్థిక పరమైనవీ, అధికార వికేంద్రీకరణ లోపం నుంచి వచ్చినవీ ఎన్నో. ఇరుగు పొరుగు దేశాల సిద్ధాంత, మత కోణాలను కూడా ఈ సమస్య నుంచి వేరు చేసి చూడలేం. నేపాల్‌ ‌నుంచి బిహార్‌ ‌మీదుగా, దక్షిణ భారతదేశం వరకు ‘రెడ్‌ ‌కారిడార్‌’ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయంటేనే వామపక్ష ఉగ్రవాదం పరిధినీ, అంతర్జాతీయంగా దానికి ఉన్న సంబంధాలనూ అంచనా వేయవచ్చు. ఐదు దశాబ్దాలు గడిచినా ఆ సమస్య పూర్తిగా నశించలేదు. ఈ వాస్తవం ఒప్పుకోవాలి. కాబట్టి నిరంతర సమీక్ష అవసరమే. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 27, 28 ‌తేదీలలో ఢిల్లీలో నిర్వహించిన సమీక్షా సమావేశం అందులో భాగమే.

 పది నక్సల్‌ ‌పీడిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశం ప్రధాన ఉద్దేశం నక్సల్స్ ‌నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద జాతీయ స్థాయి సమీక్ష. కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా అధ్యక్షత వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఇందులో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా హాజరయ్యారు. ఆంధప్రదేశ్‌ ‌నుంచి రాష్ట్ర హోంమంత్రి పాల్గొన్నారు. ఒడిశా, బిహార్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రులు కూడా హాజరు కావడం హర్షణీయం. కానీ నక్సల్‌ ‌సమస్య దేశంలోనే అతి తీవ్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ‌ముఖ్యమంత్రి భూపేశ్‌ ‌భగేల్‌ ఈ ‌సమావేశానికి డుమ్మా కొట్టడం బాధ్యతా రాహిత్యమే. చెబుతున్న కారణం కూడా సబబుగా లేదు. ముందే నిర్ణయించుకున్న చంద్రనాహు కుర్మీ సమాజ్‌ ‌సమావేశాలకు వెళ్లడం కోసం భగేల్‌ ‌ఢిల్లీ సమావేశానికి గైర్హాజరయ్యారని అధికారులే చెప్పారు. అసలు ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్‌ ‌సమస్య తీవ్రత గురించే ఢిల్లీ సమావేశ చర్చనీయాంశాలలో కీలకంగా ఉంది కూడా. విస్తరణ ధ్యేయంతో పనిచేసే మావోయిస్టుల సమస్య మీద సమష్టి పోరాటం అవసరమవుతుంది. ఒకచోట ఆ బెడద వదిలినంత మాత్రాన సమస్య పరిష్కారమైనట్టు కాదు. కాబట్టి సమస్య ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజకీయాలను పక్కన పెట్టాలి.  గడచిన కొన్నేళ్లలో నక్సల్స్ ‌జరిపిన ఘాతుకాలు ఛత్తీస్‌గఢ్‌లోనే ఎక్కువ. బస్తర్‌ ‌ప్రాంతంలో భద్రతాదళాల గస్తీ, సుక్మా, బిజాపూర్‌, ‌దంతేవాడలలో భద్రతాదళాల కార్యకలాపాల గురించి కూడా చర్చనీయాంశాలలో ఉన్నాయి. కాబట్టి ఉన్నతాధికారులే వీటి గురించి మాట్లాడారు.

