సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ భాద్రపద శుద్ధ సప్తమి – 13 సెప్టెంబర్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఇదే సెప్టెంబర్‌ 11, 1893‌న, అమెరికాలో సర్వమత గోష్టిలో సగర్వంగా నిలబడి హిందూవాణిని ఎలుగెత్తి చాటారు స్వామివివేకానంద. విశ్వం గర్వించింది. 128 ఏళ్ల తరువాత ఇప్పుడు అక్కడే బొత్తిగా విజ్ఞత లేని విద్యావేత్తల బృందం దొంగచాటుగా హిందూత్వను ధ్వంసం చేయాలంటూ ఆన్‌లైన్‌లో విషం కక్కాలని అనుకుంటున్నది. సెప్టెంబర్‌ 10 ‌నుంచి 12 వరకు ‘డిజ్‌మ్యాంటలింగ్‌ ‌గ్లోబల్‌ ‌హిందుత్వ’ పేరుతో జరగబోయే విషప్రచారం ఉద్దేశం ముమ్మాటికీ అదే- హిందూధర్మం మీద దాడి. 49 ఉత్తర అమెరికా విశ్వవిద్యాలయాలలోని 70 విద్యాశాఖలు ఈ ఘనకార్యం తలపెట్టాయి. నిర్వాహకులు పేర్లు చెప్పుకోవడం లేదు. అది తమకి కీర్తి కండూతి లేదని చెప్పుకోవడానికి మాత్రం కాదు, భద్రత కోసమట. విద్వేషం రెచ్చగొట్టే, ఇస్లామోఫోబియాను ప్రేరేపించే, హిందూ మాతృభూమి పేరుతో హిందూయిజాన్ని తొక్కేసే ఉద్దేశం కలిగిన హిందుత్వ మీదే పోరాటమట. ఆయేషా కిద్వాయ్‌ (‌జేఎన్‌యు), నందినీ సుందర్‌ (‌ఢిల్లీ వర్సిటీ), ఓ నక్సలైట్‌ ‌గ్రూప్‌ ‌నాయకురాలు కవితా కృష్ణన్‌, ‌నేహా దీక్షిత్‌ (‌జర్నలిస్ట్) ఆనంద్‌ ‌పట్వర్ధన్‌ (‌సినిమా రంగం), మీనా కందస్వామి (కవయిత్రి) ప్రాసంగికులలో ఉన్నారు. ఈ చరాచర జగత్తులో హిందుత్వ ఎక్కడున్నా తుత్తునియలు చేయమని రెచ్చగొట్టడమే ఈ గోష్టి ఉద్దేశం.

గోష్టి తేదీలు చూస్తేనే నిర్వాహకుల కుత్సితం బయటపడుతుంది. సెప్టెంబర్‌ 10 ‌వినాయక చవితి. సెప్టెంబర్‌ 11- ‌ముస్లిం ఉగ్రవాదం మీద అమెరికా అంతర్జాతీయ యుద్ధం ప్రకటించడానికి కారణమైన వరల్డ్ ‌ట్రేడ్‌ ‌సెంటర్‌ ‌మీద జరిగిన జిహాదీ దాడి. అంటే హిందువుల మనోభావాలను మళ్లీ గాయపరచడం. హిందుత్వ మీద దాడి పేరుతో 9/11 సంస్మరణ నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడం. ఈ పనిచేసిన వాళ్లే ఈ క్షణంలో అఫ్ఘానిస్తాన్‌లో ఎంత బీభత్సం సృష్టిస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఇలాంటి గోష్టికి తగుదునమ్మా అంటూ విద్యావేత్తలు ఎగరేసుకుంటూ రావడం సిగ్గులేనితనానికి పరాకాష్ట. అన్నింటికీ మించి మోదీ అమెరికా పర్యటనకు కాస్త ముందు ప్రపంచంలో హిందుత్వ మీద విషం కుమ్మరించే ప్రయత్నమిది. కాబట్టే ప్రపంచ మీడియా కూడా దీనికి వివాదాస్పద గోష్టి అనే అచ్చోసింది.

హిందూధర్మం గురించి ఇవాళ ఇలాంటి గోష్టా? అంటూ అమెరికా సహా, యావత్ప్రపంచం ప్రశ్నించుకోవలసిన సమయం. నల్లజాతీయులకి అమెరికాలో జరుగుతున్న మర్యాద ఎలాంటిదో ప్రపంచానికి తెలియనిదా? అఫ్ఘానిస్తాన్‌లో ముస్లిం మతోన్మాదుల రక్తదాహం కానరాదేం? పాకిస్తాన్‌లో మైనారిటీల పరిస్థితి ఎరుక లేదేమి? ఈ ముష్టి గోష్టి హిందూ వ్యతిరేకమేనని అమెరికా హిందువులు, సెనేటర్‌ ‌నీరజ్‌ అం‌తాని ధ్వజమెత్తారు. వీరితో పాటు భారత హిందూ సంఘాలు నిప్పులు చెరుగుతున్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి. ఆ గోష్టిలో తమ లోగోలు ఉపయోగించరాదని ఇప్పటికే కొన్ని విశ్వవిద్యాలయాలు చెప్పాయని వార్త. అది విజ్ఞతే అనిపించుకున్నా, కొన్ని విఖ్యాత విద్యాసంస్థలు ఇందులో ‘అకడమిక్‌ ‌ఫ్రీడమ్‌’‌ను చూడడం హద్దులు లేని అజ్ఞానమే. ఈ ఆగ్రహజ్వాలతో ఈ గోష్టిని వాయిదా వేసినా, రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇదంతా విద్యావేత్తల పేరుతో, మేధావుల పేరుతో, రచయితల పేరుతో చెలామణి అవుతున్న స్వయం ప్రకటిత సెక్యులరిస్టుల కిరాయి ప్రదర్శన. ఈ మోళీనీ, గారడీనీ చూస్తూ హిందువులు, ప్రపంచంలో ఉన్న విజ్ఞులు మరొకసారి నవ్వుకోవలసిందే.