దేశంలో నక్సల్‌ ‌సమస్య తీవ్రత తగ్గిందనే చెప్పాలి. 2010 నాటికి ఆ పది రాష్ట్రాలలో  96 జిల్లాలు ఆ సమస్యతో సతమతమవుతున్నాయి.  ఆ జిల్లాలు  ఇప్పుడు 41కి తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. నక్సల్‌ ‌హింసలో ఎనభయ్‌ అయిదు శాతం 25 రాష్ట్రాలలోనే జరుగుతోంది. ఇలాంటి తగ్గుదల గడచిన మూడు దశాబ్దాలలో నమోదు కావడం ఇప్పుడే. బిహార్‌, ఒడిశా, జార్ఖండ్‌ ‌రాష్ట్రాలలో అలాంటి జిల్లాల సంఖ్య తగ్గింది. ‘అత్యంత తీవ్ర ప్రభావం కలిగిన జిల్లాలు’గా కేంద్రం గుర్తించిన ఆ 25 జిల్లాలు ఆ మూడు రాష్ట్రాలలోనే ఉన్నాయి. అంటే ఇదే 2021 నాటి సమస్య పరిస్థితి. కేంద్రం దగ్గర ఉన్న జాబితా ప్రకారం ఉత్తరప్రదేశ్‌ ‌ప్రస్తుతం నక్సల్‌ ‌రహిత రాష్ట్రం. అందుకే 2019 ఫిబ్రవరి నాటికి దేశంలో 11గా ఉన్న నక్సల్‌ ‌పీడిత రాష్ట్రాలు ఇప్పుడు పదికి దిగాయి. అదే 2017 డిసెంబర్‌ ‌పరిస్థితి మరీ ఘోరం. తొమ్మిది రాష్ట్రాలలోనే అయినా 105 జిల్లాలు ఆ సమస్యతో బాధపడేవి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో 47 శాతం మావోయిస్టు కార్యకలాపాలు తగ్గాయని కూడా కేంద్రం చెప్పడం సత్యదూరం కాదని అర్ధమవుతుంది. ఈ సమస్యను మరింత తగ్గుముఖం పట్టేటట్టు చేయడం గురించి కూడా ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు చర్చించారు. అందుకే రక్షణ వ్యవహారాల కోసం ఒక సమావేశం, అభివృద్ధి పనులపై చర్చకు మరొక సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యమంత్రులతో ముఖాముఖీగా మాట్లాడి పరిస్థితిని వాస్తవిక దృష్టితో తెలుసుకునే ప్రయత్నం కూడా అమిత్‌షా చేశారు. ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం 2009లో 2258 ఘటనలు జరిగితే, ఈ సంవత్సరంలో ఆగస్ట్ ‌వరకు 349 ఘటనలు చోటు చేసుకున్నాయి. మరణాలు 908 నుంచి 110కి తగ్గాయి. 2009లో దేశంలో నక్సల్‌ ‌పీడిత జిల్లాలు 180. కాబట్టి సమస్య తగ్గుతున్నదన్న వాదన భ్రమ కాదు.

నక్సల్స్‌కు నిధులు అందకుండా జాగ్రత్త పడడం, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవడం వంటి సూచనలు సమావేశంలో వచ్చాయి. ఇవన్నీ ఒకటి, అర్బన్‌ ‌నక్సల్‌ ‌సమస్య మరొకటి. ఇప్పుడు ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఉంటూ తుపాకీ పట్టిన అసలు మావోయిస్టుల కంటే, అర్బన్‌ ‌నక్సల్స్‌తోనే సమస్య ఎక్కువ అవుతోంది. కాబట్టి దీని మీద కూడా కేంద్రం దృష్టి సారించవలసిందే. రాజ్యాంగబద్ధ పద్ధతులతోనే వీళ్లు రాజ్యాంగానికీ, సార్వభౌమాధికారానికి తూట్లు పొడిచే కుట్రదారులు. వీళ్ల చర్యలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ముస్లిం మతోన్మాదానికీ, ఉగ్రవాదానికీ దోహదపడుతోంది. మావోయిస్టు సమస్యను శాంతిభద్రతల సమస్యగానే పరిగణించడం సరికాదన్న వాదనను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. అలా అని ఈ ఉద్యమానికి గిరిజనులలో మద్దతు ఉందని భ్రమపడడం కూడా సరికాదు. క్రైస్తవ మిషనరీలు, మావోయిస్టులు కొండకోనలలో చేసేది అక్కడి అమాయకులను మోసగించడమే. ఏమైనప్పటికీ సమస్య పూర్తి పరిష్కారానికి సంసిద్ధం కావాలి.

About Author

By editor

Twitter
Instagram