 బీజేపీ విదేశీ వ్యవహారాల నిపుణుడు విజయ్‌ ‌చౌతాయ్‌వాలా ఈ గోష్టిని విమర్శిస్తూ హిందుస్తాన్‌ ‌టైమ్స్‌కు రాసిన వ్యాసంలో అద్భుతమైన విషయం గుర్తు చేశారు. మొదటి లోక్‌సభ ఎన్నికలలో అప్పుడే ఏర్పడిన భారతీయ జనసంఘ్‌ ‌మూడు స్థానాలు గెలుచుకుంటేనే ప్రథమ ప్రధాని నెహ్రూ ‘కమ్యూనల్‌’ అం‌టూ రంకెలేశారు. దీనికి పార్టీ నేత డాక్టర్‌ ‌శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ మత్తు వదిలించే సమాధానం ఇచ్చారు. ‘జనసంఘ్‌ను అణిచేస్తానని నా మిత్రుడు నెహ్రూ అంటున్నారు. నేనేమంటానంటే, ఈ అణచివేయాలన్న మనస్తత్వాన్ని అణచివేస్తానని!’. నెహ్రూ అంధభక్తుల అణచివేత ధోరణిని ఇప్పుడు శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ అనుయాయులే దిగ్విజయంగా అణచివేస్తున్నారు. వీళ్ల దృష్టిలో నెహ్రూ తప్పిదాలని, దోషాలని దేశం మరచిపోయి, కీర్తించాలి. ఈ భజనకు సిద్ధం కాకపోతే ‘కమ్యూనల్‌’ ‌లేదా ‘ఫాసిస్ట్’. అవినీతిలో కూరుకుపోయిన ఇందిరను విమర్శించినందుకు సోషలిస్ట్, ‌స్వాతంత్య్ర సమరయోధుడు లోక్‌నాయక్‌ ‌జేపీ కూడా ఫాసిస్ట్ అయ్యారని మరచిపోకూడదు. కానీ దేశం మీద అత్యవసర పరిస్థితిని రుద్ది చరిత్రబోనులో దోషిగా నిలిచిన ఇందిర మాత్రం పురోగామి నేత. ఈ దేశంలో గాంధీ-నెహ్రూ కుటుంబాలను విమర్శించేవాళ్లకీ; ముస్లిం మతోన్మాదాన్నీ, బుజ్జగింపు ధోరణిని చీల్చి చెండాడేవాళ్లకీ రెండు బిరుదులు సదా సిద్ధంగా ఉంటాయి- కమ్యూనల్‌, ‌ఫాసిస్ట్.

అసలు ఈ సదస్సు ఎవరిని ఉద్ధరించడానికి అన్న ప్రశ్న హిందూత్వ, భారత వ్యతిరేకుల నుంచే వస్తోంది. ఇందుకు గొప్ప ఉదాహరణ- పాకిస్తాన్‌ ‌నుంచి వెలువడే ఆంగ్ల దినపత్రిక ‘డాన్‌’ ‌ఢిల్లీ విలేకరి జావెద్‌ ‌నక్వీ ఏడో తేదీనే రాసిన వ్యాసం. సెక్యులర్‌ ‌కేరళలో కమ్యూనిస్టులు కూడా వాహనాలకి ముందు హిందూదేవుళ్ల బొమ్మలు పెట్టుకుని, షెగువేరా బొమ్మని వెనక్కి నెట్టారు. ఈ విద్యావేత్తలు ఏం చేస్తారు? ఇలాంటి గోష్టులు ఏం ఒరగబెడతాయి అంటూ నిర్వేదం ప్రకటించాడాయన. బీజేపీనీ, నరేంద్ర మోదీనీ భారతీయులు చట్టబద్ధంగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపారు. ఈ వాస్తవం గ్రహించలేని దద్దమ్మలు, దివాంధులు ఆ గోష్టిలో చెలరేగిపోదలిచారు. ఇదంతా చూస్తుంటే, నిజమైన భారతీయులకు కాండ్రించాలన్న కోరిక సహజం. కానీ అనవసరం. ప్రాసంగీకులు ఎల్లరు అజ్ఞాతంలోనే ఉంటారు.

About Author

By editor

Twitter
Instagram